కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

44వ అధ్యాయం

దేవుణ్ణి ప్రేమించేవాళ్లే మన స్నేహితులు

దేవుణ్ణి ప్రేమించేవాళ్లే మన స్నేహితులు

మనం ఎవరితో మాట్లాడాలనుకుంటామో, ఎవరితో సమయం గడపాలనుకుంటామో వాళ్లే మన స్నేహితులు. కానీ మనకు సరైన స్నేహితులు ఉండడం ప్రాముఖ్యం. మనం స్నేహం చేయగల గొప్ప స్నేహితుడు ఎవరు?— అవును, యెహోవా దేవుడే ఆ గొప్ప స్నేహితుడు.

మనం నిజంగా దేవునితో స్నేహం చేయగలమా?— చాలాకాలం క్రితం జీవించిన అబ్రాహాము, ‘యెహోవా స్నేహితుడు’ అని బైబిలు చెప్తోంది. (యాకోబు 2:23) ఆయన యెహోవాకు ఎందుకు స్నేహితుడయ్యాడు?— అబ్రాహాము దేవుడు చెప్పిన మాట విన్నాడని బైబిలు చెప్తోంది. దేవుడు చెప్పింది చేయడం ఎంతో కష్టమైనప్పుడు కూడా ఆయన దేవుని మాట విన్నాడు. కాబట్టి, యెహోవాతో స్నేహం చేయాలంటే మనం కూడా అబ్రాహాము చేసినట్లు యెహోవాకు ఇష్టమైనదే చేయాలి. మన గొప్ప బోధకుడు కూడా ఎప్పుడూ అలాగే చేశాడు.—ఆదికాండము 22:1-14; యోహాను 8:28, 29; హెబ్రీయులు 11:8, 17-19.

అబ్రాహాము ఎందుకు ‘యెహోవా స్నేహితుడు’ అయ్యాడు?

యేసు తన అపొస్తలులతో, ‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే, మీరు నా స్నేహితులు అవుతారు’ అని చెప్పాడు. (యోహాను 15:14) ఆయన ప్రజలకు చెప్పినవన్నీ యెహోవా దగ్గర నేర్చుకున్నవే కాబట్టి, దేవుడు చేయమని చెప్పినవి చేసిన ప్రజలే తన స్నేహితులని యేసు చెప్తున్నాడు. అవును, ఆయన స్నేహితులందరూ దేవుణ్ణి ప్రేమించారు.

మన గొప్ప బోధకునికి దగ్గరి స్నేహితుల్లో కొంతమంది ఆయన అపొస్తలులు. వాళ్ల చిత్రాలను ఈ పుస్తకంలోని 75వ పేజీలో మీరు చూడవచ్చు. వాళ్లు ఆయనతో కలిసి ప్రయాణించేవాళ్లు, అంతేకాదు, ప్రకటించే పనిలో ఆయనకు సహాయం చేసేవాళ్లు. యేసు వీళ్లతో ఎక్కువ సమయం గడిపేవాడు. వాళ్లు కలిసి తినేవాళ్లు. కలిసి దేవుని గురించి మాట్లాడుకునేవాళ్లు. వేరే పనుల్ని కూడా కలిసి చేసేవాళ్లు. అయితే, యేసుకు వేరే స్నేహితులు కూడా చాలామంది ఉండేవాళ్లు. ఆయన వాళ్లతోపాటు ఉండేవాడు, వాళ్లంతా కలిసి సరదాగా సమయం గడిపేవాళ్లు.

