కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆరవ అధ్యాయం

చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?

చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?
  • మనం చనిపోయినప్పుడు మనకేమి జరుగుతుంది?

  • మనం ఎందుకు చనిపోతాం?

  • మరణం గురించిన సత్యం తెలుసుకోవడం ఓదార్పుకరంగా ఉంటుందా?

1-3. మరణం గురించి ప్రజలకు ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి, వివిధ మతాలు వాటికి ఎలాంటి విభిన్న జవాబులు ఇస్తున్నాయి?

 వేల సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నారు. అవి ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మనం ఎవరిమైనా, ఎక్కడ జీవిస్తున్నా, మనలో ప్రతీ ఒక్కరం వాటికి జవాబులు కావాలని కోరుకుంటాం.

2 దీనికి ముందు అధ్యాయంలో, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి నిత్యజీవానికి మార్గాన్ని ఎలా సుగమం చేసిందో మనం చర్చించుకున్నాం. ‘మరణం ఇక ఉండని’ కాలం గురించి బైబిలు ప్రవచిస్తోందని కూడా మనం తెలుసుకున్నాం. (ప్రకటన 21:4) అయితే ఆ కాలం వచ్చేలోగా మనమందరం చనిపోతూనే ఉంటాం. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు” అని జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పాడు. (ప్రసంగి 9:5) మనం సాధ్యమైనంత ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటాం. అయినా సరే, మనం చనిపోయినప్పుడు మనకు ఏమి జరుగుతుందా అని మనం ఆలోచిస్తాం.

3 మన ప్రియమైనవారు చనిపోయినప్పుడు మనం దుఃఖిస్తాం. ‘వారికి ఏమి జరిగింది? వారు బాధపడుతున్నారా? వారు మనలను గమనిస్తున్నారా? మనం వారికి సహాయం చేయగలమా? మనం వారిని మళ్లీ ఎప్పుడైనా చూస్తామా?’ అనే ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. లోకంలోని మతాలు ఈ ప్రశ్నలకు విభిన్న జవాబులు ఇస్తాయి. కొన్ని మతాలు, మనం మంచి జీవితం జీవిస్తే పరలోకానికి వెళ్తామని, చెడు జీవితం జీవిస్తే అగ్నిలో కాల్చబడి బాధించబడతామని బోధిస్తున్నాయి. మరికొన్ని మతాలు, చనిపోయినవారు తమ పితరులతోపాటు ఉండడానికి ఆత్మ సంబంధ లోకానికి వెళ్తారని బోధిస్తున్నాయి. ఇంకా కొన్ని మతాలు, చనిపోయినవారు తీర్పు కోసం అథోలోకానికి వెళ్తారని, ఆ తర్వాత వారు మళ్లీ మరో శరీరంతో అవతరిస్తారని లేదా పునర్జన్మిస్తారని బోధిస్తున్నాయి.

4. మరణం గురించి అనేక మతాలు ప్రాథమికంగా ఏ విషయాన్ని బోధిస్తున్నాయి?

4 ఈ మతాలన్నీ ప్రాథమికంగా ఒకే విషయాన్ని, అంటే మన భౌతిక శరీరం చనిపోయినప్పుడు మననుండి ఒక భాగం చనిపోకుండా తప్పించుకుంటుంది అనే విషయాన్ని బోధిస్తున్నాయి. చరిత్రంతటిలోను, అలాగే ప్రస్తుతం దాదాపు అన్ని మతాలు, మనం చూడగల, వినగల, ఆలోచించగల సామర్థ్యాలతో ఏదో ఒక రూపంలో నిత్యం జీవిస్తూనే ఉంటాము అని బోధించాయి, బోధిస్తున్నాయి. అదెలా సాధ్యం? మన ఆలోచనలకు, మన జ్ఞానేంద్రియాలకు మన మెదడు పనిచేసే విధానానికి సంబంధం ఉంది. మనం చనిపోయినప్పుడు, మన మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు ఏదో నిగూఢమైన రీతిలో స్వతంత్రంగా పనిచేస్తూ ఉండవు. అవి నశించిపోతాయి.

