కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పంతొమ్మిదవ అధ్యాయం

దేవుని ప్రేమలో నిలిచి ఉండండి

దేవుని ప్రేమలో నిలిచి ఉండండి
  • దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి?

  • మనం దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండగలం?

  • యెహోవా తన ప్రేమలో నిలిచి ఉండేవారికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు?

మీరు ఈ కల్లోలభరిత కాలాల్లో యెహోవాను మీ ఆశ్రయదుర్గముగా చేసుకుంటారా?

1, 2. నేడు మనం భద్రతనిచ్చే ఆశ్రయాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?

 మీరు తుఫాను వచ్చేలా ఉన్న ఒకరోజున రోడ్డుమీద నడిచివెళ్తున్నట్లుగా ఊహించుకోండి. ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకున్నాయి. మెరుపులు, ఉరుములతోపాటు కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. మీరు తలదాచుకునే స్థలంకోసం చూస్తూ వడి వడిగా నడుస్తున్నారు. అప్పుడు మీకు రోడ్డు ప్రక్కనే ఒక ఇల్లు కనిపించింది. అది చాలా దృఢంగా, తడి లేకుండా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. అలాంటి సురక్షితమైన స్థలాన్ని మీరు ఎంత విలువైనదిగా ఎంచుతారో కదా!

2 మనం ఇప్పుడు తుఫానులాంటి కల్లోలభరిత కాలాల్లోనే జీవిస్తున్నాం. లోక పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. అయితే మనకు శాశ్వత హాని కలగకుండా మనలను భద్రంగా ఉంచగల ఒక సురక్షిత స్థలం, ఆశ్రయం ఒకటి ఉంది. ఏమిటది? బైబిలు ఏమి బోధిస్తుందో గమనించండి: “ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.”—కీర్తన 91:2.

3. యెహోవాను మన ఆశ్రయంగా ఎలా చేసుకోవచ్చు?

3 ఒక్కసారి ఊహించండి! ఈ విశ్వ సృష్టికర్త, సర్వాధిపతి అయిన యెహోవా మనకు రక్షణనిచ్చే ఆశ్రయంగా ఉండగలడు. మనలను వ్యతిరేకించేది ఎవరైనాసరే, ఏదైనాసరే ఆయన అంతకన్నా మరెంతో శక్తిగలవాడు కాబట్టి ఆయన మనలను సురక్షితంగా ఉంచగలడు. మనకు హాని జరిగినా, యెహోవా ఆ చెడు ప్రభావాలన్నింటినీ తొలగించగలడు. మరి మనం యెహోవాను మన ఆశ్రయంగా ఎలా చేసుకోవచ్చు? మనం ఆయనమీద నమ్మకం ఉంచాలి. అంతేకాక, దేవుని వాక్యం మనకిలా ఉద్బోధిస్తోంది: “దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20-21) అవును, మన పరలోకపు తండ్రితో ప్రేమపూర్వక బంధాన్ని కాపాడుకుంటూ మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అప్పుడే ఆయన మన ఆశ్రయమని ధైర్యంగా ఉండవచ్చు. అయితే అలాంటి బంధాన్ని మనం ఎలా ఏర్పరచుకోవచ్చు?

దేవుని ప్రేమను గుర్తించి, స్పందించండి

4, 5. యెహోవా మనపట్ల ప్రేమను వ్యక్తపరచిన విధానాల్లో కొన్ని ఏమిటి?

4 దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే, యెహోవా మనపట్ల తన ప్రేమను ఎలా చూపించాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం సహాయంతో మీరు నేర్చుకొన్న కొన్ని బైబిలు బోధల గురించి ఆలోచించండి. సృష్టికర్తగా యెహోవా మనకు ఈ భూమిని ఆనందకరమైన గృహంగా ఇచ్చాడు. ఆయన దానిలో ఆహారాన్ని, నీటిని, సహజ వనరులను, ఆకర్షణీయమైన జంతుజాలాలను సమృద్ధిగా ఉంచి, దాన్ని అందమైన పకృతి దృశ్యాలతో నింపాడు. బైబిలు గ్రంథకర్తగా దేవుడు మనకు తన పేరును, లక్షణాలను వెల్లడిచేశాడు. అంతేకాక, ఆయన తన ప్రియ కుమారుడైన యేసును భూమికి పంపించి, మనకోసం బాధపడి చనిపోవడానికి కూడా అనుమతించాడని ఆయన వాక్యం వెల్లడిస్తోంది. (యోహాను 3:16) ఆ బహుమానం మనకు ఎలాంటి ప్రయోజనాన్నిస్తుంది? అది మనకు అద్భుతమైన భావి నిరీక్షణనిస్తోంది.

