కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

నిజ క్రైస్తవులు సిలువను ఎందుకు ఆరాధించరు?

నిజ క్రైస్తవులు సిలువను ఎందుకు ఆరాధించరు?

లక్షలాదిమంది సిలువను ప్రేమిస్తూ, దానిని గౌరవిస్తారు. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా సిలువను “క్రైస్తవమతానికి సంబంధించిన ప్రధాన చిహ్నం” అని పిలుస్తోంది. అయినప్పటికీ, నిజ క్రైస్తవులు సిలువను తమ ఆరాధనలో ఉపయోగించరు. దానికి కారణం ఏమిటి?

ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే యేసు సిలువమీద మరణించలేదు. గ్రీకు పదమైన ‘స్టౌరస్‌’ సాధారణంగా సిలువ అని అనువదించబడింది. దానికి ప్రాథమికంగా “నిలువుగా ఉన్న ఒక కొయ్య లేదా గుంజ” అని అర్థం. “[స్టౌరస్‌] అనే పదానికి రెండు దుంగలను ఏ కోణంలోనైనా ఒకదానికికొకటి అడ్డంగా అమర్చడమనే భావం ఎంతమాత్రం లేదు . . . [నూతన నిబంధన] వ్రాయబడిన గ్రీకులో రెండు ముక్కల కలపను సూచించే పదమే లేదు” అని ద కంపేనియన్‌ బైబిల్‌ సూచిస్తోంది.

అనేక వచనాల్లో బైబిలు రచయితలు యేసు మరణానికి ఉపయోగించిన సాధనం కోసం మరో పదాన్ని ఉపయోగించారు. అది క్సైలోన్‌ అనే గ్రీకు పదం. (అపొస్తలుల కార్యములు 5:30; 10:39; 13:29; గలతీయులు 3:13; 1 పేతురు 2:24) ఈ మాటకు “కొయ్య” లేదా “కర్ర, దుడ్డుకర్ర,” లేదా “మ్రాను” అనే అర్థాలే ఉన్నాయి.

మరణ శిక్షకు తరచూ ఒక సాధారణ కొయ్యను ఎందుకు ఉపయోగించేవారో వివరిస్తూ హెర్మాన్‌ ఫూల్డే వ్రాసిన సిలువ, సిలువవేయబడడం అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “బహిరంగ మరణ శిక్ష అమలు చేయబడే అన్ని స్థలాల్లో చెట్లు ఉండేవి కావు. అందువల్ల ఒక కొయ్యను భూమిలో పాతి, శిక్షపడ్డవారిని ఆ కొయ్యకు నిలువుగా రెండుచేతులు పైకి కలిపి పెట్టి, క్రింద కాళ్లను తాళ్లతో కలిపి కట్టి లేదా మేకులు దిగగొట్టి వ్రేలాడదీసేవారు.”

అయితే అన్నింటికన్నా అత్యంత నమ్మకమైన రుజువు దేవుని వాక్యంలోనే ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి—మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” (గలతీయులు 3:13) సిలువ కాదుగానీ మ్రాను అని స్పష్టంగా చూపిస్తున్న ద్వితీయోపదేశకాండము 21:22, 23 ను పౌలు ఇక్కడ ఉల్లేఖించాడు. అలాంటి మరణశిక్షకు వాడింది ఒక వ్యక్తిని ‘శాపగ్రస్తుణ్ణి’ చేస్తుంది కాబట్టి, సిలువ మీదున్న క్రీస్తు ప్రతిమలను ఇళ్లలో అలంకరించుకోవడం క్రైస్తవులకు తగదు.

క్రీస్తు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాల వరకు క్రైస్తవులని చెప్పుకున్నవారు ఆరాధనలో సిలువను ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి రుజువూ లేదు. అయితే నాల్గవ శతాబ్దంలో అన్య చక్రవర్తి కాన్‌స్టంటైన్‌ మతభ్రష్ట క్రైస్తవత్వం పుచ్చుకుని దాని చిహ్నంగా సిలువను ప్రోత్సహించాడు. కాన్‌స్టంటైన్‌ ఉద్దేశాలు ఏవైనా సిలువకు యేసుక్రీస్తుకు ఎలాంటి సంబంధం లేదు. సిలువ నిజానికి అన్యమత సంబంధమైనది. న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంగీకరిస్తోంది: “సిలువ క్రైస్తవపూర్వ సంస్కృతుల్లో, క్రైస్తవేతర సంస్కృతుల్లో కనబడుతుంది.” వివిధరకాల ఇతర గ్రంథాలు సిలువను ప్రకృతి ఆరాధనకు అన్యమత లైంగిక ఆచారాలకు ముడిపెడుతున్నాయి.

అయితే ఈ అన్యమత చిహ్నం ఎందుకు ప్రోత్సహించబడింది? అన్యులు “క్రైస్తవత్వాన్ని” సులభంగా అంగీకరించడానికే అని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికీ, అన్యమత చిహ్నంపట్ల చూపించే ఎలాంటి పూజ్య భావాన్నైనా బైబిలు స్పష్టంగా ఖండిస్తోంది. (2 కొరింథీయులు 6:14-18) అంతేకాక లేఖనాలు ఎలాంటి విగ్రహారాధననైనా నిషేధిస్తున్నాయి. (నిర్గమకాండము 20:4, 5; 1 కొరింథీయులు 10:14) కాబట్టి, నిజ క్రైస్తవులు మంచి కారణంతోనే ఆరాధనలో సిలువను ఉపయోగించరు. a

a సిలువను గురించిన మరింత వివరణాత్మక సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాల నుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో 89-93 పేజీలు చూడండి.