కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

41వ అధ్యాయం

దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలు

దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలు

పిల్లలందరిలోకి యెహోవాను ఎవరు ఎక్కువ సంతోషపెట్టారు?— ఆయన కుమారుడైన యేసు అలా చేశాడు. యేసు తన పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి ఏంచేశాడో చూద్దాం.

యేసు వాళ్ల కుటుంబం, యెహోవా దేవుని అందమైన ఆలయమున్న యెరూషలేముకు మూడురోజుల ప్రయాణమంత దూరంలో నివసించేది. యేసు ఆ ఆలయాన్ని, ‘నా తండ్రి ఇల్లు’ అన్నాడు. యేసు, యేసు వాళ్ల కుటుంబం ప్రతి సంవత్సరం పస్కా పండుగకు అక్కడికి వెళ్లేవాళ్లు.

ఒకసారి, యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు ఆ కుటుంబం పస్కా పండుగ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తోంది. వాళ్లు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఒకచోట ఆగినప్పుడు యేసు తమ బంధువుల దగ్గరా, స్నేహితుల దగ్గరా ఎక్కడా లేడని వాళ్లకు తెలిసింది. అప్పుడు మరియ, యోసేపు వెంటనే యేసును వెతుక్కుంటూ మళ్లీ యెరూషలేముకు తిరిగి వెళ్లారు. యేసు ఎక్కడ ఉండివుంటాడని మీరు అనుకుంటున్నారు?—

యేసు వాళ్లకు దేవాలయంలో కనిపించాడు. ఆయన అక్కడున్న బోధకులు చెప్పేది వింటూ వాళ్లను ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తున్నాడు. ఆయన ఇచ్చిన చక్కని సమాధానాలను విని వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. దేవుడు తన కుమారుణ్ణి చూసి ఎందుకు సంతోషపడ్డాడో మీకు అర్థమైందా?—

చివరకు మరియకు, యోసేపుకు యేసు కనిపించినప్పుడు వాళ్లు ఊరట పొందారు. కానీ యేసు మాత్రం అస్సలు కంగారుపడలేదు. ఆలయం చాలా మంచి చోటు అని ఆయనకు తెలుసు. అందుకే ఆయన, ‘నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలీదా?’ అని అడిగాడు. ఆలయం దేవుని మందిరమని ఆయనకు తెలుసు. అందుకే ఆయన అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు.

ఆ తర్వాత మరియ, యోసేపు పన్నెండు సంవత్సరాల యేసును తీసుకుని నజరేతులోవున్న తమ ఇంటికి తిరిగి వెళ్లారు. యేసు తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించేవాడు?— ఆయన, ‘వాళ్లకు లోబడివున్నాడు’ అని బైబిలు చెప్తోంది. దాని అర్థమేమిటో తెలుసా?— ఆయన వాళ్లు చెప్పిన మాట వినేవాడు. ఆయన బావిలో నుండి నీళ్లు తోడి తీసుకురావడం వంటి ఇంటి పనులతో సహా తన తల్లిదండ్రులు చెప్పిన పనులన్నీ చేసేవాడు.—లూకా 2:41-52.

యేసు పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాడు?

ఒకసారి ఆలోచించండి: యేసు పరిపూర్ణుడైనప్పటికీ అపరిపూర్ణులైన అమ్మానాన్నల మాట విన్నాడు. అది చూసి దేవుడు సంతోషించాడా?— ఖచ్చితంగా సంతోషించాడు. ఎందుకంటే ఆయన వాక్యం, ‘మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి’ అని పిల్లలకు చెప్తోంది. (ఎఫెసీయులు 6:1) మీ అమ్మానాన్నల మాట విన్నప్పుడు మీరు కూడా యేసులా దేవుణ్ణి సంతోషపెడతారు.

