కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పదహారవ అధ్యాయం

సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడండి

సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడండి
  • ప్రతిమలను ఉపయోగించడం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

  • మత సంబంధ సెలవుదినాలను క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు?

  • ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా మీ నమ్మకాలను మీరు వారికి ఎలా వివరించవచ్చు?

1, 2. అబద్ధమతాన్ని విడిచిపెట్టిన తర్వాత మిమ్మల్ని మీరు ఏమని ప్రశ్నించుకోవాలి, ఇది ప్రాముఖ్యమని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

 మీ చుట్టుపక్కల ప్రాంతమంతా కాలుష్యానికి గురైనట్లు మీకు తెలిసిందే అనుకుందాం. ఎవరో మీ పరిసర ప్రాంతాల్లో విషపూరిత వ్యర్థ పదార్థాలను రహస్యంగా వేస్తున్నారు, పరిస్థితి ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అలాంటి సందర్భంలో మీరేమి చేస్తారు? మీకు వీలైతే వెంటనే అక్కడనుండి దూరంగా వెళ్లిపోతారు. అయితే అలా వెళ్లిపోయిన తర్వాత కూడా ‘నేను విష ప్రభావానికి గురయ్యానా?’ అనే సందేహం మీకు కలుగుతూనే ఉంటుంది.

2 అబద్ధమతానికి సంబంధించి అలాంటి పరిస్థితే కనబడుతోంది. అలాంటి ఆరాధన అపరిశుద్ధ బోధలతో, అభ్యాసాలతో కలుషితమైందని బైబిలు బోధిస్తోంది. (2 కొరింథీయులు 6:18) కాబట్టి మీరు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన ‘మహా బబులోనును’ విడిచి బయటకు రావడం ప్రాముఖ్యం. (ప్రకటన 18:2, 4) మీరలా బయటకు వచ్చారా? అలా బయటకు వచ్చివుంటే, మిమ్మల్ని అభినందించవలసిందే. అయితే అబద్ధమతం నుండి బయటకు రావడం మాత్రమే సరిపోదు. ఆ తర్వాత కూడా ‘అబద్ధ ఆరాధనకు సంబంధించిన ఛాయలు ఏమైనా నాలో ఇంకా మిగిలి ఉన్నాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

ప్రతిమలు, పూర్వీకుల ఆరాధన

3. (ఎ) ప్రతిమలను ఉపయోగించడం గురించి బైబిలు ఏమి చెబుతోంది, దేవుని దృక్కోణాన్ని అంగీకరించడం కొందరికి ఎందుకు కష్టంగా ఉండవచ్చు? (బి) మీ సొంత వస్తువుల్లో అబద్ధ ఆరాధనకు సంబంధించిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఏమి చేయాలి?

3 కొందరి ఇళ్లలో చాలా సంవత్సరాలుగా ప్రతిమలు లేదా పూజా మందిరాలు ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఉన్నాయా? అలాగైతే అలాంటి దృశ్య సహాయకాలు లేకుండా దేవుణ్ణి ప్రార్థించడం వింతగా లేదా తప్పుగా ఉన్నట్లు మీరు భావించవచ్చు. వీటిలో కొన్నింటితో మీకు అవినాభావ సంబంధమున్నట్లు కూడా మీకు అనిపించవచ్చు. అయితే తనను ఎలా ఆరాధించాలో చెప్పవలసిన వ్యక్తి దేవుడే, కాబట్టి మనం ప్రతిమలను ఉపయోగించాలని ఆయన కోరడం లేదని బైబిలు బోధిస్తోంది. (నిర్గమకాండము 20:4, 5 చదవండి; కీర్తన 115:4-8; యెషయా 42:8; 1 యోహాను 5:21) కాబట్టి మీ సొంత వస్తువుల్లో అబద్ధ ఆరాధనకు సంబంధించినవి ఏవైనా ఉంటే, వాటిని ధ్వంసం చేయడం ద్వారా మీరు సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడవచ్చు. స్పష్టంగా, అవి “హేయము” అని యెహోవా దృష్టిస్తున్నట్లే, మీరు కూడా దృష్టించండి.—ద్వితీయోపదేశకాండము 27:15.

4. (ఎ) పూర్వీకుల ఆరాధన వ్యర్థం అని మనకు ఎలా తెలుసు? (బి) అభిచార సంబంధమైన దేనిలోనూ భాగం వహించకుండా యెహోవా తన ప్రజలను ఎందుకు నిషేధించాడు?

