కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

36వ అధ్యాయం

ఎవరు పునరుత్థానం చేయబడతారు? వాళ్లు ఎక్కడుంటారు?

ఎవరు పునరుత్థానం చేయబడతారు? వాళ్లు ఎక్కడుంటారు?

ముందు రెండు అధ్యాయాల్లో, ఎంతమంది పునరుత్థానం చేయబడ్డారని మనం చదివాం?— ఐదుగురు. వాళ్లలో పిల్లలు ఎంతమంది?— ముగ్గురు. నాలుగో వ్యక్తి ఒక యువకుడు. దీన్నిబట్టి ఏమి అర్థమౌతుంది?—

దేవునికి పిల్లలంటే ఇష్టమని అర్థమౌతుంది. కానీ, ఆయన చాలామంది ఇతరులను కూడా పునరుత్థానం చేస్తాడు. దేవుడు మంచి పనులను చేసినవాళ్లను మాత్రమే పునరుత్థానం చేస్తాడా?— మనకు అలా అనిపించవచ్చు. కానీ చాలామంది యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుని గురించి సత్యం తెలుసుకోలేదు. వాళ్లకు చెడ్డ పనులే నేర్పించారు కాబట్టి వాళ్లు అవే చేశారు. అలాంటి వాళ్లను యెహోవా పునరుత్థానం చేస్తాడని మీరు అనుకుంటున్నారా?—

‘నీతిమంతులకు, అనీతిమంతులకు పునరుత్థానం కలుగబోతుంది’ అని బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 24:14, 15) అనీతిమంతులు, అంటే సరైనది చేయనివాళ్లు ఎందుకు పునరుత్థానం చేయబడతారు?— ఎందుకంటే వాళ్లకు యెహోవా గురించి, ప్రజలు ఏంచేయాలని ఆయన కోరుకుంటున్నాడనే దానిగురించి తెలుసుకునే అవకాశం ఎప్పుడూ దొరకలేదు.

సరైనది చేయని కొంతమందిని దేవుడు ఎందుకు పునరుత్థానం చేస్తాడు?

ప్రజలు ఎప్పుడు పునరుత్థానం చేయబడతారని మీరు అనుకుంటున్నారు?— లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? ‘నీ సహోదరుడు మళ్లీ లేస్తాడు’ అని యేసు లాజరువాళ్ల అక్క మార్తకు మాటిచ్చాడు. దానికి మార్త, ‘అంత్యదినాన పునరుత్థానంలో లేస్తాడని నాకు తెలుసు’ అని జవాబిచ్చింది. (యోహాను 11:23, 24) లాజరు ‘అంత్యదినాన’ లేస్తాడని మార్త అన్నప్పుడు ఆమె ఉద్దేశం ఏమిటి?—

యేసు ఇతనితో చెప్పిన పరదైసు ఎక్కడుంది?

‘సమాధుల్లో ఉన్నవాళ్లంతా బయటకు వస్తారు’ అని యేసు చేసిన వాగ్ధానాన్ని మార్త విన్నది. (యోహాను 5:28, 29) దేవుడు తాను పునరుత్థానం చేయాలనుకున్న వాళ్లందర్నీ తిరిగి బ్రతికించే సమయమే ఆ ‘అంత్యదినం.’ అది 24 గంటల రోజు కాదు. అది వెయ్యి సంవత్సరాల కాలం. ఆ రోజున, ‘దేవుడు భూమ్మీద ఉన్న ప్రజలకు తీర్పు తీరుస్తాడు’ అని బైబిలు చెప్తోంది. అప్పుడు ఆయన పునరుత్థానం చేయబడినవాళ్లకు కూడా తీర్పు తీరుస్తాడు.—అపొస్తలుల కార్యములు 17:31; 2 పేతురు 3:8.

ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! వెయ్యి సంవత్సరాలపాటు ఉండే ఆ రోజులో, చనిపోయిన కోట్లమంది తిరిగి బ్రతికించబడతారు. వాళ్లు బ్రతికించబడిన తర్వాత పరదైసులో, అంటే అందమైన తోటలో ఉంటారని యేసు అన్నాడు. పరదైసు ఎక్కడ ఉంటుందో, అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

యేసు హింసా కొయ్యపై చనిపోవడానికి దాదాపు మూడు గంటల ముందు, తన ప్రక్కన వేలాడదీయబడిన వ్యక్తితో పరదైసు గురించి మాట్లాడాడు. అతను చేసిన తప్పులకు అతనికి మరణశిక్ష విధించబడింది. కానీ, అతను యేసును గమనిస్తూ, ఆయన గురించి చుట్టూ ఉన్నవాళ్లు మాట్లాడుతున్నది విన్నప్పుడు అతను యేసును నమ్మడం మొదలుపెట్టాడు. కాబట్టి, ఆ నేరస్థుడు, ‘నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’ అని యేసును అడిగాడు. దానికి యేసు, ‘నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావని నేడు నీతో నిశ్చయంగా చెప్తున్నాను’ అని జవాబిచ్చాడు.—లూకా 23:42, 43.

పరదైసు గురించి చదివినప్పుడు మనం మన మనసులో ఏమి ఊహించుకోవాలి?

యేసు మాటలకు అర్థమేమిటి? పరదైసు ఎక్కడుంది?— దాని గురించి ఆలోచించండి. మొదట్లో పరదైసు ఎక్కడ ఉండేది?— మీకు గుర్తుందా, దేవుడు మొదటి మనిషైన ఆదామును, అతని భార్యను పరదైసులో ఉంచాడు. అది ఈ భూమ్మీదే ఉంది. దాని పేరు ఏదెను తోట. ఆ తోటలో జంతువులు ఉండేవి, కానీ అవి ఏ హానీ చేసేవి కాదు. ఇంకా ఆ తోటలోని చెట్లకు నోరూరించే ఎన్నో పళ్లు కాసేవి, అందులో ఒక పెద్ద నది కూడా ఉండేది. ఆ తోట ఎంతో బావుండేది!—ఆదికాండము 2:8-10.

కాబట్టి, ఆ నేరస్థుడు పరదైసులో ఉంటాడని మనం చదివినప్పుడు మన మనసులో భూమి ఒక అందమైన చోటుగా మారినట్లు ఊహించుకోవాలి. ఒకప్పటి నేరస్థునితోపాటు యేసు పరదైసుగా మారనున్న ఈ భూమ్మీదే ఉంటాడా?— ఉండడు. ఆయన ఇక్కడ ఎందుకు ఉండడో మీకు తెలుసా?—

ఎందుకంటే యేసు పరదైసుగా మారిన భూమిని పరిపాలిస్తూ పరలోకంలో ఉంటాడు. కాబట్టి, యేసు అతనితోపాటు ఉంటాడంటే, ఆయన అతనిని తిరిగి బ్రతికించి, అతని అవసరాలు తీరుస్తాడని అర్థం. కానీ, ఒకప్పుడు నేరస్థుడైన అతనిని యేసు పరదైసులో ఎందుకు ఉండనిస్తాడు?— దానికి కారణమేమిటో మనమిప్పుడు తెలుసుకుందాం.

ఆ నేరస్థుడు యేసుతో మాట్లాడడానికి ముందు, దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అతనికి తెలుసా?— అతనికి తెలీదు. అతనికి దేవుని గురించి సత్యం తెలీదు కాబట్టి అతను చెడ్డపనులు చేశాడు. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో అతను పరదైసులో నేర్చుకుంటాడు. అప్పుడు అతనికి, దేవుడు కోరింది చేసి ఆయనను నిజంగా ప్రేమిస్తున్నట్లు నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది.

పునరుత్థానం చేయబడిన వాళ్లంతా భూమ్మీద పరదైసులోనే ఉంటారా?— ఉండరు. ఎందుకో మీకు తెలుసా?— ఎందుకంటే కొంతమంది యేసుతోపాటు పరలోకంలో ఉండడానికి పునరుత్థానం చేయబడతారు. వాళ్లు ఆయనతోపాటు పరదైసు భూమిని పరిపాలిస్తారు. అలాగని మనం ఎలా చెప్పవచ్చో చూద్దాం.