తన గురించి మీరు వేరేవాళ్లతో చెప్పినప్పుడు కూడా దేవుడు సంతోషిస్తాడు. కానీ చిన్నపిల్లలు చేయాల్సింది అది కాదని కొంతమంది అంటారు. దేవుని గురించి మాట్లాడకుండా పిల్లలను ఆపాలని ప్రయత్నిస్తున్న కొంతమందిని, ‘దేవుడు చిన్నపిల్లలు స్తుతించేలా చేస్తాడనే మాట మీరెప్పుడూ చదువలేదా?’ అని యేసు అడిగాడు. (మత్తయి 21:16) నిజంగా చెప్పాలనుకుంటే యెహోవా గురించి, ఆయన ఎంత గొప్ప దేవుడనే దానిగురించి మనందరం వేరేవాళ్లతో మాట్లాడవచ్చు. మనమలా చేసినప్పుడు, దేవుడు సంతోషిస్తాడు.

దేవుని గురించి మనం వేరేవాళ్లతో మాట్లాడగలిగే విషయాలు ఎక్కడ నేర్చుకోవచ్చు?— మనం ఇంట్లో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు నేర్చుకోవచ్చు. కానీ అధ్యయనం చేయడానికి దేవుని ప్రజలు కూడుకునే చోట మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. అయితే, దేవుని ప్రజలు ఎవరో ఎలా తెలుస్తుంది?—

వాళ్లు తమ కూటాల్లో ఏంచేస్తారు? వాళ్లు నిజంగా బైబిల్లో ఏముందో బోధిస్తారా? వాళ్లు దాన్ని చదివి, దాని గురించి మాట్లాడుకుంటారా? అలా చేస్తేనే మనం దేవుని గురించి తెలుసుకోగలం, అవునా?— అందుకే మనం క్రైస్తవ కూటాల్లో దేవుడు చెప్తున్నది వినాలనుకుంటాం, మీరేమంటారు?— కానీ బైబిలు చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం లేదని చెప్పేవాళ్ల సంగతేమిటి? అలాంటి వాళ్లను దేవుని ప్రజలని అనుకోవచ్చా?—

దీని గురించి ఆలోచించండి. దేవుని ప్రజలు, ‘ఆయన నామం కోసం ఏర్పరచుకున్న జనం’ అని బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 15:14) దేవుని పేరు యెహోవా కాబట్టి, ‘మీరు యెహోవాను ఆరాధిస్తున్నారా?’ అని ప్రజలను అడగవచ్చు. వాళ్లు ఒకవేళ కాదంటే, వాళ్లు ఆయన ప్రజలు కాదని మనకు తెలుస్తుంది. దేవుని ప్రజలు చేసే మరో పని ఏమిటంటే, వాళ్లు వేరేవాళ్లతో దేవుని రాజ్యం గురించి మాట్లాడతారు. అంతేకాదు, వాళ్లు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనను ప్రేమిస్తున్నామని చూపిస్తారు.—1 యోహాను 5:3.

ఇవన్నీ చేసేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్లతోపాటు కూటాలకు వెళ్లాలి. ఆ కూటాల్లో మీరు జాగ్రత్తగా వినాలి, ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు చెప్పాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు యేసు అలాగే చేశాడు. కాబట్టి, వాటిని చేసినప్పుడు యేసులా మీరు కూడా దేవుణ్ణి సంతోషపెడతారు.

దేవుణ్ణి సంతోషపెట్టిన వేరే పిల్లల గురించి బైబిలు చెప్తోందా?— ఈ విషయంలో తిమోతి ఒక మంచి ఉదాహరణ. వాళ్ల నాన్న యెహోవా ఆరాధకుడు కాదు. కానీ వాళ్ల అమ్మ యునీకే, అమ్మమ్మ లోయి యెహోవా ఆరాధకులు. తిమోతి వాళ్లు చెప్పింది విని, యెహోవా గురించి నేర్చుకున్నాడు.

తిమోతి తండ్రి యెహోవా ఆరాధకుడు కాకపోయినా తిమోతి ఏమి చేయడానికి ఇష్టపడ్డాడు?

