కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పదకొండవ అధ్యాయం

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
  • లోకంలోని బాధలకు దేవుడే కారకుడా?

  • ఏదెను తోటలో ఏ వివాదాంశం తలెత్తింది?

  • మానవ బాధలవల్ల కలిగిన పర్యవసానాలను దేవుడు ఎలా సరిచేస్తాడు?

1, 2. నేడు ప్రజలు ఎలాంటి బాధలను ఎదుర్కొంటున్నారు, అది అనేకమంది ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు దారితీస్తోంది?

 భీకర యుద్ధంతో కకావికలమైన ఒక దేశంలో, హతులైన సాధారణ ప్రజల్లోని స్త్రీలను, పిల్లలను సామూహికంగా సమాధిచేసి దాని చుట్టూ చిహ్నాలు ఉంచారు. ప్రతీ చిహ్నం మీద “ఎందుకు?” అని వ్రాసి ఉంది. కొన్నిసార్లు అది అన్నింటికన్నా అత్యంత బాధాకరమైన ప్రశ్నగా ఉంటుంది. యుద్ధం, విపత్తు, వ్యాధి లేదా నేరం తమ ప్రియమైనవారిని కబళించినప్పుడు లేదా తమ గృహాన్ని నాశనం చేసినప్పుడు లేదా ఇతర విధాలుగా తమకు అంతులేని బాధ కలిగించినప్పుడు ప్రజలు దుఃఖంతో ఆ ప్రశ్న వేస్తారు. అలాంటి విషాదకర సంఘటనలు తమకు ఎందుకు జరుగుతాయో వారు తెలుసుకోవాలని కోరుకుంటారు.

2 దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు? యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడూ, ప్రేమగలవాడూ, జ్ఞానవంతుడూ, న్యాయవంతుడూ అయితే, ఈ లోకం ఎందుకింత ద్వేషంతో, అన్యాయంతో నిండివుంది? వీటి గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?

3, 4. (ఎ) దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడని అడగడం తప్పుకాదని ఏది చూపిస్తోంది? (బి) దుష్టత్వం, బాధ విషయంలో యెహోవా ఎలా భావిస్తున్నాడు?

3 దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడని అడగడం తప్పా? అలా అడగడమంటే తమకు తగినంత విశ్వాసం లేదనీ లేదా దేవునిపట్ల తాము అగౌరవం చూపిస్తున్నామనీ దాని అర్థమని కొందరు ఇబ్బందిపడతారు. అయితే మీరు బైబిలు చదువుతున్నప్పుడు నమ్మకమైన దైవభక్తిగల ప్రజలు కూడా అలాంటి ప్రశ్నలే అడిగారని తెలుసుకుంటారు. ఉదాహరణకు, హబక్కూకు ప్రవక్త యెహోవాను ఇలా అడిగాడు: “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.”—హబక్కూకు 1:3.

యెహోవా బాధనంతటినీ తొలగిస్తాడు

4 నమ్మకస్థుడైన హబక్కూకు ప్రవక్త అలాంటి ప్రశ్నలు అడిగినందుకు యెహోవా ఆయనను గద్దించాడా? లేదు. బదులుగా, హబక్కూకు నిష్కపటంగా మాట్లాడిన ఆ మాటలను దేవుడు ప్రేరేపిత బైబిలు నివేదికలో చేర్చాడు. అంతేకాక, విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికీ, మరింత విశ్వాసం కూడగట్టుకోవడానికీ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. మీ విషయంలోనూ అదే చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని బైబిలు బోధిస్తోందని గుర్తుంచుకోండి. (1 పేతురు 5:7) దుష్టత్వాన్ని అది కలిగిస్తున్న బాధను ఏ మానవుడు ద్వేషించేదానికన్నా దేవుడు ఎక్కువగా ద్వేషిస్తున్నాడు. (యెషయా 55:8, 9) అయితే మరి లోకంలో ఎందుకు ఇంత బాధ ఉంది?

ఎందుకు ఇంత బాధ?

5. మానవ బాధలకు కొన్నిసార్లు ఏ కారణాలు చెప్పబడుతున్నాయి, అయితే బైబిలు ఏమి బోధిస్తోంది?

