కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పదమూడవ అధ్యాయం

జీవం విషయంలో దేవుని దృక్కోణం

జీవం విషయంలో దేవుని దృక్కోణం
  • జీవాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు?

  • గర్భస్రావాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు?

  • జీవం విషయంలో మనం గౌరవాన్ని ఎలా చూపిస్తాం?

1. సమస్త జీవరాశులను ఎవరు సృష్టించారు?

 “యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు. (యిర్మీయా 10:10) అంతేకాదు, యెహోవా దేవుడే సమస్త జీవరాశులను సృష్టించాడు. పరలోక జీవులు ఆయనను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను.” (ప్రకటన 4:10-11) దేవుని స్తుతించే ఒక గీతంలో దావీదు రాజు ఇలా అన్నాడు: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) కాబట్టి జీవం దేవుడు అనుగ్రహించిన బహుమానమే.

2. మనల్ని పోషించడానికి యెహోవా ఏమి చేస్తున్నాడు?

2 మనల్ని యెహోవాయే పోషిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:28) మనం తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చుకునే గాలి, నివసించే నేల అన్నీ ఆయన అనుగ్రహించినవే. (అపొస్తలుల కార్యములు 14:15-17 చదవండి.) మన జీవితం మధురంగా ఉండాలనే యెహోవా ఇవన్నీ చేశాడు. అయితే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే మనం దేవుని నియమాలు నేర్చుకొని వాటికి లోబడాలి.—యెషయా 48:17, 18.

జీవం విషయంలో గౌరవం చూపించడం

3. హేబెలు హత్యను దేవుడు ఎలా దృష్టించాడు?

3 మన జీవం విషయంలో, ఇతరుల జీవం విషయంలో గౌరవం చూపించాలని దేవుడు కోరుతున్నాడు. ఉదాహరణకు, ఆదాము హవ్వల కాలంలో వారి కుమారుడైన కయీను తన తమ్ముడైన హేబెలుమీద చాలా కోపం తెచ్చుకున్నాడు. కయీను కోపం గంభీరమైన పాపానికి దారితీయగలదని యెహోవా అతడ్ని హెచ్చరించాడు. అయితే కయీను ఆ హెచ్చరికను లక్ష్యపెట్టలేదు. అతను ‘తన తమ్ముడైన హేబెలు మీదపడి అతణ్ణి చంపేశాడు.’ (ఆదికాండము 4:3-8) తన తమ్ముణ్ణి హత్య చేసినందుకు యెహోవా కయీనును శిక్షించాడు.—ఆదికాండము 4:9-11.

4. మోషే ధర్మశాస్త్రంలో జీవం విషయంలో సరైన దృక్కోణాన్ని దేవుడు ఎలా నొక్కిచెప్పాడు?

4 వేల సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు తనను ఆమోదయోగ్యంగా సేవించేందుకు సహాయకరంగా యెహోవా వారికి నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలను ఆయన మోషే ప్రవక్త ద్వారా ఇచ్చాడు కాబట్టి, అవి కొన్నిసార్లు మోషే ధర్మశాస్త్రము అని పిలవబడ్డాయి. ఆ మోషే ధర్మశాస్త్రంలోని కొంతభాగం ఇలా చెప్పింది: “నరహత్య చేయకూడదు.” (ద్వితీయోపదేశకాండము 5:17) ఇది దేవుడు మానవ జీవాన్ని విలువైనదిగా పరిగణిస్తాడనీ, ప్రజలు తమ జీవాన్ని, ఇతరుల జీవాన్ని విలువైనదిగా ఎంచాలనీ ఇశ్రాయేలీయులకు చూపించింది.

5. గర్భస్రావాన్ని మనం ఎలా దృష్టించాలి?

5 ఇంకా జన్మించని శిశువు జీవం విషయమేమిటి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం తల్లి గర్భంలోని శిశువుకైనా జీవహాని కలగజేయడం అపరాధం క్రిందే లెక్క. అవును, ఆ గర్భస్థ శిశువు జీవం కూడా యెహోవాకు అమూల్యమైనదే. (నిర్గమకాండము 21:22, 23; కీర్తన 127:3 చదవండి.) గర్భస్రావం కూడా ఒక అపరాధమే అని దీనర్థం.

6. తోటి మనిషిని మనం ఎందుకు ద్వేషించకూడదు?