చనిపోయినప్పుడు నిజంగా ఏమి జరుగుతుంది?

5, 6. చనిపోయినవారి స్థితి గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

5 ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికేమి జరుగుతుంది అనే విషయం మన మెదడును సృష్టించిన యెహోవాకు తెలియని విషయమేమీ కాదు. చనిపోయినవారి స్థితి గురించిన సత్యమేమిటో ఆయనకు తెలుసు, ఆయన తన వాక్యమైన బైబిల్లో దాని గురించి వివరించాడు. అది స్పష్టంగా ఇలా బోధిస్తోంది: ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆయన ఉనికిలో లేకుండా పోతాడు. మరణం జీవానికి వ్యతిరేకం. చనిపోయినవారు చూడలేరు, వినలేరు, ఆలోచించలేరు. మన శరీరం మరణించిన తర్వాత మననుండి ఏ భాగమూ తప్పించుకుని జీవించదు. మనలో అమర్త్యమైన ఆత్మ, అమర్త్యమైన ప్రాణం అంటూ ఏదీ లేదు. a

జ్వాల ఎక్కడికి వెళ్ళింది?

6 బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామనే విషయం తెలుసు అని ప్రకటించిన తర్వాత, సొలొమోను ఇలా వ్రాశాడు: “అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” ఆ ప్రాథమిక సత్యాన్ని మరింత విపులంగా చెబుతూ, చనిపోయినవారు ప్రేమించలేరని, పగపెట్టుకొనలేరని “[సమాధిలో] పనియైనను, ఉపాయమైనను, తెలివియైనను” ఉండవని ఆయన చెప్పాడు. (ప్రసంగి 9:5, 6, 10 చదవండి.) అలాగే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని “సంకల్పములు నాడే నశించును” అని కీర్తన 146:4 చెబుతోంది. మనం మృతతుల్యమైన మనుషులం, మన శరీరం మరణించిన తర్వాత మనం జీవిస్తూ ఉండలేము. మన జీవితం కొవ్వొత్తిపై వెలిగే జ్వాలలాంటిది. ఆ జ్వాలను ఆర్పేసినప్పుడు, అది ఎక్కడికీ వెళ్లదు. అది ఆరిపోతుంది అంతే.

మరణం గురించి యేసు ఏమి చెప్పాడు?

7. మరణమంటే ఏమిటో యేసు ఎలా వివరించాడు?

7 చనిపోయినవారి స్థితిని గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. తనకు బాగా పరిచయమున్న లాజరు చనిపోయిన సందర్భంలో ఆయన ఆ స్థితి గురించి మాట్లాడాడు. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు.” ఆ మాటలు విన్న శిష్యులు, లాజరు తన జబ్బు నయమవడానికి విశ్రాంతి తీసుకుంటున్నాడని యేసు చెబుతున్నాడు అనుకున్నారు. కానీ వారనుకున్నది తప్పు. ఎందుకంటే ఆ తర్వాత యేసు, “లాజరు చనిపోయెను” అని వారికి వివరించాడు. (యోహాను 11:11-14 చదవండి.) యేసు ఇక్కడ మరణాన్ని నిద్రతో పోల్చడాన్ని గమనించండి. లాజరు పరలోకానికి గానీ, మండుతున్న నరకానికి గానీ వెళ్ళలేదు. ఆయన దేవదూతలను గానీ, తన పూర్వీకులను గానీ కలుసుకోలేదు. లేదా మరో మనిషిగా తిరిగి జన్మించలేదు. ఆయన కలలురాని గాఢనిద్రలో ఉన్నట్లుగా మరణం అనే దీర్ఘ విశ్రాంతిలో ఉన్నాడు. ఇతర లేఖనాలు కూడా మరణాన్ని నిద్రతో పోలుస్తున్నాయి. ఉదాహరణకు, స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు, ఆయన “నిద్రించెను” అని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 7:59-60) అదేప్రకారంగా అపొస్తలుడైన పౌలు మరణమందు “నిద్రించిన” తన కాలంనాటి కొందరి గురించి వ్రాశాడు.—1 కొరింథీయులు 15:6.