5 ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి అని అడిగేందుకు వివిధ మతాల ప్రజలు తమ మత నాయకుల దగ్గరకు, బోధకుల దగ్గరకు వెళ్తారు. ఈ బాధలు దేవుని చిత్తమనీ, విషాద సంఘటనలతోపాటు జరుగుతున్న సమస్తాన్ని ఆయన పూర్వమెప్పుడో నిర్ణయించాడనీ వారికి తరచూ జవాబు ఇవ్వబడుతోంది. దేవుని మార్గాలు మర్మాలనో లేదా ఆయన తనతోపాటు పరలోకంలో ఉంచుకోవడానికి పిల్లలతోసహా పెద్దలకు మరణాన్ని కలుగజేస్తాడనో అనేకులకు చెప్పబడుతోంది. అయితే మీరు తెలుసుకున్న ప్రకారం, యెహోవా దేవుడు ఎన్నటికీ కీడు కలుగజేయడు. బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.”—యోబు 34:10.

6. చాలామంది లోకంలోని బాధలన్నిటికీ దేవుణ్ణి నిందించే పొరపాటు ఎందుకు చేస్తారు?

6 ప్రజలు లోకంలోని బాధంతటికీ దేవుణ్ణి నిందించే పొరపాటు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? చాలా సందర్భాల్లో వారు సర్వశక్తిగల దేవుణ్ణి ఎందుకు నిందిస్తారంటే, ఆయనే ప్రస్తుత లోకానికి నిజమైన పరిపాలకుడని వారు అనుకుంటారు. కానీ వారికి బైబిలు బోధిస్తున్న సరళమైనదే అయినా ప్రాముఖ్యమైన ఒక సత్యం తెలియదు. ఆ సత్యమేమిటో మీరు ఈ పుస్తకంలోని 3వ అధ్యాయంలో తెలుసుకున్నారు. అపవాదియగు సాతానే ఈ లోక పరిపాలకుడు.

7, 8. (ఎ) ఈ లోకం దాని పరిపాలకుని వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తోంది? (బి) మానవ అపరిపూర్ణత, “కాలవశముచేతను, అనూహ్యంగాను” జరిగే సంఘటనలు మానవ బాధలకు ఎలా కారణమయ్యాయి?

7 బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) దాని గురించి మీరు ఆలోచించినప్పుడు, అది అర్థవంతంగా ఉన్నట్లు మీకు అనిపించడం లేదా? ‘సర్వలోకమును మోసపుచ్చుచున్న’ అదృశ్య ఆత్మ ప్రాణి వ్యక్తిత్వాన్నే ఈ లోకం ప్రతిబింబిస్తోంది. (ప్రకటన 12:9) సాతాను హేయకరమైన, మోసకరమైన, క్రూరమైన వ్యక్తి. కాబట్టి అతని ఆధీనంలో ఉన్న లోకం ద్వేషం, మోసం, క్రూరత్వంతో నిండివుంది. బాధ ఇంత ఎక్కువగా ఉండడానికి అదొక కారణం.

8 ఇంత బాధ ఉండడానికి రెండవ కారణం, 3వ అధ్యాయంలో చర్చించినట్లుగా, ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన దగ్గరనుండి మానవాళి అపరిపూర్ణంగా, పాపభరితంగా ఉంది. పాపభరిత మానవులు అధికారం కోసం ప్రాకులాడే అవకాశం ఉంది, ఫలితంగా యుద్ధాలు, అణచివేత, బాధ కలుగుతాయి. (ప్రసంగి 4:1; 8:9) బాధకు మూడవ కారణం, “కాలవశముచేతను, అనూహ్యంగాను” జరిగే సంఘటనలు. (ప్రసంగి 9:11, NW) రక్షకుడైన యెహోవా పరిపాలకునిగా లేని ఈ లోకంలో ప్రజలు ఏదైనా అనూహ్య సంఘటన జరిగే సమయంలో అనుకోకుండా అక్కడ ఉండడమే వారి బాధలకు కారణమవుతోంది.

9. బాధలు కొనసాగేలా అనుమతించడానికి యెహోవాకు మంచి కారణమే ఉండి ఉంటుందని మనమెందుకు నమ్మవచ్చు?