6 జీవం విషయంలో గౌరవం చూపించడంలో తోటి మానవులపట్ల సరైన దృక్కోణంతో ఉండడం కూడా ఉంది. బైబిలు ఇలా చెబుతోంది: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.” (1 యోహాను 3:15) మనకు నిత్యజీవం కావాలంటే, తోటి మనిషిపట్ల ఎలాంటి ద్వేషాన్నైనా మన హృదయంలో నుండి తీసివేయాలి, ఎందుకంటే తీవ్ర హింసకు ద్వేషమే మూలకారణం. (1 యోహాను 3:11, 12) కాబట్టి మనం పరస్పరం ప్రేమ చూపించుకోవడాన్ని నేర్చుకోవడం ఆవశ్యకం.

7. జీవం విషయంలో అగౌరవాన్ని ప్రదర్శించే కొన్ని అలవాట్లు ఏవి?

7 మరి మన జీవం విషయంలో గౌరవం చూపించే విషయమేమిటి? ప్రజలు సాధారణంగా చనిపోవాలని కోరుకోరు, అయితే కొందరు సుఖం కోసం చావు కొనితెచ్చుకుంటారు. ఉదాహరణకు, చాలామంది పొగాకు వాడతారు, వక్క నములుతారు లేదా ఉల్లాసం కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటారు. అలాంటి పదార్థాలు శరీరానికి హానికరమైనవే కాక వాటిని ఉపయోగించేవారిని అవి చంపుతాయి కూడా. ఈ పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తి, జీవాన్ని పవిత్రమైనదిగా దృష్టించడు. ఈ అలవాట్లు దేవుని దృష్టిలో అపరిశుభ్రమైనవి. (రోమీయులు 6:19; 12:1; 2 కొరింథీయులు 7:1 చదవండి.) మనం దేవునికి ఆమోదకరమైన సేవ చేయాలంటే అలాంటి అలవాట్లను మానుకోవాలి. అలా మానుకోవడం కష్టమైనా, యెహోవా మనకు కావలసిన సహాయం చేస్తాడు. జీవాన్ని ఆయన మనకిచ్చిన అమూల్యమైన బహుమానంలా చూసుకునేందుకు మనం చేసే ప్రయత్నాలను ఆయన విలువైనవిగా పరిగణిస్తాడు.

8. మనం అన్ని సమయాల్లోను భద్రత గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి?

8 మనకు జీవం విషయంలో గౌరవం ఉన్నట్లయితే, మనం అన్ని సమయాల్లోను భద్రత గురించి శ్రద్ధ తీసుకుంటాం. మనం అజాగ్రత్తగా ఉండం, కేవలం సుఖాల కోసం లేదా ఉత్తేజం కోసం ప్రమాదాలను కొనితెచ్చుకోం. అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయం, బలాత్కారంతో నిండిన లేదా ప్రమాదకరమైన క్రీడలకు దూరంగా ఉంటాం. (కీర్తన 11:5) ప్రాచీన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఒక నియమం ఇలా చెప్పింది: “క్రొత్త యిల్లు [డాబా] కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 22:8) ఆ నియమంలోని సూత్రానికి అనుగుణంగా, ఎవరైనా మెట్ల మీదనుండి జారిపడి తీవ్రంగా గాయపడకుండా ఉండడానికి మీ ఇంట్లోని మెట్లు తదితరమైనవి మంచి స్థితిలో ఉండేలా చూసుకోండి. మీకు కారు ఉంటే అది నడపడానికి సురక్షితమైనదిగా ఉండేలా చూసుకోండి. మీ ఇల్లు లేదా కారు మీకూ, ఇతరులకూ ప్రమాదకరంగా తయారవకుండా చూసుకోండి.

9. మనకు జీవం విషయంలో గౌరవం ఉంటే, మనం జంతువులతో ఎలా వ్యవహరిస్తాం?

9 జంతువుల జీవం విషయమేమిటి? అది కూడా సృష్టికర్తకు పవిత్రమైనదే. ఆహారం కోసం, వస్త్రాల కోసం లేదా ప్రమాదం నుండి ప్రజలను రక్షించేందుకు జంతువులను చంపడాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు. (ఆదికాండము 3:21; 9:3; నిర్గమకాండము 21:28) కానీ జంతువుల విషయంలో క్రూరంగా ప్రవర్తించడం లేదా కేవలం క్రీడానందం కోసం వాటిని చంపడం తప్పే కాక, జీవానికి సంబంధించిన పవిత్రత విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది.—సామెతలు 12:10.

