కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పధ్నాలుగవ అధ్యాయం

మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?

మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
  • మంచి భర్తగా ఉండాలంటే అవసరమైనదేమిటి?

  • ఒక స్త్రీ భార్యగా ఎలా విజయం సాధించగలదు?

  • మంచి తల్లిగా లేక తండ్రిగా ఉండడంలో ఏమి ఇమిడివుంది?

  • కుటుంబ జీవితాన్ని సంతోషభరితంగా చేసుకోవడంలో పిల్లలు ఎలా సహాయం చేయవచ్చు?

1. సంతోషభరితమైన కుటుంబ జీవితానికి కీలకం ఏమిటి?

 మీ కుటుంబ జీవితం సంతోషభరితంగా ఉండాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు. దేవుడు కుటుంబంలోని ప్రతీ ఒక్కరు నిర్వర్తించాలని కోరుకునే పాత్ర గురించి వర్ణిస్తూ ఆయన వాక్యమైన బైబిలు ప్రతీ సభ్యునికి మార్గనిర్దేశాలను అందిస్తోంది. దేవుని ఉపదేశానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు తమవంతు కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడు, ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు . . . ధన్యులు” అని యేసు చెప్పాడు.—లూకా 11:28.

2. కుటుంబ సంతోషం మనం దేనిని గుర్తించడం మీద ఆధారపడి ఉంది?

2 “మా తండ్రీ” అని యేసు ఎవరినైతే పిలిచాడో ఆ యెహోవాయే కుటుంబాన్ని ఆరంభించాడు అని గుర్తించడం మీదే కుటుంబ సంతోషం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. (మత్తయి 6:9, 10) మన పరలోకపు తండ్రి కారణంగానే భూమ్మీద ప్రతీ కుటుంబం ఉనికిలో ఉంది, అంతేకాదు, ఒక కుటుంబం సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో కూడా ఆయనకు నిశ్చయంగా తెలుసు. (ఎఫెసీయులు 3:14, 15) కాబట్టి, ప్రతీ కుటుంబ సభ్యుని పాత్ర గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

కుటుంబ ఏర్పాటును దేవుడే ఆరంభించాడు

3. మానవ కుటుంబ ఆరంభాన్ని బైబిలు ఎలా వర్ణిస్తోంది, అది చెప్పేది సత్యమేనని మనకు ఎలా తెలుసు?

3 యెహోవా మొదటి మానవులైన ఆదాము హవ్వలను సృష్టించి వారిని భార్యాభర్తలుగా ఒక దగ్గరకు చేర్చాడు. ఆయన వారిని ఏదెను తోట అనే అందమైన భూపరదైసు గృహంలో ఉంచి పిల్లల్ని కనమని చెప్పాడు. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం[చండి]” అని యెహోవా వారికి చెప్పాడు. (ఆదికాండము 1:26-28; 2:18, 21-24) ఇది ఒక కథో పుక్కిటి పురాణమో కాదు, ఎందుకంటే మానవ కుటుంబ ఆరంభాన్ని గురించి ఆదికాండము చెబుతున్నది సత్యమేనని యేసు చూపించాడు. (మత్తయి 19:4, 5) మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా, మన జీవితం ఇప్పుడు దేవుడు సంకల్పించినట్లుగా లేకపోయినప్పటికీ, కుటుంబంలో సంతోషం ఎలా సాధ్యమో చూద్దాం.

4. (ఎ) కుటుంబ సంతోషానికి దానిలోని ప్రతీ సభ్యుడు ఎలా తోడ్పడవచ్చు? (బి) కుటుంబ సంతోషానికి యేసు జీవితాన్ని అధ్యయనం చేయడం ఎందుకు అత్యంత ప్రాముఖ్యం?