4 పూర్వీకుల ఆరాధన కూడా చాలా మతాల్లో ఉంది. చనిపోయినవారు అదృశ్య జగత్తులో ఉన్నారని, జీవిస్తున్న వారికి మేలు గానీ హాని గానీ చేయగలరని సత్యం నేర్చుకోవడానికి ముందు కొందరు నమ్మారు. మరణించిన మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి మీరు బహుశా చాలా ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఈ పుస్తకంలోని 6వ అధ్యాయంలో మీరు తెలుసుకున్నట్లుగా, చనిపోయినవారు ఎక్కడా ఉనికిలో ఉండరు. కాబట్టి వారితో సంభాషించడానికి ప్రయత్నించడం వ్యర్థం. చనిపోయినవారినుండి వచ్చినట్లు అనిపించే ఎలాంటి సందేశమైనా నిజానికి దయ్యాల సంబంధమైనదే. ఆ కారణంగానే, చనిపోయినవారితో మాట్లాడకూడదని లేదా అభిచార సంబంధమైన దేనిలోనూ భాగం వహించకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు.ద్వితీయోపదేశకాండము 18:10-12 చదవండి.

5. మీ గత ఆరాధనా విధానంలో ప్రతిమలను ఉపయోగించడం గానీ, పూర్వీకులను ఆరాధించడం గానీ ఉంటే మీరు ఏమి చేయవచ్చు?

5 మీ గత ఆరాధనా విధానంలో ప్రతిమలను ఉపయోగించడం లేదా పూర్వీకులను ఆరాధించడం భాగంగా ఉంటే, మీరేమి చేయవచ్చు? వీటిని దేవుడు ఎలా దృష్టిస్తాడో మీకు వివరించే బైబిలు భాగాలను చదివి ధ్యానించండి. సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడాలనే మీ కోరిక గురించి ప్రతీదినం యెహోవాకు ప్రార్థిస్తూ, ఆయన దృష్టించినట్లే దృష్టించేందుకు సహాయం చేయమని వేడుకోండి.—యెషయా 55:9.

తొలి క్రైస్తవులు క్రిస్మస్‌ను ఆచరించలేదు

6, 7. (ఎ) క్రిస్మస్‌ ఆచరణకు దేనితో సంబంధం ఉంది, యేసు మొదటి శతాబ్దపు అనుచరులు దానిని ఆచరించారా? (బి) యేసు శిష్యులు భూమ్మీదున్న కాలంలో జన్మదిన వేడుకలు వేటితో ముడిపెట్టబడ్డాయి?

6 జనసమ్మతమైన మత సంబంధ సెలవుదినాలు ఒక వ్యక్తి ఆరాధనను కలుషితం చేయగలవు. ఉదాహరణకు, క్రిస్మస్‌నే తీసుకోండి. తమది క్రైస్తవ మతమని చెప్పుకునే దాదాపు అన్ని మతాలూ క్రిస్మస్‌ను యేసుక్రీస్తు జన్మదినంగా ఆచరిస్తూ, దానిని వేడుకగా జరుపుకుంటున్నాయి. అయితే మొదటి శతాబ్దపు యేసు శిష్యులు అలాంటి సెలవుదినాన్ని ఆచరించారని తెలిపే ఎలాంటి ఆధారమూ లేదు. సేక్రెడ్‌ ఆరిజిన్స్‌ ఆఫ్‌ ప్రొఫౌండ్‌ థింగ్స్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “క్రీస్తు మరణించిన రెండు శతాబ్దాల వరకు, యేసు ఎప్పుడు పుట్టాడు అనేది ఎవరికీ తెలియదు, కొద్దిమంది మాత్రమే దాని విషయంలో ఆసక్తి చూపారు.”

7 ఒకవేళ యేసు శిష్యులకు ఆయన పుట్టిన తేదీ ఖచ్చితంగా తెలిసినా వారు దానిని ఆచరించే వారుకాదు. ఎందుకు? ఎందుకంటే, ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతున్న ప్రకారం, తొలి క్రైస్తవులు “జన్మదిన వేడుక జరుపుకోవడాన్ని అన్యమతానికి సంబంధించినదిగా పరిగణించారు.” బైబిల్లో కేవలం ఇద్దరు మాత్రమే జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు కనబడుతుంది, వారుకూడా యెహోవాను ఆరాధించని పరిపాలకులే. (ఆదికాండము 40:20; మార్కు 6:21) జన్మదిన వేడుకలు అన్య దేవతల గౌరవార్థం కూడా ఆచరించేవారు. ఉదాహరణకు, మే 24న రోమన్లు డయానా దేవత జన్మదినాన్ని ఆచరించేవారు. ఆ మరుసటి రోజు వారు తమ సూర్య భగవానుడైన అపొల్లొ జన్మదినాన్ని ఆచరించేవారు. కాబట్టి, జన్మదిన వేడుకలు అన్యమత సంబంధమైనవే తప్ప క్రైస్తవులకు వాటితో సంబంధమే లేదు.

