కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

47వ అధ్యాయం

అర్మగిద్దోను దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చు?

అర్మగిద్దోను దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చు?

గుర్తు అంటే ఏమిటో మీకు తెలుసు కదా?— లోకాన్ని నాశనం చేయడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రప్పించనని చూపించడానికి దేవుడు ఇచ్చిన గుర్తు గురించి 46వ అధ్యాయంలో చదివాం. యేసు తిరిగి వచ్చాడని, లోక నాశనం దగ్గరపడిందని తెలుసుకోవడానికి సహాయం చేసే గుర్తు ఏమిటని అపొస్తలులు అడిగారు.—మత్తయి 24:3.

యేసు పరలోకంలో ఉన్నందువల్ల మనకు కనిపించడు కాబట్టి, ఆయన పరిపాలించడం మొదలుపెట్టాడని ప్రజలకు తెలిసేలా చేసే గుర్తు అవసరం. ఈ భూమ్మీద ఏయే సంఘటనలు జరగడం చూసి తన శిష్యులు అది తెలుసుకోవాలో యేసు చెప్పాడు. ఆ సంఘటనలు జరిగినప్పుడు, ఆయన తిరిగి వచ్చాడనీ, పరలోకంలో రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడనీ అర్థంచేసుకోవాలి.

కనిపెట్టుకుని ఉండడం ప్రాముఖ్యమని తన శిష్యులకు బోధించడానికి యేసు వాళ్లతో, ‘అంజూరపు వృక్షాన్ని, వృక్షాలన్నిటినీ చూడండి. అవి చిగురించడం చూసి, వసంతకాలం అప్పుడే దగ్గరపడిందని మీ అంతట మీరే తెలుసుకుంటారు’ అని చెప్పాడు. వసంతకాలం దగ్గరపడిందని ఎలా చెప్పవచ్చో మీకు తెలుసు. యేసు చెప్పినవి జరగడం మీరు చూసినప్పుడు అర్మగిద్దోను దగ్గరపడిందని తెలుసుకోవచ్చు.—లూకా 21:29, 30.

యేసు, అంజూరపు చెట్టు గురించి మాట్లాడినప్పుడు ఏ పాఠం నేర్పించాడు?

దేవుని రాజ్యం దగ్గరపడినప్పుడు జరుగుతాయని యేసు చెప్పిన సంఘటనల చిత్రాలు ఈ పేజీలో, తర్వాతి పేజీలో ఉన్నాయి. ఆ సంఘటనలన్నీ యేసు చెప్పిన గుర్తులో భాగం. అవి జరిగినప్పుడు, మనం 46వ అధ్యాయంలో తెలుసుకున్నట్లు, క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యం మనుషుల ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తుంది.

దీనికి ముందున్న రెండు పేజీల్లో ఉన్న చిత్రాలను జాగ్రత్తగా చూడండి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చిత్రాల్లో కనిపిస్తున్నవాటి గురించి, మత్తయి 24:6-14 ఇంకా లూకా 21:9-11 వచనాల్లో చదవవచ్చు. ఆ చిత్రాల్లో ప్రతిదానిమీద ఒక సంఖ్య ఇవ్వబడింది. అదే సంఖ్య, ఆ చిత్రాన్ని వివరిస్తున్న పేరా మొదట్లో ఉంది. యేసు చెప్పిన గుర్తులోని చాలా సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయేమో చూద్దాం.

(1) యేసు ఇలా చెప్పాడు, ‘మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు; జనం మీదకు జనం, రాజ్యం మీదకు రాజ్యం లేస్తుంది.’ మీరు యుద్ధాల గురించి విన్నారా?— 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఆ తర్వాత 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అంతకు ముందెప్పుడూ ప్రపంచ యుద్ధాలు జరగలేదు! ఇప్పుడు ప్రపంచమంతటా యుద్ధాలు జరుగుతున్నాయి. వాటి గురించి మనం ప్రతీరోజు టీవీల్లో చూస్తుంటాం, రేడియోల్లో వింటుంటాం, వార్తాపత్రికల్లో చదువుతుంటాం.

(2) యేసు ఇంకా ఇలా చెప్పాడు, ‘అక్కడక్కడ కరవులు వస్తాయి.’ మీకు తెలిసినట్లు చాలామందికి సరిపడినంత ఆహారం దొరకడం లేదు. ప్రతిరోజు వేలమంది ఆకలితో చనిపోతున్నారు.

(3) యేసు, ‘అక్కడక్కడ తెగుళ్లు వస్తాయని’ చెప్పాడు. తెగులు అంటే ఏమిటో తెలుసా?— ఒకేసారి చాలామందిని చంపే వ్యాధిని తెగులు అంటారు. స్పానిష్‌ ఫ్లూ అనే భయంకరమైన తెగులువల్ల దాదాపు ఒక సంవత్సరంలోనే సుమారు 2 కోట్లమంది చనిపోయారు. ఈ రోజుల్లో అంతకన్నా ఎక్కువమంది బహుశా ఎయిడ్స్‌వల్ల చనిపోవచ్చు. అంతేకాదు, ప్రతీ సంవత్సరం క్యాన్సర్‌వల్ల, గుండె జబ్బులవల్ల, ఇతర అనారోగ్యాలవల్ల ఎన్నో వేలమంది చనిపోతున్నారు.

