కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మూడవ అధ్యాయం

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
  • మానవాళిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?

  • దేవుడు ఎలా సవాలు చేయబడ్డాడు?

  • భవిష్యత్తులో ఈ భూమ్మీద జీవితం ఎలా ఉంటుంది?

1. భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?

 భూమిపట్ల దేవుని సంకల్పం నిజంగా అద్భుతమైనది. భూమంతా సంతోషభరితమైన, ఆరోగ్యవంతమైన ప్రజలతో నిండి ఉండాలని యెహోవా కోరుతున్నాడు. దేవుడు “ఏదెనులో ఒక తోటవేసి,” అందులో “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును . . . మొలిపించెను” అని బైబిలు చెబుతోంది. దేవుడు మొదటి స్త్రీపురుషులైన ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత, వారిని ఆ సుందరమైన తోటలో ఉంచి వారితో ఇలా అన్నాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28; 2:8, 9, 15) మానవులు పిల్లలను కనాలని, ఆ తోటను భూవ్యాప్తంగా విస్తరింపజేయాలని, జంతువులను సంరక్షించాలని దేవుడు సంకల్పించాడు.

2. (ఎ) భూమిపట్ల దేవుని సంకల్పం నెరవేరుతుందని మనకెలా తెలుసు? (బి) బైబిలు ప్రకారం, ఎలాంటి మానవులు నిత్యం జీవిస్తారు?

2 ప్రజలు భూ పరదైసులో జీవించాలనే యెహోవా దేవుని సంకల్పం ఎప్పటికైనా నెరవేరుతుందని మీరు అనుకుంటారా? “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను” అని దేవుడు ప్రకటిస్తున్నాడు. (యెషయా 46:9-11; 55:11) అవును, దేవుడు తాను సంకల్పించినది తప్పకుండా నెరవేరుస్తాడు. ‘భూమిని నిరాకారముగా ఉండునట్లు సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా సృజించాను’ అని ఆయన సెలవిస్తున్నాడు. (యెషయా 45:18) భూమ్మీద ఎలాంటి ప్రజలు నివసించాలని దేవుడు కోరుతున్నాడు? వారలా ఎంతకాలం జీవించాలని ఆయన కోరుతున్నాడు? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.”కీర్తన 37:29; ప్రకటన 21:3, 4.

3. నేడు భూమ్మీద ఎలాంటి విషాదకర పరిస్థితులు ఉన్నాయి, అవి ఎలాంటి ప్రశ్నలను లేవదీస్తున్నాయి?

3 అది ఇంకా నెరవేరలేదని స్పష్టమవుతూనే ఉంది. ప్రజలు ఇప్పుడు రోగులై, మరణిస్తున్నారు; పోరాటాలు చేస్తూ పరస్పరం చంపుకుంటున్నారు. ఏదో తప్పు జరిగింది. అయితే ఒకటి మాత్రం నిజం, నేడు మనం చూస్తున్న విధంగా భూమి ఉండాలని దేవుడు సంకల్పించలేదు! మరైతే ఏమి జరిగింది? దేవుని సంకల్పం ఎందుకు నెరవేరలేదు? మానవులు వ్రాసిన చరిత్ర గ్రంథాలేవీ ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేవు, ఎందుకంటే అసలు సమస్య పరలోకంలో మొదలైంది.

ఒక శత్రువు ఆవిర్భావం

4, 5. (ఎ) నిజానికి హవ్వతో పాము ద్వారా ఎవరు మాట్లాడారు? (బి) ఒకప్పుడు మర్యాదస్థునిగా, నిజాయితీపరునిగా ఉన్న ఒక వ్యక్తి దొంగగా ఎలా మారవచ్చు?