8. జన్మదిన వేడుకలకు, మూఢనమ్మకానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.

8 మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసు జన్మదినాన్ని ఆచరించి ఉండరని చెప్పడానికి మరో కారణం ఉంది. జన్మదిన ఆచరణలు మూఢనమ్మకాలతో ముడిపడి ఉన్నాయని బహుశా వారికి తెలిసే ఉంటుంది. ఉదాహరణకు, ప్రతీ వ్యక్తి జనన సమయంలో ఒక ఆత్మ వచ్చి అది ఆ వ్యక్తిని జీవితాంతం కాపాడుతుందని ప్రాచీనకాల గ్రీకులు, రోమన్లు చాలామంది నమ్మేవారు. “ఒక వ్యక్తి ఏ దేవత జన్మదినాన పుడతాడో ఆ దేవతతో ఈ ఆత్మకు నిగూఢ సంబంధం ఉంటుంది” అని ద లోర్‌ ఆఫ్‌ బర్త్‌డేస్‌ అనే పుస్తకం చెబుతోంది. యేసును మూఢనమ్మకంతో ముడిపెట్టే ఎలాంటి ఆచారమైనా యెహోవాకు ఏ మాత్రం సంతోషం కలిగించదు. (యెషయా 65:11, 12) అలాంటప్పుడు, క్రిస్మస్‌ను అనేకులు ఎందుకు ఆచరిస్తారు?

క్రిస్మస్‌ పుట్టుక

9. యేసు జన్మదినంగా డిసెంబరు 25 ఎలా ఎంచుకోబడింది?

9 యేసు భూమ్మీద జీవించిన చాలా శతాబ్దాల తర్వాతే ప్రజలు డిసెంబరు 25ను ఆయన జన్మదినంగా ఆచరించడం ఆరంభించారు. అయితే యేసు పుట్టిన తేదీ అది కాదు, ఎందుకంటే ఆయన అక్టోబరులో జన్మించాడని స్పష్టమవుతోంది. a అలాంటప్పుడు, డిసెంబరు 25ను ఎందుకు ఎంచుకున్నారు? ఆ తర్వాతి కాలాల్లో క్రైస్తవులని చెప్పుకున్నవారు “‘అజేయుడైన సూర్యుని పుట్టుకకు’ సంబంధించిన అన్యమత రోమా పండుగకు ఆ తేదీని జతచేయాలని కోరుకున్నారు.” (ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా) శీతాకాలంలో, సూర్యుడు బలహీనంగా ఉన్నట్లు కనబడినప్పుడు, వెచ్చని వెలుగిచ్చే సూర్యుడు సుదూర తీరాల నుండి తిరిగిరావాలని అన్యులు పండుగలు చేసేవారు. డిసెంబరు 25 సూర్యుడు తిరిగిరావడం ఆరంభమైన రోజు అని తలంచారు. అన్యులను మతమార్పిడి చేసే ప్రయత్నంలో మతనాయకులు ఈ పండుగను ఎంచుకొని అది “క్రైస్తవులదే” అని భావింపజేసేందుకు ప్రయత్నించారు. b

10. గతకాలాల్లో కొందరు క్రిస్మస్‌ను ఎందుకు ఆచరించలేదు?