తిమోతి పెద్దవాడైనప్పుడు వాళ్లు ఉండే పట్టణానికి అపొస్తలుడైన పౌలు వచ్చాడు. యెహోవాను సేవించాలని తిమోతి ఎంతగా ఇష్టపడుతున్నాడో ఆయన చూశాడు. అందుకే, ఆయన ఇంకా ఎక్కువగా దేవుని సేవ చేయగలిగేలా తనతోపాటు రమ్మని తిమోతిని పిలిచాడు. వాళ్లు వెళ్లిన ప్రతిచోటా వాళ్లు దేవుని రాజ్యాన్ని గురించి, యేసు గురించి ప్రజలకు చెప్పారు.—అపొస్తలుల కార్యములు 16:1-5; 2 తిమోతి 1:3-5; 3:14, 15.

కానీ బైబిలు, దేవుణ్ణి సంతోషపెట్టిన అబ్బాయిల గురించి మాత్రమే మాట్లాడుతుందా?— కాదు, అలాంటి అమ్మాయిల గురించి కూడా చెప్తోంది. అలా చేసిన ఇశ్రాయేలీయురాలైన ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఆమె జీవించిన కాలంలో సిరియా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి శత్రుత్వం ఉండేది. ఒకరోజు సిరియా దేశస్థులు ఇశ్రాయేలుతో యుద్ధంచేసి ఆ అమ్మాయిని బంధీగా తీసుకువెళ్లారు. ఆమెను సిరియా దేశపు సైన్యాధిపతియైన నయమాను ఇంటికి పంపించారు. అక్కడామెను నయమాను భార్యకు సేవకురాలిగా పెట్టారు.

నయమానుకు కుష్ఠురోగం వచ్చింది. ఆ జబ్బును వైద్యులు ఎవ్వరూ నయం చేయలేకపోయారు. కానీ, ఇశ్రాయేలు నుండి వచ్చిన ఆ అమ్మాయి, ఒక ప్రవక్త అంటే దేవుని ప్రత్యేకమైన సేవకుల్లో ఒకాయన నయమానును బాగు చేయగలడని నమ్మింది. అయితే నయమాను, అతని భార్య యెహోవా ఆరాధకులు కాదు. అలాంటప్పుడు, ఆ అమ్మాయి తనకు తెలిసింది వాళ్లకు చెప్పాలా? మీరైతే ఏమి చేసివుండేవాళ్లు?—

ఈ ఇశ్రాయేలు అమ్మాయి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టింది?

ఆ అమ్మాయి ఇలా చెప్పింది, ‘నయమాను ఇశ్రాయేలులో ఉన్న యెహోవా ప్రవక్త దగ్గరకు వెళ్తే ఆయన కుష్ఠురోగం నయమౌతుంది.’ నయమాను ఆ అమ్మాయి మాట విని యెహోవా ప్రవక్త దగ్గరకు వెళ్లాడు. ఆ ప్రవక్త చెప్పినట్లు చేసినప్పుడు ఆయన కుష్ఠురోగం పోయింది. దానివల్ల నయమాను సత్యదేవుని ఆరాధకుడు అయ్యాడు.—2 రాజులు 5:1-15.

మీరు ఆ అమ్మాయి చేసినట్లు యెహోవా గురించి, ఆయన ఏమి చేయగలడనే దాని గురించి తెలుసుకునేందుకు ఎవరికైనా సహాయం చేయడానికి ఇష్టపడతారా?— మీరు ఎవరికి సహాయం చేయవచ్చు?— మొదట్లో కొంతమంది, తమకు సహాయం అవసరం లేదని అనుకుంటారు. కానీ యెహోవా చేసే మంచి గురించి మీరు వాళ్లకు చెప్పవచ్చు. అప్పుడు వాళ్లు వినవచ్చు. మీరు చేసినదానికి దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు.

సంతోషంగా దేవుని సేవ చేయమని, కీర్తన 122:1; 148:12, 13; ప్రసంగి 12:1; 1 తిమోతి 4:12; హెబ్రీయులు 10:23-25 వచనాలు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాయి.