కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 12

‘యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడారు’

‘యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడారు’

పౌలు బర్నబాలు వినయం, పట్టుదల, ధైర్యం చూపించారు

అపొస్తలుల కార్యాలు 14:1-28 ఆధారంగా

1, 2. పౌలు, బర్నబా లుస్త్రకు వెళ్లినప్పుడు ఏం జరిగింది?

 లుస్త్ర నగరమంతా సందడి సందడిగా, గోలగోలగా ఉంది. ఇద్దరు అపరిచితులు పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని బాగుచేశారు, ఇప్పుడు అతను సంతోషంతో గంతులు వేస్తున్నాడు. అది చూసి ప్రజలు అవాక్కయ్యారు, ఆ అపరిచితులిద్దరూ దేవుళ్లేమో అని అనుకున్నారు. ఇంతలో, ఒక పూజారి వాళ్లిద్దరి మెడలో వేయడానికి పూలదండల్ని, బలి ఇవ్వడానికి ఎద్దుల్ని తీసుకొచ్చాడు. అలా చేయవద్దని పౌలు, బర్నబాలు గొంతు చించుకుని మరీ చెప్తున్నారు. వాళ్లు తమ బట్టలు చింపుకుంటూ, ప్రజల మధ్యలోకి వెళ్లి తమను అలా ఆరాధించవద్దని బ్రతిమాలారు. ప్రజల్ని ఆపడానికి వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

2 అప్పుడు పిసిదియలోని అంతియొకయ నుండి, అలాగే ఈకొనియ నుండి కొంతమంది యూదులు వచ్చారు. ఆ యూదులు పౌలు బర్నబాల మీద లేనిపోనివి చెప్పి, లుస్త్ర ప్రజల మనసుల్ని చెడగొట్టారు. దాంతో అప్పటిదాకా పౌలును దేవునిలా పూజించిన ప్రజలు, ఆయన్ని స్పృహ కోల్పోయేలా రాళ్లతో కొట్టారు. పౌలు చనిపోయాడు అనుకుని రక్తంతో, గాయాలతో నిండిన ఆయన శరీరాన్ని ఊరి అవతల పడేశారు.

3. ఈ అధ్యాయంలో ఏం పరిశీలిస్తాం?

3 ఎందుకు ఇలా జరిగింది? పౌలు బర్నబాల నుండి, అలాగే నిలకడలేని లుస్త్ర ప్రజల నుండి నేడు మంచివార్త ప్రచారకులు ఏం నేర్చుకోవచ్చు? “యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడుతూ” పరిచర్యలో పట్టుదల చూపించిన పౌలు, బర్నబాల నుండి నేడు క్రైస్తవ పెద్దలు ఏం నేర్చుకోవచ్చు?—అపొ. 14:3.

‘చాలామంది విశ్వాసులయ్యారు’ (అపొ. 14:1-7)

4, 5. పౌలు, బర్నబాలు ఈకొనియకు ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం జరిగింది?

4 కొన్నిరోజుల క్రితమే, పిసిదియలోని అంతియొకయలో యూదులు పౌలు, బర్నబాలను వ్యతిరేకించి ఊరు అవతలికి వెళ్లగొట్టారు. ప్రజలు ఆసక్తి చూపించలేదని పౌలు, బర్నబా డీలా పడిపోయారా? లేదు, ‘తమ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేసుకున్నారు.’ (అపొ. 13:50-52; మత్త. 10:14) తమను వ్యతిరేకించే వాళ్లను దేవుడే చూసుకుంటాడని పౌలు, బర్నబాలు అక్కడి నుండి శాంతిగా వెళ్లిపోయారు. (అపొ. 18:5, 6; 20:26) ఆ ఇద్దరు మిషనరీల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు, వాళ్లు తమ మిషనరీ యాత్రను కొనసాగించారు. వాళ్లు ఆగ్నేయం (సౌత్‌ ఈస్ట్‌) వైపు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి తౌరస్‌, సుల్తాన్‌ పర్వతాల మధ్య పంటలు బాగా పండే ఒక ప్రాంతానికి చేరుకున్నారు.

5 పౌలు, బర్నబాలు ముందుగా ఈకొనియకు వెళ్లారు. అక్కడ గ్రీకు సంస్కృతి ఎక్కువగా ఉండేది. అది రోమా పరిపాలన కింద ఉన్న గలతీయ ప్రాంతంలో ముఖ్య నగరం. a ఆ నగరంలో బాగా పలుకుబడి ఉన్న యూదులు ఉండేవాళ్లు, యూదులుగా మారిన అన్యజనులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవాళ్లు. పౌలు, బర్నబాలు అలవాటు ప్రకారం సమాజ మందిరంలోకి వెళ్లి ప్రకటించడం మొదలుపెట్టారు. (అపొ. 13:5, 14) “వాళ్లు అక్కడ ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు, గ్రీకువాళ్లు విశ్వాసులయ్యారు.”—అపొ. 14:1.

6. పౌలు, బర్నబా అంత బాగా ఎలా మాట్లాడగలిగారు? వాళ్ల ఆదర్శాన్ని మనం ఎలా పాటించవచ్చు?

6 పౌలు, బర్నబా అంత బాగా ఎలా మాట్లాడగలిగారు? పౌలుకు లేఖనాల మీద మంచి పట్టు ఉంది. బైబిలు చరిత్రను, ప్రవచనాల్ని, ధర్మశాస్త్రాన్ని చక్కగా ఉపయోగించి యేసే మెస్సీయ అని పౌలు నిరూపించాడు. (అపొ. 13:15-31; 26:22, 23) బర్నబా ప్రజల మీద శ్రద్ధతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. (అపొ. 4:36, 37; 9:27; 11:23, 24) వాళ్లిద్దరు సొంత తెలివితేటల మీద ఆధారపడలేదు గానీ, “యెహోవా అధికారంతో” మాట్లాడారు. మనం కూడా పరిచర్యలో ఆ మిషనరీల ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు? ఈ పనులు చేయడం ద్వారా వాళ్ల ఆదర్శాన్ని పాటించవచ్చు: లేఖనాల మీద మంచి పట్టు సాధించండి, వినేవాళ్లకు ఆసక్తిగా అనిపించే లేఖనాల్ని చూపించండి. ప్రజల్ని ఎలా ఓదార్చవచ్చో ఆలోచించండి. మీ సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా, ఎప్పుడూ దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ యెహోవా అధికారంతో మాట్లాడండి.

7. (ఎ) మంచివార్తకు ఎలాంటి ఫలితాలు రావచ్చు? (బి) మీరు మంచివార్తను ఇష్టపడడం వల్ల మీ ఇంట్లోవాళ్లు మిమ్మల్ని వ్యతిరేకిస్తే, ఏం గుర్తుంచుకోవాలి?

7 అయితే పౌలు, బర్నబా చెప్పేది ఈకొనియలో కొంతమందికి నచ్చలేదు. “విశ్వసించని యూదులు అన్యజనుల్ని ప్రేరేపించి పౌలును, బర్నబాను ద్వేషించేలా వాళ్ల మనసుల్ని చెడగొట్టారు” అని లూకా రాశాడు. వాళ్లిద్దరు అక్కడ మంచివార్త తరఫున మాట్లాడడం అవసరమని పౌలు, బర్నబా గుర్తించారు. అందుకే వాళ్లు “ధైర్యంగా మాట్లాడుతూ చాలాకాలం అక్కడ ఉన్నారు.” దానివల్ల, “ఆ నగరంలోని ప్రజలు రెండుగా విడిపోయారు. కొందరు యూదులకు, మిగతావాళ్లు ఆ ఇద్దరు అపొస్తలులకు మద్దతిచ్చారు.” (అపొ. 14:2-4) నేడు కూడా మంచివార్తకు వచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. మంచివార్త కొంతమందిని ఐక్యం చేస్తుంది, ఇంకొంతమందిని విడదీస్తుంది. (మత్త. 10:34-36) మీరు మంచివార్తను ఇష్టపడడం వల్ల మీ ఇంట్లోవాళ్లు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? అయితే, సాధారణంగా వాళ్లు అలా వ్యతిరేకించడానికి కారణం, మన గురించి విన్న లేనిపోని అబద్ధాలు, పుకార్లే అని గుర్తుంచుకోండి. అయితే మీ మంచి ప్రవర్తన అవన్నీ నిజాలు కాదని నిరూపించవచ్చు, ఏదోకరోజు వాళ్ల అభిప్రాయాన్ని మార్చుకునేలా సహాయం చేయవచ్చు.—1 పేతు. 2:12; 3:1, 2.