5 మన భావి నిరీక్షణ దేవుడు చేసిన మరో ఏర్పాటుపై కూడా ఆధారపడి ఉంది. పరలోక ప్రభుత్వమైన మెస్సీయ రాజ్యాన్ని యెహోవా స్థాపించాడు. అది త్వరలోనే సమస్త బాధలను తొలగించి ఈ భూమిని పరదైసుగా మారుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి! అక్కడ మనం శాంతి సంతోషాలతో నిరంతరం జీవించవచ్చు. (కీర్తన 37:29) ఇప్పుడు మనం సాధ్యమైనంత శ్రేష్ఠమైన రీతిలో జీవించడానికి అవసరమైన మార్గనిర్దేశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆయనతో స్వేచ్ఛగా సంభాషించడానికి ప్రార్థనా వరాన్ని కూడా ఇచ్చాడు. మానవులందరిపట్ల, వ్యక్తిగతంగా మీపట్ల యెహోవా ప్రేమ చూపించిన విధానాల్లో ఇవి కొన్ని మాత్రమే.

6. యెహోవా మీపట్ల చూపించిన ప్రేమకు మీరు ఎలా స్పందించవచ్చు?

6 మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ‘యెహోవా ప్రేమకు నేను ఎలా స్పందిస్తాను?’ చాలామంది, “నేను కూడా తిరిగి యెహోవాను ప్రేమించాలి” అని చెబుతారు. మీరుకూడా అలాగే భావిస్తున్నారా? ఆజ్ఞలన్నింటిలోకి ఈ ఆజ్ఞ ప్రధానమైనదని యేసు అన్నాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మత్తయి 22:37) యెహోవా దేవుణ్ణి ప్రేమించడానికి మీకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే యెహోవాను మీ పూర్ణహృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో ప్రేమించడంలో, మీకు అలాంటి ప్రేమ అనే అనుభూతి ఉండడం మాత్రమే సరిపోతుందా?

7. దేవునిపట్ల కేవలం ప్రేమానుభూతిని కలిగి ఉండడం మాత్రమే సరిపోతుందా? వివరించండి.

7 బైబిలులో వర్ణించబడినట్లుగా, దేవునిపట్ల ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు. వాస్తవానికి, యెహోవాపట్ల ప్రేమానుభూతి కలిగివుండడం ప్రాముఖ్యమే అయినప్పటికీ, ఆ అనుభూతి ఆయనపట్ల నిజమైన ప్రేమకు ఆరంభం మాత్రమే. ఫలవంతమైన ఆపిల్‌ చెట్టు ఎదగాలంటే దానికి ఆపిల్‌ విత్తనం ముఖ్యం. అయితే మీకు ఒక ఆపిల్‌ పండు కావాలనుకోండి, అప్పుడు మీకు ఎవరైనా ఒక ఆపిల్‌ విత్తనం ఇస్తే సరిపోతుందా? సరిపోదు! అదేవిధంగా యెహోవా దేవునిపట్ల ప్రేమానుభూతి ఒక ఆరంభం మాత్రమే. బైబిలు ఇలా బోధిస్తోంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) దేవునిపట్ల మనం చూపించే ప్రేమ యథార్థమైనదిగా ఉండాలంటే, మనం మంచి ఫలాలు ఫలించాలి. దానిని క్రియల్లో చూపించాలి.మత్తయి 7:16-20 చదవండి.

8, 9. దేవునిపట్ల మన ప్రేమను, కృతజ్ఞతను మనమెలా వ్యక్తం చేయవచ్చు?