యేసు కలిసి ఉండడానికి ఇష్టపడే ఒక కుటుంబం, యెరూషలేము అనే పెద్ద పట్టణం దగ్గర్లోవున్న బేతనియ అనే ఒక చిన్న ఊరిలో ఉండేది. వాళ్లు ఎవరో మీకు తెలుసా?— వాళ్లు మరియ, మార్త, వాళ్ల తమ్ముడు లాజరు. యేసు లాజరును తన స్నేహితుడనేవాడు. (యోహాను 11:1, 5, 11) వీళ్లు యెహోవాను ప్రేమించారు, ఆయనను ఆరాధించారు కాబట్టే యేసు వాళ్లను ప్రేమించాడు, వాళ్లతో ఉండడానికి ఇష్టపడ్డాడు.

యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తరచూ ఈ కుటుంబంతో ఎందుకు ఉండేవాడు? వాళ్ల పేర్లు తెలుసా?

అలాగని, దేవుని ఆరాధకులు కానివారితో యేసు కఠినంగా ఉండేవాడు కాదు. వాళ్లతో కూడా ఆయన దయగా ఉండేవాడు. ఆయన వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి, వాళ్లతో కలిసి భోజనం చేసేవాడు. ఇది చూసి కొందరు, యేసు ‘సుంకరులకు, పాపులకు స్నేహితుడు’ అన్నారు. (మత్తయి 11:19) కానీ, యేసు వాళ్ల ఇళ్లకు వెళ్లింది వాళ్లు జీవించే పద్ధతి నచ్చడంవల్ల కాదు. వాళ్లతో యెహోవా గురించి మాట్లాడడానికే అలా వెళ్లేవాడు. వాళ్లు, చెడ్డ పనులు చేయడం మానేసి దేవుణ్ణి ఆరాధించేలా వాళ్లకు సహాయం చేయడానికి ఆయన ప్రయత్నించేవాడు.

జక్కయ్య ఈ చెట్టు ఎందుకు ఎక్కాడు?

అలాంటి సంఘటన ఒకటి యెరికో పట్టణంలో జరిగింది. యేసు ఆ పట్టణం మీదుగా యెరూషలేముకు వెళ్తున్నాడు. అప్పుడు జనం గుమికూడివున్నారు, ఆ గుంపులో జక్కయ్య అనే ఒకాయన కూడా ఉన్నాడు. ఆయన ఒక్కసారి యేసును చూడాలనుకున్నాడు. కానీ జక్కయ్య పొట్టివాడు, అందుకే ఆయన ఆ గుంపులో యేసును చూడలేకపోయాడు. కాబట్టి, యేసు అటుగా వెళ్తున్నప్పుడు ఆయనను దగ్గర నుండి చూడాలని జక్కయ్య ఆయనకు ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అదే దారిలో ఉన్న ఒక చెట్టు ఎక్కాడు.

యేసు ఆ చెట్టు దగ్గరకు రాగానే, పైకి చూసి, ‘త్వరగా దిగి రా, ఇవాళ నేను మీ ఇంటికి వస్తున్నాను’ అన్నాడు. కానీ ధనవంతుడైన ఈ జక్కయ్య చెడ్డ పనులు చేశాడు. యేసు అలాంటి వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్లాలనుకున్నాడు?—

యేసు ఆయన ఇంటికి వెళ్లాలనుకున్నది ఆయన జీవించే పద్ధతి నచ్చడంవల్ల కాదు. ఆయన జక్కయ్యతో దేవుని గురించి మాట్లాడడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు. తనను చూడడానికి జక్కయ్య ఎన్ని తిప్పలుపడ్డాడో యేసు చూశాడు. కాబట్టి తాను చెప్పింది జక్కయ్య వినే అవకాశం ఉందని యేసుకు తెలుసు. అందుకే, ప్రజలు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆయనకు చెప్పడానికి అదే మంచి సమయం.

యేసు జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్లాడు, ఏమి చేస్తానని జక్కయ్య మాటిస్తున్నాడు?