9 దేవుడు బాధలు కలిగించడని తెలుసుకోవడం మనకెంతో ఓదార్పునిస్తుంది. ప్రజల బాధలకు కారణమయ్యే యుద్ధాలకు, నేరాలకు, అణచివేతకు, చివరకు ప్రకృతి విపత్తులకు ఆయన బాధ్యుడు కాడు. అయినప్పటికీ, ఈ బాధలన్నింటినీ యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన సర్వశక్తిమంతుడైతే, దీనిని ఆపే శక్తి ఆయనకు ఉంటుంది. అలాంటప్పుడు, ఆయనెందుకు తన శక్తిని ఉపయోగించడం లేదు? మనమెరిగిన అంత ప్రేమగల దేవునికి తప్పకుండా మంచి కారణమే ఉండి ఉంటుంది.—1 యోహాను 4:8.

ఓ ప్రధాన వివాదాంశం తలెత్తడం

10. సాతాను దేనిని సవాలు చేశాడు, ఎలా సవాలు చేశాడు?

10 బాధలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో కనుక్కోవడానికి మనం బాధ ఆరంభమైన సమయం గురించి ఆలోచించాలి. ఆదాము హవ్వలు యెహోవాకు అవిధేయత చూపించేలా సాతాను చేసినప్పుడు, ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తింది. సాతాను యెహోవా శక్తిని సవాలు చేయలేదు. యెహోవాకు అపారమైన శక్తి ఉందనే సంగతి సాతానుకు కూడా తెలుసు. సాతాను యెహోవా రిపాలనా హక్కును సవాలు చేశాడు. దేవుడు తన ప్రజలకు ప్రయోజనం కలిగించే దాన్ని వారికి దక్కకుండా చేస్తున్న అబద్ధికుడని చెబుతూ, ఆయన చెడ్డ పరిపాలకుడు అని సాతాను ఆరోపించాడు. (ఆదికాండము 3:2-5 చదవండి.) దేవుని పరిపాలన అక్కర్లేకుండానే మానవులు చక్కగా ఉండగలరనే భావాన్ని సాతాను కలిగించాడు. ఇది యెహోవా సర్వాధిపత్యం మీద, ఆయన పరిపాలనా హక్కు మీద దాడి చేయడమే.

11. ఏదెనులో యెహోవా ఆ తిరుగుబాటుదారులను ఎందుకు నాశనం చేయలేదు?

11 ఆదాము, హవ్వ యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నిజానికి వారు ఇలాంటి భావాన్ని వ్యక్తం చేశారు: ‘యెహోవా మా మీద పరిపాలకునిగా ఉండనక్కర్లేదు. మంచేదో చెడేదో మేమే నిర్ణయించుకోగలం.’ ఆ వివాదాన్ని యెహోవా ఎలా పరిష్కరించగలడు? ఆ తిరుగుబాటుదారుల వాదన తప్పనీ, తన పరిపాలనే శ్రేష్ఠమైనదనీ బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరికీ ఆయన ఎలా బోధించగలడు? ఆ తిరుగుబాటుదారులను నాశనం చేసి, మళ్లీ కొత్తగా ఆరంభించాల్సింది అని కొందరు అనవచ్చు. అయితే ఈ భూమిని ఆదాము హవ్వల సంతానంతో నింపాలన్నది తన సంకల్పం అని చెప్పడమే కాక, వారు పరదైసు భూమ్మీద నివసించాలని కూడా ఆయన కోరుకున్నాడు. (ఆదికాండము 1:28) యెహోవా ఎల్లప్పుడూ తన సంకల్పాలను నెరవేరుస్తాడు. (యెషయా 55:10, 11) అంతేకాక, ఏదెనులో ఆ తిరుగుబాటుదారులను నాశనం చేస్తే, యెహోవా పరిపాలనా హక్కుకు సంబంధించి తలెత్తిన ప్రశ్నకు జవాబు లభించదు.

12, 13. సాతాను ఈ లోక పరిపాలకుడు కావడానికి, మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి యెహోవా ఎందుకు అనుమతించాడో ఉదాహరించండి.