4 ఏదెను తోటలో బయటపడిన దేవుని శత్రువు గురించి బైబిల్లోని మొదటి పుస్తకం మనకు చెబుతోంది. అతను “సర్పము” అని వర్ణించబడ్డాడు, అయితే ఆ వ్యతిరేకి ఒక జంతువు కాదు. బైబిల్లోని చివరి పుస్తకం అతణ్ణి “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల” వ్యక్తిగా గుర్తిస్తోంది. అతను “ఆది సర్పము” అని కూడా పిలువబడ్డాడు. (ఆదికాండము 3:1; ప్రకటన 12:9) ఈ శక్తిమంతమైన దూత లేదా అదృశ్య ఆత్మప్రాణి హవ్వతో మాట్లాడేందుకు, దగ్గర్లోని బొమ్మ మాట్లాడుతున్నట్లు భ్రమింపజేసే నేర్పుగల వ్యక్తిలా, ఒక పామును ఉపయోగించుకున్నాడు. దేవుడు మానవుల కోసం భూమిని సిద్ధం చేసినప్పుడు ఆ ఆత్మప్రాణి కూడా ఉనికిలో ఉన్నాడు.—యోబు 38:4, 7.

5 యెహోవా సృష్టి కార్యాలన్నీ పరిపూర్ణమైనవి కదా, మరి ఈ ‘అపవాదిని, సాతానును’ ఎవరు చేశారు? ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని శక్తిమంతమైన ఆత్మ కుమారుల్లో ఒకరు తానే అపవాదిగా మారాడు. అదెలా సాధ్యం? ఈ రోజు మర్యాదస్థునిగా, నిజాయితీపరునిగా ఉన్న వ్యక్తి రేపు దొంగగా మారే అవకాశం ఉందని మనకు తెలుసు. అదెలా జరుగుతుంది? ఆ వ్యక్తి తన హృదయంలో తప్పుడు కోరికలు వృద్ధి కావడానికి అనుమతించవచ్చు. అతను వాటి గురించే ఆలోచిస్తూవుంటే ఆ తప్పుడు కోరికలు మరింత బలపడవచ్చు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు, ఆ వ్యక్తి తన చెడు కోరికల ప్రకారం ప్రవర్తించవచ్చు.యాకోబు 1:13-15 చదవండి.

6. దేవుని శక్తిమంతమైన ఆత్మ కుమారుల్లో ఒకరు అపవాదియైన సాతానుగా ఎలా మారాడు?

6 అపవాదియైన సాతాను విషయంలో కూడా అదే జరిగింది. దేవుడు ఆదాము హవ్వలతో పిల్లలను కనమని, తమ సంతానంతో భూమిని నింపమని చెప్పడాన్ని అతడు విన్నాడని అర్థమవుతోంది. (ఆదికాండము 1:27, 28) ‘ఈ మానవులందరూ దేవుణ్ణి ఆరాధించే బదులు నన్ను ఆరాధిస్తే ఎంత బాగుంటుందో కదా!’ అని సాతాను అనుకున్నాడు. అలా ఒక తప్పుడు కోరిక అతని హృదయంలో పుట్టింది. చివరికి, అతడు దేవునిమీద అబద్ధాలు చెప్పి హవ్వను మోసగించడానికి సిద్ధపడ్డాడు. (ఆదికాండము 3:1-5 చదవండి.) ఆ విధంగా అతడు “అపవాది”గా మారాడు, ఆ మాటకు “కొండెములు చెప్పువాడు” అని అర్థం. అదేసమయంలో అతడు “సాతాను”గా కూడా మారాడు, దానికి “ఎదిరించువాడు” అని అర్థం.

7. (ఎ) ఆదాము, హవ్వ ఎందుకు మరణించారు? (బి) ఆదాము సంతానమంతా ఎందుకు వృద్ధులై మరణిస్తున్నారు?