యెహోవా మానవులను భూమ్మీద నిరంతరం జీవించాలని చేశాడు

8. ప్రజలు చనిపోవాలనేది దేవుని సంకల్పం కాదని మనకెలా తెలుసు?

8 ప్రజలు మరణించాలనేది దేవుని ఆది సంకల్పమా? ఎంతమాత్రం కాదు. ఆయన మనుష్యులను భూమ్మీద నిత్యం జీవించడానికే చేశాడు. ఈ పుస్తకంలో మనం ముందు చూసినట్లుగా, మొదటి మానవ దంపతులను దేవుడు అందమైన పరదైసులో ఉంచాడు. ఆయన వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించాడు. యెహోవా వారి మేలునే కోరాడు. ప్రేమగల తల్లిదండ్రులెవరైనా తమ పిల్లలు వృద్ధాప్య బాధలు అనుభవించి చనిపోవాలని కోరుకుంటారా? ఎన్నటికీ కోరుకోరు! అలాగే యెహోవా తన పిల్లలను ప్రేమించడమే కాక, వారు భూమ్మీద నిత్యం సంతోషంగా జీవించాలని కోరుకున్నాడు. మానవుల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన [యెహోవా] శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు.” (ప్రసంగి 3:11) దేవుడు మనల్ని నిరంతరం జీవించాలనే కోరికతో సృష్టించాడు. ఆ కోరిక నెరవేరే మార్గాన్ని ఆయన తెరిచాడు.

మానవులు ఎందుకు చనిపోతున్నారు?

9. యెహోవా ఆదాముపై ఎలాంటి నిషేధాన్ని విధించాడు, ఆ ఆజ్ఞను పాటించడం ఎందుకు కష్టం కాదు?

9 అలాంటప్పుడు మానవులు ఎందుకు చనిపోతున్నారు? దానికి జవాబు పొందాలంటే, మనం ముందుగా ఈ భూమిపై మొదటి స్త్రీపురుషులు ఇద్దరే ఉన్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించాలి. బైబిలు ఇలా వివరిస్తోంది: “దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును . . . నేలనుండి మొలిపించెను.” (ఆదికాండము 2:9) అయితే దేవుడు వారిపై ఒక నిషేధాన్ని విధించాడు. ఆయన ఆదాముకు ఇలా చెప్పాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఆ ఆజ్ఞను పాటించడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే ఆదాము హవ్వలు తినడానికి ఇతర వృక్ష ఫలాలు ఎన్నో ఉన్నాయి. పరిపూర్ణ జీవంతోపాటు తమకు సమస్తాన్ని అనుగ్రహించిన దేవునిపట్ల తమ కృతజ్ఞత చూపించే ఒక ప్రత్యేకమైన అవకాశం వారికి లభించింది. వారు చూపించే విధేయత, తమ పరలోకపు తండ్రి అధికారాన్ని వారు గౌరవిస్తున్నారని, ఆయన ప్రేమపూర్వక నిర్దేశం తమకు కావాలని కోరుకుంటున్నారని చూపిస్తుంది.

10, 11. (ఎ) మొదటి మానవ దంపతులు దేవునికి ఎలా అవిధేయులయ్యారు? (బి) ఆదాము హవ్వల అవిధేయత ఎందుకు ఒక గంభీరమైన విషయం?

