కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

46వ అధ్యాయం

ఒకప్పుడు నీళ్లు లోకాన్ని నాశనం చేశాయి—మళ్లీ అలా జరుగుతుందా?

ఒకప్పుడు నీళ్లు లోకాన్ని నాశనం చేశాయి—మళ్లీ అలా జరుగుతుందా?

లోకం నాశనం అయిపోతుందని ఎవరైనా అనడం ఎప్పుడైనా విన్నారా?— ఈ రోజుల్లో చాలామంది దానిగురించి మాట్లాడుకుంటున్నారు. మనుషులు అణుబాంబులు ఉపయోగించి చేసే ఒక యుద్ధంలో లోకం నాశనం అయిపోతుందని కొందరు అనుకుంటారు.మన అందమైన భూమిని మనుషులు నాశనం చేయడానికి దేవుడు అసలు అనుమతిస్తాడంటారా?—

మనం ముందు తెలుసుకున్నట్లు, లోకం నాశనం అవుతుందని బైబిలు చెప్తోంది. ‘లోకం గతించిపోతోంది’ అని బైబిలు చెప్తోంది. (1 యోహాను 2:17) లోకం నాశనం అవుతుందంటే దానర్థం భూమి నాశనం అవుతుందనా?— కాదు, ఎందుకంటే దేవుడు ఈ భూమి “నివాస స్థలం” కావాలని, అంటే ప్రజలు దానిపై ఆనందంగా నివసించాలని దానిని చేసినట్లు బైబిలు చెప్తోంది. (యెషయా 45:18) ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వాళ్లు దానిలో నిత్యం నివసిస్తారు’ అని కీర్తన 37:29లో ఉంది. అందుకే భూమి ఎప్పటికీ ఉంటుందని కూడా బైబిలు చెప్తోంది.—కీర్తన 104:5; ప్రసంగి 1:4.

కాబట్టి లోకనాశనం అంటే భూమి నాశనమవ్వడం కాకపోతే, మరి దానర్థం ఏమిటి?— నోవహు కాలంలో ఏమి జరిగిందో జాగ్రత్తగా పరిశీలిస్తే దాని అర్థం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. బైబిలు ఇలా వివరిస్తోంది, “అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 2 పేతురు 3:6.

నోవహుకాలంలో ఆ జలప్రళయం లేదా నీటివరద వచ్చినప్పుడు ఎవరైనా బ్రతికి బయటపడ్డారా?— దేవుడు ‘లోకం మీదికి అంటే భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయం రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడాడు’ అని బైబిలు చెప్తోంది.—2 పేతురు 2:5.

నోవహు కాలంలో ఏ లోకం నాశనమైంది?

కాబట్టి ఏ లోకం నాశనమయ్యింది? భూమి నాశనమైందా లేక చెడ్డ ప్రజలు నాశనమయ్యారా?— ‘భక్తిహీనుల సమూహం’ నాశనమయ్యింది అని బైబిలు చెప్తోంది. అలాగే నోవహు ‘ప్రకటించాడు’ అని కూడా బైబిలు చెప్తోంది. ఆయన ఏమి ప్రకటించాడు?— నోవహు ‘అప్పుడున్న లోకం’ నాశనం అవుతుందని ప్రజలను హెచ్చరించాడు.

యేసు ఆ గొప్ప జలప్రళయం గురించి మాట్లాడుతూ అంతం రావడానికి ముందు ప్రజలేమి చేసేవాళ్లో తన శిష్యులకు చెప్పాడు. ఆయన వాళ్లతో, ‘జలప్రళయం రావడానికి ముందటి రోజుల్లో, నోవహు ఓడలోకి వెళ్లిన రోజువరకు, ప్రజలు తింటూ తాగుతూ పెళ్లి చేసుకొంటూ పెళ్లికిస్తూ, జలప్రళయంవచ్చి అందరిని కొట్టుకొనిపోయే వరకు ఎరుగక పోయిరి [పట్టించుకోలేదు] అన్నాడు. ఆ తర్వాత ఆయన, ఈ లోకం నాశనం కావడానికి ముందు కూడా ప్రజలు అలాంటి పనులే చేస్తుంటారని చెప్పాడు.—మత్తయి 24:37-39.

జలప్రళయానికి ముందు ప్రజలు చేసినవాటి నుండి మనం పాఠాలు నేర్చుకోవచ్చని యేసు మాటలు చూపిస్తున్నాయి. ఆ ప్రజలు ఏంచేశారో 10వ అధ్యాయంలో చదివాం, గుర్తుందా?— కొందరు దౌర్జన్యం చేసేవాళ్లు, క్రూరంగా ప్రవర్తించేవాళ్లు. కానీ ప్రకటించడానికి దేవుడు నోవహును పంపించినప్పుడు చాలామంది వినలేదని యేసు చెప్పాడు.

