కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పదవ అధ్యాయం

ఆత్మ ప్రాణులు—మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు?

ఆత్మ ప్రాణులు—మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు?
  • దేవదూతలు ప్రజలకు సహాయం చేస్తారా?

  • దురాత్మలు మానవులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

  • దురాత్మలకు మనం భయపడాలా?

1. దేవదూతల గురించి తెలుసుకోవాలని మనమెందుకు కోరుకోవాలి?

 ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే సాధారణంగా అతని కుటుంబం గురించి ఎంతోకొంత తెలుసుకోవాలి. అదేవిధంగా, యెహోవా దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన దూతల కుటుంబాన్ని మరింతగా తెలుసుకోవాలి. ఆ దూతలను బైబిలు “దైవపుత్రులు” అని పిలుస్తోంది. (కీర్తన 89:6) కాబట్టి, దేవుని సంకల్పంలో వారి పాత్ర ఏమిటి? మానవ చరిత్రలో వారేమైనా పాత్ర వహించారా? దేవదూతలు మీ జీవితాలను ప్రభావితం చేస్తారా? చేస్తే, ఎలా చేస్తారు?

2. దేవదూతలు ఎక్కడనుండి వచ్చారు, ఎంతమంది ఉన్నారు?

2 బైబిలు వందలసార్లు దేవదూతల గురించి ప్రస్తావిస్తోంది. దేవదూతల గురించి మరింత తెలుసుకోవడానికి మనం వీటిలో కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. దేవదూతలు ఎక్కడనుండి వచ్చారు? కొలొస్సయులు 1:16 ఇలా చెబుతోంది: ‘ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, సర్వమును ఆయన [యేసుక్రీస్తు] ద్వారా సృజింపబడెను.’ కాబట్టి, దేవదూతలని పిలువబడే ఆత్మ ప్రాణులందరినీ యెహోవా తన ప్రథమ పుత్రుని ద్వారా తన చేతులమీదుగా సృష్టించాడు. దేవదూతలు ఎంతమంది ఉన్నారు? వందల కోట్ల సంఖ్యలో దేవదూతలు సృష్టించబడ్డారనీ, వారందరూ బలశాలులనీ బైబిలు సూచిస్తోంది.—కీర్తన 103:20. a

3. దేవదూతల గురించి యోబు 38:4-7 మనకేమి చెబుతోంది?

3 భూమికి పునాదులు వేయబడినప్పుడు “దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు” చేశారని దేవుని వాక్యమైన బైబిలు మనకు చెబుతోంది. (యోబు 38:4-7) కాబట్టి మానవులే కాక భూమి కూడా సృష్టించబడక పూర్వమే, ఎంతోకాలం నుండి దేవదూతలు ఉనికిలో ఉన్నారు. దేవదూతలకు భావోద్వేగాలు ఉన్నాయని కూడా ఈ బైబిలు వాక్యాలు చూపిస్తున్నాయి, ఎందుకంటే వారు ‘ఆనందంతో ఏకముగా కూడి పాడిరి’ అని అవి చెబుతున్నాయి. ఆ ‘దేవదూతలు అందరును’ ఏకముగా కూడి ఆనందించారని గమనించండి. ఆ సమయంలో, దేవదూతలందరూ యెహోవా దేవుణ్ణి సేవిస్తూ ఐక్య కుటుంబంగా ఉన్నారు.

దేవదూతల మద్దతు, రక్షణ

4. నమ్మకమైన దేవదూతలకు మానవ వ్యవహారాల్లో శ్రద్ధ ఉందని బైబిలు ఎలా చూపిస్తోంది?