7 అపవాదియైన సాతాను అబద్ధాలను, కుతంత్రాలను ఉపయోగించి ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులయ్యేలా చేశాడు. (ఆదికాండము 2:17; 3:6) ఆ కారణంగా, అవిధేయులైతే మరణిస్తారని దేవుడు చెప్పినట్లుగానే వారు మరణించారు. (ఆదికాండము 3:17-19) ఆదాము పాపం చేసి అపరిపూర్ణుడయ్యాడు కాబట్టి, అతని ద్వారా అతని సంతానమంతటికీ పాపం వారసత్వంగా ప్రాప్తించింది. (రోమీయులు 5:12 చదవండి.) ఆ పరిస్థితిని, మనం ఇడ్లీలు చేయడానికి వాడే పాత్రతో పోల్చవచ్చు. ఆ పాత్రకు ఎక్కడైనా సొట్ట ఉంటే, ఆ పాత్రలో చేసే ఇడ్లీలన్నీ ఎలా తయారవుతాయి? ప్రతీ ఇడ్లీకి ఆ సొట్ట లేదా ఆకార “అపరిపూర్ణత” ఉంటుంది. అదేప్రకారంగా, ఆదాము నుండి ప్రతీ ఒక్కరికి వారసత్వంగా అపరిపూర్ణత అనే “సొట్ట” సంక్రమించింది. అందుకే మానవులందరూ వృద్ధులై మరణిస్తున్నారు.—రోమీయులు 3:23.

8, 9. (ఎ) సాతాను ఎలాంటి సవాలు విసిరాడు? (బి) ఆ తిరుగుబాటుదారులను దేవుడు వెంటనే ఎందుకు నాశనం చేయలేదు?

8 ఆదాము హవ్వలను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలా ప్రేరేపించడం ద్వారా, సాతాను నిజానికి తిరుగుబాటును పురికొల్పాడు. అతను యెహోవా పరిపాలనా విధానాన్ని సవాలు చేశాడు. సాతాను ఇలాంటి భావాన్ని వ్యక్తం చేశాడు: ‘దేవుడు మంచి పరిపాలకుడు కాదు. ఆయన అబద్ధాలు చెబుతాడు, తన ప్రజలకు మేలైనవి దక్కకుండా చేస్తాడు. మానవులకు దేవుని పరిపాలన అవసరం లేదు. వారు తమకు మంచేదో, చెడేదో స్వయంగా నిర్ణయించుకోగలరు. వారు నా పరిపాలన క్రింద ఉంటే మరింత క్షేమంగా ఉంటారు.’ అలాంటి దూషణకర సవాలును దేవుడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆ తిరుగుబాటుదారులను దేవుడు వెంటనే హతమార్చి ఉండాల్సిందని కొందరు అనుకుంటారు. కానీ ఆ చర్య సాతాను సవాలుకు జవాబు ఇచ్చి ఉండేదా? దేవుని పరిపాలనా విధానం సరైనదని అది నిరూపించి ఉండేదా?

9 యెహోవా పరిపూర్ణ న్యాయంగలవాడు కాబట్టి ఆయన ఆ తిరుగుబాటుదారులను వెంటనే హతమార్చలేదు. సాతాను విసిరిన సవాలుకు సంతృప్తికరమైన విధంగా జవాబిచ్చి, అపవాది అబద్ధికుడని నిరూపించడానికి సమయం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగానే, మానవులు సాతాను ప్రభావం క్రింద కొంతకాలంపాటు తమను తాము పరిపాలించుకోవడానికి అనుమతించాలని ఆయన తీర్మానించుకున్నాడు. యెహోవా అలా ఎందుకు చేశాడు, ఈ వివాదాంశాలను పరిష్కరించడానికి ముందు ఆయన ఇంతకాలం ఎందుకు అనుమతించాడు అనేవి ఈ పుస్తకంలోని 11వ అధ్యాయంలో చర్చించబడతాయి. అయితే మనమిప్పుడు వీటి గురించి ఆలోచించాలి: ఆదాము హవ్వలు తమకు ఎన్నడూ మేలు చేయని సాతానును నమ్మడం సమంజసమేనా? వారికున్న సమస్తాన్ని అనుగ్రహించిన యెహోవా క్రూరుడు, అబద్ధికుడు అని నమ్మడం న్యాయమేనా? మీరేమి చేసి ఉండేవారు?