10 విచారకరంగా, మొదటి మానవ దంపతులు యెహోవాకు అవిధేయులు కావడానికే నిర్ణయించుకున్నారు. సాతాను ఒక పాముద్వారా మాట్లాడుతూ, “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని హవ్వను అడిగాడు. దానికి హవ్వ, “ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెను” అని జవాబిచ్చింది.—ఆదికాండము 3:1-3.

11 అప్పుడు సాతాను, “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును” అని చెప్పాడు. (ఆదికాండము 3:4-6) ఆ నిషిద్ధ ఫలాలు తింటే తనకు ప్రయోజనం కలుగుతుందని హవ్వను నమ్మించాలని సాతాను కోరుకున్నాడు. అతని మాటలు విన్న తర్వాత, ఆమె ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించుకోవచ్చు; తాను కోరుకున్నది చేసే హక్కు ఆమెకు ఉంది. ఆ ఫలాలను తినడం ద్వారా చెడు పర్యవసానాలు కలుగుతాయని యెహోవా అబద్ధాలు చెప్పాడని కూడా సాతాను ఆరోపించాడు. హవ్వ సాతాను మాటలు నమ్మింది. అందువల్ల ఆమె ఆ ఫలాలను తీసుకొని తిన్నది. ఆ తర్వాత ఆమె వాటిని తన భర్తకు ఇచ్చింది, అతను కూడా వాటిని తిన్నాడు. వారు అజ్ఞానంతో ఆ పని చేయలేదు. దేవుడు చేయవద్దని చెప్పిందే తాము చేస్తున్నామని వారికి ఖచ్చితంగా తెలుసు. ఆ ఫలాలు తినడం ద్వారా వారు దేవుడిచ్చిన సరళమైన, సమంజసమైన ఆజ్ఞకు ఉద్దేశపూర్వకంగా అవిధేయులయ్యారు. వారు తమ పరలోకపు తండ్రిపట్ల, ఆయన అధికారంపట్ల తిరస్కార భావాన్ని ప్రదర్శించారు. వారు తమ ప్రేమగల సృష్టికర్తను అలా అవమానించడం క్షమార్హం కాదు!

12. ఆదాము హవ్వలు యెహోవాకు విరుద్ధమైన మార్గాన్ని అవలంబించినప్పుడు ఆయనెంత బాధపడి ఉంటాడో అర్థం చేసుకోవడానికి మనకేది సహాయం చేయవచ్చు?

12 ఉదాహరణకు, మీరు ఎంతో ప్రేమతో శ్రద్ధతో పెంచిన మీ పిల్లలు మీ మీద తమకేమాత్రం గౌరవం, ప్రేమ లేవన్నట్లు ప్రవర్తించి మీకు అవిధేయత చూపిస్తే మీరెలా భావిస్తారు? అది మీకెంతో బాధ కలిగిస్తుంది. అలాంటప్పుడు ఆదాము హవ్వలు యెహోవాకు విరుద్ధమైన మార్గాన్ని అవలంబించినప్పుడు ఆయనెంత బాధపడి ఉంటాడో ఊహించండి.

ఆదాము మట్టి నుండి వచ్చాడు, తిరిగి మట్టికే చేరుకున్నాడు

13. చనిపోయినప్పుడు ఆదాముకు ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడు, దాని భావమేమిటి?

13 అవిధేయులైన ఆదాము హవ్వలు ఇంకా బ్రతికుండేలా అనుమతించడానికి యెహోవాకు సరైన కారణమేదీ కనిపించలేదు. యెహోవా చెప్పినట్లే వారు చనిపోయారు. ఆదాము హవ్వలు ఉనికిలో లేకుండా పోయారు. వారు ఆత్మ సంబంధ లోకానికి వెళ్ళలేదు. అవిధేయత చూపించిన ఆదామును జవాబుదారుణ్ణి చేసి మాట్లాడుతూ యెహోవా అతనితో అన్న మాటలనుబట్టి ఇది మనకు తెలుస్తోంది. దేవుడు ఇలా అన్నాడు: ‘నీవు నేలకు తిరిగి చేరుదువు, నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ (ఆదికాండము 3:19) దేవుడు ఆదామును మట్టితో చేశాడు. (ఆదికాండము 2:7) అంతకుముందు ఆదాము ఉనికిలో లేడు. కాబట్టి ఆదాము తిరిగి మన్నైపోతాడని యెహోవా చెప్పినప్పుడు, ఆదాము ఉనికిలో లేకుండా పోతాడని ఆయన భావం. ఆదాము ఏ మట్టితో చేయబడ్డాడో ఆ మట్టిలాగే నిర్జీవమైనవాడైపోతాడు.

