కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

45వ అధ్యాయం

దేవుని రాజ్యమంటే ఏమిటి? అది రావాలని కోరుకుంటున్నట్లు ఎలా చూపించాలి?

దేవుని రాజ్యమంటే ఏమిటి? అది రావాలని కోరుకుంటున్నట్లు ఎలా చూపించాలి?

యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థన మీకు తెలుసా?— ఒకవేళ తెలియకపోతే, మత్తయి 6:9-13లో ఉన్న ఆ ప్రార్థనను మనం కలిసి చదువుదాం. ఆ ప్రార్థనను చాలామంది ప్రభువు ప్రార్థన అంటారు. దానిలో, “నీ రాజ్యము వచ్చుగాక” అనే మాటలు ఉన్నాయి. దేవుని రాజ్యమంటే ఏమిటో తెలుసా?—

ఒక దేశాన్ని లేదా ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు అంటారు. ఆయన పరిపాలన చేయడాన్ని రాజ్యం చేయడం అంటారు. అయితే, కొన్నిదేశాల్లో అందరికన్నా పై అధికారిని రాష్ట్రపతి అంటారు. మరి దేవుని రాజ్యంలో పరిపాలన చేసే వ్యక్తిని ఏమి అనాలి?— రాజు అనాలి. కాబట్టి, దేవుని పరిపాలనను దేవుని రాజ్యం అనవచ్చు.

తన రాజ్యానికి రాజుగా ఉండేందుకు యెహోవా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా?— తన కుమారుడైన యేసుక్రీస్తును. మానవులు ఎన్నుకోగల ఏ పరిపాలకునికన్నా ఆయనే ఎందుకు మెరుగైనవాడు?— ఎందుకంటే, యేసుకు తన తండ్రియైన యెహోవా అంటే ఎంతో ప్రేమ. అందుకే ఆయన ఎప్పుడూ సరైనదే చేస్తాడు.

యేసు బేత్లెహేములో పుట్టడానికి చాలాకాలం ముందే, బైబిలు ఆయన పుట్టుక గురించి మాట్లాడింది. అంతేకాదు, దేవుడు తన రాజ్యానికి పరిపాలకునిగా ఆయన్నే ఎన్నుకుంటాడని కూడా వివరించింది. దీని గురించి యెషయా 9:6, 7 వచనాలు చదువుదాం. అక్కడ ఇలావుంది, ‘మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముమీద రాజ్యభారముండును. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మితిలేకుండ ఆ రాజ్యానికి వృద్ధియు, క్షేమమును కలుగును.’

దేవుని రాజ్య పరిపాలకుడైన యేసును బైబిలు ఇక్కడ “అధిపతి” అని పిలుస్తుంది. అంతేకాదు, ఈయన గొప్ప రాజైన యెహోవా కుమారుడు. కానీ యేసును యెహోవా తన రాజ్యానికి రాజుగా కూడా నియమించాడు. ఆ రాజ్యం భూమిని వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తుంది. (ప్రకటన 20:6) బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు, ‘పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి, మారుమనస్సు పొందండని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.’—మత్తయి 4:17.

రాజ్యం సమీపించిందని యేసు ఎందుకు చెప్పాడు?— ఎందుకంటే, ఆ తర్వాత పరలోకంలో పరిపాలించే రాజు, అప్పుడు వాళ్లతోనే ఉన్నాడు! అందుకే యేసు, ‘దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది’ అన్నాడు. (లూకా 17:21) ఒక రాజుకు, అదీ యెహోవా నియమించిన రాజుకు దగ్గరగా అంటే ఆయనతో మాట్లాడగలిగేంత దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలరా?—

కాబట్టి, యేసు ఏ ప్రాముఖ్యమైన పని చేయడానికి ఈ భూమ్మీదికి వచ్చాడు?— యేసు దానికి జవాబిస్తూ, ‘నేను వేరే పట్టణాల్లో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి; ఈ పని కోసమే నేను పంపించబడ్డాను’ అని చెప్పాడు. (లూకా 4:43) ఆ ప్రకటించే పనినంతా తానొక్కడే చేయలేడని యేసుకు తెలుసు. కాబట్టి ఆయనేమి చేశాడు?—

యేసు ఏ పని చేయడానికి ఈ భూమ్మీదికి వచ్చాడు?

