కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

38వ అధ్యాయం

మనం యేసును ఎందుకు ప్రేమించాలి?

మనం యేసును ఎందుకు ప్రేమించాలి?

మీరు మునిగిపోతున్న పడవలో ఉన్నారని ఊహించుకోండి. ఎవరైనా మిమ్మల్ని కాపాడాలని మీరు కోరుకుంటారా?— మిమ్మల్ని కాపాడడానికి ఎవరైనా తమ ప్రాణాలనే త్యాగం చేశారనుకోండి, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?— యేసుక్రీస్తు అదే చేశాడు. మనం 37వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడు.

మనం నిజంగా నీళ్లల్లో మునిగిపోతుంటే యేసు కాపాడతాడని కాదు. మరి ఆయన మనల్ని దేని నుండి కాపాడతాడు? మీకు గుర్తుందా?— ఆదామువల్ల మనకు వచ్చిన పాపమరణాల నుండి కాపాడతాడు. కొంతమంది చాలా చెడ్డపనులు చేసినా యేసు వాళ్ల కోసం కూడా చనిపోయాడు. అలాంటివాళ్లను కాపాడడం కోసం మీరు మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోవడానికి ప్రయత్నిస్తారా?—

‘నీతిమంతుని కోసం సహితం ఒకరు చనిపోవడం అరుదు; మంచివాని కోసం ఎవరైనా ఒకవేళ చనిపోవడానికి తెగించవచ్చు’ అని బైబిలు చెప్తోంది. కానీ, యేసు ‘భక్తిహీనుల కోసం చనిపోయాడు’ అని బైబిలు వివరిస్తోంది. ఆ భక్తిహీనుల్లో దేవుణ్ణి సేవించని వాళ్లు కూడా ఉన్నారు! బైబిలు ఇంకా ఇలా చెప్తోంది, ‘మనమింకా పాపులుగా ఉండగానే [ఇంకా చెడ్డపనులు చేస్తుండగానే] క్రీస్తు మన కోసం చనిపోయాడు.’—రోమీయులు 5:6-8.

ఒకప్పుడు చాలా చెడ్డపనులు చేసిన ఒక అపొస్తలుడు మీకు గుర్తున్నాడా?— ‘పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు లోకానికి వచ్చాడు. అలాంటివాళ్లలో నేను ప్రధానుణ్ణి’ అని ఆ అపొస్తలుడు రాశాడు. అలా అన్నది అపొస్తలుడైన పౌలు. తాను ‘ఒకప్పుడు అవివేకిని’ అని, ‘దుష్టునిగా’ జీవించేవాడినని ఆయన అన్నాడు.—1 తిమోతి 1:15; తీతు 3:3.

అలాంటి వాళ్లకోసం చనిపోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి! దాని కోసం, యోహాను 3వ అధ్యాయంలోని 16వ వచనం ఏంచెప్తుందో చదువుదాం. అక్కడిలా ఉంది, “దేవుడు లోకమును [అంటే, భూమ్మీద జీవిస్తున్న ప్రజలను] ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”

యేసు మనకోసం తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఎలాంటి బాధలుపడ్డాడు?

మన మీద తన తండ్రికి ఉన్నలాంటి ప్రేమే తనకూ ఉందని యేసు చూపించాడు. యేసును బంధించిన రాత్రి ఆయన పడిన బాధల గురించి కొంతవరకు 30వ అధ్యాయంలో చదివినవి మీకు గుర్తుండేవుంటాయి. ఆయనను ప్రధాన యాజకుడైన కయప ఇంటికి తీసుకువెళ్లారు, అక్కడ ఆయనపై విచారణ చేశారు. యేసు మీద అబద్ధాలు చెప్పడానికి అబద్ధసాక్షులను రప్పించారు, అక్కడున్నవాళ్లు యేసును గుద్దారు. యేసు ఎవరో తెలీదని పేతురు అన్నది అప్పుడే. అక్కడ జరిగినదాన్ని మన కళ్లముందు జరుగుతున్నట్లు ఊహించుకుని, అక్కడ ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం.