10 క్రిస్మస్‌ అన్యమతం నుండే పుట్టిందనే విషయం చాలాకాలం ముందే గుర్తించబడింది. క్రిస్మస్‌కు ఉన్న లేఖనవిరుద్ధ ఆరంభాల కారణంగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండులో, అమెరికా వలసరాజ్యాల్లో అది నిషేధించబడింది. క్రిస్మస్‌ రోజున ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటిదగ్గర ఉండేవారు జరిమానా కట్టవలసి వచ్చేది. అయితే ఆ తర్వాత కొద్దికాలానికే పాత ఆచారాలు మళ్లీ వాడుకలోకి రావడమే కాక, వాటికి మరికొన్ని కొత్తవి కూడా చేర్చబడ్డాయి. క్రిస్మస్‌ మళ్లీ ఒకసారి అతి ప్రాముఖ్యమైన మతసంబంధ సెలవుదినంగా మారడమే కాక, అనేక దేశాల్లో ప్రజలు దాన్ని ఇప్పటికీ ఒక పెద్ద మత సంబంధ సెలవుదినంగానే పరిగణిస్తున్నారు. అయితే, దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునేవారు, అబద్ధమతంతో క్రిస్మస్‌కు ఉన్న సంబంధాల కారణంగా క్రిస్మస్‌ను గానీ అన్య ఆరాధనకు ముడిపడి ఉన్న వేరే ఏ సెలవుదినాలను గానీ ఆచరించరు. c

సెలవుదినాల ఆరంభాలు నిజంగా ప్రాముఖ్యమా?

11. కొందరు సెలవుదినాలను ఎందుకు ఆచరిస్తారు, మనం శ్రద్ధ వహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి?

11 క్రిస్మస్‌ వంటి మత సంబంధ సెలవుదినాలు అన్యమతం నుండి వచ్చాయని కొందరు అంగీకరించినా, వాటిని ఆచరించడం తప్పు కాదని భావిస్తారు. వాస్తవానికి చాలామంది సెలవుదినాలను ఆచరించేటప్పుడు అబద్ధ ఆరాధన గురించే ఆలోచించరు. ఈ సందర్భాలు కుటుంబాలు సన్నిహితమవడానికి కూడా అవకాశాలు కల్పిస్తాయి. మీరుకూడా అలాగే భావిస్తున్నారా? అలాగైతే, సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడడాన్ని కష్టభరితం చేసేది బహుశా అబద్ధమతాన్ని ప్రేమించడం కాదుగానీ, కుటుంబ సభ్యులపట్ల ఉన్న ప్రేమే కావచ్చు. కుటుంబానికే కర్త అయిన యెహోవా మీరు మీ బంధువులతో మంచి సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడని నమ్మకంతో ఉండండి. (ఎఫెసీయులు 3:14, 15) అయితే అలాంటి బంధాలను దేవుని ఆమోదం ఉన్న మార్గాల్లో మీరు మరింత బలోపేతం చేసుకోవచ్చు. మనం శ్రద్ధ వహించాల్సిన ముఖ్య విషయం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు . . . నడుచుకొనుడి.”—ఎఫెసీయులు 5:10.

మీరు మురికి కాలువలో ఉన్న చాక్లెట్‌ తీసుకొని తింటారా?

12. అన్యమతాల నుండి వచ్చిన ఆచారాలకు, ఆచరణలకు మనం ఎందుకు దూరంగా ఉండాలో సోదాహరణంగా చెప్పండి.

12 మత సంబంధ సెలవుదినాల పుట్టుకలకూ నేడు వాటిని ఆచరించడానికీ సంబంధమే లేదని మీరు భావించవచ్చు. అవి ఎక్కడినుండి వచ్చాయనేది నిజంగా ప్రాముఖ్యమా? అవును ప్రాముఖ్యమే! ఉదాహరణకు, మీరు ఒక మురికి కాలువలో ఒక చాక్లెట్‌ చూశారనుకుందాం. మీరు ఆ చాక్లెట్‌ తీసుకొని తింటారా? ఎంతమాత్రం తినరు! ఆ చాక్లెట్‌ అపరిశుభ్రమైనది. ఆ చాక్లెట్‌లాగే మత సంబంధ సెలవుదినాలు కోరదగినవిగా అనిపించవచ్చు, కానీ అవి అపవిత్ర మూలాల నుండి వచ్చాయి. మనం సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడాలంటే యెషయా ప్రవక్తకు ఉన్నటువంటి దృక్కోణంతో ఉండాలి. ఆయన సత్యారాధకులకు ఇలా చెప్పాడు: “అపవిత్రమైన దేనిని ముట్టకుడి.”—యెషయా 52:11.

ఇతరులతో వ్యవహరించేటప్పుడు వివేచన ఉపయోగించడం

13. మత సంబంధ సెలవుదినాలను పాటించనప్పుడు మీకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు?

