కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు సంబంధించిన సత్యం

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు సంబంధించిన సత్యం

త్రిత్వ బోధను నమ్మే ప్రజలు దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారని నమ్ముతారు. ఈ ముగ్గురు సమానులనీ, సర్వశక్తిమంతులనీ, ఆది లేనివారనీ చెబుతారు. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం ప్రకారం తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే అయినప్పటికీ దేవుడు మాత్రం ఒక్కడే.

త్రిత్వాన్ని నమ్మే చాలామంది ఆ బోధను వివరించలేమని ఒప్పుకుంటారు. అయినా ఆ బోధ బైబిల్లో ఉందని వారు భావించవచ్చు. అయితే బైబిల్లో “త్రిత్వం” అనే మాటే లేదనేది గమనించాల్సిన విషయం. మరి త్రిత్వం గురించిన ఆలోచన లేదా బోధ దానిలో ఉందా? ఈ ప్రశ్నకు జవాబిచ్చేందుకు, త్రిత్వానికి మద్దతు ఇస్తుందని దాన్ని సమర్థించేవారు తరచూ ఉదాహరించే ఒక లేఖనాన్ని మనం పరిశీలిద్దాం.

“వాక్యము దేవుడై యుండెను”

యోహాను 1:1 ఇలా చెబుతోంది: “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.” ఆ తర్వాత అదే అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను “ఆ వాక్యము” యేసు అని స్పష్టంగా చూపిస్తున్నాడు. (యోహాను 1:14) అయితే వాక్యము దేవుడు అని పిలవబడ్డాడు కాబట్టి కుమారుడు, తండ్రి ఒకే దేవునిలో భాగంగా ఉండవచ్చుననే ముగింపుకు కొందరు వస్తారు.

బైబిల్లోని ఈ భాగం మొదట గ్రీకులో వ్రాయబడిందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అనువాదకులు ఆ గ్రీకు మూలపాఠాన్ని ఇతర భాషల్లోకి అనువదించారు. అయితే చాలామంది బైబిలు అనువాదకులు “వాక్యము దేవుడై యుండెను” అనే పదబంధాన్ని ఉపయోగించలేదు. ఎందుకు? బైబిలు వ్రాయబడిన గ్రీకుకు సంబంధించి వారికున్న జ్ఞానం ఆధారంగా ఆ అనువాదకులు “వాక్యము దేవుడై యుండెను” అనే పదబంధాన్ని మరో విధంగా అనువదించాలనే నిర్ణయానికొచ్చారు. వారు ఎలా అనువదించారు? కొన్ని ఉదాహరణలు ఇలా ఉన్నాయి: “లోగోస్‌ [వాక్యము] దైవికమై ఉండెను.” (ఎ న్యూ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద బైబిల్‌ ) “వాక్యము ఒక దేవుడై ఉండెను.” (ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ ఎన్‌ ఇంప్రూవ్‌డ్‌ వర్షన్‌ ) “వాక్యము దేవునియొద్ద ఉండి, ఆయన వంటి స్వభావముగలదై ఉండెను.” (ద ట్రాన్స్‌లేటర్స్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ ) ఈ అనువాదాల ప్రకారం వాక్యము దేవుడు కాదు. a బదులుగా, యెహోవా సృష్టి ప్రాణుల్లో ఆయనకున్న ఉన్నతస్థానాన్నిబట్టి ఆ వాక్యము “ఒక దేవుడు” అని సూచించబడ్డాడు. ఇక్కడ “దేవుడు” అనే మాటకు “బలమైనవాడు” అని అర్థం.

మరిన్ని వాస్తవాలు చూడండి

చాలామందికి బైబిలు వ్రాయబడిన గ్రీకు తెలియదు. కాబట్టి అపొస్తలుడైన యోహాను నిజంగా ఏ భావంతో ఆ మాటలు పలికాడో మనకు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక అంశాన్ని వివరించాడనుకుందాం. అయితే ఆ తర్వాత, ఆ వివరణను అర్థం చేసుకొనే విషయంలో విద్యార్థుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ విద్యార్థులు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు? మరింత సమాచారం కోసం వారు ఆ ఉపాధ్యాయుణ్ణే అడగవచ్చు. అదనపు వాస్తవాలు తెలుసుకోవడంద్వారా దానిని మరింత స్పష్టంగా గ్రహించడానికి వారికి నిస్సందేహంగా సహాయపడుతుంది. అదేవిధంగా, యోహాను 1:1 అర్థాన్ని గ్రహించడానికి యేసు స్థానానికి సంబంధించిన మరింత సమాచారం కోసం యోహాను సువార్తనే మీరు పరిశీలించవచ్చు. ఈ విషయానికి సంబంధించిన అదనపు వాస్తవాలను తెలుసుకోవడం మీరు సరైన ముగింపుకు వచ్చేందుకు సహాయం చేస్తుంది.