10. సాతాను సవాలుకు జవాబిచ్చే విషయంలో సహాయం చేయడానికి మీరు యెహోవా పక్షాన ఎలా నిలబడవచ్చు?

10 ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది, ఎందుకంటే మనలో ప్రతీ ఒక్కరం నేడు ఆ వివాదాంశాలనే ఎదుర్కొంటున్నాం. సాతాను సవాలుకు జవాబిచ్చే విషయంలో, మీకు యెహోవా పక్షాన నిలబడే అవకాశం ఉంది. యెహోవాను మీ పరిపాలకునిగా అంగీకరించడం ద్వారా సాతాను అబద్ధికుడు అని నిరూపించడానికి మీరు సహాయం చేయవచ్చు. (కీర్తన 73:28; సామెతలు 27:11 చదవండి.) అయితే ఈ లోకంలోని కోట్లాదిమందిలో కేవలం కొద్దిమంది మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయం. ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవదీస్తోంది, అదేమిటంటే సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని బైబిలు నిజంగా బోధిస్తోందా?

ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?

లోకంలోని రాజ్యాలు సాతానువి కాకపోతే, వాటిని యేసుకు ఇస్తానని అతను ఎలా ప్రతిపాదించగలడు?

11, 12. (ఎ) యేసుకు ఎదురైన ఒక శోధన, సాతానే ఈ లోక పరిపాలకుడని ఎలా వెల్లడి చేస్తోంది? (బి) సాతానే ఈ లోక పరిపాలకుడని ఇంకా ఏవి నిరూపిస్తున్నాయి?

11 సాతాను ఈ లోక పరిపాలకుడనే విషయాన్ని యేసు ఎన్నడూ సందేహించలేదు. సాతాను ఒకసారి అద్భుతరీతిలో “లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” యేసుకు చూపించాడు. ఆ తర్వాత సాతాను యేసుకు ఇలా వాగ్దానం చేశాడు: “నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదను.” (మత్తయి 4:8, 9; లూకా 4:5, 6) దాని గురించి ఆలోచించండి. ఈ రాజ్యాలకు సాతాను పరిపాలకుడు కానట్లైతే, అతడు యేసుకు చేసిన ఆ ప్రతిపాదన ఒక శోధనగా ఉండగలదా? ఈ లోక ప్రభుత్వాలన్నీ సాతానువే అనే విషయాన్ని యేసు కాదనలేదు. ఆ రాజ్యాలకు సాతాను అధికారి కాకపోతే యేసు తప్పకుండా ఆ విషయాన్ని ఖండించేవాడే.

12 నిజమే, యెహోవాయే సర్వశక్తిగల దేవుడు, ఆయనే ఈ అద్భుత విశ్వానికి సృష్టికర్త. (ప్రకటన 4:10-11) అయినప్పటికీ, ఈ లోక పరిపాలకుడు యెహోవా అని గానీ, యేసుక్రీస్తు అని గానీ బైబిలు ఎక్కడా చెప్పడం లేదు. వాస్తవానికి, సాతానే “ఈ లోకాధికారి” అని యేసు ప్రత్యేకంగా సూచించాడు. (యోహాను 12:31; 14:30; 16:9-11) అపవాదియైన సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” అని కూడా బైబిలు చెబుతోంది. (2 కొరింథీయులు 4:3, 4) ఈ విరోధి లేదా సాతాను గురించి క్రైస్తవ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “లోకమంతయు దుష్టుని యందున్నది.”—1 యోహాను 5:19.

సాతాను లోకం తొలగించబడడం

13. ఒక కొత్త లోకం ఎందుకు అవసరం?