13 మీరు మత సంబంధ సెలవుదినాలు పాటించకూడదని నిర్ణయించుకున్నప్పుడు మీకు సవాళ్లు ఎదురుకావచ్చు. ఉదాహరణకు, మీ ఉద్యోగస్థలంలో ఒకానొక సెలవుదిన కార్యక్రమంలో మీరు పాలుపంచుకోకపోవడానికి కారణం ఏమిటా అని సహోద్యోగులు అనుకుంటుండవచ్చు. మీకు ఒకవేళ క్రిస్మస్‌ బహుమానం ఇస్తే అప్పుడెలా? దానిని అంగీకరించడం తప్పా? మీ జీవిత భాగస్వామి మీ నమ్మకాలతో ఏకీభవించకపోతే అప్పుడెలా? మత సంబంధ సెలవుదినాలను ఆచరించని కారణంగా తామేదో పోగొట్టుకుంటున్నట్లు మీ పిల్లలు భావించకుండా ఉండడానికి మీరేమి చేయవచ్చు?

14, 15. మీకు ఎవరైనా సెలవుదిన శుభాకాంక్షలు చెబితే లేదా మీకు ఎవరైనా బహుమానం ఇవ్వాలనుకుంటే మీరు ఏమి చేయవచ్చు?

14 ప్రతీ పరిస్థితితో ఎలా వ్యవహరించాలో గ్రహించడానికి వివేచన అవసరం. మామూలుగా ఎవరైనా పండుగ శుభాకాంక్షలు చెప్పినప్పుడు, ఆ శ్రేయోభిలాషికి కేవలం కృతజ్ఞతలు చెప్పవచ్చు. కానీ మీరు తరచుగా కలుసుకునే వ్యక్తి లేదా మీతో కలిసి పనిచేసే వ్యక్తి అయితే అప్పుడెలా? అలాంటప్పుడు, మీరు విషయాన్ని కాస్త వివరంగా చెప్పవలసి ఉంటుంది. అన్ని సందర్భాల్లోను ఔచిత్యంతో మెలగండి. బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) ఇతరులతో అమర్యాదగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడండి. మీ దృక్పథం ఏమిటో నేర్పుగా వివరించండి. బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడానికి, సమకూడడానికి మీరు వ్యతిరేకం కాదనీ, వేరే సమయాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి ఇష్టపడతారనీ స్పష్టంగా వివరించండి.

15 మీకు ఎవరైనా బహుమానం ఇవ్వాలనుకుంటే అప్పుడెలా? దానిని అంగీకరించడం ఎక్కువగా పరిస్థితుల మీదే ఆధారపడి ఉంటుంది. బహుమానం ఇచ్చే వ్యక్తి, “మీరు పండుగ చేసుకోరని నాకు తెలుసు. అయినా మీరు దీనిని తీసుకోవాలి” అని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితిలో ఆ బహుమతిని అంగీకరించడం సెలవుదినాన్ని పాటించడం క్రిందకు రాదని మీరు దానిని స్వీకరించడానికి నిర్ణయించుకోవచ్చు. కానీ ఆ బహుమానం ఇచ్చే వ్యక్తికి మీ నమ్మకాలు తెలియకపోతే, మీరు ఆ పండుగను ఆచరించడం లేదని వివరించవచ్చు. ఇలా వివరించడం మీరు ఎందుకు ఆ బహుమానాన్ని అంగీకరిస్తున్నారో, ఆ సందర్భంలో మీరు కూడా ఒక బహుమానం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడానికి సహాయం చేస్తుంది. మరోవైపున, మీరు మీ నమ్మకాలకు కట్టుబడి ఉండరనో లేక మీరు వస్తుపరమైన ప్రయోజనాల కోసం రాజీపడతారనో చూపించడానికే మీకు బహుమానం ఇస్తే దానిని అంగీకరించకుండా ఉండడమే జ్ఞానయుక్తం.

కుటుంబ సభ్యుల మాటేమిటి?

16. మత సంబంధ పండుగలకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు మీరు ఔచిత్యంతో ఎలా ఉండవచ్చు?

16 కుటుంబ సభ్యులు మీ నమ్మకాలతో ఏకీభవించకపోతే అప్పుడెలా? ఇక్కడ కూడా ఔచిత్యం అవసరం. మీ బంధువులు పాటించే ప్రతీ ఆచారం గురించి లేదా ఆచరణ గురించి వాదించాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు మీ ఉద్దేశాల హక్కును వారు గౌరవించాలని ఎలా కోరుకుంటారో, వారి దృక్కోణాల హక్కును కూడా మీరు అలాగే గౌరవించండి. (మత్తయి 7:12 చదవండి.) మత సంబంధ సెలవుదినాన్ని పాటింపజేసే క్రియలకు దూరంగా ఉండండి. అయితే ఆచరణకు సంబంధంలేని విషయాల్లో సహేతుకంగా ఉండండి. అవును, ఎల్లప్పుడూ మీ మనస్సాక్షికి బాధ కలగని విధంగా ప్రవర్తించండి.1 తిమోతి 1:18, 19 చదవండి.