8 మనం దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయన సూత్రాలను అన్వయించుకున్నప్పుడు ఆయనపట్ల మనకున్న ప్రేమను చూపిస్తాం. అలా చేయడం కష్టమేమీ కాదు. యెహోవా నియమాలు భారమైనవి కాదు, బదులుగా అవి మనం మంచి, సంతోషభరితమైన, సంతృప్తికరమైన జీవితాలను అనుభవించేందుకు మనకు సహాయం చేయడానికి రూపొందించబడ్డాయి. (యెషయా 48:17, 18) యెహోవా ఇచ్చే మార్గనిర్దేశానికి అనుగుణంగా జీవించడం ద్వారా, మన పరలోకపు తండ్రి మనకోసం చేసిన వాటన్నింటిపట్ల మనకు నిజమైన కృతజ్ఞత ఉన్నట్లు చూపిస్తాం. అయితే అలాంటి కృతజ్ఞతను నేటి లోకంలో కొద్దిమంది మాత్రమే చూపించడం శోచనీయం. యేసు భూమ్మీద జీవించిన కాలంలోని కొందరిలా మనం కృతఘ్నులుగా ఉండాలని కోరుకోం. యేసు పదిమంది కుష్ఠ రోగులను బాగుచేశాడు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి ఆయన దగ్గరకు వచ్చాడు. (లూకా 17:12-17) మనం తప్పకుండా కృతజ్ఞత చూపించిన ఆ ఒక్కడిలాగే ఉండాలని కోరుకుంటాము గానీ కృతఘ్నులైన ఆ తొమ్మిది మందిలా ఉండాలని కోరుకోము!

9 అయితే మనం పాటించవలసిన యెహోవా ఆజ్ఞలు ఏమిటి? మనం ఈ పుస్తకంలో చాలా ఆజ్ఞలను చర్చించాం, అయితే వాటిలో కొన్నింటిని మనం పునఃసమీక్షిద్దాం. దేవుని ఆజ్ఞలు పాటించడం దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.

యెహోవాకు ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండండి

10. యెహోవా దేవుని గురించి తెలుసుకుంటూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో వివరించండి.

10 యెహోవాకు సన్నిహితమవడానికి ఆయన గురించి తెలుసుకోవడం ఒక ప్రాముఖ్యమైన చర్య. అది ఎన్నటికీ ఆపకూడని ప్రక్రియ. మీరు ఆరుబయట ఎముకలు కొరికే చలిలో మంట వేసుకుని చలి కాచుకుంటున్నట్లయితే, ఆ మంటలు తగ్గిపోయి ఆరిపోవడానికి అనుమతిస్తారా? అలా ఎన్నటికీ చేయరు! ఆ మంట ఇంకా అలాగే మండడానికి మీరు దానిలో కర్రలు వేస్తూ ఉంటారు. అలా చేయకపోతే మీ ప్రాణమే ప్రమాదంలో పడవచ్చు. అగ్నికి ఇంధనం తోడ్పడినట్లే “దేవుని గూర్చిన విజ్ఞానము” యెహోవాపట్ల మనకున్న ప్రేమను చల్లారకుండా ఉంచుతుంది.—సామెతలు 2:1-5.

అగ్నికి ఇంధనం అవసరమైనట్లే, యెహోవాపట్ల మీ ప్రేమ చల్లారిపోకుండా ఉండాలంటే ఇంధనం అవసరం

11. యేసు బోధ ఆయన అనుచరులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

11 యేసు తన అనుచరులు యెహోవాపట్ల, ఆయన అమూల్యమైన సత్యవాక్యంపట్ల తమకున్న ప్రేమ ఆరిపోకుండా, సజీవంగా ఉంచుకోవాలని కోరుకున్నాడు. యేసు తన పునరుత్థానం తర్వాత, తన విషయంలో నెరవేరిన హీబ్రూ లేఖనాల్లోని కొన్ని ప్రవచనాల గురించి తన శిష్యుల్లో ఇద్దరికి బోధించాడు. దాని ప్రభావం ఎలా ఉంది? వారు ఆ తర్వాత ఇలా అన్నారు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?”—లూకా 24:32.

12, 13. (ఎ) నేడు మానవాళిలోని అధికశాతం మందిలో దేవునిపట్ల, బైబిలుపట్ల ఉన్న ప్రేమకు ఏమి సంభవించింది? (బి) మన ప్రేమ చల్లారిపోకుండా ఎలా ఉంచుకోవచ్చు?

12 బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో మీరు మొదటిసారి తెలుసుకున్నప్పుడు, దేవునిపట్ల ప్రేమతో ఆనందంతో, ఆసక్తితో, మీ హృదయం రగులుకోవడం ఆరంభించలేదా? నిస్సందేహంగా మీరు అలాగే భావించి ఉంటారు. చాలామంది అలాగే భావించారు. అయితే ఇప్పుడు ఆ ప్రగాఢ ప్రేమను సజీవంగా కాపాడుకుంటూ, అది ఎదిగేందుకు తోడ్పడడం ఒక సవాలుగా ఉంది. నేటి ప్రపంచంలో ఉన్నటువంటి ధోరణిని అనుసరించాలని మనం కోరుకోం. యేసు ముందుగానే ఇలా చెప్పాడు: “అనేకుల ప్రేమ చల్లారును.” (మత్తయి 24:12) యెహోవాపట్ల, బైబిలు సత్యాలపట్ల మీ ప్రేమ చల్లారిపోకుండా మీరు ఎలా నివారించవచ్చు?

