కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

30వ అధ్యాయం

భయం పోగొట్టుకోవడానికి ఏవి సహాయం చేస్తాయి?

భయం పోగొట్టుకోవడానికి ఏవి సహాయం చేస్తాయి?

యెహోవాను సేవించడం మీకు సులభంగా ఉంటుందా?— సులభంగా ఉంటుందని మన గొప్ప బోధకుడు చెప్పలేదు. యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి తన అపొస్తలులతో, ‘లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకంటే ముందు నన్ను ద్వేషించిందని మీకు తెలుసు’ అన్నాడు.—యోహాను 15:18.

పేతురు, తాను ఎప్పుడూ యేసును విడిచిపెట్టనని గొప్పగా చెప్పుకున్నాడు. కానీ దానికి యేసు, ‘నేనెవరో తెలీదని ఈ రాత్రే నువ్వు మూడుసార్లు అంటావు’ అని పేతురుతో అన్నాడు. పేతురు ఖచ్చితంగా అదే చేశాడు. (మత్తయి 26:31-35, 69-75) అసలు ఎందుకు అలా జరిగింది?— పేతురు, మిగతా అపొస్తలులు భయపడడంవల్లే అలా జరిగింది.

అపొస్తలులు ఎందుకు భయపడ్డారో తెలుసా?— వాళ్లు ఒక ప్రాముఖ్యమైన పని చేయలేదు. దాని గురించి తెలుసుకుంటే, మనల్ని ఎవరు ఏమన్నా, మనకు ఏంచేసినా యెహోవా సేవ చేయగలుగుతాం. అయితే ముందుగా, యేసు తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి ఏంజరిగిందో తెలుసుకోవాలి.

మొదట, వాళ్లంతా కలిసి పస్కా పండుగ చేసుకున్నారు. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తన ప్రజలను విడిపించిన సంఘటనకు గుర్తుగా ప్రతీ సంవత్సరం ఈ రోజున ఒక ప్రత్యేకమైన భోజనం చేసేవాళ్లు. ఆ రోజు పస్కా చేసుకున్న తర్వాత యేసు వాళ్లతో మరో ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేశాడు. ఆ భోజనం యేసును జ్ఞాపకం చేసుకోవడానికి మనకు ఎలా సహాయం చేస్తుందో మరో అధ్యాయంలో చూద్దాం. ఆ భోజనం పూర్తిచేసి తన అపొస్తలులను ప్రోత్సహించిన తర్వాత యేసు వాళ్లను గెత్సేమనే తోటకు తీసుకువెళ్లాడు. ఈ తోట అంటే వాళ్లకు చాలా ఇష్టం, అక్కడికి వాళ్లు తరచూ వెళ్తుండేవాళ్లు.

యేసు ప్రార్థన చేసుకోవడానికి ఆ తోటలోనే కాస్త దూరంగా వెళ్లాడు. ఆయన పేతురును, యాకోబును, యోహానును కూడా ప్రార్థన చేయమన్నాడు. కానీ వాళ్లు నిద్రపోయారు. యేసు ప్రార్థన చేసుకోవడానికి మూడుసార్లు వాళ్లకు దూరంగా వెళ్లాడు. మూడుసార్లూ ఆయన తిరిగొచ్చే సరికి పేతురు, మిగతా వాళ్లు నిద్రపోతున్నారు! (మత్తయి 26:36-47) వాళ్లు ఎందుకు నిద్రపోకుండా ప్రార్థన చేయాల్సింది?— దాని గురించి తెలుసుకుందాం.

పేతురు, యాకోబు, యోహాను ఎందుకు మెలకువగా ఉండాల్సింది?

ఆ రోజు సాయంత్రం యేసు, మిగతా అపొస్తలులు పస్కా జరుపుకున్నప్పుడు ఇస్కరియోతు యూదా కూడా అక్కడే ఉన్నాడు. యూదా దొంగతనం చేసేవాడని మీకు గుర్తుండివుంటుంది. తర్వాత ఆయన మోసగాడయ్యాడు. యేసు సాధారణంగా తన అపొస్తలులతో కలిసి గెత్సేమనే తోటలో ఎక్కడికి వెళ్లేవాడో అతనికి తెలుసు. కాబట్టి యూదా యేసును బంధించడానికి సైనికులను అక్కడకు తీసుకొచ్చాడు. వాళ్లు అక్కడికి వచ్చినప్పుడు యేసు వాళ్లను ‘మీరు ఎవరిని వెదుకుతున్నారు?’ అని అడిగాడు.