జలప్రళయం రప్పించి ఆ చెడ్డ ప్రజలను నాశనం చేస్తానని యెహోవా ఒకరోజు నోవహుతో చెప్పాడు. అప్పుడు పర్వతాలతో సహా భూమ్మీద ఉన్నవన్నీ నీటిలో మునిగిపోతాయి. యెహోవా నోవహును ఒక పెద్ద ఓడ చేయమన్నాడు. అది పొడుగ్గా, పెద్ద పెట్టెలా ఉంటుంది, పేజీ వెనక్కి తిప్పితే 238వ పేజీలో దాని బొమ్మ చూడవచ్చు.

నోవహు, ఆయన కుటుంబంతోపాటు ఎన్నో జంతువులు సురక్షితంగా ఉండడానికి సరిపడేంత పెద్ద ఓడను చేయమని దేవుడు నోవహుకు చెప్పాడు. నోవహు ఆయన కుటుంబం చాలా కష్టపడి పనిచేశారు. వాళ్లు పెద్దపెద్ద చెట్లు నరికి వాటి కలపతో ఓడ చేయడం మొదలుపెట్టారు. ఆ ఓడ చాలా పెద్దది కాబట్టి దాన్ని చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది.

ఆ ఓడను చేస్తున్న కాలమంతటిలో నోవహు ఇంకా ఏంచేశాడో గుర్తుందా?— ఆయన జలప్రళయం రాబోతుందని ప్రజలకు ప్రకటించాడు, వాళ్లను హెచ్చరించాడు. వాళ్లలో ఎవరైనా నోవహు చెప్పింది విన్నారా? నోవహు కుటుంబం తప్ప ఇంకెవ్వరూ ఆయన చెప్పింది పట్టించుకోలేదు. వాళ్లంతా వేరే పనుల్లో మునిగిపోయారు. వాళ్లు ఏ పనుల్లో మునిగిపోయారని యేసు చెప్పాడో గుర్తుందా?— వాళ్లు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. తాము చెడ్డ వాళ్లమని వాళ్లు అనుకోలేదు, నోవహు చెప్తున్నది వినడానికి వీలు చేసుకోలేదు. కాబట్టి వాళ్లకు ఏమయ్యిందో చూద్దాం.

నోవహు, ఆయన కుటుంబం ఓడలోకి వెళ్లిన తర్వాత, యెహోవా ఓడ తలుపు మూసేశాడు. జలప్రళయం వస్తుందని బయటవున్న ప్రజలు అప్పటికీ నమ్మలేదు. కానీ ఒక్కసారిగా వర్షం మొదలైంది! అది మామూలు వర్షం కాదు. చాలాచాలా పెద్ద వర్షం! వర్షం నీళ్లు పెద్ద శబ్దంతో నదుల్లా పారడం మొదలైంది. ఆ నీళ్ల తాకిడికి పెద్దపెద్ద చెట్లుకూడా పడిపోయాయి, పెద్దపెద్ద బండరాళ్లు చిన్నచిన్న గులకరాళ్లలా కొట్టుకుపోయాయి. ఓడ బయట ఉన్నవాళ్లకు ఏమయ్యింది?— ‘జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోయారు’ అని యేసు చెప్పాడు. ఓడ బయట ఉన్నవాళ్లంతా చనిపోయారు. ఎందుకు?— ఎందుకంటే, వాళ్లు ‘పట్టించుకోలేదు’ అని యేసు చెప్పాడు. వాళ్లు వినలేదు!—మత్తయి 24:39; ఆదికాండము 6:5-7.

మనం ఎప్పుడూ సరదాగా గడపడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం ఎందుకు మంచిది కాదు?

మీకు గుర్తుందా, ఆ కాలంలో ప్రజలకు జరిగిన దాని నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చని యేసు చెప్పాడు. మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?— ఆ ప్రజలు చెడ్డవాళ్లు అయినందువల్ల మాత్రమే కాదు, వాళ్లలో చాలామంది దేవుని గురించి, ఆయన చేయబోతున్న దాని గురించి తెలుసుకునే తీరిక లేకుండా ఉన్నందుకు నాశనం చేయబడ్డారు. కాబట్టి మనం వాళ్లలా ఉండకుండా జాగ్రత్తపడాలి, అవునా?—

దేవుడు మళ్లీ అలాంటి జలప్రళయం తీసుకొచ్చి ఈ లోకాన్ని నాశనం చేస్తాడని అనిపిస్తుందా?— లేదు, అలా నాశనం చేయనని దేవుడు మాటిచ్చాడు. ‘మేఘంలో నా ధనుస్సును ఉంచాను, అది ఒక గుర్తుగా ఉంటుంది’ అని ఆయన అన్నాడు. ‘సమస్త శరీరులను నాశనం చేయడానికి మళ్లీ అలా ప్రవాహంగా నీళ్లు రావు’ అనడానికి మేఘంలో ఆ ధనుస్సు లేదా ఇంద్రధనుస్సు ఒక గుర్తుగా ఉంటుందని యెహోవా చెప్పాడు.—ఆదికాండము 9:11-17.