12 మనమొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు గణితంలో ఒక కష్టతరమైన లెక్కను ఎలా పరిష్కరించాలో చెబుతున్నాడనుకోండి. తెలివిగలవాడే అయినా తిరుగుబాటుదారుడైన ఒక విద్యార్థి ఆ లెక్కను ఉపాధ్యాయుడు పరిష్కరించే విధానం తప్పని అంటాడు. ఆ ఉపాధ్యాయునికి తగిన సామర్థ్యం లేదని సూచిస్తూ, ఆ లెక్కను పరిష్కరించడానికి తనకు మరింత మంచి మార్గం తెలుసని అతడు వాదిస్తాడు. కొంతమంది విద్యార్థులు అతడు చెబుతున్నది సరైనదేనని తలంచి వారు కూడా తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చెయ్యాలి? ఆయన ఆ తిరుగుబాటుదారులను తరగతి నుండి బయటకు పంపించేస్తే, అది ఇతర విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? తమ తోటి విద్యార్థి, అతనితోపాటు ఉన్నవారు చేస్తున్న వాదనే సరైనదని వారు నమ్మరా? తరగతిలో ఉన్న ఇతర విద్యార్థులందరూ ఆ ఉపాధ్యాయుడు తన విధానం తప్పని నిరూపించబడుతుందనే భయంతో అలా చేశాడని భావిస్తూ ఆయనపట్ల గౌరవం కోల్పోవచ్చు. అయితే ఉపాధ్యాయుడు, ఆ లెక్కను తిరుగుబాటుదారుడు ఎలా పరిష్కరిస్తాడో తరగతికి చూపించడానికి అనుమతించాడనుకోండి.

విద్యార్థి ఉపాధ్యాయునికన్నా ఎక్కువ యోగ్యతగలవాడా?

13 యెహోవా దాదాపు ఆ ఉపాధ్యాయుడు చేసేదాన్నే చేశాడు. ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు ఉనికిలో ఉన్నది కేవలం ఆ తోటలోనివారు మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని కోట్లకొలదిగా ఉన్న దేవదూతలు గమనిస్తున్నారు. (యోబు 38:7; దానియేలు 7:10) ఆ తిరుగుబాటును యెహోవా ఎలా చక్కదిద్దుతాడనే విషయం ఆ దూతలందరి మీదనే కాక, చివరకు బుద్ధిసూక్ష్మతగల సృష్టి ప్రాణులందరి మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, యెహోవా ఏమి చేశాడు? మానవాళిని సాతాను ఎలా పరిపాలిస్తాడో చూపించమని ఆయన అతడ్ని అనుమతించాడు. సాతాను నిర్దేశంలో మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి కూడా దేవుడు అనుమతించాడు.

14. మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి అనుమతించాలనే యెహోవా నిర్ణయం నుండి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

14 మన దృష్టాంతంలోని ఉపాధ్యాయునికి ఆ తిరుగుబాటుదారునిది, అతని పక్షాన ఉన్న విద్యార్థులది తప్పని తెలుసు. అలాగే తమ వాదన నిరూపించుకోవడానికి ప్రయత్నించే అవకాశాన్ని వారికివ్వడం తరగతి అంతటికీ ప్రయోజనకరంగా ఉంటుందని కూడా ఆయనకు తెలుసు. ఆ తిరుగుబాటుదారులు విఫలమైనప్పుడు, ఉపాధ్యాయునికి మాత్రమే తరగతిని నడిపించే అర్హత ఉందని యథార్థపరులైన విద్యార్థులందరూ గ్రహిస్తారు. ఆ తర్వాత ఆయన అలాంటి తిరుగుబాటుదారులను తరగతి నుండి ఎందుకు తొలగిస్తాడో అర్థం చేసుకుంటారు. అదేప్రకారంగా, సాతాను, అతని తోటి తిరుగుబాటుదారులు విఫలమయ్యారనీ, మానవులు తమను తాము పరిపాలించుకోలేరనీ గ్రహించిన యథార్థ మానవులు, దేవదూతలు ప్రయోజనం పొందుతారని యెహోవాకు తెలుసు. పూర్వకాలంలోని యిర్మీయాలాగే వారు కూడా ఈ ఆవశ్యక సత్యాన్ని గ్రహిస్తారు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.

ఇంతకాలం ఎందుకు అనుమతించాడు?

15, 16. (ఎ) బాధ ఇంతకాలం కొనసాగడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? (బి) ఘోరమైన నేరాల వంటివాటిని యెహోవా ఎందుకు అడ్డుకోలేదు?

