కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు సంకల్పించింది ఇదేనా?

దేవుడు సంకల్పించింది ఇదేనా?

మీరు ఏ వార్తాపత్రిక చదివినా, టీవీ చూసినా లేక రేడియో విన్నా నేరాలు, యుద్ధాలు, ఉగ్రవాదం గురించిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. మీ కష్టాల గురించి ఒక్కసారి ఆలోచించండి. వ్యాధి లేదా ప్రియమైనవారు చనిపోవడం మీకు చాలా బాధ కలిగిస్తుంది. “నేను . . . బాధతో నిండిపోయాను” అని చెప్పిన మంచి మనిషియైన యోబులాగే మీరు కూడా భావించవచ్చు.—యోబు 10:15, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి:

  • నా కోసం, మిగతా మానవాళి కోసం దేవుడు సంకల్పించింది ఇదేనా?

  • నా సమస్యలను అధిగమించేందుకు నాకు సహాయం ఎక్కడ లభిస్తుంది?

  • మనం భూమ్మీద ఎప్పటికైనా సమాధానాన్ని చూడగలమనే నిరీక్షణ ఉందా?

ఈ ప్రశ్నలకు బైబిలు సంతృప్తికరమైన జవాబులు ఇస్తోంది.

దేవుడు భూమ్మీద ఇలాంటి మార్పులు తీసుకొస్తాడని బైబిలు బోధిస్తోంది.

“ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4

కుంటివా దుప్పివలె గంతులువేయుదురు.యెషయా 35:6

“గ్రుడ్డివారి కన్నులు తెరవబడును.”—యెషయా 35:5

“సమాధులలో నున్నవారందరు . . . బయటికి వచ్చెదరు.” —యోహాను 5:28, 29

“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” —యెషయా 33:24

“దేశములో . . . సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16

బైబిలు బోధిస్తున్న దానినుండి ప్రయోజనం పొందండి

ముందరి పేజీల్లో ఇవ్వబడిన సమాచారం కేవలం ఊహాజనితమని వెంటనే కొట్టిపారేయకండి. ఈ పరిస్థితులు తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాటిని ఎలా తీసుకొస్తాడో బైబిలు వివరిస్తోంది.

అయితే బైబిలు అంతకంటే ఇంకా ఎక్కువే చేస్తోంది. మీరు ఇప్పుడు కూడా నిజంగా సంతృప్తిదాయకమైన జీవితాన్ని ఆస్వాదించే కీలకాన్ని అందిస్తోంది. మీకున్న చింతలు, బాధల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. వాటిలో ఆర్థిక విషయాలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం లేదా ప్రియమైనవారు చనిపోవడం ఉండవచ్చు. నేటి సమస్యలతో వ్యవహరించేందుకు మీకు బైబిలు సహాయం చేయడమే కాక, ఈ క్రింద ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబులు అందజేస్తూ సేదదీర్పును కూడా ఇవ్వగలదు:

  • మనం బాధలు ఎందుకు అనుభవిస్తున్నాం?

  • జీవన చింతలను మనం ఎలా తాళుకోవచ్చు?

  • మన కుటుంబ జీవితాన్ని మనం ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?

  • చనిపోయినప్పుడు మనకు ఏమి సంభవిస్తుంది?

  • చనిపోయిన మన ప్రియమైనవారిని మనం మళ్లీ ఎప్పుడైనా చూస్తామా?

  • భవిష్యత్తుకు సంబంధించిన తన వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడని మనం ఎలా నమ్మవచ్చు?

మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారనే వాస్తవం, బైబిలు బోధిస్తున్నదేమిటో తెలుసుకోవాలనే మీ కోరికను చూపిస్తుంది. ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుంది. పేరాలకు సంబంధించిన ప్రశ్నలు ఆ పేజీ క్రింద ఉన్నాయని గమనించండి. యెహోవాసాక్షులతో బైబిలును చర్చిస్తున్నప్పుడు ప్రశ్నాజవాబుల పద్ధతిని ఉపయోగించడాన్ని లక్షలాదిమంది ఆనందించారు. మీరుకూడా అలాగే ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాం. బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో నేర్చుకునే ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన అనుభవాన్ని మీరు ఆస్వాదిస్తుండగా దేవుని ఆశీర్వాదాలు మీకు లభించును గాక.