4 ప్రేమ చూపించడంలో దేవుణ్ణి అనుకరించడం ద్వారా కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరూ కుటుంబ జీవితంలో సంతోషం నెలకొనేందుకు దోహదపడవచ్చు. (ఎఫెసీయులు 5:1, 2) అయితే మనం దేవుణ్ణి చూడలేము కాబట్టి మనం ఆయనను ఎలా అనుకరించగలం? యెహోవా తన జ్యేష్ఠ కుమారుణ్ణి పరలోకం నుండి ఈ భూమ్మీదికి పంపించాడు కాబట్టి ఆయన ఎలా చర్యలు తీసుకుంటాడో మనం తెలుసుకోవచ్చు. (యోహాను 1:14, 18) కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమ్మీద ఉన్నప్పుడు ఆయన తన పరలోకపు తండ్రిని ఎంత సన్నిహితంగా అనుకరించాడంటే, ఆయనను చూడడం, ఆయన చెప్పింది వినడం మనం నిజంగా యెహోవాతో ఉండి, ఆయన చెబుతున్నది వింటున్నట్లుగానే ఉంటుంది. (యోహాను 14:9) కాబట్టి, యేసు చూపించిన ప్రేమ గురించి తెలుసుకొని ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేసుకోవడంలో మనలో ప్రతీ ఒక్కరం తోడ్పడవచ్చు.

భర్తలకు ఆదర్శం

5, 6. (ఎ) యేసు సంఘాన్ని చూసే పద్ధతి భర్తలకు ఎలా ఒక ఆదర్శంగా ఉంది? (బి) పాప క్షమాపణ పొందడానికి ఏమి చేయాలి?

5 యేసు తన శిష్యులను చూసిన విధంగానే భర్తలు తమ భార్యలను చూసుకోవాలని బైబిలు చెబుతోంది. బైబిలు ఇస్తున్న ఈ నిర్దేశాన్ని పరిశీలించండి: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.”ఎఫెసీయులు 5:23, 25-29.

6 యేసుకు తన శిష్యుల సంఘం మీద ఉన్న ప్రేమ భర్తలకు పరిపూర్ణ ఆదర్శంగా ఉంది. యేసు శిష్యులు అపరిపూర్ణులే అయినా ఆయన ‘వారిని అంతమువరకు ప్రేమించాడు,’ వారికోసం తన ప్రాణాన్ని అర్పించాడు. (యోహాను 13:1; 15:13) అదేప్రకారంగా, “మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి” అని భర్తలు ఉద్బోధించబడ్డారు. (కొలొస్సయులు 3:19) ప్రత్యేకంగా తన భార్య కొన్నిసార్లు వివేకయుక్తంగా ప్రవర్తించని సందర్భాల్లో, అలాంటి సలహాను అన్వయించుకోవడానికి భర్తకు ఏది సహాయం చేస్తుంది? ఆయన తాను కూడా తప్పిపోతాననే విషయంతోపాటు, దేవుని క్షమాపణ పొందడం కోసం తానేమి చేయాలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయనేమి చేయాలి? ఆయన తనకు విరుద్ధంగా పాపం చేసినవారిని క్షమించాలి, అలాంటి వారిలో ఆయన భార్య కూడా ఒకరు. అయితే, ఆమె కూడా అలాగే చేయాలి. (మత్తయి 6:12, 14, 15 చదవండి.) విజయవంతమైన వివాహమంటే క్షమించుకునే ఇద్దరు వ్యక్తుల సంగమమని కొందరు ఎందుకు అన్నారో మీరు అర్థం చేసుకున్నారా?

7. యేసు వేటిని పరిగణనలోకి తీసుకున్నాడు, ఇది భర్తలకు ఎలాంటి మాదిరిని ఉంచుతోంది?