15 కానీ బాధలు ఇంతకాలం కొనసాగడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు? చెడు విషయాలు జరగకుండా ఆయనెందుకు అడ్డుకోవడం లేదు? మన దృష్టాంతంలోని ఉపాధ్యాయుడు చేయని రెండు విషయాలను పరిశీలించండి. మొదటిది, తిరుగుబాటుదారుడైన విద్యార్థి తన వాదన వినిపించడాన్ని ఆయన అడ్డుకోలేదు. రెండవది, ఆ తిరుగుబాటుదారుడు తన వాదనను సమర్థించుకోవడానికి ఆ ఉపాధ్యాయుడు సహాయం చేయలేదు. అదేప్రకారంగా, యెహోవా చేయకూడదని నిర్ణయించుకున్న రెండు విషయాలను పరిశీలించండి. మొదటిది, సాతాను, అతని పక్షాన ఉన్నవారు తమ వాదన సరైనదని నిరూపించుకొనేందుకు చేసే ప్రయత్నాన్ని ఆయన అడ్డుకోలేదు. కాబట్టి సమయం గడవడానికి అనుమతించడం అవసరమైంది. మానవ చరిత్రలోని వేలాది సంవత్సరాల్లో మానవాళి ప్రతివిధమైన స్వీయ పరిపాలనను లేదా మానవ ప్రభుత్వాన్ని ప్రయత్నించి చూసింది. మానవాళి విజ్ఞానశాస్త్రంలో, మరితర క్షేత్రాల్లో కొంత పురోగతి సాధించినా, అన్యాయం, దారిద్ర్యం, నేరం, యుద్ధం మితిమీరిపోయాయి. మానవ పరిపాలన విఫలమైందని స్పష్టమవుతోంది.

16 రెండవది, ఈ లోకాన్ని పరిపాలించడానికి యెహోవా సాతానుకు సహాయం చేయలేదు. ఉదాహరణకు, దేవుడు ఘోరమైన నేరాలను అడ్డగిస్తే అది ఆ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉండదా? విపత్కర పర్యవసానాలు లేకుండానే మానవులు బహుశా తమను తాము పరిపాలించుకోగలరని ప్రజలు తలంచేలా దేవుడు చేసినట్లుగా అది ఉండదా? యెహోవా ఆ విధంగా చేస్తే, అబద్ధంలో ఆయనకూ వంతు ఉన్నట్లే. అయితే ‘దేవుడు అబద్ధమాడజాలడు.’—హెబ్రీయులు 6:18.

17, 18. మానవ పరిపాలనవల్ల, సాతాను ప్రభావంవల్ల కలిగిన హాని అంతటి విషయంలో యెహోవా ఏమి చేస్తాడు?

17 అయితే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సుదీర్ఘ కాలంలో జరిగిన హాని అంతటి విషయమేమిటి? యెహోవా సర్వశక్తిమంతుడని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన మానవ బాధల పర్యవసానాలను సరిచేయగలడు, సరిచేస్తాడు కూడా. మనం ఇప్పటికే తెలుసుకున్నట్లుగా, నాశనమైపోతున్న మన భూమి పరదైసుగా మార్చబడినప్పుడు అది మళ్ళీ మంచి స్థితికి వస్తుంది.యేసు విమోచన క్రయధన బలి మీది విశ్వాసం మూలంగా పాపపు ప్రభావాలు తొలగింపబడతాయి, పునరుత్థానం ద్వారా మరణ ప్రభావాలు లేకుండా పోతాయి. ఆ విధంగా దేవుడు “అపవాది యొక్క క్రియలను లయపరచుటకు” యేసును ఉపయోగిస్తాడు. (1 యోహాను 3:8) యెహోవా ఇవన్నీ సరిగ్గా సరైన సమయంలో తీసుకొస్తాడు. ఆయన ముందే చర్య తీసుకోనందుకు మనం సంతోషించవచ్చు, ఎందుకంటే ఆయన సహనం మనం సత్యం తెలుసుకొని ఆయనకు సేవచేసే అవకాశాన్ని ఇచ్చింది. (2 పేతురు 3:9, 10 చదవండి.) ఈ మధ్యకాలంలో దేవుడు యథార్థ ఆరాధకులను చురుకుగా అన్వేషిస్తూ, ఈ కష్టభరిత లోకంలో వారికి కలిగే ఎలాంటి బాధనైనా సహించేలా వారికి సహాయం చేస్తూ వచ్చాడు.—యోహాను 4:23; 1 కొరింథీయులు 10:13.