రక్తం విషయంలో గౌరవం చూపించడం

10. జీవానికీ రక్తానికీ సంబంధం ఉందని దేవుడు ఎలా చూపించాడు?

10 కయీను తన తమ్ముడైన హేబెలును చంపిన తర్వాత, యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.” (ఆదికాండము 4:10) దేవుడు హేబెలు రక్తం గురించి మాట్లాడినప్పుడు, నిజానికి ఆయన హేబెలు జీవం గురించి మాట్లాడుతున్నాడు. కయీను హేబెలును చంపేశాడు, కాబట్టి అతను శిక్షించబడాలి. న్యాయం కోసం హేబెలు రక్తం లేదా అతని జీవం యెహోవాకు మొర్రపెట్టినట్లయింది. నోవహు కాలంలోని జలప్రళయం తర్వాత జీవానికి, రక్తానికి ఉన్న సంబంధం మళ్లీ చూపించబడింది. జలప్రళయానికి ముందు మానవులు కేవలం పళ్లు, కూరగాయలు, ధాన్యం, గింజలు మాత్రమే భుజించేవారు. కానీ జలప్రళయం తర్వాత నోవహుకు, ఆయన కుమారులకు యెహోవా ఇలా చెప్పాడు: “జీవముగల సమస్త చరములు మీకు ఆహారమగును.” కానీ దేవుడు ఈ నిషేధాన్ని పెట్టాడు: “మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని జీవము.” (ఆదికాండము 1:29; 9:3, 4) కాబట్టి యెహోవా ఒక జీవి ప్రాణాన్ని దాని రక్తంతో గట్టిగా ముడిపెడుతున్నాడనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

11. నోవహు కాలం నుండి రక్తం విషయంలో దేవుడు ఏమి నిషేధించాడు?

11 రక్తాన్ని తినకుండా ఉండడం ద్వారా మనం రక్తంపట్ల గౌరవం చూపిస్తాం. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇలా ఆజ్ఞాపించాడు: ‘ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. మీరు ఏ దేహరక్తమును తినకూడదు అని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.’ (లేవీయకాండము 17:13, 14) అప్పటికి దాదాపు 800 సంవత్సరాల క్రితం, జంతు రక్తమును తినకూడదని నోవహుకు దేవుడు మొదట ఆజ్ఞాపించినది, ఇంకా అమలులోనే ఉంది. యెహోవా దృక్కోణం స్పష్టంగా ఉంది. అదేమిటంటే తన సేవకులు జంతుమాంసం తినవచ్చును గానీ దాని రక్తమును తినకూడదు. వారు రక్తాన్ని నేల మీద పారబోయాలి అంటే ఆ జీవి జీవాన్ని దాని సృష్టికర్తకు తిరిగి అప్పగించడం అని అర్థం.

12. రక్తానికి సంబంధించి నేటికీ అన్వయించే ఏ ఆజ్ఞ పరిశుద్ధాత్మ ద్వారా మొదటి శతాబ్దంలో ఇవ్వబడింది?

12 క్రైస్తవులకు కూడా అలాంటి ఆజ్ఞే ఇవ్వబడింది. మొదటి శతాబ్దంలో యేసు అనుచరులకు నాయకత్వం వహిస్తున్న అపొస్తలులు, ఇతర పురుషులు క్రైస్తవ సంఘ సభ్యులందరూ లోబడవలసిన ఆజ్ఞలేవో నిర్ణయించడానికి సమావేశమయ్యారు. వారు చివరకు ఈ నిర్ణయానికి వచ్చారు: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని [అంటే మాంసంలో రక్తం అలాగే ఉండిపోనిచ్చిన దానిని], జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను.” (అపొస్తలుల కార్యములు 15:28, 29; 21:25) కాబట్టి మనం ‘రక్తాన్ని విసర్జించాలి.’ దేవుని దృష్టిలో రక్తాన్ని విసర్జించడం, విగ్రహారాధనను, లైంగిక దుర్నీతిని విసర్జించడమంత ప్రాముఖ్యమైనది.

మద్యం త్రాగకూడదని డాక్టరు మీకు చెబితే, మీరు దానిని నరాలగుండా శరీరంలోకి ఎక్కించుకుంటారా?