యేసు అలా చెప్పినప్పుడు ఏమి జరిగింది?— యేసు బోధించినవి జక్కయ్యకు నచ్చాయి. ప్రజలను మోసం చేసినందుకు జక్కయ్య చాలా బాధపడ్డాడు, అంతేకాదు ప్రజల దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బును తిరిగి వాళ్లకు ఇచ్చేస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత ఆయన యేసు అనుచరుడయ్యాడు. ఆయన అలా మారిన తర్వాతే యేసుకు స్నేహితుడయ్యాడు.—లూకా 19:1-10.

మనం గొప్ప బోధకుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే, మన స్నేహితులు కాని వాళ్ల దగ్గరకు వెళ్తామా?— వెళ్తాము. కానీ వాళ్లు జీవించే పద్ధతి నచ్చడంవల్లనో, వాళ్లతోపాటు చెడ్డపనులు చేయడానికనో మనం వాళ్ల ఇళ్లకు వెళ్లం. దేవుని గురించి మాట్లాడడం కోసం మాత్రమే మనం వాళ్ల దగ్గరకు వెళ్తాం.

కానీ, మనం మన దగ్గరి స్నేహితులతో ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడతాం. అయితే, దేవుడు ఇష్టపడే విధంగా జీవించే వాళ్లే సరైన స్నేహితులు. కొంతమందికి యెహోవా ఎవరో కూడా తెలీకపోవచ్చు. కానీ, వాళ్లు ఆయన గురించి తెలుసుకోవాలని ఇష్టపడితే, మనం వాళ్లకు సహాయం చేయవచ్చు. వాళ్లు కూడా మనలా యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే వాళ్లూ మనమూ దగ్గరి స్నేహితులం కావొచ్చు.

మనం ఎవరితో స్నేహం చేస్తే మంచిదో తెలుసుకోవడానికి మరో పద్ధతి కూడా ఉంది. వాళ్ల ప్రవర్తనను గమనించండి. వాళ్లు వేరేవాళ్లను బాధపెట్టి నవ్వుకుంటారా? అలా చేయడం మంచిది కాదు, అవునా?— వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి చేసి సమస్యల్లో చిక్కుకుంటారా? వాళ్లతో ఉండి వాళ్లు చేసిన వాటికి వాళ్లతోపాటు మనం కూడా సమస్యల్లో చిక్కుకోవాలని అనుకుంటామా, లేదు కదా?— వాళ్లు కావాలనే చెడ్డ పనులు చేస్తూ, తాము ఎవరికీ దొరక్కుండా తప్పించుకున్నాం కాబట్టి తెలివైనవాళ్లమని అనుకుంటారా? వాళ్లు ఎవరికీ దొరక్కపోయినా వాళ్లు చేసిన దాన్ని దేవుడు చూశాడు, అవునా?— అలాంటి పనులు చేసేవాళ్లతో స్నేహం చేయడం మంచిదేనా?—

అది తెలుసుకోవడానికి మీరు మీ బైబిలు తీసి చూస్తారా? మన సహవాసులు మన జీవితాలను ఎంతవరకు మార్చగలరని అది చెప్తుందో చూద్దాం. అది 1 కొరింథీయులు 15వ అధ్యాయం, 33వ వచనంలో ఉంది. ఆ లేఖనాన్ని తీశారా?— అక్కడ ఇలా ఉంది, “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” అంటే చెడ్డవాళ్లతో సమయం గడిపితే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని అర్థం. మంచివాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటామనేది కూడా నిజం.

మన జీవితంలో యెహోవాకే అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయనతో ఉన్న స్నేహం పోగొట్టుకోవాలని ఏ రోజూ మనం అనుకోం, అవునా?— కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, దేవుణ్ణి ప్రేమించేవాళ్లతో మాత్రమే స్నేహం చేయాలి.

మనం సరైనవాళ్లతో స్నేహం చేయడం ఎందుకు ప్రాముఖ్యమో, కీర్తన 119:115; సామెతలు 13:20; 2 తిమోతి 2:22; 1 యోహాను 2:15 వచనాలు చూపిస్తున్నాయి.