7 యేసు తన శిష్యుల విషయంలో అన్ని సందర్భాల్లోనూ శ్రద్ధ వహించాడని కూడా భర్తలు గమనించాలి. ఆయన వారి పరిమితులను, భౌతిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్నాడు. ఉదాహరణకు, వారు అలసిపోయినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడి.” (మార్కు 6:30-32) అదేవిధంగా భార్యల విషయంలో భర్తలు కూడా శ్రద్ధ చూపించడం అవసరం. భార్యను “బలహీనమైన ఘటము” అని బైబిలు వర్ణిస్తోంది, ఆమెను ‘సన్మానించాలి’ అని భర్తలకు ఆజ్ఞాపించబడింది. కారణం? భార్యాభర్తలిద్దరూ సమానంగా ‘జీవమను కృపావరములో పాలివారైయున్నారు.’ (1 పేతురు 3:7) స్త్రీపురుషులనే భేదం లేకుండా, ఒక వ్యక్తి తాను చూపించే విశ్వసనీయతను బట్టే దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తిగా ఉంటాడని భర్తలు గుర్తుపెట్టుకోవాలి.—కీర్తన 101:6.

8. (ఎ) తన “భార్యను ప్రేమించు” ఒక భర్త ఏ విధంగా “తన్ను ప్రేమించుకొనుచున్నాడు”? (బి) భార్యాభర్తలు “ఏకశరీరముగా” ఉండడం అంటే ఏమిటి?

8 “భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. ఎందుకంటే యేసు చెప్పినట్లుగా భార్యాభర్తలు “ఇద్దరుకాక, ఏకశరీరముగా ఉన్నారు.” (మత్తయి 19:6) కాబట్టి వారి లైంగిక విషయాలు వారిద్దరికే పరిమితమై ఉండాలి. (సామెతలు 5:15-21; హెబ్రీయులు 13:4) వారు పరస్పరం నిస్వార్థమైన శ్రద్ధ చూపించుకున్నప్పుడే అలా ఉండగలరు. (1 కొరింథీయులు 7:3-5) ఈ మాటలు గుర్తుంచుకోదగినవి: “తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.” కాబట్టి భర్తలు తమ శిరస్సైన యేసుక్రీస్తుకు తాము జవాబుదారులమని గుర్తుంచుకుంటూ, తమనుతాము ప్రేమించుకొంటున్నట్లే తమ భార్యలను కూడా ప్రేమించాలి.—ఎఫెసీయులు 5:29; 1 కొరింథీయులు 11:3.

9. యేసు చూపించిన ఏ లక్షణం ఫిలిప్పీయులు 1:8 లో ప్రస్తావించబడింది, భర్తలు తమ భార్యల విషయంలో ఈ లక్షణాన్ని ఎందుకు కనబరచాలి?

9 క్రీస్తుయేసుకున్న మృదువైన అనురాగం లేదా “దయారసము” గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (ఫిలిప్పీయులు 1:8) యేసు మృదు స్వభావం ఊరటనిచ్చే లక్షణమే కాక, ఆయన శిష్యులైన స్త్రీలకు అది మనోహరంగా ఉంది. (యోహాను 20:1, 11-13, 16) భార్యలు తమ భర్తలనుండి అలాంటి మృదువైన అనురాగాన్నే కోరుకుంటారు.

భార్యలకు మాదిరి

10. భార్యలకు యేసు ఏ విధంగా ఒక మాదిరి ఉంచాడు?

10 కుటుంబం ఒక వ్యవస్థ, అది సజావుగా సాగిపోవడానికి దానికి ఒక శిరస్సు అవసరం. యేసుకు కూడా తాను లోబడి ఉండాల్సిన ఒక శిరస్సు ఉన్నాడు. ‘స్త్రీకి శిరస్సుగా పురుషుడు’ ఉన్నట్లే “క్రీస్తునకు శిరస్సు దేవుడు.” (1 కొరింథీయులు 11:3) మనం లోబడవలసిన ఒక శిరస్సు మనందరికీ ఉన్నాడు కాబట్టి, దేవుని శిరసత్వానికి యేసు లోబడి ఉండడం ఒక ఉత్తమ ఆదర్శంగా ఉంది.