13 యెహోవా దేవుని గురించిన, యేసుక్రీస్తును గురించిన జ్ఞానం నిరంతరం సంపాదించుకుంటూ ఉండండి. (యోహాను 17:3) దేవుని వాక్యం నుండి మీరు తెలుసుకున్న విషయాలను ధ్యానిస్తూ లేదా లోతుగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఇది యెహోవా దేవుని గురించి నాకు ఏమి బోధిస్తోంది? నా పూర్ణహృదయంతో, మనస్సుతో, ఆత్మతో ఆయనను ప్రేమించడానికి అదనంగా ఇది నాకు ఎలాంటి కారణాన్నిస్తోంది?’ (1 తిమోతి 4:15 చదవండి.) అలాంటి ధ్యానం యెహోవాపట్ల మీ ప్రేమ చల్లారిపోకుండా ఉండడానికి సహాయం చేస్తుంది.

14. యెహోవాపట్ల మన ప్రేమను సజీవంగా ఉంచుకునేందుకు ప్రార్థన మనకు ఎలా సహాయం చేయగలదు?

14 యెహోవాపట్ల మనకున్న ప్రేమ ప్రజ్వరిల్లుతూ ఉండడానికి సహాయం చేసే మరో మార్గం క్రమంగా ప్రార్థించడం. (1 థెస్సలొనీకయులు 5:17) ఈ పుస్తకంలోని 17వ అధ్యాయంలో ప్రార్థన మనకు దేవుడిచ్చిన అమూల్యమైన బహుమానం అని తెలుసుకున్నాం. క్రమమైన, నిరాటంకమైన సంభాషణల ద్వారా మానవ సంబంధాలు వృద్ధి చెందినట్లే, యెహోవాకు మనం క్రమంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయనతో మన సంబంధం పటిష్ఠంగా, సజీవంగా ఉంటుంది. మన ప్రార్థనలు ఎన్నటికీ యాంత్రికంగా అంటే ఎలాంటి అనుభూతి లేదా భావం లేకుండా కేవలం పదాలను వల్లించినట్లు ఉండకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక పిల్లవాడు ప్రేమగల తన తండ్రితో మాట్లాడినట్లే మనమూ యెహోవాతో మాట్లాడాలి. అయితే మనం గౌరవపూర్వకంగా, స్వేచ్ఛగా, యథార్థంగా, హృదయపూర్వకంగా ప్రార్థించాలని కోరుకుంటాం. (కీర్తన 62:8) అవును, మన ఆరాధనలో వ్యక్తిగత బైబిలు అధ్యయనం, హృదయపూర్వక ప్రార్థన ముఖ్య విషయాలే కాక, దేవుని ప్రేమలో నిలిచి ఉండేందుకు కూడా అవి మనకు సహాయం చేస్తాయి.

మీ ఆరాధనలో ఆనందం పొందండి

15, 16. రాజ్య ప్రకటనా పనిని మనం సరైన రీతిలో ఒక ఆధిక్యతగా, ఐశ్వర్యంగా ఎందుకు దృష్టించవచ్చు?

15 వ్యక్తిగత బైబిలు అధ్యయనం, ప్రార్థన అనేవి మనం వ్యక్తిగతంగా చేసే ఆరాధనకు సంబంధించిన క్రియలు. అయితే మన ఆరాధనకు సంబంధించి మనం బహిరంగంగా చేసే పనిని అంటే మన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మీరు ఇప్పటికే కొన్ని బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకున్నారా? అయితే మీరు ఒక అద్భుతమైన ఆధిక్యతను చవిచూశారన్నమాటే. (లూకా 1:75) యెహోవా దేవుని గురించి మనం తెలుసుకున్న సత్యాలను ఇతరులతో పంచుకుంటున్నప్పుడు, నిజ క్రైస్తవులందరికీ ఇవ్వబడిన ఒక అతి ప్రాముఖ్యమైన నియామకాన్ని మనం నెరవేరుస్తున్నాం, అదేమిటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం.మత్తయి 24:14; 28:19, 20 చదవండి.

