కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

43వ అధ్యాయం

మన సహోదర సహోదరీలు ఎవరు?

మన సహోదర సహోదరీలు ఎవరు?

ఒకసారి మన గొప్ప బోధకుడు ఆశ్చర్యం అనిపించే ప్రశ్న ఒకటి అడిగాడు. అదేమిటంటే, ‘నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు?’ (మత్తయి 12:48) దానికి మీరు జవాబు చెప్పగలరా?— యేసు తల్లి మరియ అని మీకు తెలిసేవుంటుంది. మరి ఆయన సహోదరులు ఎవరో మీకు తెలుసా?— ఆయనకు సహోదరీలు కూడా ఉన్నారా?—

యేసు సహోదరుల పేర్లు ‘యాకోబు, యోసేపు, సీమోను, యూదా’ అని బైబిలు చెప్తోంది. యేసుకు సహోదరీలు కూడా ఉన్నారు. ఆయన ప్రకటిస్తున్న కాలంలో వాళ్లు జీవించారు. యేసు మొదట పుట్టాడు కాబట్టి, ఆయనే వీళ్లందరికన్నా పెద్దవాడు.—మత్తయి 13:55, 56; లూకా 1:34, 35.

యేసు సహోదరులు ఆయన శిష్యులు కూడా అయ్యారా?— మొదట్లో వాళ్లు, ‘ఆయన మీద విశ్వాసం ఉంచలేదు’ అని బైబిలు చెప్తోంది. (యోహాను 7:5) అయితే ఆ తర్వాత, యాకోబు, యూదా ఆయన శిష్యులయ్యారు, వాళ్లు బైబిల్లోని పుస్తకాలు కూడా రాశారు. వాళ్లు రాసిన పుస్తకాలు ఏమిటో తెలుసా?— యాకోబు వ్రాసిన పత్రిక, యూదా వ్రాసిన పత్రిక.

యేసు చెల్లెళ్ల పేర్లు బైబిల్లో లేకపోయినా, ఆయనకు కనీసం ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారని తెలుస్తుంది. ఇంకా ఎక్కువమంది కూడా ఉండివుండవచ్చు. వాళ్లు యేసు అనుచరులు అయ్యారా?— దాని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు కాబట్టి మనకు తెలీదు. కానీ యేసు, ‘నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు?’ అని ఎందుకు అడిగాడు?— దాని గురించి తెలుసుకుందాం.

యేసు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చి, ‘నీ తల్లి, నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట నిలబడివున్నారు’ అని చెప్పారు. అప్పుడు యేసు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్లకొక ప్రాముఖ్యమైన పాఠం నేర్పించాలనుకున్నాడు. వాళ్లకు ఆశ్చర్యమనిపించేలా ఆయన, ‘నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన తన శిష్యులను చూపిస్తూ, ‘ఇదిగో నా తల్లి, నా సహోదరులు!’ అని చెప్పాడు.

యేసు తన ఉద్దేశమేమిటో వివరిస్తూ, ‘పరలోకంలోవున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్లే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి’ అన్నాడు. (మత్తయి 12:47-50) యేసు తన శిష్యులను ఎంత ప్రేమించాడో దీన్నిబట్టి తెలుస్తుంది. ఆయన, తన శిష్యులే తనకు నిజమైన సహోదరులు, సహోదరీలు, తల్లులలాంటివాళ్లు అని మనకు బోధిస్తున్నాడు.

ఎవరు తన సహోదర సహోదరీలని యేసు చెప్పాడు?

