కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

మానవుల్లో అదృశ్యమైన, అమర్త్యమైన భాగం ఏదైనా నిజంగా ఉందా?

మానవుల్లో అదృశ్యమైన, అమర్త్యమైన భాగం ఏదైనా నిజంగా ఉందా?

మనుష్యులు, జంతువులు చనిపోయినప్పుడు అదృశ్యమైన ఒక భాగం ఏదో శరీరంనుండి విడిపోయి ఇంకా జీవిస్తూ, అమర్త్యంగా ఉంటుందనే భావాన్నిచ్చే పదాలు అనేక భారతీయ భాషల్లో ఉన్నాయి. అందువల్ల ప్రజలు సాధారణంగా అమర్త్యమైన ఆత్మ గురించి మాట్లాడుతూ మనిషిలోని కొంతభాగం సజీవంగా ఉండి మరో శరీరంతో మళ్లీ జన్మిస్తుందనే ఆలోచనకు దాన్ని ముడిపెడతారు.

లేఖనాలను భారతీయ భాషల్లోకి అనువదించేటప్పుడు అనేకమంది బైబిలు అనువాదకులు ఉపయోగించడానికి ఎంపిక చేసుకున్న పదాల కారణంగా ఈ గందరగోళం ఏర్పడింది. ఆ కారణంగా కొందరు, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని శరీరం నుండి ఏదో ఒక అదృశ్య భాగం తప్పించుకుంటుందని బైబిలు కూడా బోధిస్తుందని అనుకుంటారు. అయితే బైబిలు ఆదిమ భాషల్లో ఉపయోగించబడిన పదాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బైబిలు బోధిస్తున్నది ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేయగలదు.

నెఫెష్‌, సైఖే అనే పదాల భావం

బైబిలు మొదట్లో ముఖ్యంగా హీబ్రూ, గ్రీకు భాషల్లో వ్రాయబడిందనే విషయం మీకు గుర్తుండవచ్చు. బైబిలు రచయితలు మనుష్యుల గురించి, జంతువుల గురించి, మనిషి లేదా జంతువు ప్రాణం గురించి వ్రాసేటప్పుడు నెఫెష్‌ అనే హీబ్రూ పదాన్ని, సైఖే అనే గ్రీకు పదాన్ని ఉపయోగించారు. ఈ రెండు పదాలు లేఖనాల్లో 800 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తాయి, తెలుగులో ఇవి తరచూ మనిషి, జీవము, ప్రాణము అని అనువదించబడ్డాయి. ఈ పదాలు బైబిలులో ఉపయోగించబడిన విధానాన్ని మీరు పరిశీలించినప్పుడు అవి ప్రాథమికంగా (1) మనుష్యులను, (2) జంతువులను (3) ఒక మనిషి లేదా జంతువు ప్రాణాన్ని సూచిస్తున్నాయని స్పష్టమవుతుంది. ఈ విభిన్న భావాలను సూచించే కొన్ని లేఖనాలను మనం పరిశీలిద్దాం.

మనుష్యులు. “నోవహు దినములలో . . . ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది [సైఖే] నీటిద్వారా రక్షణపొందిరి.” (1 పేతురు 3:19, 20) ఇక్కడ “మంది” అని అనువదించబడిన గ్రీకు మూల పదం, నోవహును, ఆయన భార్యను, ఆయన ముగ్గురు కుమారులను, వారి భార్యలను సూచిస్తోంది. మన్నా సమకూర్చుకునే విషయంలో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆదేశాలను నిర్గమకాండము 16:16 ఇలా పేర్కొంటోంది: “ప్రతివాడును తనవారి [నెఫెష్‌లెక్కచొప్పున] భోజనమునకు . . . తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెను.” కాబట్టి నెఫెష్‌ల లెక్కనుబట్టి లేదా కుటుంబంలోని వ్యక్తుల సంఖ్యనుబట్టి మన్నాను సమకూర్చుకునేవారు. మనుష్యులను సూచించడానికి నెఫెష్‌ లేదా సైఖే అనే పదాలు ఉపయోగించబడిన మరి కొన్ని లేఖనాలు ఆదికాండము 46:18; యెహోషువ 11:11; అపొస్తలుల కార్యములు 27:37; రోమీయులు 13:1.