దానికి సైనికులు ‘యేసును’ అన్నారు. యేసు భయపడకుండా, ‘నేనే ఆయనను’ అని జవాబిచ్చాడు. యేసు ధైర్యాన్ని చూసి వాళ్లు వెనక్కి తగ్గి నేలమీద పడిపోయారు. అప్పుడు యేసు, ‘మీరు నా కోసం వెతుకుతుంటే నా అపొస్తలులను పోనివ్వండి’ అన్నాడు.—యోహాను 18:1-9.

సైనికులు యేసును గట్టిగా పట్టుకుని, ఆయన చేతులను కట్టేసినప్పుడు అపొస్తలులు భయపడి అక్కడ నుండి పారిపోయారు. కానీ పేతురు, యోహాను ఏమి జరుగుతుందో చూద్దామని కాస్త దూరంగా ఆయన వెంటే వెళ్లారు. చివరకు యేసును ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకువెళ్లారు. యోహాను ప్రధాన యాజకునికి తెలిసినవాడు కావడంవల్ల ద్వార పాలకురాలు ఆయనను, పేతురును ఆవరణలోకి వెళ్లనిచ్చింది.

యేసును విచారణ చేయడానికి మతనాయకులు అప్పటికే కయప ఇంటిదగ్గర కూడుకునివున్నారు. వాళ్లు యేసును చంపాలనుకున్నారు. అందుకే వాళ్లు యేసు గురించి అబద్ధాలు చెప్పే సాక్షులను రప్పించారు. అక్కడున్న వాళ్లు యేసును గుద్ది, చెంపమీద కొట్టారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పేతురు దగ్గర్లోనే ఉన్నాడు.

యోహానును, పేతురును లోపలికి వెళ్లనిచ్చిన ద్వార పాలకురాలు పేతురును గుర్తుపట్టింది. ‘నువ్వూ యేసుతో ఉన్నావు!’ అంది. కానీ యేసు ఎవరో కూడా తనకు తెలీదని పేతురు అన్నాడు. ఆ తర్వాత మరో అమ్మాయి పేతురును గుర్తుపట్టి చూట్టువున్న వాళ్లతో, ‘వీడు కూడా యేసుతో ఉన్నాడు’ అని చెప్పింది. యేసు తనకు తెలీదని పేతురు మళ్లీ అన్నాడు. కొంతసేపటి తర్వాత కొంతమంది పేతురును చూసి, ‘నిజమే, నువ్వు కూడా వాళ్లలో ఒకడివే’ అన్నారు. ‘ఆ మనిషి ఎవరో నాకు తెలీదు!’ అంటూ పేతురు మూడోసారి అబద్ధం చెప్పాడు. తాను నిజమే చెప్తున్నానని పేతురు ఒట్టు కూడా పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ఆయనవైపు తిరిగి చూశాడు.—మత్తయి 26:57-75; లూకా 22:54-62; యోహాను 18:15-27.

యేసు ఎవరో తనకు తెలీదని చెప్పేంతగా పేతురు ఎందుకు భయపడ్డాడు?

పేతురు ఎందుకు అబద్ధం చెప్పాడో తెలుసా?— ఎందుకంటే ఆయన భయపడ్డాడు. కానీ ఆయన ఎందుకు భయపడ్డాడు? ఏంచేస్తే ఆయనకు ధైర్యం వచ్చివుండేది? దీని గురించి ఆలోచించండి. ధైర్యం కోసం యేసు ఏంచేశాడు?— దేవునికి ప్రార్థన చేశాడు, ధైర్యంగా ఉండడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. మీకు గుర్తుందా, మెలకువగా ఉండి, ప్రార్థన చేయమని యేసు పేతురుకు మూడుసార్లు చెప్పాడు. కానీ ఏం జరిగింది?—

ప్రతీసారి పేతురు నిద్రలోకి జారుకున్నాడు. ఆయన ప్రార్థన చేయలేదు, మెలకువగా ఉండలేదు. కాబట్టి, ఊహించని విధంగా యేసును బంధించినప్పుడు పేతురుకు ఏం చేయాలో అర్థంకాలేదు. తర్వాత విచారణ జరుగుతున్నప్పుడు, అక్కడున్నవాళ్లు యేసును కొట్టి, ఆయన్ని ఎలా చంపాలో మాట్లాడుకుంటున్నప్పుడు పేతురుకు భయమేసింది. కానీ, అప్పటికి కొన్ని గంటల ముందే, ఏం జరుగుతుందని యేసు తన అపొస్తలులకు చెప్పాడు?— లోకం తనను ద్వేషించినట్టే, వాళ్లను కూడా ద్వేషిస్తుందని యేసు వాళ్లతో చెప్పాడు.