4 మొదటి మానవుల సృష్టిని కళ్లారా చూసిన దగ్గరనుండి ఆ నమ్మకమైన ఆత్మ ప్రాణులు విస్తరిస్తున్న మానవ కుటుంబం విషయంలో, దేవుని సంకల్పం నెరవేరడంలో ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. (సామెతలు 8:30, 31; 1 పేతురు 1:11, 12) అయితే కాలప్రవాహంలో మానవ కుటుంబంలో అధికశాతం మంది తమ ప్రేమగల సృష్టికర్త సేవకు దూరం కావడం వారు గమనించారు. ఇది నమ్మకమైన దేవదూతలకు తప్పకుండా విచారం కలిగించి ఉంటుంది. మరోవైపున, కేవలం ఒక మనిషి యెహోవావైపు తిరిగి వచ్చిన ప్రతీసారి ‘దూతలకు సంతోషము’ కలుగుతుంది. (లూకా 15:10) దేవుణ్ణి సేవించేవారి సంక్షేమం విషయంలో దేవదూతలకు అంత ప్రగాఢమైన శ్రద్ధ ఉండడం వల్లనే, భూమ్మీది తన నమ్మకమైన సేవకులను బలపరిచేందుకు, రక్షించేందుకు యెహోవా ఆ దూతలను పదేపదే వాడుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. (హెబ్రీయులు 1:7, 14 చదవండి.) కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

‘నా దేవుడు తన దూతను పంపించి, సింహముల నోళ్లు మూయించాడు.’ —దానియేలు 6:22.

5. దేవదూతల మద్దతుకు సంబంధించిన ఏ ఉదాహరణలు మనం బైబిల్లో చూస్తాం?

5 దుష్ట సొదొమ గొమొఱ్ఱా పట్టణాల నాశనం నుండి తప్పించుకొనేందుకు ఇద్దరు దేవదూతలు నీతిమంతుడైన లోతు, ఆయన ఇద్దరు కుమార్తెలను ఆ పట్టణాల వెలుపలికి తీసుకొచ్చి సహాయం చేశారు. (ఆదికాండము 19:15, 16) అనేక శతాబ్దాల తర్వాత, దానియేలు ప్రవక్త సింహాల గుహలో పడవేయబడి ఏ హానీ కలుగకుండా అందులోనుండి తప్పించున్నప్పుడు ఇలా చెప్పాడు: ‘నా దేవుడు తన దూతను పంపించి, సింహముల నోళ్లు మూయించాడు.’ (దానియేలు 6:22) సా.శ. మొదటి శతాబ్దంలో ఒక దేవదూత అపొస్తలుడైన పేతురును చెరసాల నుండి విడిపించాడు. (అపొస్తలుల కార్యములు 12:6-11) అంతేకాదు, యేసు భూపరిచర్య ఆరంభంలో దేవదూతలు ఆయనను బలపరిచారు. (మార్కు 1:13) అలాగే యేసు చనిపోయే ముందు ఒక దేవదూత ఆయనకు కనబడి ‘ఆయనను బలపరిచాడు.’ (లూకా 22:43) యేసుకు తన జీవితంలోని ఆ ప్రాముఖ్యమైన క్షణాల్లో అలాంటి మద్దతు ఎంతటి ఓదార్పును ఇచ్చి ఉంటుందో కదా!

6. (ఎ) నేడు దేవుని ప్రజలను దూతలు ఎలా రక్షిస్తున్నారు? (బి) మనమిప్పుడు ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

6 నేడు, భూమ్మీద దేవుని ప్రజలకు దేవదూతలు ప్రత్యక్షంగా కనిపించరు. దేవుని బలశాలులైన ఆ దూతలు మానవ నేత్రాలకు అదృశ్యంగా ఉన్నప్పటికీ, వారు ఆయన ప్రజలను ఇంకా రక్షిస్తూనే ఉన్నారు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక హాని కలిగించే ప్రతిదానినుండి రక్షిస్తున్నారు. బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును.” (కీర్తన 34:7) ఆ మాటలు ఎందుకు మనకు గొప్ప ఓదార్పును ఇచ్చేవిగా ఉండాలి? ఎందుకంటే మనలను నాశనం చేయాలని కోరుకునే ప్రమాదకరమైన దుష్ట ప్రాణులు ఉన్నారు. వాళ్లెవరు? ఎక్కడనుండి వచ్చారు? మనకు హాని తలపెట్టడానికి వాళ్లెలా ప్రయత్నిస్తున్నారు? వాటికి జవాబులు కనుగొనేందుకు, మానవ చరిత్ర ఆరంభంలో జరిగిన ఒక విషయాన్ని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.

మన శత్రువులైన ఆత్మ ప్రాణులు

7. ప్రజలను దేవునినుండి దూరం చేయడంలో సాతాను ఎంతమేరకు విజయం సాధించాడు?