11. భార్య తన భర్త విషయంలో ఎలాంటి స్వభావంతో ఉండాలి, ఆమె ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపించగలదు?

11 అపరిపూర్ణులైన పురుషులు తాము చేసే తప్పుల కారణంగా, ఆదర్శవంతమైన కుటుంబ శిరస్సులుగా ఉండడంలో తరచూ తప్పిపోతారు. కాబట్టి, భార్య ఏమి చేయాలి? తన భర్త చేసేదాన్ని ఆమె చులకన చేయకూడదు, అతని శిరసత్వాన్ని తాను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించకూడదు. సాధుత్వం, మృదు స్వభావం దేవుని దృష్టిలో ఎంతో విలువైనవని ఆమె గుర్తుంచుకోవాలి. (1 పేతురు 3:4) ఆమె అలాంటి స్వభావాన్ని కనబరచినప్పుడు, కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దైవిక విధేయతను ప్రదర్శించడం ఆమెకు సుళువుగా ఉంటుంది. అంతేకాక, బైబిలు ఇలా చెబుతోంది: “భార్యయైతే తన భర్తయందు భయము [‘ప్రగాఢ గౌరవము’ NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:33) ఒకవేళ ఆమె భర్త క్రీస్తును తన శిరస్సుగా అంగీకరించని వ్యక్తి అయితే అప్పుడెలా? బైబిలు భార్యలకు ఇలా ఉద్బోధిస్తోంది: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన [‘ప్రగాఢ గౌరవముతో కూడిన’ NW] మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”—1 పేతురు 3:1-2.

12. భార్య గౌరవపూర్వకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఎందుకు తప్పు కాదు?

12 భర్త విశ్వాసి అయినా, కాకపోయినా భార్య తన భర్తకు భిన్నమైన అభిప్రాయాన్ని ఔచిత్యంతో వ్యక్తం చేసినప్పుడు అది అగౌరవం చూపించినట్లేమీ కాదు. ఆమె అభిప్రాయం బహుశా సరైనదే కావచ్చు, భర్త ఆమె చెప్పిన మాట వింటే కుటుంబమంతా ప్రయోజనం పొందవచ్చు. శారా ఒకానొక కుటుంబ సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచించినప్పుడు అబ్రాహాము తన భార్యతో ఏకీభవించకపోయినా, “ఆమె మాట వినుము” అని దేవుడు ఆయనకు చెప్పాడు. (ఆదికాండము 21:9-12 చదవండి.) అయితే భర్త చివరకు దేవుని నియమానికి వ్యతిరేకం కాని నిర్ణయం తీసుకున్నప్పుడు, భార్య దానికి మద్దతివ్వడం ద్వారా తన విధేయతను చూపిస్తుంది.—అపొస్తలుల కార్యములు 5:29; ఎఫెసీయులు 5:24.

భార్యలకు శారా ఎలాంటి చక్కని మాదిరిని ఉంచింది?

13. (ఎ) వివాహిత స్త్రీలు ఏమి చేయాలని తీతు 2:3-5 ఉద్బోధిస్తోంది? (బి) వేరుపడడం గురించి, విడాకుల గురించి బైబిలు ఏమి చెబుతోంది?