17. ఇతరులు మత సంబంధ సెలవులను ఆచరించడం చూసి, మీ పిల్లలు తామేదో పోగొట్టుకుంటున్నామని భావించకుండా ఉండడానికి మీరు వారికి ఎలా సహాయం చేయవచ్చు?

17 లేఖన విరుద్ధ సెలవులను ఆచరించని కారణంగా తామేదో పోగొట్టుకుంటున్నట్లు మీ పిల్లలు భావించకుండా ఉండేందుకు మీరేమి చేయవచ్చు? అది సంవత్సరంలోని మిగతా సమయాల్లో మీరేమి చేస్తారనే దానిమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇతర సమయాల్లో బహుమానాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంటారు. మీ పిల్లలకు మీరు ఇవ్వగల ఒక ఉత్తమ బహుమానం వారితో మీరు గడిపే సమయం, వారిపట్ల మీరు చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ.

సత్యారాధనను అభ్యసించండి

సత్యారాధనను అభ్యసించడం నిజమైన సంతోషాన్ని ఇస్తుంది

18. సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడడానికి క్రైస్తవ కూటాలకు హాజరవడం మీకెలా సహాయం చేయవచ్చు?

18 దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు అబద్ధ ఆరాధనను విసర్జించి, సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడాలి. దీనిలో ఏమి ఇమిడివుంది? బైబిలు ఇలా చెబుతోంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) దేవుడు ఆమోదించిన రీతిలో ఆయనను ఆరాధించడానికి క్రైస్తవ కూటాలు సంతోషభరిత సందర్భాలుగా ఉంటాయి. (కీర్తన 22:22; 122:1) అలాంటి కూటాల్లో విశ్వాసులైన క్రైస్తవులు ‘ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణ’ పొందుతారు.—రోమీయులు 1:11.

19. బైబిలు నుండి మీరు నేర్చుకున్న సంగతుల గురించి ఇతరులతో మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం?

19 సత్యారాధన పక్షాన మీరు స్థిరంగా నిలబడడానికి మరో మార్గమేమిటంటే, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మూలంగా మీరు నేర్చుకున్న సంగతుల గురించి ఇతరులతో మాట్లాడాలి. నేడు లోకంలో ఉన్న దుష్టత్వాన్నిబట్టి చాలామంది నిజంగా “మూల్గులిడుచు ప్రలాపించుచున్నా[రు].” (యెహెజ్కేలు 9:4) అలా ప్రలాపిస్తున్న కొందరు బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. భవిష్యత్తు విషయంలో మీకున్న బైబిలు ఆధారిత నిరీక్షణ గురించి వారితో ఎందుకు మాట్లాడకూడదు? మీరు నిజ క్రైస్తవులతో సహవసిస్తూ, మీరు నేర్చుకున్న అద్భుతమైన బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకుంటుండగా, అబద్ధ ఆరాధనా ఆచారాలకు సంబంధించిన కోరిక మీ హృదయంలో ఏ మాత్రం ఉన్నా అది క్రమేణా అంతరించి పోవడాన్ని మీరు చూస్తారు. సత్యారాధనను మీరు హత్తుకున్నప్పుడు, మీరు చాలా సంతోషంగా ఉంటూ అనేక ఆశీర్వాదాలను తప్పకుండా అనుభవిస్తారు.—మలాకీ 3:10.

b డిసెంబరు 25ను ఎంచుకోవడంలో శాటర్నేలియా కూడా కీలకపాత్ర వహించింది. రోమా వ్యవసాయ దేవత గౌరవార్థం జరుపుకునే ఈ పండుగ డిసెంబరు 17-24 వరకు జరిగేది. శాటర్నేలియా పండుగ సమయంలో విందులు వినోదాలు, బహుమతులు ఇచ్చుకోవడం ఉండేది.

c ఇతర జనసమ్మతమైన మత సంబంధ సెలవుదినాలను క్రైస్తవులు ఎలా దృష్టిస్తారనే చర్చ కోసం, అనుబంధంలోని 222-3 పేజీలను చూడండి.