7 ఈ పుస్తకంలోని 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లుగా, ఒక దూత ఇతరులను పరిపాలించాలనే కోరికను పెంచుకొని దేవునికి విరోధి అయ్యాడు. ఆ తర్వాత ఈ దూత అపవాదియగు సాతానుగా గుర్తించబడ్డాడు. (ప్రకటన 12:9) సాతాను హవ్వను మోసగించిన తర్వాత 16 శతాబ్దాల కాలంలో హేబెలు, హనోకు, నోవహు లాంటి కొద్దిమంది నమ్మకస్థులను తప్ప దాదాపు మానవులందరినీ దేవుని నుండి దూరం చేయడంలో విజయం సాధించాడు.—హెబ్రీయులు 11:4, 5, 7.

8. (ఎ) దూతల్లో కొందరు దయ్యాలుగా ఎలా మారారు? (బి) నోవహు కాలంలోని జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఆ దయ్యాలు ఏమి చేయవలసి వచ్చింది?

8 నోవహు కాలంలో, కొందరు దూతలు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. వాళ్లు దేవుని పరలోక కుటుంబంలో తమ స్థానాలను విడిచిపెట్టి, ఈ భూమ్మీదికి వచ్చి మానవ శరీరాలను ధరించారు. ఎందుకు? ఆదికాండము 6:2⁠లో మనమిలా చదువుతాం: “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” అయితే యెహోవా దేవుడు ఈ దూతల క్రియలను, తత్ఫలితంగా మానవాళిలో వృద్ధి చెందిన అవినీతిని కొనసాగేందుకు అనుమతించలేదు. అందుకే ఆయన భూవ్యాప్తంగా జలప్రళయం రప్పించి దుష్టులైన మానవులందరినీ నిర్మూలించి, నమ్మకమైన తన సేవకులను మాత్రం రక్షించాడు. (ఆదికాండము 7:17, 23) దానితో తిరుగుబాటుదారులైన ఆ దూతలు లేదా దయ్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ మానవ శరీరాలను విడిచి ఆత్మ ప్రాణులుగా తిరిగి పరలోకానికి వెళ్లారు. అక్కడ వాళ్లు అపవాది పక్షం వహించారు, అలా అతడు ఆ ‘దయ్యాలకు అధిపతి’ అయ్యాడు.—మత్తయి 9:34.

9. (ఎ) దయ్యాలు పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడు వాటికి ఏమి సంభవించింది? (బి) దయ్యాలకు సంబంధించి మనం ఏమి పరిశీలిస్తాం?

9 అవిధేయులైన ఆ దూతలు పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడు, వాళ్ల అధిపతి అయిన సాతానులాగే వాళ్లు కూడా వెలివేయబడిన వారిగా పరిగణించబడ్డారు. (2 పేతురు 2:4) మానవ శరీరాలు ధరించడం వాళ్లకిప్పుడు కుదరక పోయినా, వాళ్లు మానవులపై చెడు ప్రభావాన్ని ఇంకా చూపిస్తూనే ఉన్నారు. వాస్తవానికి, ఈ దయ్యాల సహాయంతోనే సాతాను ‘సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు.’ (ప్రకటన 12:9; 1 యోహాను 5:19) ఏ విధంగా? ముఖ్యంగా, ఈ దయ్యాలు ప్రజలను మోసగించడానికి రూపొందించబడిన విధానాలను ఉపయోగిస్తాయి. (2 కొరింథీయులు 2:11 చదవండి.) ఈ విధానాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

దయ్యాలు మోసగించే విధానం

10. అభిచారం అంటే ఏమిటి?

10 ప్రజలను మోసగించడానికి దయ్యాలు అభిచారాన్ని ఉపయోగిస్తాయి. అభిచారాన్ని అభ్యసించడంలో దయ్యాలతో అటు సూటిగా గానీ, ఇటు మానవ మాధ్యమం ద్వారా గానీ సంప్రదించడం ఉంటుంది. అయితే బైబిలు అభిచారాన్ని ఖండిస్తూ, దానికి సంబంధించిన ప్రతీ అంశానికి దూరంగా ఉండమని మనలను హెచ్చరిస్తోంది. (గలతీయులు 5:19-21) జాలరి ఎరను ఉపయోగించినట్లే, దయ్యాలు అభిచారాన్ని ఉపయోగిస్తాయి. జాలరి వివిధ రకాల చేపలు పట్టడానికి వివిధ రకాల ఎరలను ఉపయోగిస్తాడు. అదేవిధంగా, అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభావం క్రిందికి తెచ్చుకోవడానికి దురాత్మలు వివిధ రకాల అభిచారాన్ని ఉపయోగిస్తాయి.