13. రక్తాన్ని విసర్జించండి అనే ఆజ్ఞలో రక్తమార్పిడులు కూడా ఎందుకు ఇమిడివున్నాయో ఉదాహరించండి.

13 రక్తాన్ని విసర్జించండి అనే ఆ ఆజ్ఞలో రక్తమార్పిడులను విసర్జించడం కూడా ఇమిడివుందా? నిశ్చయంగా! ఉదాహరణకు, మద్యాన్ని తీసుకోవద్దని డాక్టరు మీకు చెప్పాడనుకుందాం. అంటే మీరు కేవలం మద్యాన్ని త్రాగకూడదు గానీ, నరాలగుండా దానిని శరీరంలోకి ఎక్కించుకోవచ్చని దానర్థమా? ఎంతమాత్రం కాదు! అదేవిధంగా, రక్తాన్ని విసర్జించడం అంటే దానిని ఏ విధంగానూ మన శరీరాల్లోకి ఎక్కించుకోకూడదనే భావం. కాబట్టి రక్తాన్ని విసర్జించండి అనే ఆజ్ఞలో ఏ విధంగా కూడా మనకు రక్తమార్పిడి చేయడానికి ఎవరినీ అనుమతించమనే భావం ఉంది.

14, 15. ఒక క్రైస్తవుడు తప్పకుండా రక్తం ఎక్కించుకోవాలని డాక్టర్లు చెబితే, ఆయన ఎలా స్పందిస్తాడు, ఎందుకలా స్పందిస్తాడు?

14 ఒక క్రైస్తవుడు బాగా గాయపడితే లేదా ఆయనకు శస్త్రచికిత్స అవసరమైతే అప్పుడెలా? ఆయనకు రక్తం ఎక్కించాలి లేకపోతే చనిపోతాడు అని డాక్టర్లు చెప్పారనుకోండి. ఒక క్రైస్తవుడు చనిపోవాలని కోరుకోడు. దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన జీవ బహుమానాన్ని కాపాడుకోవాలనే తన ప్రయత్నంలో ఆయన రక్తాన్ని దుర్వినియోగపరచని ఇతర చికిత్సా విధానాలను అంగీకరిస్తాడు. కాబట్టి అలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉంటే వాటికోసం ప్రయత్నిస్తూ రక్తానికి బదులు వివిధ ప్రత్యామ్నాయాలను అంగీకరించవచ్చు.

15 ఈ విధానంలో మరికొంత కాలం మాత్రమే సజీవంగా ఉండడానికి ఒక క్రైస్తవుడు దేవుని నియమాన్ని ఉల్లంఘిస్తాడా? యేసు ఇలా చెప్పాడు: “తన జీవమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన జీవమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.” (మత్తయి 16:25) మనం చనిపోవాలని కోరుకోము. అయితే దేవుని నియమాన్ని ఉల్లంఘించి ప్రస్తుత జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తే, మనం నిత్యజీవం పోగొట్టుకునే ప్రమాదంలో ఉంటాం. కాబట్టి ఏ కారణంగానైనా మనం ఒకవేళ మరణించినా మన జీవదాత మనలను పునరుత్థానం చేస్తాడని, మనకు మళ్లీ అమూల్యమైన జీవాన్ని బహుమతిగా ఇస్తాడనే పూర్తి నమ్మకంతో దేవుని నియమాలు సరైనవని నమ్మడం జ్ఞానయుక్తం.—యోహాను 5:28, 29; హెబ్రీయులు 11:6.

16. రక్తం విషయంలో దేవుని సేవకులు ఏమని దృఢంగా తీర్మానించుకుంటారు?

16 నేడు, దేవుని నమ్మకమైన సేవకులు రక్తం విషయంలో ఆయన నిర్దేశాన్ని అనుసరించడానికి దృఢంగా తీర్మానించుకుంటారు. వారు దానిని ఏ విధంగానూ భుజించరు, లేదా వైద్య కారణాలనుబట్టి రక్తాన్ని అంగీకరించరు. a తమకు ఏది మంచిదో తమకన్నా, రక్తాన్ని సృష్టించిన దేవునికే ఎక్కువ తెలుసని వారు ఖచ్చితంగా నమ్ముతారు. ఆయనకే ఎక్కువ తెలుసని మీరు నమ్ముతున్నారా?