యేసు సొంత తమ్ముళ్లయిన యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఆయన దేవుని కుమారుడని అప్పట్లో నమ్మలేదు. వాళ్ల అమ్మతో గబ్రియేలు దూత చెప్పినదాన్ని వాళ్లు నమ్మివుండరు. (లూకా 1:30-33) అందుకే వాళ్లు యేసుతో కఠినంగా ప్రవర్తించివుంటారు. అలా చేసేవాళ్లు ఎవరైనా నిజమైన సహోదరుడు లేదా సహోదరి కాదు. తమ అన్నదమ్ముళ్లతో, తమ అక్కచెల్లెళ్లతో కఠినంగా ఉన్నవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?—

బైబిలు ఏశావు, యాకోబుల గురించి చెప్తోంది. ఏశావుకు ఎంతో కోపం వచ్చి, ‘నా తమ్ముడైన యాకోబును చంపేస్తాను’ అని ఎందుకు అన్నాడో కూడా అది చెప్తోంది. ఏశావు మాటలు విన్న వాళ్ల అమ్మ రిబ్కా ఎంత భయపడిందంటే, ఏశావుకు దొరకకూడదని యాకోబును దూరంగా పంపించేసింది. (ఆదికాండము 27:41-46) అయితే, చాలా సంవత్సరాల తర్వాత ఏశావు మారాడు, ఆయన యాకోబును కౌగలించుకుని, ముద్దుపెట్టుకున్నాడు.—ఆదికాండము 33:4.

కొంతకాలానికి యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు. కానీ, యాకోబు కొడుకులకు వాళ్ల చిన్న తమ్ముడు యోసేపు అంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ల నాన్నకు అందరికన్నా యోసేపు అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి, వాళ్లు ఆయనను చూసి అసూయపడేవాళ్లు. అందుకే వాళ్లు ఐగుప్తుకు వెళ్తున్న బానిస వ్యాపారులకు ఆయనను అమ్మేశారు. తర్వాత వాళ్లు యోసేపును క్రూరమృగం చంపేసిందని వాళ్ల నాన్నకు చెప్పారు. (ఆదికాండము 37:23-36) అది చాలా ఘోరం కదా?—

ఆ తర్వాత యోసేపు అన్నలు తాము చేసినదానికి బాధపడ్డారు. అందుకే యోసేపు వాళ్లను క్షమించాడు. యోసేపు యేసులా ఎలా ప్రవర్తించాడో మీరు గమనించారా?— యేసు అపొస్తలులు ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయనను వదిలి పారిపోయారు, పేతురు అయితే ఆయనెవరో తనకు తెలీదన్నాడు. అయినప్పటికీ, యోసేపులా యేసు వాళ్లందర్నీ క్షమించాడు.

కయీను హేబెలుకు చేసినదాని నుండి మనం ఏ పాఠం నేర్చుకోవాలి?

కయీను, హేబెలు అనే ఇద్దరు అన్నదమ్ముల గురించి కూడా బైబిలు చెప్తోంది. వాళ్లను చూసి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. కయీను తన తమ్ముణ్ణి నిజంగా ప్రేమించడంలేదని దేవుడు గమనించాడు. అందుకే కయీను తన పద్ధతిని మార్చుకోవాలని దేవుడు అతనితో చెప్పాడు. కయీను నిజంగా దేవుణ్ణి ప్రేమించివుంటే ఆయన చెప్పేది వినివుండేవాడే. కానీ అతను దేవుణ్ణి ప్రేమించలేదు. ఒకరోజు కయీను హేబెలుతో, ‘మనం పొలానికి వెళ్దాం’ అన్నాడు. హేబెలు కయీనుతోపాటు వెళ్లాడు. పొలంలో వాళ్లు ఇద్దరే ఉన్నప్పుడు, కయీను తన తమ్ముణ్ణి గట్టిగా కొట్టి చంపేశాడు.—ఆదికాండము 4:2-8.

ఈ సంఘటన నుండి మనం ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవాలని బైబిలు చెప్తోంది. ఏమిటా పాఠం?— ‘మొదటి నుండి మీరు విన్న వర్తమానం ఇదే: మనం ఒకరిమీద ఒకరం ప్రేమ కలిగివుండాలి. మనం కయీనులా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి.’ కాబట్టి అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి. వాళ్లు కయీనులా ఉండకూడదు.—1 యోహాను 3:11, 12.