జంతువులు. సృష్టిని గురించిన బైబిలు వృత్తాంతంలో మనమిలా చదువుతాం: “దేవుడు—జీవముకలిగి చలించువాటిని [నెఫెష్‌] జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు—వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని [నెఫెష్‌లను], అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను.” (ఆదికాండము 1:20, 24) ఈ వచనాల్లో చేపలు, సాధుజంతువులు, అడవి జంతువులు వీటన్నిటినీ సూచించేందుకు నెఫెష్‌ అనే ఒకే హీబ్రూ పదం ఉపయోగించబడింది. ఈ లేఖనాల్లో పక్షులు, జంతువులు కూడా నెఫెష్‌ అనే అనువదించబడ్డాయి: ఆదికాండము 9:10; లేవీయకాండము 11:46; సంఖ్యాకాండము 31:28.

మనిషి ప్రాణం. కొన్నిసార్లు హీబ్రూ పదమైన నెఫెష్‌, గ్రీకు పదమైన సైఖే ఒక మనిషి ప్రాణాన్ని సూచించాయి. యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీ ప్రాణమును [నెఫెష్‌] వెదకిన మనుష్యులందరు చనిపోయిరి.” (నిర్గమకాండము 4:19) మోషే శత్రువులు దేని కోసం వెదికారు? వాళ్ళు మోషే ప్రాణం తీయాలని చూశారు. అంతకుముందు, రాహేలు బెన్యామీనుకు జన్మనిస్తున్నప్పుడు ‘ఆమె మృతిబొందెను కాబట్టి ఆమె ప్రాణము [నెఫెష్‌] పోయెను.’ (ఆదికాండము 35:16-19) ఆ సమయంలో రాహేలు తన ప్రాణం కోల్పోయింది. యేసు పలికిన మాటలను కూడా పరిశీలించండి: “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము [సైఖే] పెట్టును.” (యోహాను 10:11) యేసు మానవజాతి కోసం తన సైఖే లేదా తన ప్రాణము పెట్టాడు. ఈ బైబిలు వచనాల్లో హీబ్రూ పదమైన నెఫెష్‌, గ్రీకు పదమైన సైఖే స్పష్టంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని సూచిస్తున్నాయి. నెఫెష్‌ లేదా సైఖే అనే పదాలు ఈ విధంగా ఉపయోగించబడిన మరి కొన్ని లేఖనాలు 1 రాజులు 17:17-23; మత్తయి 10:39; యోహాను 15:13; అపొస్తలుల కార్యములు 20:10.

బైబిలంతటిలో హీబ్రూ పదమైన నెఫెష్‌, గ్రీకు పదమైన సైఖే “అమర్త్యతకు” లేదా “నిత్యత్వానికి” ముడిపెట్టబడలేదని దేవుని వాక్య అదనపు అధ్యయనం చూపిస్తుంది. బదులుగా, మానవుడు మర్త్యమైనవాడని అంటే మనిషి మరణిస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. (యెహెజ్కేలు 18:4, 20) అందుకే, బైబిలు మానవులను “మర్త్యులు” అని పిలుస్తోంది.—యోబు 4:16, 17.

రూ-ఆహ్‌, న్యూమా అనే పదాల భావం

బైబిలు రచయితలు హీబ్రూ పదమైన రూ-ఆహ్‌ లేదా గ్రీకు పదమైన న్యూమా ఉపయోగించినచోట ఆ పదాలు తెలుగులో “ఊపిరి,” “ప్రాణము,” “జీవవాయువు,” లేదా “ఆత్మ” అని అనువదించబడ్డాయి. వాటి అర్థాన్ని లేఖనాలే సూచిస్తున్నాయి. ఉదాహరణకు, కీర్తన 104:29 ఇలా చెబుతోంది: “నీవు [యెహోవా] వాటి ఊపిరి [రూ-ఆహ్‌] తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.” యాకోబు 2:26 ఇలా చెబుతోంది: “ప్రాణము [న్యూమా] లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.” ఈ వచనాల్లో “ఊపిరి,” “ప్రాణము” అనే పదాలు శరీరంలోని జీవశక్తిని సూచిస్తున్నాయి. ప్రాణములేని శరీరము మృతము. బైబిల్లో రూ-ఆహ్‌ అనే పదం “ఊపిరి,” “ప్రాణము” అనేకాక, “జీవాత్మ” లేదా “జీవవాయువు” అని కూడా అనువదించబడింది. ఉదాహరణకు, నోవహు కాలము నాటి జలప్రళయము గురించి ఆదికాండము 6:17 ఇలా చెబుతోంది: “ఇదిగో నేనే జీవ వాయువు [రూ-ఆహ్‌]గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. (ఆదికాండము 7:15, 22) ఇక్కడ ఉపయోగించబడిన రూ-ఆహ్‌ అనే పదం జీవరాశులన్నిటిలో చైతన్యం కలిగించే అదృశ్య (జీవ) శక్తిని సూచిస్తోంది.

ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, ఒక రేడియో గురించి ఆలోచించండి. మీరు రేడియోలో బ్యాటరీలు వేసి ఆన్‌ చేస్తే ఆ బ్యాటరీల్లో నిక్షిప్తమైన విద్యుత్తువల్ల రేడియోకు ప్రాణం వస్తుందని చెప్పవచ్చు. అయితే బ్యాటరీలు లేకపోతే రేడియో పనిచేయదు. అదేవిధంగా, రూ-ఆహ్‌ లేదా న్యూమా అని అనువదించబడిన జీవశక్తి శరీరానికి చైతన్యం తీసుకొస్తుంది. విద్యుత్తుకు ఉండనట్లే ఆ శక్తికి కూడా ఎలాంటి భావాలూ లేవు, అది తలంచలేదు. అది వ్యక్తిత్వంలేని శక్తి. అయితే ఆ శక్తి లేదా జీవశక్తి లేకపోతే, కీర్తనకర్త చెప్పినట్లుగా మనం కూడా ‘ప్రాణములు విడిచి మంటి పాలవుతాము.’

మనిషి మరణం గురించి మాట్లాడుతూ ప్రసంగి 12:7 ఇలా చెబుతోంది: “మన్నయినది [అతని శరీరము] వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ [రూ-ఆహ్‌] దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.” ఆత్మ లేదా జీవశక్తి శరీరాన్ని విడిచినప్పుడు శరీరం మరణించి అది ఏ మట్టితో చేయబడిందో ఆ మట్టికే తిరిగి చేరుతుంది. అదేవిధంగా జీవశక్తి ఎక్కడనుండి వచ్చిందో ఆ దేవుని దగ్గరకే పోతుంది. (యోబు 34:14, 15; కీర్తన 36:9) దీనర్థం ఆ జీవశక్తి అక్షరార్థంగా ప్రయాణిస్తూ పరలోకానికి వెళుతుందని కాదు. బదులుగా, చనిపోయిన వ్యక్తి భవిష్యత్‌ నిరీక్షణ యెహోవా దేవునిపై ఆధారపడి ఉంటుందని దానర్థం. అతని జీవితం దేవుని చేతుల్లో ఉంటుందని చెప్పవచ్చు. కేవలం దేవుని శక్తి మూలంగానే ఆ ఆత్మ లేదా జీవశక్తి ఆ వ్యక్తి మళ్లీ బ్రతకడానికి అతనికి తిరిగి ఇవ్వబడుతుంది.

“సమాధులలో నున్నవారంద[రి]” విషయంలో దేవుడు ఖచ్చితంగా ఇలా చేస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా! (యోహాను 5:28, 29) పునరుత్థాన సమయంలో మరణనిద్ర అనుభవిస్తున్న వారికి యెహోవా ఒక కొత్త శరీరాన్ని ఇచ్చి దానిలో ఆత్మను లేదా జీవశక్తిని నింపి తిరిగి బ్రతికిస్తాడు. ఆ రోజు ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా!

నెఫెష్‌, సైఖే, రూ-ఆహ్‌, న్యూమా అనే పదాలు బైబిలులో ఎలా ఉపయోగించబడ్డాయనే దాని గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌లో, లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకంలోని 375-384 పేజీల్లో మీకు విలువైన సమాచారం లభిస్తుంది.