రక్తాన్ని సరిగా ఉపయోగించే ఏకైక విధానం

17. ప్రాచీన ఇశ్రాయేలులో, యెహోవా దేవునికి ఆమోదయోగ్యంగా రక్తాన్ని ఉపయోగించే ఏకైక విధానం ఏమిటి?

17 రక్తాన్ని సరిగా ఉపయోగించే ఏకైక విధానాన్ని మోషే ధర్మశాస్త్రం నొక్కిచెప్పింది. ప్రాచీన ఇశ్రాయేలీయులు చేయవలసిన ఆరాధనకు సంబంధించి, యెహోవా వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “రక్తము దేహమునకు జీవము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న జీవమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.” (లేవీయకాండము 17:11) ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఒక జంతువును బలి అర్పించి దాని రక్తాన్ని గుడారంలోని బలిపీఠం మీద, దేవాలయం కట్టిన తర్వాత దేవాలయంలోని బలిపీఠం మీద పోయడం ద్వారా క్షమాపణ పొందగలిగేవారు. రక్తాన్ని సరైన విధంగా ఉపయోగించే ఏకైక పద్ధతి, దాన్ని అలాంటి బలి అర్పణల్లో ఉపయోగించడం మాత్రమే.

18. యేసు చిందించిన రక్తంవల్ల మనం ఏ ప్రయోజనాలను, ఆశీర్వాదాలను పొందవచ్చు?

18 నిజ క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు కాబట్టి, వారు జంతు బలులు అర్పించి వాటి రక్తాన్ని బలిపీఠం మీద పోయరు. (హెబ్రీయులు 10:1) కానీ ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలంలో బలిపీఠం మీద రక్తాన్ని పోయడం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అర్పించబోయే అమూల్యమైన బలిని సూచించింది. ఈ పుస్తకంలోని 5 అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లుగా యేసు బలిగా తన రక్తం చిందించి మన కోసం తన మానవ జీవాన్ని అర్పించాడు. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఎక్కిపోయి దేవునికి ఒక్కసారే తాను చిందించిన రక్తపు విలువను అర్పించాడు. (హెబ్రీయులు 9:11, 12) అది మన పాపాల క్షమాపణకు ఆధారాన్ని ఇవ్వడమే కాక, మనం నిత్యజీవం పొందేందుకు మార్గాన్ని తెరిచింది. (మత్తయి 20:28; యోహాను 3:16) రక్తం యొక్క ఉపయోగం ఎంత ప్రాముఖ్యమైనదని నిరూపించబడిందో కదా! (1 పేతురు 1:18, 19) యేసు చిందించిన రక్తం చేకూర్చే ప్రయోజనాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలుగుతాం.

జీవం విషయంలో, రక్తం విషయంలో మీరు ఎలా గౌరవం చూపించవచ్చు?

19. మనం ‘ఎవరి నాశనము విషయంలోను దోషులం కాకుండా’ ఉండాలంటే ఏమి చేయాలి?

19 ఆ ప్రేమపూర్వక జీవ బహుమానం ఇచ్చినందుకు యెహోవా దేవునికి మనమెంత కృతజ్ఞులమో కదా! యేసు బలిపై విశ్వాసం ఆధారంగా నిత్యజీవం పొందే అవకాశం గురించి ఇతరులకు చెప్పేలా అది మనలను పురికొల్పవద్దా? మానవులపట్ల దేవునికి ఉన్నటువంటి శ్రద్ధే మనకు తోటి మానవులపట్ల ఉంటే అది మనం ఉత్సాహంతో, ఆసక్తితో ఈ పని చేయడానికి మనలను పురికొల్పుతుంది. (యెహెజ్కేలు 3:17-21 చదవండి.) మనం శ్రద్ధగా ఈ బాధ్యతను నెరవేర్చినప్పుడు అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా ఇలా చెప్పగలుగుతాం: ‘ఎవరి నాశనము విషయంలోను నేను దోషినికాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.’ (అపొస్తలుల కార్యములు 20:26, 27) జీవం విషయంలో, రక్తం విషయంలో మనకు అత్యున్నత గౌరవం ఉందని చూపించడానికి ఒక శ్రేష్ఠమైన మార్గం ఏమిటంటే, దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ ప్రజలకు చెప్పడమే.

a రక్తమార్పిడి ప్రత్యామ్నాయాల సంబంధిత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషుర్‌లోని 13-17 పేజీలను చూడండి.