14. మనం ఎందుకు చనిపోతున్నాం?

14 ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించడానికి ఎంపిక చేసుకొని పాపం చేశారు కాబట్టే చనిపోయారు, లేకపోతే వారు ఇప్పటివరకూ జీవించి ఉండేవారే. ఆదాము సంతానమైన మనకు అతని పాపస్థితితోపాటు మరణం కూడా సంక్రమించింది కాబట్టి మనం కూడా చనిపోతున్నాం. (రోమీయులు 5:12 చదవండి.) ఆ పాపం ఒక భయంకరమైన సంక్రమిత వ్యాధిలాంటిది, దానినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. దాని పర్యవసానమైన మరణం ఒక శాపం. మరణం ఒక శత్రువే గానీ మిత్రుడు కాదు. (1 కొరింథీయులు 15:26) ఈ భయంకరమైన శత్రువు నుండి మనలను రక్షించడానికి యెహోవా విమోచన క్రయధనం ఏర్పాటు చేసినందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండాలో కదా!

మరణం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం ప్రయోజనకరం

15. మరణం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం ఎందుకు ఓదార్పుకరంగా ఉంటుంది?

15 చనిపోయినవారి స్థితి గురించి బైబిలు బోధిస్తున్నది ఎంతో ఓదార్పునిస్తుంది. మనం చూసినట్లుగా, చనిపోయినవారు బాధను, వేదనను అనుభవించరు. వారి విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు మనకు హాని చేయలేరు. వారికి మన సహాయం అవసరం లేదు, వారు మనకు సహాయం చేయలేరు. మనం వారితో మాట్లాడలేము, వారు కూడా మనతో మాట్లాడలేరు. చనిపోయినవారికి తాము సహాయం చేయగలమని అనేకమంది మతనాయకులు అబద్ధాలు చెబుతారు, ప్రజలు అలాంటి నాయకుల మాటలు నమ్మి వారికి డబ్బు ముట్టచెబుతారు. అయితే సత్యం తెలుసుకోవడంవల్ల మనం అలాంటి అబద్ధాలు చెప్పేవారి చేతుల్లో మోసపోకుండా ఉంటాము.

16. అనేక మతాల బోధలను ఎవరు ప్రభావితం చేశారు, ఏ విధంగా?

16 చనిపోయినవారి గురించి బైబిలు బోధిస్తున్న విషయాలతో మీ మతం ఏకీభవిస్తోందా? అనేక మతాలు అలా ఏకీభవించవు. ఎందుకు? ఎందుకంటే వాటి బోధలను సాతాను ప్రభావితం చేశాడు. తమ శరీరం చనిపోయినా, తాము ఆత్మ సంబంధ లోకంలో జీవిస్తూనే ఉంటామని ప్రజలను నమ్మించడానికి అతడు అబద్ధమతాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రజలను యెహోవా దేవుని నుండి మళ్లించడానికి సాతాను ఈ అబద్ధానికి మరిన్ని అబద్ధాలు జోడిస్తున్నాడు. ఏ విధంగా?

17. నిత్యయాతన అనే బోధ యెహోవాను ఎందుకు అవమానిస్తుంది?