8. ఈకొనియ నుండి పౌలు, బర్నబా ఎందుకు వెళ్లిపోయారు? వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

8 కొంతకాలం తర్వాత వ్యతిరేకులు పౌలు బర్నబాల మీద కుట్ర పన్ని, వాళ్లను రాళ్లతో కొట్టాలని అనుకున్నారు. అది తెలుసుకున్న పౌలు బర్నబాలు, అక్కడ నుండి వెళ్లిపోయి వేరే ప్రాంతంలో ప్రకటించారు. (అపొ. 14:5-7) నేడు రాజ్య ప్రచారకులు కూడా వాళ్లలాగే తెలివిగా నడుచుకుంటారు. మన గురించి గానీ, మన పని గురించి గానీ ఎవరైనా లేనిపోనివి చెప్తే మనం ధైర్యంగా మాట్లాడతాం. (ఫిలి. 1:7; 1 పేతు. 3:13-15) కానీ హింస వచ్చే అవకాశం ఉందని తెలిస్తే, మనం మూర్ఖంగా మన ప్రాణాల్ని గానీ, మన తోటి వాళ్ల ప్రాణాల్ని గానీ ప్రమాదంలో పడేయం.—సామె. 22:3.

‘జీవంగల దేవుని వైపుకు తిరగండి’ (అపొ. 14:8-19)

9, 10. లుస్త్ర నగరం ఎక్కడ ఉంది? ఆ నగరంలో ఉన్నవాళ్ల గురించి మనకు ఏం తెలుసు?

9 తర్వాత పౌలు, బర్నబా రోమన్ల పరిపాలన కింద ఉన్న లుస్త్ర నగరానికి బయల్దేరారు. అది ఈకొనియ నుండి నైరుతి (సౌత్‌ వెస్ట్‌) వైపు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. లుస్త్ర నగరానికి, పిసిదియలోని అంతియొకయకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే అక్కడున్నట్టు, ఇక్కడ ఎక్కువమంది యూదులు లేరు. లుస్త్ర ప్రజల మాతృభాష లుకయొనియ భాష. అయినా, వాళ్లకు గ్రీకు భాష కూడా తెలిసుండవచ్చు. ఆ నగరంలో సమాజమందిరం లేకపోవడంతో, పౌలు బర్నబాలు బహుశా ప్రజలు ఎక్కువగా ఉండే చోట ప్రకటించడం మొదలుపెట్టారు. (అపొ. 14:8-10) ఇదివరకు పేతురు యెరూషలేములో పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని బాగుచేశాడు. ఆ అద్భుతాన్ని చూసి చాలామంది విశ్వాసులయ్యారు. (అపొ. 3:1-10) ఇప్పుడు పౌలు కూడా లుస్త్రలో పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని బాగుచేశాడు. కానీ ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు మాత్రం ఇంకోలా స్పందించారు.

10 ఈ అధ్యాయం మొదట్లో చెప్పినట్టు, లుస్త్ర ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లు. బాగైన కుంటివాడు ఆనందంతో ఎగిరి గంతులు వేయడం చూసిన ప్రజలు పౌలు, బర్నబాలు దేవుళ్లని అనుకున్నారు. వాళ్లు బర్నబాను గ్రీకుల ముఖ్య దేవుడైన ద్యుపతి అని, పౌలును దేవుళ్ల తరఫున మాట్లాడే ద్యుపతి కుమారుడైన హెర్మే అని పిలిచారు. (“ లుస్త్ర నగరం, ద్యుపతి - హెర్మేల ఆరాధన” అనే బాక్సు చూడండి.) అయితే తాము దేవుళ్లం కాదని, సత్య దేవుడైన యెహోవా ఇచ్చిన అధికారంతోనే అలా మాట్లాడాం అని, ఆ అద్భుతాన్ని చేశాం అని ప్రజలకు స్పష్టం చేయాలని పౌలు, బర్నబా అనుకున్నారు.—అపొ. 14:11-14.