18 ఆదాము హవ్వలను తిరుగుబాటు చేయలేని రీతిలో దేవుడు వారిని సృష్టించి ఉంటే ఈ బాధంతా తప్పి ఉండేది కదా అని కొందరు అనుకోవచ్చు. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి, యెహోవా మీకిచ్చిన ఒక ప్రశస్తమైన వరాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

దేవుడిచ్చిన వరాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు?

బాధలను సహించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు

19. యెహోవా మనకు ఎలాంటి ప్రశస్తమైన వరాన్ని ఇచ్చాడు, దానిని విలువైనదిగా మనమెందుకు పరిగణించాలి?

19 ఐదవ అధ్యాయంలో పేర్కొన్నట్లుగా, మానవులు స్వేచ్ఛాచిత్తంతో సృష్టించబడ్డారు. అది ఎంత ప్రశస్తమైన వరమో మీరు గ్రహిస్తున్నారా? దేవుడు ఎన్నో జంతువులను చేశాడు, ఇవి చాలామట్టుకు తమ సహజ ప్రవృత్తితోనే జీవిస్తాయి. మానవుడు మరమనుషులను తయారుచేశాడు, అవి ప్రోగ్రాం చేయబడిన ప్రకారమే ఏ పనైనా చేస్తాయి. దేవుడు మనలను అలా చేసివుంటే మనం సంతోషంగా ఉండేవాళ్ళమా? ఉండేవాళ్ళం కాదు, మనం ఎలాంటి వ్యక్తులుగా తయారవ్వాలి, ఎలాంటి జీవన విధానం అనుసరించాలి, ఎలాంటి స్నేహబంధాలు ఏర్పరచుకోవాలి వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మనకున్నందుకు మనం ఆనందిస్తాం. కొంతమేరకు స్వేచ్ఛగా ఉండడాన్ని మనం ఇష్టపడతాం, మనం అలాంటి స్వేచ్ఛనే అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు.

20, 21. స్వేచ్ఛాచిత్తం అనే వరాన్ని మనం అత్యంత ప్రయోజనకరమైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు, అలా ఉపయోగించుకోవాలని మనం ఎందుకు కోరుకోవాలి?

20 బలవంతంగా చేసే సేవను యెహోవా ఇష్టపడడంలేదు. (2 కొరింథీయులు 9:7) ఉదాహరణకు, “మీరంటే నాకెంతో ఇష్టం” అని తమ కుమారుడు తనంతట తానుగా చెబితే తల్లిదండ్రులు ఎక్కువ సంతోషిస్తారా లేక ఎవరో నేర్పించినందుకు అతనలా చెబితే వారు ఎక్కువ సంతోషిస్తారా? కాబట్టి, ప్రశ్నేమిటంటే, యెహోవా మీకిచ్చిన స్వేచ్ఛాచిత్తాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? సాతాను, ఆదాము, హవ్వ తమ స్వేచ్ఛాచిత్తాన్ని ఘోరమైన విధంగా ఉపయోగించుకున్నారు. వారు యెహోవా దేవుణ్ణి తిరస్కరించారు. మీరేం చేస్తారు?

21 స్వేచ్ఛాచిత్తం అనే అద్భుతమైన వరాన్ని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకునే అవకాశం మీకుంది. యెహోవా పక్షం వహించిన లక్షలాది మందితో మీరూ చేరవచ్చు. సాతాను అబద్ధికుడనీ, పరిపాలకునిగా ఘోరంగా విఫలమయ్యాడనీ నిరూపించడంలో వారు చురుగ్గా భాగం వహిస్తూ దేవునికి సంతోషం కలిగిస్తున్నారు. (సామెతలు 27:11) సరైన జీవన విధానాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు కూడా అలాగే చేయవచ్చు. ఈ విషయం తర్వాతి అధ్యాయంలో వివరించబడుతుంది.