తెల్లవారింది. యేసు రాత్రి అంతా నిద్రపోలేదు. రాత్రి జరిగిన విచారణ సరైనది కాదు కాబట్టి, యాజకులు ఉదయాన్నే ఆయనను మరోసారి విచారించాలనుకున్నారు. అందుకే తొందర తొందరగా మహాసభ లేదా యూదుల ఉన్నత న్యాయస్థానం సమావేశమైంది. దేవునికి వ్యతిరేకంగా నేరాలు చేశాడని యేసుపై అక్కడ మళ్లీ నిందలు వేశారు.

యాజకులు ఆ తర్వాత యేసును బంధించి, రోమా అధిపతియైన పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. వాళ్లు పిలాతుతో, ‘యేసు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఆయనను చంపాలి’ అని చెప్పారు. కానీ, యాజకులు అబద్ధం చెప్తున్నారని పిలాతుకు అర్థమైంది. అందుకే పిలాతు వాళ్లతో, ‘ఈయనలో నాకు ఏ నేరం కనబడలేదు, కాబట్టి ఈయనను విడిచిపెడతాను’ అన్నాడు. కానీ యాజకులు, మిగతావాళ్లు, ‘వద్దు! అతణ్ణి చంపండి!’ అని అరిచారు.

తర్వాత పిలాతు మళ్లీ ప్రజలతో యేసును విడిచిపెడతానని అన్నాడు. కానీ యాజకులు, ‘నువ్వు ఇతనిని విడిచిపెడితే, ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లే! ఇతణ్ణి చంపు!’ అని కేకలు పెట్టేలా ప్రజలను రెచ్చగొట్టారు. ప్రజలు చాలా గోల చేశారు. అప్పుడు పిలాతు ఏంచేశాడో తెలుసా?—

పిలాతు వాళ్లకు తలొగ్గాడు. ముందుగా ఆయన యేసును కొరడాలతో కొట్టించాడు. తర్వాత ఆయనను చంపడానికి ఆయనను సైనికులకు అప్పగించాడు. వాళ్లు ముళ్లతో చేసిన కిరీటాన్ని యేసు తలమీద పెట్టి, వంగి వంగి నమస్కరిస్తూ ఆయనను ఎగతాళి చేశారు. తర్వాత వాళ్లు యేసుతో ఒక పెద్ద కొయ్యను మోయిస్తూ, ఆయనను పట్టణం బయట ఉన్న కపాల స్థలం అనే చోటుకు తీసుకెళ్లారు. వాళ్లు యేసు కాళ్లను, చేతులను ఆ కొయ్యకు మేకులతో కొట్టారు. యేసు ఆ కొయ్యకు వేలాడేటట్లు వాళ్లు దాన్ని నిలబెట్టారు. అప్పుడు ఆయన గాయల నుండి రక్తం కారుతుంటే ఆయనకు భరించలేనంత నొప్పి కలిగింది.

యేసు వెంటనే చనిపోలేదు. ఆయన ఆ కొయ్యకు అలాగే వేలాడుతూ ఉన్నాడు. ప్రధానయాజకులు ఆయనను ఎగతాళి చేశారు. దారిన వెళ్తున్నవాళ్లు, ‘నువ్వు దేవుని కుమారుడవైతే హింసా కొయ్య మీద నుండి దిగిరా!’ అన్నారు. కానీ తన తండ్రి తనను ఎందుకు పంపించాడో యేసుకు తెలుసు. మనకు నిత్యజీవం పొందే అవకాశం ఉండాలంటే, ఆయన తన పరిపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ఆయనకు తెలుసు. మధ్యాహ్నం దాదాపు మూడు గంటలప్పుడు యేసు తన తండ్రిని గట్టిగా వేడుకుని చనిపోయాడు.—మత్తయి 26:36–27:50; మార్కు 15:1; లూకా 22:39–23:46; యోహాను 18:1–19:30.