యేసు చనిపోయే ముందు రాత్రి తన అపొస్తలులతో, ‘నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపర్చడానికి వెళ్తున్నాను’ అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన, ‘నేనున్న స్థలంలో మీరు కూడా ఉండేలా మళ్లీ వచ్చి నా దగ్గర ఉండడానికి మిమ్మల్ని తీసికొని వెళ్తాను’ అని వాళ్లకు మాటిచ్చాడు.—యోహాను 14:2, 3.

యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత ఎక్కడకు వెళ్లాడు?— అవును, ఆయన తన తండ్రితోపాటు ఉండేందుకు తిరిగి పరలోకానికి వెళ్లాడు. (యోహాను 17:4, 5) అందుకే యేసు తన అపొస్తలులు, ఇతర అనుచరులు తనతోపాటు పరలోకంలో ఉండేందుకు వాళ్లను పునరుత్థానం చేస్తానని వాళ్లకు మాటిచ్చాడు. అక్కడ వాళ్లు యేసుతోపాటు ఏంచేస్తారు?— ‘మొదటి పునరుత్థానంలో’ పునరుత్థానం చేయబడే యేసు శిష్యులు పరలోకంలో ఉంటూ, భూమ్మీద ‘ఆయనతోపాటు వెయ్యి సంవత్సరాలు రాజులుగా పరిపాలన చేస్తారు.’—ప్రకటన 5:9, 10; 20:6; 2 తిమోతి 2:12.

‘మొదటి పునరుత్థానంలో’ ఎంతమంది పునరుత్థానం చేయబడి, యేసుతోపాటు పరిపాలిస్తారు?— యేసు తన శిష్యులతో, ‘చిన్న మందా, భయపడవద్దు. మీకు రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రి ఇష్టపడ్డాడు’ అని చెప్పాడు. (లూకా 12:32) యేసుతోపాటు ఆయన పరలోక రాజ్యంలో ఉండడానికి పునరుత్థానం చేయబడే ఈ ‘చిన్న మందలో’ ఎంతమంది ఉంటారు అనేది ఖచ్చితంగా నిర్ణయించబడింది. ‘నూట నలభై నాలుగు వేలమంది’ భూమ్మీద నుండి పునరుత్థానం చేయబడతారని బైబిలు చెప్తోంది.—ప్రకటన 14:1, 3.

పునరుత్థానం చేయబడినవాళ్లు ఎక్కడ ఉంటారు, ఏంచేస్తారు?

భూమ్మీద పరదైసులో ఎంతమంది ఉంటారు?— దీని గురించి బైబిలు చెప్పడంలేదు. ఆదాము, హవ్వ ఏదెను తోటలో ఉన్నప్పుడు పిల్లలను కని, భూమిని నిండించమని దేవుడు వాళ్లకు చెప్పాడు. వాళ్లు అలా చేయలేదు. అయితే, తాను కోరుకున్నట్లు భూమి మంచివాళ్లతో నిండివుండేలా దేవుడు చూస్తాడు.—ఆదికాండము 1:28; యెషయా 45:18; 55:11.

పరదైసులో ఉండడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! భూమి అంతా ఒక తోటలా మారుతుంది. అప్పుడు భూమి ఎన్నో పక్షులతో, జంతువులతో కళకళలాడుతుంది, అన్నిరకాల చెట్లతో, పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. ఎవ్వరూ అనారోగ్యంతో బాధపడరు, ఎవ్వరూ చనిపోవాల్సిన అవసరముండదు. అందరూ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటారు. మనం పరదైసులో ఉండాలనుకుంటే ఇప్పుడే దాని కోసం సిద్ధపడాలి.

దేవుడు భూమి విషయంలో ఏమి చేయాలని అనుకుంటున్నాడనే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, సామెతలు 2:21, 22; ప్రసంగి 1:4; యెషయా 2:4; 11:6-9; 35:5, 6; 65:21-24 వచనాలు చదవండి.