11. సోదె చెప్పడం అంటే ఏమిటి, మనం ఎందుకు దానికి దూరంగా ఉండాలి?

11 దయ్యాలు ఉపయోగించే ఒక రకమైన ఎర సోదె చెప్పడం. సోదె అంటే ఏమిటి? భవిష్యత్తు గురించి లేదా తెలియని ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఈ సోదె చెప్పడంలో జ్యోతిష్యం, చిలక జోస్యం, స్ఫటికపు గోళం చూడడం, హస్తసాముద్రికం, కలల్లో రహస్య శకునాలు లేదా సూచనలు వెదకడం వంటివి కొన్ని రకాలు. సోదె చెప్పడంలో హానిలేదని చాలామంది అనుకున్నా, సోదె చెప్పేవాళ్లు నిజానికి దురాత్మలతో కలిసి పని చేస్తారని బైబిలు చూపిస్తోంది. ఉదాహరణకు, “పుతోను అను దయ్యము” అంటే సోదె చెప్పే శక్తిగల దయ్యము, ఒక అమ్మాయి ‘సోదె చెప్పేలా’ ఆమెను బలపరచిందని అపొస్తలుల కార్యములు 16:16-18 చెబుతోంది. అయితే ఆ దయ్యాన్ని ఆమె నుండి వెళ్ళగొట్టినప్పుడు ఆమెలోని సోదె చెప్పే సామర్థ్యం కూడా పోయింది.

ప్రజలను మోసగించడానికి దయ్యాలు వివిధ మాధ్యమాలను ఉపయోగిస్తాయి

12. చనిపోయినవారితో సంభాషించడానికి ప్రయత్నించడం ఎందుకు ప్రమాదకరం?

12 దయ్యాలు ప్రజలను మోసగించే మరో మార్గం ఏమిటంటే, చనిపోయినవారిని గురించిన సమాచారాన్ని సేకరించమని పురికొల్పడమే. తమ ప్రియమైనవారి మరణంతో దుఃఖంలో మునిగి ఉన్నవారు తరచూ, చనిపోయినవారి గురించిన తప్పుడు భావాలతో మోసపోతుంటారు. కర్ణపిశాచిగల వ్యక్తి లేదా చనిపోయినవారితో మాట్లాడే వ్యక్తి ప్రత్యేక సమాచారాన్ని ఇవ్వవచ్చు లేదా చనిపోయిన వ్యక్తి స్వరంలా అనిపించే స్వరంతో మాట్లాడవచ్చు. ఆ కారణంగానే చాలామంది, చనిపోయినవారు సజీవంగా ఉన్నారనీ, వారిని సంప్రదిస్తే బ్రతికి ఉన్నవారు తమ దుఃఖాన్ని తట్టుకోవడానికి వారు సహాయం చేస్తారనీ నమ్ముతారు. అయితే అలాంటి “ఊరట” అబద్ధమేకాక, ప్రమాదకరం కూడా. ఎందుకు? ఎందుకంటే, దయ్యాలు చనిపోయిన వ్యక్తి స్వరాన్ని అనుకరిస్తూ, కర్ణపిశాచిగల వ్యక్తికి చనిపోయినవారి గురించిన సమాచారాన్ని అందజేయగలవు. (1 సమూయేలు 28:3-19) అంతేకాక, 6వ అధ్యాయంలో మనం తెలుసుకున్న ప్రకారం చనిపోయినవారు ఉనికిలో ఉండరు. (కీర్తన 115:17) కాబట్టి, “దయ్యములయొద్ద విచారణచేయు” వారెవరైనా దురాత్మలచేత మోసగించబడడమే కాక, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారవుతారు. (ద్వితీయోపదేశకాండము 18:10, 11 చదవండి; యెషయా 8:18-19) కాబట్టి, దయ్యాలు ఉపయోగించే ప్రమాదకరమైన ఈ ఎర విషయంలో జాగ్రత్తగా ఉండండి.