యేసుకు, ఆదాముకు ఎంత తేడా! ఆదాము దేవుణ్ణి ప్రేమించలేదు, మనల్ని కూడా ప్రేమించలేదు. అతను దేవుడు చెప్పిన మాట వినలేదు. అతను పాపం చేసినందుకు మనందరం పాపంతోనే పుట్టాం. కానీ యేసు మాత్రం దేవుణ్ణి, మనల్ని ప్రేమించాడు. ఆయన ఎప్పుడూ దేవుని మాట విన్నాడు. ఆదాము మనకు చేసిన నష్టాన్ని పూర్తిగా తీసివేయడానికి యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు.

మనం యేసును ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

యేసు అంత గొప్ప పనిని చేసినందుకు మీరు ఆయనకు కృతజ్ఞత చూపిస్తారా?— మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌ చెప్తున్నారా?— అపొస్తలుడైన పౌలు తన కోసం క్రీస్తు చేసిన దానికి కృతజ్ఞత చూపించాడు. దేవుని కుమారుడు ‘నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు’ అని పౌలు రాశాడు. (గలతీయులు 2:20) యేసు మీ కోసం, నా కోసం కూడా చనిపోయాడు. మనం ఎప్పటికీ జీవించగలిగేలా ఆయన తన పరిపూర్ణ జీవాన్ని ఇచ్చాడు! మనం యేసును ప్రేమించడానికి ఇది నిజంగా మంచి కారణం.

అపొస్తలుడైన పౌలు కొరింథు నగరంలో ఉన్న క్రైస్తవులకు ఇలా రాశాడు, ‘క్రీస్తు ప్రేమ మనతో పనిచేయిస్తుంది.’ క్రీస్తు ప్రేమ మనతో ఎలాంటి పని చేయించాలి?— పౌలు దానికి ఇలా అన్నాడు, ‘జీవించేవాళ్లు ఇకమీదట తమ కోసం కాక, తన కోసం జీవించేలా క్రీస్తు ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు.’—ఏటవాలు ముద్దక్షరాలు మావి; 2 కొరింథీయులు 5:14, 15, న్యూ లైఫ్‌ వర్షన్‌.

క్రీస్తుకు నచ్చేలా జీవిస్తున్నారని మీరు ఎలా చూపించవచ్చు?— ఆయన గురించి మీరు తెలుసుకున్నవాటిని వేరేవాళ్లకు చెప్పినప్పుడు మీరు అలా చూపిస్తారు. లేదా, దీని గురించి ఆలోచించండి: ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారనుకుందాం, అప్పుడు మీరు ఏంచేస్తున్నారో మీ అమ్మానాన్నలుగానీ మనుషులు ఎవరైనాగానీ చూడలేరు. అలాంటప్పుడు యేసు ఇష్టపడడని మీకు తెలిసినవాటిని టీవీలో లేదా ఇంటర్నెట్‌లో చూస్తారా?— మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, యేసు ఇప్పుడు జీవించేవున్నాడు, మనం చేసే ప్రతీదీ ఆయన చూడగలడు!

మనం చేసే ప్రతీదీ ఎవరు చూడగలరు?

మనం యేసును ప్రేమించడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే, మనం యెహోవా చేసినట్లు చేయాలని కోరుకోవడం. ఎందుకంటే, ‘తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు’ అని యేసు చెప్పాడు. యెహోవా యేసును ఎందుకు ప్రేమిస్తున్నాడో, మనం కూడా ఆయనను ఎందుకు ప్రేమించాలో మీకు తెలుసా?— ఎందుకంటే, దేవుడు అనుకున్నది జరగడం కోసం యేసు చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. (యోహాను 10:17) కాబట్టి, మనం బైబిలు చెప్తున్నది చేద్దాం, అందులో ఇలా ఉంది, ‘మీరు ప్రియమైన పిల్లల్లా దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, మీ కోసం తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే మీరు కూడా ప్రేమకలిగి నడుచుకోండి.’—ఎఫెసీయులు 5:1, 2.

యేసుపట్ల, ఆయన మనకోసం చేసిన దానిపట్ల కృతజ్ఞత పెంచుకోవడానికి, యోహాను 3:35; 15:9, 10; 1 యోహాను 5:11, 12 వచనాలు చదవండి.