(4) యేసు మరో గుర్తు కూడా ఇచ్చాడు, ‘అక్కడక్కడ భూకంపాలు వస్తాయి.’ భూకంపం అంటే ఏమిటో తెలుసా?— భూకంపం వచ్చినప్పుడు మీ కాళ్ల కిందవున్న భూమి కంపిస్తుంది. ఇళ్లు కూలిపోతాయి, చాలా సమయాల్లో మనుషులు చచ్చిపోతారు. 1914వ సంవత్సరం నుండీ ప్రతీ సంవత్సరం చాలా భూకంపాలు వస్తూనే ఉన్నాయి. మీరు భూకంపాల గురించి విన్నారా?—

(5) యేసు ఇంకా ఇలా చెప్పాడు, ‘చెడుతనం విస్తరిస్తుంది.’ అందుకే మన చుట్టూ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి, హింస ఎక్కువైంది. తమ ఇళ్లల్లో దొంగలు పడతారని అన్నిచోట్ల ఉన్న ప్రజలు భయపడుతున్నారు. ప్రపంచమంతటా, ఇంతకుముందు ఎప్పుడూ నేడు జరుగుతున్నంత ఎక్కువ నేరాలు జరగలేదు, ఇప్పుడు ఉన్నంత హింస లేదు.

(6) యేసు ఆ గుర్తులో చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి చెప్తూ, ‘ఈ రాజ్య సువార్త సకల జనాలకు సాక్ష్యార్థంగా లోకమందంతా ప్రకటించబడుతుంది; ఆ తర్వాత అంతం వస్తుంది’ అన్నాడు. (మత్తయి 24:14) మీకు ‘ఈ రాజ్య సువార్త’ మీద నమ్మకం ఉంటే, దాని గురించి వేరేవాళ్లతో మాట్లాడాలి. అలా చేసి, యేసు చెప్పిన గుర్తులో ఈ భాగం నెరవేరడానికి మీరు చేయాల్సింది చేయవచ్చు.

యేసు ముందుగా చెప్పినవన్నీ ఎప్పటి నుండో ఉన్నవేనని కొంతమంది అంటారు. కానీ, అవన్నీ ప్రపంచంలో చాలాచోట్ల, ఒకే సమయంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. గుర్తు అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా?— ఇవన్నీ జరగడం చూసినప్పుడు త్వరలోనే, ఈ చెడ్డలోకం పోయి దేవుని కొత్త లోకం వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.

యేసు ఈ గుర్తు గురించి మాట్లాడినప్పుడు, సంవత్సరంలోని ఒక ప్రత్యేకమైన కాలం గురించి కూడా చెప్పాడు. ‘మీరు పారిపోవలసిన సమయం చలికాలంలో రాకూడదని ప్రార్థన చేయండి’ అని ఆయన చెప్పాడు. (మత్తయి 24:20) ఆయన చెప్పినదాని అర్థమేమిటి?—

ప్రయాణించడం చాలా కష్టంగా లేదా ప్రమాదకరంగా కూడా ఉండే చలికాలంలో ఏదైనా విపత్తు నుండి తప్పించుకోవడం ఎవరికైనా సులభంగా ఉంటుందా?— ఒకవేళ ఎవరైనా అలా తప్పించుకోగలిగినా, ఎంతో కష్టపడితేగానీ అది సాధ్యం కాదు. ఎవరైనా ముందే బయలుదేరకుండా వేరే పనుల్లో మునిగిపోయి ఉన్నందుకు, మంచు తుఫానులో చనిపోవాల్సి రావడం ఎంత బాధ కలిగిస్తుందో కదా?—

యేసు చలికాలంలో పారిపోవడానికి ప్రయత్నించడం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏ పాఠం నేర్పించాడు?

చలికాలం వచ్చేంతవరకు పారిపోకుండా వేచి ఉండకూడదని అనడం ద్వారా, యేసు ఏ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడు?— అర్మగిద్దోను దగ్గరపడిందని మనకు తెలుసు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని సేవ చేయడం ద్వారా ఆయనను ప్రేమిస్తున్నట్లు నిరూపించుకోవాలని యేసు చెప్తున్నాడు. మనం ఆలస్యం చేస్తే, పరిస్థితి మన చేయిదాటిపోవచ్చు. అప్పుడు మనం, జలప్రళయం వచ్చిన కాలంలో నోవహు చెప్పింది విని కూడా ఓడలోకి వెళ్లని వాళ్లలా ఉంటాం.

గొప్ప యుద్ధమైన అర్మగిద్దోను ముగిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దేవుడు తనను ప్రేమించే వాళ్ల కోసం, తన సేవచేసే వాళ్ల కోసం ఏమేమి చేయబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

అర్మగిద్దోను చాలా దగ్గర్లో ఉందని, 2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4 వచనాలు కూడా వివరిస్తున్నాయి.