13 సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ లోకం అంతకంతకూ ప్రమాదభరితంగా తయారవుతోంది. ఈ లోకం యుద్ధాలు చేస్తున్న సైనికులతో, నిజాయితీలేని రాజకీయ నాయకులతో, వేషధారులైన మతనాయకులతో, కరడుగట్టిన నేరగాళ్లతో నిండిపోయింది. ప్రపంచమంతా బాగుచేయలేనంతగా చెడిపోయింది. దేవుడు తన యుద్ధమైన అర్మగిద్దోనులో ఈ దుష్టలోకాన్ని నాశనం చేసే సమయం దగ్గరైందని బైబిలు వెల్లడి చేస్తోంది. అది నీతియుక్తమైన కొత్త లోకానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.—ప్రకటన 16:14-16.

14. దేవుడు తన రాజ్యానికి రాజుగా ఎవరిని ఎన్నుకున్నాడు, ఇది ఎలా ప్రవచించబడింది?

14 యెహోవా దేవుడు తన పరలోక రాజ్యానికి లేదా ప్రభుత్వానికి రాజుగా ఉండేందుకు యేసుక్రీస్తును ఎన్నుకున్నాడు. ఎంతోకాలం ముందే బైబిలు ఇలా ప్రవచించింది: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. . . . సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. . . . మితిలేకుండ దానికి [ఆ రాజ్యమునకు] వృద్ధియు క్షేమమును కలుగును.” (యెషయా 9:6, 7) ఆ ప్రభుత్వం గురించి ఇలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9-10) ఈ పుస్తకంలో మనం ఆ తర్వాత చూడబోతున్నట్లుగా, దేవుని రాజ్యం త్వరలోనే ఈ లోక ప్రభుత్వాలన్నింటిని తొలగించి వాటి స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. (దానియేలు 2:44 చదవండి.) ఆ తర్వాత దేవుని రాజ్యం భూపరదైసును తీసుకొస్తుంది.

ఒక కొత్త లోకం సమీపంలో ఉంది!

15. “క్రొత్త భూమి” అంటే అర్థం ఏమిటి?

15 బైబిలు మనకిలా అభయమిస్తోంది: “మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13; యెషయా 65:17) కొన్నిసార్లు బైబిలు “భూమి” అని మాట్లాడినప్పుడు, ఈ భూమ్మీద జీవించే ప్రజలను సూచిస్తుంది. (ఆదికాండము 11:1) కాబట్టి నీతి నివసించే “క్రొత్త భూమి” అంటే దేవుని అనుగ్రహం పొందే ప్రజల సమాజమని అర్థం.

16. దేవుడు ఆమోదించే వారికి ఆయనిచ్చే అమూల్యమైన బహుమానం ఏమిటి, దానిని అందుకోవడానికి మనమేమి చేయాలి?

16 రాబోయే నూతనలోకంలో దేవుడు ఆమోదించిన వారు “నిత్యజీవము” అనే బహుమానం పొందుతారని యేసు వాగ్దానం చేశాడు. (మార్కు 10:30) దయచేసి యోహాను 3:16 మరియు 17:3కు మీ బైబిలు తెరచి, యేసు ఆ నిత్యజీవం కోసం మనమేమి చేయాలని చెప్పాడో చదవండి. రాబోయే భూపరదైసులో దేవుడు ఇచ్చే అద్భుతమైన ఆ బహుమానానికి అర్హులయ్యే వారు అనుభవించే ఆశీర్వాదాలను ఇప్పుడు బైబిలునుండి పరిశీలించండి.

17, 18. భూమి అంతటా శాంతిభద్రతలు ఉంటాయని మనమెందుకు నమ్మవచ్చు?

17 దుష్టత్వం, యుద్ధం, నేరం, బలత్కారం లేకుండా పోతాయి. “భక్తిహీనులు లేకపోవుదురు. . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు.” (కీర్తన 37:10, 11) ‘దేవుడు భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పుతాడు’ కాబట్టి శాంతి విలసిల్లుతుంది. (కీర్తన 46:9; యెషయా 2:4) ఆ తర్వాత, “నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు” అంటే నిరంతరం “క్షేమాభివృద్ధి కలుగును.”—కీర్తన 72:7.