13 కుటుంబ శ్రేయస్సు కోసం భార్య అనేక రకాలుగా తన పాత్రను పోషించవచ్చు. ఉదాహరణకు, వివాహిత స్త్రీలు “తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని” బైబిలు వివరిస్తోంది. (తీతు 2:3-5) ఈ విధంగా ప్రవర్తించే భార్య, తల్లి తన కుటుంబ సభ్యుల శాశ్వత ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకుంటుంది. (సామెతలు 31:10, 28 చదవండి.) అయితే వివాహం అపరిపూర్ణులైన ఇద్దరి కలయిక కాబట్టి, కొన్ని విపరీత పరిస్థితుల కారణంగా వారు వేరుపడే లేదా విడాకులు తీసుకునే అవకాశముంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేరుపడడాన్ని బైబిలు అనుమతిస్తోంది. అయితే వేరుపడడాన్ని తేలికగా దృష్టించకూడదు, ఎందుకంటే బైబిలు ఇలా ఉపదేశిస్తోంది: “భార్య భర్తను ఎడబాయకూడదు. . . . మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.” (1 కొరింథీయులు 7:10, 11) భార్యాభర్తల్లో ఎవరైనా వ్యభిచారం చేసినప్పుడు మాత్రమే విడాకులకు లేఖనాధారం లభిస్తుంది.—మత్తయి 19:9.

తల్లిదండ్రులకు ఒక పరిపూర్ణ మాదిరి

14. యేసు పిల్లలతో ఎలా వ్యవహరించాడు, పిల్లలకు తల్లిదండ్రుల నుండి కావల్సింది ఏమిటి?

14 పిల్లలతో వ్యవహరించే విషయంలో యేసు తల్లిదండ్రులకు ఒక పరిపూర్ణ మాదిరిని ఉంచాడు. చిన్నపిల్లలు తనను సమీపించడాన్ని ఇతరులు అడ్డగించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఇలా అన్నాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.” ఆ పిమ్మట ఆయన “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను” అని బైబిలు చెబుతోంది. (మార్కు 10:13-16) చిన్నపిల్లల కోసం యేసు సమయం వెచ్చించాడు కాబట్టి, మీరు కూడా మీ పిల్లలతో సమయం వెచ్చించకూడదా? మీరు వారికి ఎప్పుడో ఒకప్పుడు కాస్త సమయం ఇస్తే చాలదు, వారితో ఎక్కువ సమయం గడపాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించాలని యెహోవా చెబుతున్నాడు కాబట్టి, వారికి బోధించడానికి మీరు సమయం వెచ్చించాలి.ద్వితీయోపదేశకాండము 6:4-9 చదవండి.

15. తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడడానికి ఏమి చేయవచ్చు?

15 ఈ లోకంలో దుష్టత్వం మరింత ప్రబలుతుండగా, లైంగిక దుశ్చర్యలతో పిల్లలకు హాని కలిగించడానికి ప్రయత్నించేవారి నుండి తమను కాపాడే తల్లిదండ్రులు వారికి కావాలి. యేసు అనురాగంతో “పిల్లలారా” అని పిలిచిన తన శిష్యులను ఎలా ఆదుకున్నాడో పరిశీలించండి. యేసును బంధించి, చంపే సమయం వచ్చినప్పుడు కూడా ఆయన వారిని తప్పించడానికి ప్రయత్నించాడు. (యోహాను 13:33; 18:7-9) తల్లిదండ్రుల్లో ఒకరిగా మీరుకూడా మీ పిల్లలకు హాని తలపెట్టాలని అపవాది చేసే ప్రయత్నాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు వారిని ముందుగానే హెచ్చరించాలి. a (1 పేతురు 5:8) పిల్లల భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక భద్రతకు క్రితమెన్నడూ లేనంత ముప్పు ఇప్పుడు పొంచివుంది.

యేసు పిల్లలతో వ్యవహరించిన విధానం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

16. యేసు తన శిష్యుల అపరిపూర్ణతలతో వ్యవహరించిన విధానం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