17 మనం ముందు చూసినట్లుగా, ఎవరైనా చెడు జీవితం జీవిస్తే, వారు చనిపోయిన తర్వాత నిత్యయాతన అనుభవించడానికి అగ్నిమయ ప్రదేశానికి వెళ్తారని కొన్ని మతాలు బోధిస్తున్నాయి. ఈ బోధ దేవుణ్ణి అవమానపరుస్తుంది. యెహోవా ప్రేమగల దేవుడు, ఆయన ప్రజలను ఆ విధంగా ఎన్నడూ బాధించడు. (1 యోహాను 4:8 చదవండి.) అవిధేయత చూపించిన పిల్లవాడి చేతులను నిప్పులతో కాల్చి శిక్షించేటువంటి వ్యక్తి ఎలాంటి వాడని మీరనుకుంటారు? అలాంటి వ్యక్తిని మీరు గౌరవిస్తారా? అలాంటి వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటారా? ఖచ్చితంగా అనుకోరు! అలాంటి వ్యక్తి చాలా క్రూరుడని మీరు తలంచవచ్చు. అయితే యెహోవా ప్రజలను నిత్యం అంటే కోటానుకోట్ల సంవత్సరాలు అగ్నిలో కాలుస్తూ బాధిస్తాడని మనం నమ్మాలని సాతాను కోరుతున్నాడు.

18. చనిపోయినవారిని ఆరాధించడం ఎలాంటి అబద్ధంపై ఆధారపడి ఉంది?

18 ప్రజలు మరణించిన తర్వాత ఆత్మలుగా మారతారని, అందుకే బ్రతికి ఉన్నవారు వారిని గౌరవించి, సన్మానించాలని బోధించడానికి కూడా సాతాను కొన్ని మతాలను వాడుకుంటున్నాడు. ఈ బోధ ప్రకారం, చనిపోయినవారి ఆత్మలు బలమైన స్నేహితులుగా లేదా భయంకరమైన శత్రువులుగా తయారుకావచ్చు. ఈ అబద్ధాన్ని చాలామంది నమ్ముతున్నారు. వారు చనిపోయినవారికి భయపడుతూ, వారిని గౌరవిస్తూ ఆరాధిస్తున్నారు. అయితే దానికి పూర్తిగా భిన్నంగా, చనిపోయినవారు నిద్రిస్తున్నారని, మన సృష్టికర్త, దాత అయిన అద్వితీయ సత్య దేవుడైన యెహోవాను మాత్రమే మనం ఆరాధించాలని బైబిలు బోధిస్తోంది.—ప్రకటన 4:10-11.

19. చనిపోయినవారి గురించిన సత్యం తెలుసుకోవడం ఏ ఇతర బైబిలు బోధలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది?

19 చనిపోయినవారి గురించిన సత్యాన్ని తెలుసుకోవడంవల్ల మీరు వివిధ మతాలు బోధించే అబద్ధాలచేత మోసగించబడరు. అది ఇతర బైబిలు బోధలను అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, చనిపోయినవారు ఆత్మ సంబంధ లోకానికి వెళ్ళరని మీరు గ్రహించినప్పుడు, పరదైసు భూమిపై నిత్యజీవితమనే వాగ్దానం మీకు మరింత అర్థవంతంగా ఉంటుంది.

20. తర్వాతి అధ్యాయంలో మనం ఏ ప్రశ్న పరిశీలిస్తాం?

20 ఎంతోకాలం పూర్వం, నీతిమంతుడైన యోబు ఈ ప్రశ్న లేవదీశాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” (యోబు 14:14) నిర్జీవునిగా మరణనిద్రలో ఉన్న వ్యక్తి తిరిగి జీవానికి వచ్చే అవకాశం ఉందా? ఈ విషయం గురించి బైబిలు బోధిస్తున్నది చాలా ఓదార్పునిస్తుంది. అదెలాగో తర్వాతి అధ్యాయం చూపిస్తుంది.

a నెఫెష్‌, సైఖే అనే పదాల చర్చ కోసం దయచేసి అనుబంధంలో 208-211 పేజీలు చూడండి.