13. ఒకప్పుడు దయ్యాలకు భయపడిన అనేకులు ఇప్పుడేమి చేయగలుగుతున్నారు?

13 దురాత్మలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాక, వారిని భయపెడతాయి కూడా. నేడు, సాతానుకూ అతని దయ్యాలకూ తాము బంధించబడడానికి ఇక “సమయము కొంచెమే” ఉందని తెలుసు కాబట్టి, వారు ఇంతకుముందు కన్నా ఇప్పుడు మరింత క్రూరంగా తయారయ్యారు. (ప్రకటన 12:12, 17) అయినప్పటికీ, ఒకప్పుడు ప్రతీదినం అలాంటి దురాత్మల భయంతో జీవించినవారు ఇప్పుడు విముక్తి పొందగలిగారు. ఎలా పొందగలిగారు? ఇప్పటికే అభిచారంలో చిక్కుకున్న వ్యక్తి కూడా ఏమి చేయవచ్చు?

దురాత్మలను ఎలా ఎదిరించవచ్చు?

14. ఎఫెసులోని మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే మనం కూడా దురాత్మల నుండి ఎలా విముక్తి పొందగలం?

14 దురాత్మలను ఎలా ఎదిరించవచ్చో, వాటినుండి ఎలా విముక్తులు కావచ్చో కూడా బైబిలు మనకు చెబుతోంది. ఎఫెసు పట్టణంలోని మొదటి శతాబ్దపు క్రైస్తవుల ఉదాహరణను పరిశీలించండి. వారిలో కొందరు క్రైస్తవులు కాకముందు అభిచారాన్ని అభ్యసించారు. అభిచారాన్ని మానుకోవాలని వారు నిర్ణయించుకున్నప్పుడు, వారేమి చేశారు? బైబిలు ఇలా చెబుతోంది: “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి.” (అపొస్తలుల కార్యములు 19:19) ఆ మాంత్రిక పుస్తకాలను నాశనం చేయడం ద్వారా, వారు నేడు దురాత్మలను ఎదిరించాలని ఇష్టపడేవారికి ఒక ఆదర్శాన్ని ఉంచారు. యెహోవాను సేవించాలని కోరుకునే ప్రజలు అభిచారానికి సంబంధించిన ప్రతీదానిని వదిలించుకోవాలి. వాటిలో అభిచారాన్ని ప్రోత్సహిస్తూ దానిని ఆకర్షణీయంగా, ఉత్తేజకరంగా కనిపించేలా చేసే పుస్తకాలు, పత్రికలు, సినిమాలు, పోస్టర్లు, సంగీతాలు ఉన్నాయి. కీడు కలగకుండా రక్షణ కోసం ధరించే తాయెత్తులు లేదా ఇతర వస్తువులు కూడా ఆ కోవలోకే వస్తాయి.—1 కొరింథీయులు 10:21.

15. దురాత్మల సమూహాలను ఎదిరించడానికి మనం ఏమి చేయాలి?

15 ఎఫెసులోని క్రైస్తవులు తమ మంత్ర పుస్తకాలను నాశనం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు వారికి ఇలా వ్రాశాడు: ‘మనము దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము.’ (ఎఫెసీయులు 6:12) దయ్యాలు తమ పోరాటాన్ని ఆపుజేయలేదు. వాళ్లింకా పైచెయ్యి సాధించడానికే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి, ఆ క్రైస్తవులు ఇంకా ఏమి చేయాలి? “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని [సాతాను] అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు” అని పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 6:16) విశ్వాసమనే మన డాలు ఎంత బలంగా ఉంటే, దురాత్మల సమూహాలను మనం అంత శక్తిమంతంగా ఎదిరించగలం.—మత్తయి 17:20.

16. మనం మన విశ్వాసాన్ని ఎలా బలపరచుకోవచ్చు?