16 యేసు చనిపోవడానికి ముందురాత్రి ఆయన శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. యేసు వారిమీద కోపం తెచ్చుకోవడానికి బదులు, ఆయన తన మాట ద్వారా మాదిరి ద్వారా వారిని అనునయిస్తూ ప్రేమపూర్వకంగా మాట్లాడాడు. (లూకా 22:24-27; యోహాను 13:3-8) మీరు తల్లిదండ్రుల్లో ఒకరైతే, మీ పిల్లలను సరిదిద్దే విషయంలో యేసు మాదిరిని మీరు ఎలా అనుకరించవచ్చో చూడగలుగుతున్నారా? నిజమే వారికి క్రమశిక్షణ అవసరం, అయితే అది ఎన్నటికీ కోపంతో కాక, ‘మితముగా’ ఉండాలి. అనాలోచితంగా “కత్తిపోటువంటి మాటలు” మాట్లాడాలని మీరు కోరుకోరు. (యిర్మీయా 30:11; సామెతలు 12:18) మీరిచ్చే క్రమశిక్షణ, మీ పిల్లవాడు తనకు ఇవ్వబడిన క్రమశిక్షణ ఎంత సముచితమైనదో ఆ తర్వాత అర్థం చేసుకోగలిగేలా ఉండాలి.—ఎఫెసీయులు 6:4; హెబ్రీయులు 12:9-11.

పిల్లలకు ఒక ఆదర్శం

17. యేసు పిల్లలకు ఏ విధంగా ఒక పరిపూర్ణ మాదిరి ఉంచాడు?

17 యేసు నుండి పిల్లలు ఏమైనా నేర్చుకోగలరా? అవును, నేర్చుకోగలరు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించవచ్చో యేసు తన మాదిరి ద్వారా చూపించాడు. “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను . . . ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అని ఆయన చెప్పాడు. (యోహాను 8:28, 29) యేసు తన పరలోకపు తండ్రికి లోబడ్డాడు, అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 6:1-3 చదవండి.) యేసు పరిపూర్ణ బాలునిగా ఉన్నప్పటికీ, ఆయన అపరిపూర్ణులుగా ఉన్న తన మానవ తల్లిదండ్రులైన యోసేపు, మరియలకు లోబడ్డాడు. అది నిశ్చయంగా యేసు కుటుంబంలోని ప్రతీ సభ్యుని సంతోషానికి దోహదపడింది.—లూకా 2:4, 5, 51, 52.

18. యేసు అన్ని సందర్భాల్లోను తన పరలోకపు తండ్రికి ఎందుకు లోబడ్డాడు, నేడు పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఎవరు సంతోషిస్తారు?

18 పిల్లలు తాము మరింతగా యేసులాగే ఉండేందుకు మార్గాలేమిటో తెలుసుకొని తమ తల్లిదండ్రులకు సంతోషం కలిగించే అవకాశముందా? నిజమే, తల్లిదండ్రులకు లోబడి ఉండడం కొన్నిసార్లు పిల్లలకు కష్టమనిపించవచ్చు, అయినప్పటికీ పిల్లలు వారికి లోబడి ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. (సామెతలు 1:8; 6:20) యేసు అన్ని సందర్భాల్లో, కష్ట పరిస్థితుల్లో కూడా తన పరలోకపు తండ్రికి లోబడి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో దేవుని చిత్తానికి సంబంధించి యేసు నిజంగా చాలా కష్టమైన పని చేయవలసి వచ్చినప్పుడు, యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, యీ గిన్నె [ఆయన చేయవలసినదొకటి] నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము.” అయినప్పటికీ, యేసు తనను దేవుడు అడిగిన పనే చేశాడు, ఎందుకంటే తనకన్నా తండ్రికే ఎక్కువ తెలుసని ఆయన గ్రహించాడు. (లూకా 22:42) విధేయతను నేర్చుకోవడం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులకూ, తమ పరలోక తండ్రికీ చాలా సంతోషం కలిగిస్తారు. bసామెతలు 23:22-25.

యౌవనులు శోధనకు గురైనప్పుడు దేని గురించి ఆలోచించాలి?

19. (ఎ) సాతాను పిల్లలను ఎలా శోధిస్తాడు? (బి) పిల్లల చెడు ప్రవర్తన తల్లిదండ్రుల మీద ఎలాంటి ప్రభావం చూపించగలదు?