కాబట్టి, దేవుడు మళ్లీ జలప్రళయం తీసుకొచ్చి ఈ లోకాన్ని నాశనం చేయడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే, మనం ముందు చూసినట్లుగా లోకం నాశనమవుతుందని బైబిలు చెప్తోంది. దేవుడు ఈ లోకాన్ని నాశనం చేసినప్పుడు, ఆయన ఎవరిని ప్రాణాలతో కాపాడతాడు?— దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టం పడకుండా, వేరే విషయాల్లో మునిగిపోయి ఉండేవాళ్లను ఆయన కాపాడతాడా? బైబిలు గురించి తెలుసుకోవడానికి వీలు చేసుకోని వాళ్లను ఆయన కాపాడతాడా? మీకు ఏమి అనిపిస్తుంది?—

దేవుడు కాపాడేవాళ్లలో మనం ఉండాలని కోరుకుంటాం, అవునా?— నోవహు కుటుంబంలా మన కుటుంబం కూడా దేవుడు కాపాడే విధంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా?— ఈ లోకం నాశనం అవుతున్నప్పుడు మనం నాశనం కాకుండా ఉండాలంటే, దేవుడు ఆ లోకాన్ని ఎలా నాశనం చేస్తాడో, ఆ తర్వాత నీతీన్యాయాలుండే తన కొత్త లోకాన్ని ఎలా తీసుకొస్తాడో తెలుసుకోవాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

దాని గురించి దానియేలు 2వ అధ్యాయం, 44వ వచనంలో ఉంది. ఈ వచనం మనకాలంలో జరగబోయే దాని గురించి మాట్లాడుతూ, ‘ఆ రాజుల కాలంలో పరలోకంలోవున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎప్పటికీ నాశనం కలగదు, ఆ రాజ్యం దాని పొందినవారికి తప్ప ఇంకెవ్వరికీ చెందదు; అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుంది గానీ అది యుగాల వరకూ నిలుస్తుంది’ అని చెప్తోంది.

అది మీకు అర్థమైందా?— దేవుని రాజ్యం భూమ్మీదవున్న అన్ని ప్రభుత్వాలను నాశనం చేయబోతుందని బైబిలు చెప్తోంది. ఎందుకు?— ఎందుకంటే, అవి దేవుడు నియమించిన రాజుకు లోబడలేదు. ఆ రాజు ఎవరు?— సరిగ్గా చెప్పారు, యేసుక్రీస్తు!

దేవుడు ఎంచుకున్న రాజైన యేసుక్రీస్తు అర్మగిద్దోనులో ఈ లోకాన్ని నాశనం చేస్తాడు

ఎలాంటి పరిపాలన ఉండాలో నిర్ణయించే హక్కు యెహోవా దేవునికి ఉంది. అందుకే ఆయన, తన కుమారుడైన యేసును రాజుగా ఎంచుకున్నాడు. త్వరలోనే దేవుడు నియమించిన పరిపాలకుడైన యేసుక్రీస్తు అధికారం క్రింద ఈ ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ నాశనం చేయబడతాయి. ఆయన నాశనం చేస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రకటన 19వ అధ్యాయం, 11 నుండి 16 వచనాలు వివరిస్తున్నాయి. దాన్ని మీరు ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ లోక ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసే దేవుని యుద్ధం పేరు హార్‌మెగిద్దోను లేదా అర్మగిద్దోను అని బైబిల్లో ఉంది.

తన రాజ్యం, మనుషుల ప్రభుత్వాలను నాశనం చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. కానీ, ఆయన ఆ పని మనల్ని చేయమని అంటున్నాడా?— లేదు, ఎందుకంటే, అర్మగిద్దోను ‘సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధం’ అని బైబిలు చెప్తోంది. (ప్రకటన 16:14-16) అవును, అర్మగిద్దోను దేవుని యుద్ధం. ఆ యుద్ధంలో పోరాడే దేవదూతల సైన్యాలకు నాయకత్వం వహించే బాధ్యతను ఆయన యేసుక్రీస్తుకు అప్పగిస్తాడు. అర్మగిద్దోను యుద్ధం దగ్గరపడిందా? అది మనం ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

దేవుడు చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసి, తన సేవకులను కాపాడినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, సామెతలు 2:21, 22; యెషయా 26:20, 21; యిర్మీయా 25:31-33; మత్తయి 24:21, 22 వచనాలు కలిసి చదువుదాం.