18 యెహోవా ఆరాధకులు సురక్షితంగా నివసిస్తారు. బైబిలు కాలాల్లో ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులుగా ఉన్నంతకాలం, వారు సురక్షితంగా నివసించారు. (లేవీయకాండము 25:18, 19) పరదైసులో అలాంటి భద్రతను అనుభవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!యెషయా 32:17 చదవండి; మీకా 4:4.

19. దేవుని నూతనలోకంలో ఆహారం సమృద్ధిగా ఉంటుందని మనకెలా తెలుసు?

19 ఆహార కొరతలు ఉండవు. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును” అని కీర్తనకర్త ఆలపించాడు. (కీర్తన 72:16) యెహోవా దేవుడు తనపట్ల నీతిగా ఉండే ప్రజలను ఆశీర్వదిస్తాడు, “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును.”—కీర్తన 67:6.

20. భూమంతా పరదైసుగా మారుతుందని మనమెందుకు నమ్మవచ్చు?

20 భూమంతా పరదైసుగా మారుతుంది. పాపులైన మానవులు నాశనం చేసిన భూమి నిండా చూడచక్కని ఇళ్లు నిర్మించబడతాయి, ఉద్యానవనాలు నెలకొల్పబడతాయి. (యెషయా 65:21-24 చదవండి; ప్రకటన 11:18) కాలం గడిచేకొద్దీ, అప్పటికే లోపరచుకోబడిన ప్రాంతాలు క్రమేణా భూవ్యాప్తంగా విస్తరించి భూమంతా అందమైన, ఫలవంతమైన ఏదెను తోటలా తయారవుతుంది. అప్పుడు దేవుడు నిశ్చయంగా ‘తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు.’—కీర్తన 145:16.

21. మానవులకు, జంతువులకు మధ్య శాంతి ఉంటుందని ఏది చూపిస్తోంది?

21 మానవులకు, జంతువులకు మధ్య శాంతి ఉంటుంది. క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసి మేస్తాయి. ప్రస్తుతం ప్రమాదకరమైనవిగా ఉన్న జంతువులకు చిన్న పిల్లలు కూడా భయపడరు.యెషయా 11:6-9 చదవండి; 65:25.

22. వ్యాధులకు ఏమవుతుంది?

22 వ్యాధులు ఉండవు. దేవుని పరలోక రాజ్యానికి పరిపాలకుడైన యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసినదానికన్నా మరెంతో విస్తృతంగా స్వస్థత చేకూరుస్తాడు. (మత్తయి 9:35; మార్కు 1:40-42; యోహాను 5:5-9) అప్పుడు “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24; 35:5, 6.

23. పునరుత్థానం మన హృదయాలకు ఎందుకు ఆనందం కలిగిస్తుంది?

23 చనిపోయిన మన ప్రియమైనవారు మళ్ళీ ఎన్నడూ చనిపోకుండా ఉండే ఉత్తరాపేక్షతో తిరిగి జీవానికి పునరుద్ధరించబడతారు. చనిపోయి దేవుని జ్ఞాపకంలో ఉన్నవారందరూ తిరిగి బ్రతికించబడతారు. నిజానికి, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.”—అపొస్తలుల కార్యములు 24:14-15; యోహాను 5:28, 29 చదవండి.

24. పరదైసు భూమ్మీద జీవించడం గురించి మీరెలా భావిస్తున్నారు?

24 మహోన్నతుడైన మన సృష్టికర్తయైన యెహోవా దేవుని గురించి తెలుసుకొని ఆయనను సేవించాలని నిర్ణయించుకునే వారికి ఎంతటి మహత్తర భవిష్యత్తు వేచి ఉందో కదా! “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” అని యేసు తనతోపాటు వ్రేలాడదీయబడిన నేరస్థునికి వాగ్దానం చేసినప్పుడు ఆయన రాబోయే ఈ భూపరదైసు గురించే మాట్లాడాడు. (లూకా 23:43) ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి మూలంగా సాధ్యమవుతాయో ఆ యేసుక్రీస్తు గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.