16 అపొస్తలుడైన పౌలు తన పరిచర్యను ఐశ్వర్యం అని పిలుస్తూ దానిని అమూల్యమైనదిగా పరిగణించాడు. (2 కొరింథీయులు 4:7) యెహోవా దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి ప్రజలతో మాట్లాడడం మీరు చేయగల అత్యుత్తమ కార్యం. అది ఎంతో ఉన్నతుడైన యజమానికి చేసే సేవ, దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన పరలోకపు తండ్రికి సన్నిహితులు కావడానికి యథార్థపరులకు సహాయం చేస్తూ, వారు నిత్యజీవ మార్గంలోకి వచ్చేందుకు సహాయం చేసిన వారవుతారు. ఇంతకు మించిన సంతృప్తిని వేరే ఏ పని ఇవ్వగలదు? అంతేకాక, యెహోవా గురించి ఆయన వాక్యం గురించి సాక్ష్యమివ్వడం మీ విశ్వాసాన్ని వృద్ధిచేసి, ఆయనపట్ల మీ ప్రేమను బలపరుస్తుంది. యెహోవా మీ ప్రయత్నాలను అమూల్యమైనవిగా పరిగణిస్తాడు. (హెబ్రీయులు 6:10) అలాంటి సేవలో నిమగ్నమై ఉండడం దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది.1 కొరింథీయులు 15:58 చదవండి.

17. క్రైస్తవ పరిచర్య నేడు ఎందుకు అత్యవసరం?

17 రాజ్య ప్రకటనా పని చేయడం అత్యవసరమని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. బైబిలు ఇలా చెబుతోంది: “వాక్యమును [‘అత్యవసర భావంతో,’ NW] ప్రకటించుము, ప్రయాసపడుము.” (2 తిమోతి 4:2) అలా ప్రకటించడం నేడు ఎందుకు అత్యవసరం? దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:14) అవును, ఈ విధానమంతటికీ యెహోవా అంతం తీసుకొచ్చే సమయం శీఘ్రంగా సమీపిస్తోంది. ప్రజలకు హెచ్చరిక చేయాలి! యెహోవాను తమ సర్వాధిపతిగా అంగీకరించవలసిన సమయం ఇదే అని వారు తెలుసుకోవాలి. అంతం “జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.

18. నిజ క్రైస్తవులతోపాటు యెహోవాను బహిరంగంగా ఎందుకు ఆరాధించాలి?

18 నిజ క్రైస్తవులతో సహవసిస్తూ మనం యెహోవాను బహిరంగంగా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24-25) క్రైస్తవ కూటాల్లో మనం తోటి విశ్వాసులతో సమావేశమైనప్పుడు, మన ప్రియమైన దేవుణ్ణి స్తుతించే, ఆరాధించే అద్భుతమైన అవకాశం మనకు లభిస్తుంది. అంతేకాక మనం ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ బలపరచుకుంటాం.

19. క్రైస్తవ సంఘంలో ప్రేమ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఎలా కృషి చేయవచ్చు?

19 యెహోవా ఆరాధకులతో మనం సహవసిస్తుంటే, సంఘంలో మన ప్రేమానుబంధాలు, స్నేహబంధాలు బలపడతాయి. యెహోవా మనలో మంచిని చూసినట్లే, మనమూ పరస్పరం మంచిని చూడడం ప్రాముఖ్యం. మీ తోటి విశ్వాసుల నుండి పరిపూర్ణతను ఆశించకండి. ఆధ్యాత్మిక అభివృద్ధిలో అందరూ వివిధ స్థాయిల్లో ఉన్నారనీ అందరం తప్పులు చేస్తామనీ గుర్తుంచుకోవాలి. (కొలొస్సయులు 3:13 చదవండి.) యెహోవాను ప్రగాఢంగా ప్రేమించేవారితో సన్నిహిత స్నేహాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు, మీరు కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు కనుగొంటారు. అవును, మీ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించడం దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. తనను నమ్మకంగా సేవిస్తూ తన ప్రేమలో నిలిచి ఉన్నవారికి యెహోవా ఎలాంటి ప్రతిఫలమిస్తాడు?

“వాస్తవమైన జీవము” పొందడానికి ప్రయత్నించండి

20, 21. “వాస్తవమైన జీవము” అంటే ఏమిటి, అది ఎందుకు ఒక అద్భుతమైన నిరీక్షణ?