యేసు ప్రజలను తనతోపాటు తీసుకెళ్లి ప్రకటనా పని ఎలాచేయాలో వాళ్లకు చూపించాడు. ఆయన దాన్ని ముందుగా తాను ఎన్నుకున్న 12 మంది అపొస్తలులకు నేర్పించాడు. (మత్తయి 10:5, 7) కానీ, యేసు కేవలం తన అపొస్తలులకు మాత్రమే ఈ పని ఎలా చేయాలో నేర్పించాడా? లేదు, ఆయన ప్రకటించడం ఇంకా చాలామందికి నేర్పించాడని బైబిలు చెప్తోంది. కొంతకాలం తర్వాత ఆయన 70 మంది ఇతర శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున తనకంటే ముందుగా పంపించాడు. వాళ్లు ప్రజలకు ఏమి బోధించారు?— ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని వాళ్లతో చెప్పండి’ అని యేసు వాళ్లతో అన్నాడు. (లూకా 10:9) అలా ప్రజలు దేవుని రాజ్యం గురించి తెలుసుకున్నారు.

పూర్వం ఇశ్రాయేలులో కొత్తగా నియమించబడిన రాజులు తామెవరో ప్రజలకు తెలియడానికి గాడిదపిల్లపై స్వారీచేస్తూ పట్టణంలోకి ప్రవేశించేవాళ్లు. యేసు చివరిసారిగా యెరూషలేముకు వెళ్లినప్పుడు అలాగే చేశాడు. దేవుని రాజ్యానికి యేసు రాజు కాబోతున్నాడు. మరి ఆయన తమ రాజుగా ఉండాలని ప్రజలు కోరుకున్నారా?—

యేసు అలా వెళ్తుండగా, దారిపొడవునా చాలామంది తమ బట్టలను, కొంతమంది చెట్ల కొమ్మలను పరిచారు. అలా వాళ్లు యేసు తమపై రాజుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపించారు. వాళ్లు, ‘యెహోవా పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక!’ అని కేకలు వేశారు. కానీ అందరూ అలా సంతోషించలేదు. నిజానికి కొందరు మతనాయకులు, ‘నీ శిష్యులను ఊరుకోమను’ అని యేసుతో అన్నారు.—లూకా 19:28-40.

యేసు రాజుగా ఉండాలని కోరుకున్న ప్రజలు ఎందుకు తమ మనస్సు మార్చుకున్నారు?

అది జరిగిన ఐదు రోజుల తర్వాత, యేసును బంధించి, అధిపతియైన పొంతి పిలాతు ముందు నిలబెట్టడానికి ఆయనను రాజ భవనానికి తీసుకెళ్లారు. యేసు తాను రాజునని చెప్పుకుంటూ, రోమా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాడని ఆయన శత్రువులు ఆరోపించారు. పిలాతు దాని గురించి యేసును అడిగాడు. అయితే యేసు తాను రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించడంలేదని చెప్పాడు. ఆయన పిలాతుతో, ‘నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు’ అన్నాడు.—యోహాను 18:36.

పిలాతు బయటకు వెళ్లి, యేసులో తనకు ఎలాంటి తప్పు కనబడలేదని ప్రజలతో అన్నాడు. కానీ యేసు తమపై రాజుగా ఉండడం ప్రజలకు ఇక ఇష్టం లేదు. ఆయనను విడుదల చేయడం వాళ్లు ఇష్టపడలేదు. (యోహాను 18:37-40) పిలాతు యేసుతో మళ్లీ మాట్లాడాడు. యేసు ఎలాంటి తప్పూ చేయలేదని ఆయనకు ఈసారి పూర్తిగా అర్థమైంది. అందుకే పిలాతు, యేసును చివరిసారిగా బయటకు తీసుకొచ్చి ప్రజలతో, “ఇదిగో మీ రాజు” అన్నాడు. కానీ దానికి వాళ్లు, ‘ఇతనిని సంహరించు, సంహరించు, సిలువ వేయి [మ్రానుమీద వేలాడదీయి]’ అని కేకలు వేశారు.

అప్పుడు పిలాతు, ‘మీ రాజును సిలువ వేయాలా [మ్రానుమీద వేలాడదీయాలా]?’ అని అడిగాడు. అందుకు ప్రధానయాజకులు, ‘కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు’ అన్నారు. చూశారా వాళ్లెంత పనిచేశారో? ప్రజలు యేసును తిరస్కరించేలా ఆ చెడ్డ యాజకులు చేయగలిగారు.—యోహాను 19:1-16.

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. చాలామంది యేసు తమకు రాజుగా ఉండాలని కోరుకోవడం లేదు. దేవుని మీద తమకు నమ్మకం ఉందని వాళ్లు అనవచ్చు, అయితే ఏంచేయాలి, ఏమి చేయకూడదు అనేది దేవుడు గానీ, క్రీస్తు గానీ తమకు చెప్పడం వాళ్లకు ఇష్టం లేదు. ఈ భూమ్మీద తమ ప్రభుత్వాలే ఉండాలని వాళ్లు కోరుకుంటారు.

