కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

1914—బైబిలు ప్రవచనాల్లో గమనార్హమైన సంవత్సరం

1914—బైబిలు ప్రవచనాల్లో గమనార్హమైన సంవత్సరం

దశాబ్దాలకు ముందే బైబిలు విద్యార్థులు 1914లో గమనార్హమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రకటించారు. ఆ పరిణామాలు ఏమిటి, 1914 చాలా ప్రాముఖ్యమైన సంవత్సరమని ఏ రుజువు సూచిస్తోంది?

లూకా 21:24 ప్రకారం, “అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును” అని యేసు చెప్పాడు. రాజైన దావీదు వంశస్థులు వరుసగా పరిపాలించిన యెరూషలేము యూదా జనాంగానికి రాజధానిగా ఉండేది. (కీర్తన 48.1,2) అయితే లోక పరిపాలకుల్లో ఈ రాజులకు ఎంతో విశిష్టత ఉంది. వాళ్ళు దేవుని ప్రతినిధులుగా “యెహోవా సింహాసనమందు” కూర్చున్నారు. (1 దినవృత్తాంతములు 29:23) ఆ విధంగా, యెరూషలేము యెహోవా పరిపాలనకు ఒక చిహ్నంగా ఉండేది.

అయితే దేవుని పరిపాలన ‘అన్యజనములచేత త్రొక్కబడడం’ అనేది ఎప్పుడు, ఎలా ఆరంభమైంది? సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును జయించినప్పుడు అది ఆరంభమైంది. “యెహోవా సింహాసనము” పరుల పాలయ్యింది, దావీదు వంశస్థుల పరిపాలనకు అంతరాయం ఏర్పడింది. (2 రాజులు 25:1-26) మరి ఈ ‘త్రొక్కబడడం’ అలాగే నిరంతరం కొనసాగుతుందా? లేదు, యెరూషలేము చివరి రాజు సిదియా గురించి యెహెజ్కేలు ప్రవచనం ఇలా చెబుతోంది: “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము . . . దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.” (యెహెజ్కేలు 21:26, 27) దావీదు వంశపు “స్వాస్థ్యకర్త” క్రీస్తుయేసు. (లూకా 1:32, 33) కాబట్టి యేసు రాజైనప్పుడు ఆ ‘త్రొక్కబడడం’ అంతమవుతుంది.

ఈ గొప్ప సంఘటన ఎప్పుడు జరుగుతుంది? అన్యజనులు నిర్ణీతకాలం వరకు మాత్రమే పరిపాలిస్తారని యేసు వివరించాడు. అది ఎంతకాలమో తెలుసుకోవడానికి దానియేలు 4వ అధ్యాయంలోని వృత్తాంతం కీలక సమాచారాన్ని అందిస్తోంది. అది బబులోను రాజైన నెబుకద్నెజరుకు వచ్చిన ప్రవచనార్థక కల గురించి చెబుతోంది. అతను ఆ కలలో నరికివేయబడిన ఒక మహా వృక్షాన్ని చూశాడు. దాని మొద్దు చిగురించే అవకాశాలు తక్కువ, ఎందుకంటే అది ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టబడింది. “ఏడు కాలములు గడచువరకు” అది అలాగే ఉండాలి అని ఒక దేవదూత ప్రకటించాడు.—దానియేలు 4:10-16.

బైబిలులో వృక్షాలు కొన్నిసార్లు పరిపాలనకు ప్రతీకగా ఉపయోగించబడ్డాయి. (యెహెజ్కేలు 17:22-24; 31:2-5) కాబట్టి ఆ సూచనార్థక వృక్షం నరికివేయబడడం, యెరూషలేములో పరిపాలించిన రాజుల ద్వారా వ్యక్తం చేయబడిన దేవుని పరిపాలనకు కలిగే అంతరాయానికి ప్రతీకగా ఉంది. ‘యెరూషలేము త్రొక్కబడడం’ కేవలం తాత్కాలికమని అంటే ఏడుకాలాలు మాత్రమే అని చెప్పడానికి ఆ దర్శనం దోహదపడింది. ఆ కాలం ఎంత?

మూడున్నర కాలాలు “వెయ్యిన్ని రెండువందల అరువది దినములకు” సమానమని ప్రకటన 12:6, 14 సూచిస్తోంది. కాబట్టి “ఏడు కాలాలు” దానికి రెండింతలు ఉంటుంది లేదా 2,520 రోజులు. అయితే యెరూషలేము పతనమైన తర్వాత కేవలం 2,520 రోజులకే దేవుని పరిపాలన ‘అన్యజనులచేత తొక్కబడడం’ ఆగిపోలేదు. కాబట్టి ఈ ప్రవచనం అంతకంటే ఎక్కువకాలాన్నే సూచిస్తోంది. “దినమునకు ఒక సంవత్సరము చొప్పున” అని చెబుతున్న సంఖ్యాకాండము 14:34, యెహెజ్కేలు 4:6 ఆధారంగా ఆ “ఏడు కాలములు” 2,520 సంవత్సరాలను సూచిస్తున్నాయి.

బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడంతో దావీదు వంశస్థుల పరిపాలన కూలిపోయిన సా.శ.పూ. 607 అక్టోబరులో ఆ 2,520 సంవత్సరాలు ఆరంభమయ్యాయి. ఆ కాలం 1914 అక్టోబరులో ముగిసింది. ఆ సంవత్సరంలో ‘అన్యజనముల కాలములు సంపూర్ణమవడంతో’ దేవుని పరలోక రాజుగా యేసుక్రీస్తు నియమించబడ్డాడు. aకీర్తన 2:1-6; దానియేలు 7:13, 14.

యేసు ముందే చెప్పినట్లుగా పరలోక రాజుగా ఆయన “ప్రత్యక్షత” నాటకీయ ప్రపంచ పరిణామాల ద్వారా అంటే యుద్ధం, కరవు, భూకంపాలు, తెగుళ్ల మూలంగా గుర్తించబడుతుంది. (మత్తయి 24:3-8; లూకా 21:11) అలాంటి పరిణామాలు 1914లో దేవుని పరలోకరాజ్యం నిజంగా ఆవిర్భవించిందని, ప్రస్తుత దుష్ట విధాన “అంత్యదినములు” ఆరంభమయ్యాయనే బలమైన రుజువునిస్తున్నాయి.—2 తిమోతి 3:1-5.

a సా.శ.పూ. 607 అక్టోబరు నుండి సా.శ.పూ. అక్టోబరు 1 వరకు 606 సంవత్సరాలు. శూన్య సంవత్సరం లేదు కాబట్టి, సా.శ.పూ. 1 అక్టోబరు నుండి సా.శ. 1914 అక్టోబరు వరకు 1,914 సంవత్సరాలు. 606 సంవత్సరాలకు, 1914 సంవత్సరాలను కూడా కలిపితే అది 2,520 సంవత్సరాలు అవుతుంది. సా.శ.పూ. 607లో యెరూషలేము పతనం గురించిన సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన, లేఖనములైప అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకంలో “క్రొనాలజీ” అనే ఆర్టికల్‌చూడండి.