16 అయితే మనం మన విశ్వాసాన్ని ఎలా బలపరచుకోవచ్చు? బైబిలు అధ్యయనం చేయడం ద్వారా. గోడ స్థిరత్వం దాని పునాదిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, మన విశ్వాస స్థిరత్వం దాని పునాది బలం మీదే, అంటే దేవుని వాక్యమైన బైబిలు సంబంధిత ఖచ్చితమైన పరిజ్ఞానం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనం ప్రతీదినం బైబిలు చదివి అధ్యయనం చేస్తే, మన విశ్వాసం బలంగా తయారవుతుంది. బలమైన గోడలా అలాంటి విశ్వాసం దురాత్మల ప్రభావం నుండి మనలను కాపాడుతుంది.—1 యోహాను 5:5.

17. దురాత్మలను ఎదిరించడానికి ఎలాంటి చర్య తీసుకోవాలి?

17 ఎఫెసులో ఉన్న ఆ క్రైస్తవులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోవలసి వచ్చింది? వారు దయ్యాల ప్రభావంతో నిండిన పట్టణంలో జీవిస్తున్నారు కాబట్టి వారికి అదనపు రక్షణ కావలసివచ్చింది. కాబట్టి పౌలు వారికి ఇలా చెప్పాడు: ‘ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచుండుడి.’ (ఎఫెసీయులు 6:18) మనం కూడా దయ్యాల ప్రభావంతో నిండిన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, దురాత్మలను ఎదిరించడంలో యెహోవా రక్షణ కోసం ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించడం ఆవశ్యకం. అవును, మన ప్రార్థనల్లో యెహోవా పేరు ఉపయోగించడం ప్రాముఖ్యం. (సామెతలు 18:10 చదవండి.) కాబట్టి మనం “దుష్టునినుండి” అంటే అపవాదియగు సాతానునుండి “మమ్మును తప్పించుము” అని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తుండాలి. (మత్తయి 6:13) అలాంటి హృదయపూర్వక ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడు.—కీర్తన 145:19.

18, 19. (ఎ) దురాత్మలకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు? (బి) తర్వాతి అధ్యాయంలో ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వబడుతుంది?

18 దురాత్మలు ప్రమాదకరమైనవి, అయితే అపవాదిని ఎదిరిస్తూ దేవుని చిత్తం చేయడం ద్వారా ఆయనకు సన్నిహితమైతే మనం ఆ దురాత్మలకు భయపడుతూ జీవించాల్సిన అవసరం లేదు. (యాకోబు 4:7, 8 చదవండి.) దురాత్మల శక్తి పరిమితమైనది. వాళ్లు నోవహు కాలంలో శిక్షకు గురయ్యారు, వాళ్లు భవిష్యత్తులో అంతిమ తీర్పును ఎదుర్కొంటారు. (యూదా 6) అలాగే మనకు యెహోవా శక్తిమంతమైన దూతల కాపుదల ఉందని గుర్తుంచుకోండి. (2 రాజులు 6:15-17) దురాత్మలను ఎదిరించడంలో మనం విజయం సాధించడాన్ని చూడాలనే ప్రగాఢ ఆసక్తి దేవదూతలకు ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే, నీతిమంతులైన ఆ దేవదూతలు మనలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం యెహోవాకు ఆయన నమ్మకమైన ఆత్మ ప్రాణుల కుటుంబానికి సన్నిహితంగా ఉందాం. అలాగే మనం ఎల్లప్పుడూ ప్రతి విధమైన అభిచారాన్ని విసర్జిస్తూ, దేవుని వాక్యోపదేశాన్ని అన్వయించుకుందాం. (1 పేతురు 5:6, 7; 2 పేతురు 2:9) అప్పుడే దురాత్మలకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో తప్పక విజయం సాధిస్తాం.

19 కానీ ప్రజలు అనుభవిస్తున్న ఇంతటి బాధకు కారణమైన దురాత్మలను, దుష్టత్వాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆ ప్రశ్నకు తర్వాతి అధ్యాయంలో జవాబు ఇవ్వబడుతుంది.

a నీతిమంతులైన దేవదూతల గురించి ప్రకటన 5:11 ఇలా చెబుతోంది: “వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.” కాబట్టి వందల కోట్ల సంఖ్యలో దేవదూతలు సృష్టించబడ్డారని బైబిలు సూచిస్తోంది.