కయీనులా ఉండడం ఎందుకు తప్పు?— ఎందుకంటే బైబిలు చెప్తున్నట్లు, అతను ‘దుష్టుని సంబంధి,’ అంటే అపవాదియైన సాతానుకు సంబంధించినవాడు. కయీను అపవాది చేసినట్లే చేసి, అపవాదే తన తండ్రి అని చూపించాడు.

మీ అన్నదమ్ముళ్లను, అక్కచెల్లెళ్లను ప్రేమించడం ఎందుకు ప్రాముఖ్యమో అర్థమైందా?— మీరు వాళ్లను ప్రేమించకపోతే మీరు ఎవరి పిల్లల్లా ఉంటారు?— అపవాది పిల్లల్లా ఉంటారు. మీరు అలా ఉండాలనుకోవడంలేదు, అవునా?— కాబట్టి, దేవుని పిల్లల్లా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపించాలంటే మీరు ఏంచేయాలి?— మీ అన్నదమ్ముళ్లను, అక్కచెల్లెళ్లను నిజంగా ప్రేమించాలి.

అయితే, మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఏంచేస్తాం?— వాళ్లకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంతేకాకుండా, మనం వాళ్ల గురించి మంచిగా ఆలోచిస్తూ, వాళ్లకు సహాయం కూడా చేస్తాం. మరి మనం ప్రేమించాల్సిన మన సహోదర సహోదరీలు ఎవరు?— గుర్తుందా, ఒక పెద్ద క్రైస్తవ కుటుంబంగా ఏర్పడే ప్రజలే మన సహోదర సహోదరీలని యేసు బోధించాడు.

మీ అన్ననుగానీ, తమ్ముణ్ణిగానీ ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

ఈ క్రైస్తవ సహోదర సహోదరీలను ప్రేమించడం ఎంత ప్రాముఖ్యం?— ‘చూసిన తమ సహోదరుని [లేదా తమ సహోదరిని] ప్రేమించని వాళ్లు తాము చూడని దేవుణ్ణి ప్రేమించలేరు’ అని బైబిలు చెప్తోంది. (1 యోహాను 4:20) కాబట్టి క్రైస్తవ కుటుంబంలో కొంతమందినే ప్రేమించాలని అనుకోకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. ‘మీరు ఒకరిమీద ఒకరు ప్రేమ కలిగివుంటే దీన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు’ అని యేసు అన్నాడు. (యోహాను 13:35) మీరు సహోదర సహోదరీలందర్నీ ప్రేమిస్తారా?— అలా చేయకపోతే, దేవుణ్ణి నిజంగా ప్రేమించలేరని గుర్తుంచుకోండి.

మన సహోదర సహోదరీలను మనం నిజంగా ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?— మనం వాళ్లను ప్రేమిస్తే, వాళ్లతో మాట్లాడకూడదనే ఉద్దేశంతో వాళ్లను తప్పించుకుని తిరగడానికి చూడము. వాళ్లందరితో స్నేహంగా ఉంటాం. మనం ఎప్పుడూ వాళ్లకు సహాయం చేస్తాం, మన దగ్గరున్నది వాళ్లతో పంచుకుంటాం. ఎప్పుడైనా వాళ్లకు కష్టం వస్తే మనం వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వెళ్తాం, ఎందుకంటే మనమంతా నిజంగా ఒక పెద్ద కుటుంబంలో సభ్యులం.

మనం మన సహోదర సహోదరీలందర్నీ నిజంగా ప్రేమిస్తే, అది ఏమని నిరూపిస్తుంది?— మనం గొప్ప బోధకుడైన యేసు శిష్యులమని నిరూపిస్తుంది. మనం కోరుకునేది అదే కాదా?—

మన సహోదర సహోదరీలను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చో వివరించే, గలతీయులు 6:10; 1 యోహాను 4:8, 21 వచనాలు చదవండి.