మరి మన విషయం ఏమిటి, దేవుని రాజ్యం గురించి మనం ఏమి అనుకుంటున్నాం? ఆ రాజ్యం గురించి, అది తీసుకొచ్చే అద్భుతమైన వాటన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు, దేవుడంటే మనకు ఎలా అనిపిస్తుంది?— మనకు ఆయనంటే ప్రేమ కలుగుతుంది, అవునా?— అలాగైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, ఆయన రాజ్య పరిపాలనను కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?—

యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు, దాన్నిబట్టి తాను ఆనందించినట్లు దేవుడు ఎలా చూపించాడు?

ఆ విషయాన్ని, యేసును అనుసరించడం ద్వారా దేవునికి చూపించవచ్చు. యెహోవాను ప్రేమిస్తున్నానని చూపించడానికి యేసు ఏంచేశాడు?— ‘నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను’ అని యేసు వివరించాడు. (యోహాను 8:29) ‘దేవుని చిత్తం చేసి,’ ‘ఆయన చెప్పిన పని ముగించడానికే’ యేసు ఈ భూమ్మీదికి వచ్చాడు. (హెబ్రీయులు 10:7; యోహాను 4:34) యేసు ప్రకటనా పని మొదలుపెట్టడానికి ముందు ఏంచేశాడో ఆలోచించండి.

బాప్తిస్మమిచ్చే యోహాను యొర్దాను నది దగ్గర ఉన్నప్పుడు యేసు అక్కడకు వెళ్లాడు. వాళ్లిద్దరూ నీళ్లలోకి వెళ్లిన తర్వాత, యేసుకు బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను ఆయనను నీళ్లలో పూర్తిగా ముంచి పైకి లేపాడు. యేసుకు యోహాను ఎందుకు బాప్తిస్మమిచ్చాడో తెలుసా?—

దేవుని రాజ్యం గురించి ఎక్కడెక్కడ మాట్లాడవచ్చు?

తనకు బాప్తిస్మం ఇవ్వమని యేసే యోహానును అడిగాడు. అయితే యేసు బాప్తిస్మం తీసుకోవాలని దేవుడు కోరుకున్నట్లు మనకు ఎలా తెలుసు?— మనకు ఎలా తెలుసంటే, యేసు నీళ్లలో నుండి పైకి వచ్చినప్పుడు, పరలోకం నుండి దేవుని స్వరం, ‘నువ్వు నా ప్రియ కుమారుడవు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను’ అని చెప్పడం ఆయన విన్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసు మీదకు దిగేలా కూడా చేశాడు. కాబట్టి, యేసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా జీవితాంతం అంటే ఎప్పటికీ యెహోవా సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు చూపించాడు.—మార్కు 1:9-11.

మీరు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలే. కానీ మీరు పెద్దవాళ్లు అయ్యాక ఏంచేస్తారు?— మీరు కూడా యేసులా బాప్తిస్మం తీసుకుంటారా?— మీరు యేసును అనుసరించాలి, ఎందుకంటే ఆయన ‘తన అడుగుజాడల్లో నడుచుకునేలా మీకు మాదిరి’ ఉంచాడని బైబిలు చెప్తోంది. (1 పేతురు 2:21) మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, దేవుని రాజ్య పరిపాలనను మీరు నిజంగా కోరుకుంటున్నారని చూపిస్తారు. అయితే బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు.

యేసు బోధించిన వాటన్నిటిని మనం పాటించాలి. మనం ‘లోక సంబంధులముగా ఉండకూడదు’ అని యేసు చెప్పాడు. లోకంలోని ప్రజలు చేస్తున్నవే మనం కూడా చేస్తుంటే, మనం ఆయన మాట వింటున్నట్లా? యేసు, ఆయన అపొస్తలులు అలాంటివి చేయలేదు. (యోహాను 17:14) మరి వాళ్లు ఏంచేశారు?— వాళ్లు దేవుని రాజ్యం గురించి వేరేవాళ్లకు చెప్పారు. వాళ్లు తమ జీవితంలో ఆ పనికే అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. మనం కూడా అలాగే చేయగలమా?— దేవుని రాజ్యం రావాలని మనం మనస్ఫూర్తిగానే ప్రార్థన చేస్తుంటే, మనం ఆ పనికే అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం.

దేవుని రాజ్యం రావాలని మనం కోరుకుంటున్నామని చూపించడానికి మనమేమి చేయవచ్చో వివరించే, మత్తయి 6:24-33; 24:14; 1 యోహాను 2:15-17; 5:3 వచనాలు కూడా చూడండి.