ఉదాహరణకు, 1వ అధ్యాయం 18వ వచనంలో యోహాను ఇంకా ఏమి వ్రాస్తున్నాడో పరిశీలించండి: “ఎవడును ఎప్పుడైనను [సర్వశక్తిగల] దేవుని చూడలేదు.” అయితే కుమారుడైన యేసును మానవులు చూశారు, యోహాను ఇలా చెబుతున్నాడు: ‘ఆ వాక్యము [యేసు] శరీరధారియై మనమధ్య నివసించెను. మనము ఆయన మహిమను కనుగొంటిమి.’ (యోహాను 1:14) అలాంటప్పుడు కుమారుడు సర్వశక్తిగల దేవునిలో ఒక భాగంగా ఎలా ఉండగలడు? వాక్యము “దేవునియొద్ద” ఉండెను అని కూడా యోహాను చెబుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మరొక వ్యక్తి వద్ద ఉంటూ అదే సమయంలో ఆ వ్యక్తిగా ఎలా ఉండగలడు? అంతేకాక, యోహాను 17:3 లో ఉన్న ప్రకారంగా యేసు తనకూ తన పరలోకపు తండ్రికీ మధ్యగల వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆయన తన తండ్రిని “అద్వితీయ సత్యదేవుడు” అని పిలుస్తున్నాడు. యోహాను తన సువార్త ముగింపులో విషయాన్ని సారాంశపూర్వకంగా ఇలా చెబుతున్నాడు: “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” (యోహాను 20:31) ఇక్కడ యేసు దేవుని కుమారుడని పిలవబడ్డాడే తప్ప దేవుడు అని పిలవబడలేదని గమనించండి. యోహాను సువార్తలోని ఈ అదనపు సమాచారం యోహాను 1:1 ని ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తుంది. వాక్యమైన యేసుకున్న ఉన్నతస్థానాన్నిబట్టి ఆయన “ఒక దేవుడు” అని పిలవబడ్డాడే తప్ప సర్వశక్తిగల దేవుడు అనే భావంతో కాదు.

వాస్తవాలను నిర్ధారించుకోండి

ఉపాధ్యాయుడు, విద్యార్థులకు సంబంధించిన ఉదాహరణ గురించి మళ్లీ ఆలోచించండి. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిన అదనపు వివరణను విన్న తర్వాత కూడా కొందరు విద్యార్థులకు కొన్ని సందేహాలు ఉన్నాయనుకోండి. వారు ఏమి చేయవచ్చు? ఆ విషయం మీదే అదనపు సమాచారం కోసం మరో ఉపాధ్యాయుని దగ్గరకు వెళ్లవచ్చు. రెండవ ఉపాధ్యాయుడు మొదటి ఉపాధ్యాయుని వివరణనే నిర్ధారిస్తే, చాలామంది విద్యార్థుల సందేహాలు తీరిపోతాయి. అదేవిధంగా, యేసుకు సర్వశక్తిగల దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి అపొస్తలుడైన యోహాను నిజంగా ఏమి చెబుతున్నాడో మీకు స్పష్టం కాకపోతే అదనపు సమాచారం కోసం మరో బైబిలు రచయితవైపు మీరు తిరగవచ్చు. ఉదాహరణకు, మత్తయి వ్రాసిన విషయాలను పరిశీలించండి. ఈ విధానాంతం గురించి యేసు చెప్పిన మాటలను ఆయన ఇలా ఉల్లేఖించాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:36) యేసు సర్వశక్తిగల దేవుడు కాదని ఈ మాటలు ఎలా రుజువు చేస్తున్నాయి?

కుమారునికన్నా తండ్రికి ఎక్కువ తెలుసని యేసు ఇక్కడ చెబుతున్నాడు. అయితే, యేసు సర్వశక్తిగల దేవునిలో ఒక భాగమైతే, తండ్రికి తెలిసిన విషయాలే ఆయనకు కూడా తెలిసి ఉంటాయి. కాబట్టి తండ్రి, కుమారుడు సమానులుగా ఉండే అవకాశమే లేదు. అయినప్పటికీ కొందరు, ‘యేసుకు రెండు స్వాభావిక లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన మామూలు మనుష్యునిలా మాట్లాడుతున్నాడు’ అని అంటారు. ఒకవేళ అదే నిజమైతే మరి పరిశుద్ధాత్మ సంగతి ఏమిటి? అది కూడా తండ్రిలాగే ఒకే దేవునిలో భాగమైతే, తండ్రికి తెలిసిన విషయాలు పరిశుద్ధాత్మకు కూడా తెలుసని యేసు ఎందుకు చెప్పలేదు?

మీరు మీ బైబిలు అధ్యయనాన్ని కొనసాగిస్తుండగా ఈ అంశానికి సంబంధించిన ఇంకా అనేక బైబిలు వాక్యాలు మీకు తెలుస్తాయి. అవి తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి సత్యాన్ని స్పష్టం చేస్తాయి.—కీర్తన 90:2; అపొస్తలుల కార్యములు 7:55; కొలొస్సయులు 1:15.

a యోహాను 1:1 కి అన్వయించే గ్రీకు వ్యాకరణ నియమాలను పరిశీలించడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషుర్‌లో 26-9 పేజీలు చూడండి.