19 అపవాది యేసును శోధించాడు కాబట్టి, తప్పు చేయడానికి అతడు పిల్లలను కూడా తప్పక శోధిస్తాడు. (మత్తయి 4:1-10) అపవాదియైన సాతాను, ఎదిరించడానికి కష్టంగా ఉండే తోటివారి ఒత్తిడిని ఉపయోగిస్తాడు. కాబట్టి, యౌవనులు చెడు సహవాసానికి దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! (1 కొరింథీయులు 15:33) యాకోబు కుమార్తె దీనా యెహోవాను ఆరాధించని వారితో సహవాసం చేసింది, అది చాలా ఇబ్బందులకు దారితీసింది. (ఆదికాండము 34:1, 2) కుటుంబ సభ్యుల్లో ఒకరు లైంగిక దుర్నీతికి పాల్పడడం ఆ కుటుంబాన్ని ఎంత గాయపరుస్తుందో ఆలోచించండి!—సామెతలు 17:21, 25.

కుటుంబ సంతోషానికి కీలకం

20. సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి, కుటుంబంలోని ప్రతీ సభ్యుడు ఏమి చేయాలి?

20 బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకున్నప్పుడు కుటుంబ సమస్యలతో వ్యవహరించడం సులభంగా ఉంటుంది. నిజానికి, అలాంటి ఉపదేశాన్ని అన్వయించుకోవడం కుటుంబ సంతోషానికి కీలకం. కాబట్టి భర్తలారా, మీ భార్యలను ప్రేమిస్తూ, యేసు సంఘాన్ని చూసిన విధంగానే వారిని చూసుకోండి. భార్యలారా, మీ భర్తల శిరసత్వానికి లోబడి ఉంటూ సామెతలు 31:10-31⁠లో వర్ణించబడిన సమర్థురాలైన భార్య మాదిరిని అనుసరించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి. (సామెతలు 22:6) తండ్రులారా, ‘మీ ఇంటివారిని బాగుగా ఏలేవారిగా ఉండండి.’ (1 తిమోతి 3:4, 5; 5:8) పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. (కొలొస్సయులు 3:20) కుటుంబంలో ఎవరూ పరిపూర్ణులు కాదు, ఎందుకంటే అందరూ తప్పులు చేస్తారు. కాబట్టి ఒకరినొకరు క్షమాపణ అడుగుతూ, వినయంగా ఉండండి.

21. భవిష్యత్తులో ఎలాంటి అద్భుతమైన ఉత్తరాపేక్షలు ఉన్నాయి, ఇప్పుడు సంతోషభరిత కుటుంబ జీవితాన్ని మనమెలా ఆస్వాదించవచ్చు?

21 నిజంగా, కుటుంబ జీవితానికి సంబంధించి బైబిల్లో విలువైన హితవు, ఉపదేశాల విస్తారమైన సంపద ఉంది. అంతేకాక, అది దేవుని నూతనలోకం గురించి, యెహోవాను ఆరాధించే సంతోషభరిత ప్రజలతో నింపబడే భూపరదైసు గురించి కూడా మనకు బోధిస్తోంది. (ప్రకటన 21:3, 4) భవిష్యత్తులో ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షలు ఉన్నాయో కదా! ఇప్పుడు కూడా దేవుని వాక్యమైన బైబిల్లోవున్న ఆయన ఉపదేశాలను అన్వయించుకుంటూ సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

a పిల్లలను రక్షించడానికి కావలసిన సహాయం యెహోవాసాక్షులు ప్రచురించిన గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకంలో 32వ అధ్యాయంలో లభిస్తుంది.

b తల్లి లేదా తండ్రి దేవుని నియమాన్ని ఉల్లంఘించమని చెప్పినప్పుడు మాత్రమే, పిల్లవాడు ఆ మాట వినకపోవడం సరైనదిగా ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 5:29.