20 యెహోవా తన నమ్మకమైన సేవకులకు జీవాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు, అయితే అది ఎలాంటి జీవం? మీరు ఇప్పుడు నిజంగా జీవిస్తున్నారా? మనలో చాలామందిమి అవును అనే జవాబిస్తాం. ఎంతైనా మనం శ్వాసిస్తున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం. కాబట్టి మనం జీవిస్తున్నట్లే. సంతోషంగా ఉన్నప్పుడు “జీవించడం అంటే నిజంగా ఇదే” అని కూడా మనం అంటుంటాము. అయితే ఒక ప్రాముఖ్యమైన భావంలో, నేడు ఏ మానవుడూ నిజంగా జీవించడం లేదని బైబిలు సూచిస్తోంది.

మీరు “వాస్తవమైన జీవమును” అనుభవించాలని యెహోవా కోరుతున్నాడు. మీరు అనుభవిస్తారా?

21 ‘వాస్తవమైన జీవమును సంపాదించుకొనుడి’ అని దేవుని వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (1 తిమోతి 6:18) “వాస్తవమైన జీవము” అనేది భవిష్యత్తులో మనం పొందాలని నిరీక్షించే జీవమని ఆ మాటలు సూచిస్తున్నాయి. అవును, మనం పరిపూర్ణులుగా ఉన్నప్పుడు, మనమెలా జీవించాలని దేవుడు మొదట ఉద్దేశించాడో ఆ విధమైన పూర్ణ భావంలో మనం జీవిస్తామని ఆ మాట సూచిస్తోంది. పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతి, సంతోషాలతో మనం పరదైసు భూమ్మీద జీవిస్తున్నప్పుడు మనం చివరకు “వాస్తవమైన జీవమును” అంటే నిత్యజీవాన్ని అనుభవిస్తాం. (1 తిమోతి 6:12) అదొక అద్భుతమైన నిరీక్షణ కాదా?

22. మీరు “వాస్తవమైన జీవమును” ఎలా సంపాదించుకోవచ్చు?

22 మరి మనం ఆ “వాస్తవమైన జీవమును” ఎలా సంపాదించుకోవచ్చు? పౌలు ఆ వచనంలోనే క్రైస్తవులు “మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును” అయ్యుండాలని ఉద్బోధించాడు. (1 తిమోతి 6:18) కాబట్టి, బైబిలునుండి మనం నేర్చుకున్న సత్యాలను ఎలా అన్వయించుకుంటామనే దానిమీదే ఆ జీవితం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అయితే మనం సత్క్రియలు చేయడం ద్వారా “వాస్తవమైన జీవమును” సంపాదించుకుంటాము అని పౌలు చెబుతున్నాడా? లేదు, అలాంటి అద్భుతమైన భావి నిరీక్షణలు నిజానికి దేవుడు మనపై చూపించే “కృప” మీదే ఆధారపడి ఉంటాయి. (రోమీయులు 5:15) అయితే తనను నమ్మకంగా సేవిస్తున్నవారికి ప్రతిఫలం ఇవ్వడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు “వాస్తవమైన జీవమును” పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమలో నిలిచి ఉండేవారికి భవిష్యత్తులో అలాంటి సంతోషకరమైన, సమాధానకరమైన నిత్యజీవం లభిస్తుంది.

23. దేవుని ప్రేమలో నిలిచి ఉండడం ఎందుకు ఆవశ్యకం?

23 మనలో ప్రతీ ఒక్కరం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘బైబిల్లో దేవుడు చెప్పిన ప్రకారమే నేను ఆయనను ఆరాధిస్తున్నానా?’ ప్రతీరోజు మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మన జవాబు అవును అన్నట్లుగా ఉంటే, మనం సరైన మార్గంలో ఉన్నట్లే. అప్పుడు యెహోవా మన ఆశ్రయదుర్గం అనే నమ్మకంతో ఉండవచ్చు. ఈ విధానపు కష్టభరిత అంత్యదినాల్లో ఆయన తన నమ్మకమైన ప్రజలను సురక్షితంగా కాపాడతాడు. అలాగే త్వరలో రాబోయే అద్భుతమైన నూతన విధానంలోకి కూడా ఆయన మనలను సురక్షితంగా చేరుస్తాడు. ఆ కాలాన్ని చూడడానికి మనం ఎంతగా పులకించిపోతామో కదా! ఈ అంత్యదినాల్లో సరైన నిర్ణయం తీసుకున్నందుకు కూడా మనం ఎంతగా సంతోషిస్తామో కదా! మీరు ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకుంటే, యెహోవా దేవుడు ఉద్దేశించిన “వాస్తవమైన జీవమును” మీరు నిరంతరం అనుభవిస్తారు.