పేతురుకు జరిగినట్లే, మీ విషయంలో కూడా ఎలా జరగవచ్చు?

పేతురుకు జరిగినట్లే, మన విషయంలో కూడా ఎలా జరగవచ్చో ఆలోచించండి. జెండా వందనం చేయనివాళ్ల గురించి లేదా క్రిస్మస్‌ జరుపుకోనివాళ్ల గురించి మీ క్లాసులో ఎవరైనా చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి. అప్పుడు ఎవరైనా మీవైపు తిరిగి “మీరు జెండా వందనం చేయరంట, నిజమేనా?” అనో, “మీరు క్రిస్మస్‌ కూడా చేసుకోరంట!” అనో అంటే అప్పుడు మీరు ఏం చేయవచ్చు? మీరు నిజం చెప్పడానికి భయపడతారా?— అప్పుడు మీరు కూడా పేతురులా అబద్దం చెప్పాలనుకుంటారా?—

యేసు ఎవరో తనకు తెలీదని చెప్పినందుకు పేతురు ఆ తర్వాత చాలా బాధపడ్డాడు. తను ఎంత తప్పు చేశాడో అర్థమయ్యాక, ఆయన బయటకు వెళ్లి ఏడ్చాడు. ఆయన తిరిగి యేసు దగ్గరకు వచ్చాడు. (లూకా 22:32) దీని గురించి ఆలోచించండి. పేతురు ఎంతో భయపడిపోవడంవల్లే అబద్ధం చెప్పాడు. మనం అలా భయపడకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?— గుర్తుందా, పేతురు ప్రార్థన చేయలేదు, మెలకువగా ఉండలేదు. కాబట్టి, మన గొప్ప బోధకునికి అనుచరులుగా ఉండాలంటే, మనం ఏంచేయాలి?—

మనం సహాయం కోసం యెహోవాకు ఖచ్చితంగా ప్రార్థించాలి. యేసు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన కోసం ఏంచేశాడో తెలుసా?— యేసుకు ధైర్యం చెప్పడానికి ఆయన ఒక దేవదూతను పంపించాడు. (లూకా 22:43) దేవుని దూతలు మనకు సహాయం చేయగలరా?— ‘యెహోవా అంటే భయభక్తులు ఉన్నవాళ్ల చుట్టూ ఆయన దూత కావలివుండి, వాళ్లను రక్షిస్తాడు’ అని బైబిలు చెప్తోంది. (కీర్తన 34:7) కానీ, దేవుని సహాయం పొందాలంటే మనం ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోదు. మనం ఇంకా ఏంచేయాలో తెలుసా?— మెలకువగా ఉండి, కనిపెట్టుకుని ఉండాలని యేసు తన అనుచరులకు చెప్పాడు. మనం అలా ఉండాలంటే ఏంచేయాలి?—

క్రైస్తవ కూటాల్లో చెప్పేవాటిని జాగ్రత్తగా వినాలి, బైబిల్లో చదివిన వాటి గురించి ఆలోచించాలి. వీటితోపాటు యెహోవాకు క్రమంగా ప్రార్థన చేస్తూ, తనను సేవించడానికి సహాయం చేయమని అడగాలి. మనం అలా చేసినప్పుడు మన భయాలను పోగొట్టుకోవడానికి అవసరమైన సహాయం మనకు దొరుకుతుంది. అప్పుడు మనం అవకాశం దొరికినప్పుడల్లా, మన గొప్ప బోధకుని గురించి, ఆయన తండ్రి గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి ఇష్టపడతాం.

మనుషులకు భయపడితే మనం సరైనది చేయలేము. అలా భయపడకుండా ఉండడానికి, సామెతలు 29:25; యిర్మీయా 26:12-15, 20-24; యోహాను 12:42, 43 వచనాలు సహాయం చేస్తాయి.