‘ఇలాంటి వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని చేసిన జీవంగల దేవుని వైపుకు తిరగండి.’—అపొస్తలుల కార్యాలు 14:15

11-13. (ఎ) లుస్త్రలోని ప్రజలతో పౌలు, బర్నబా ఏమన్నారు? (బి) వాళ్లు అన్న మాటల నుండి మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటి?

11 ప్రజలు అలా స్పందించినప్పటికీ, వాళ్ల హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడానికి పౌలు, బర్నబా చేయగలిగినదంతా చేశారు. లూకా ఇక్కడ రాసిన విషయాలు, క్రైస్తవులుకాని వాళ్లతో ఎలా చక్కగా మాట్లాడవచ్చో మనకు నేర్పిస్తాయి. ప్రజల హృదయాల్ని చేరుకునేలా పౌలు, బర్నబా ఎలా మాట్లాడారో గమనించండి: “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీకున్న లాంటి బలహీనతలే మాకూ ఉన్నాయి. మీరు ఇలాంటి వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసిన జీవంగల దేవుని వైపుకు తిరగాలని మేము మీకు మంచివార్త ప్రకటిస్తున్నాం. గతంలో ఆయన దేశాలన్నిటినీ తమకు నచ్చినట్టు చేయనిచ్చాడు. అయినా, మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు. ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ, ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.”—అపొ. 14:15-17.

12 ప్రజల్ని ఆలోచింపజేసేలా పౌలు, బర్నబా అన్న ఈ మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిగా, ప్రజలకన్నా తాము గొప్పవాళ్లం అని పౌలు, బర్నబా అనుకోలేదు. ఆ అద్భుతాన్ని తమ సొంత శక్తితోనే చేసినట్టుగా ప్రవర్తించలేదు. బదులుగా ఆ ప్రజలకు ఉన్నలాంటి బలహీనతలే తమకూ ఉన్నాయని వినయంగా ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే, పౌలు బర్నబాలు పవిత్రశక్తిని పొందారు; అబద్ధ బోధల నుండి విడుదలయ్యారు; భవిష్యత్తులో క్రీస్తుతో కలిసి పరలోకం నుండి పరిపాలించే అవకాశాన్ని పొందారు. అయితే క్రీస్తుకు లోబడితే, లుస్త్రలోని ప్రజలు కూడా ఆ అవకాశాలన్నీ పొందవచ్చని వాళ్లు గుర్తించారు.

13 మనం ప్రకటించే ప్రజల్ని మనం ఎలా చూస్తున్నాం? వాళ్లు కూడా మనతో సమానమే అన్నట్టు చూస్తున్నామా? దేవుని వాక్యాన్ని ఉపయోగించి ప్రజలకు సత్యాల్ని నేర్పిస్తున్నప్పుడు, పౌలు బర్నబాల్లాగే పొగడ్తల్ని కోరుకోకుండా ఉంటున్నామా? ఈ విషయంలో, ఛార్లెస్‌ టేజ్‌ రస్సెల్‌ కూడా చక్కని ఆదర్శం ఉంచాడు. దాదాపు 1870 నుండి 1916 వరకు, ఆయన ప్రకటనా పనిని ముందుండి నడిపించాడు. మంచి బోధకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇలా రాశాడు: “మేము చేస్తున్న పనిని బట్టి లేదా మేము రాస్తున్న విషయాలను బట్టి ఇతరులు మమ్మల్ని గౌరవించాలని గానీ, భక్తితో చూడాలని గానీ మేము కోరుకోవడం లేదు; రెవరెండ్‌ లేదా రబ్బీ అని పిలిపించుకోవాలని మేము ఆశపడడం లేదు.” పౌలు బర్నబాల్లాగే, రస్సెల్‌ కూడా వినయం చూపించాడు. అదేవిధంగా, మనం ప్రకటనా పనిని చేస్తున్నప్పుడు ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలని అనుకోం గానీ, “జీవంగల దేవుని వైపుకు” తిప్పాలని కోరుకుంటాం.

14-16. లుస్త్రలో జరిగినదాని నుండి మనం నేర్చుకునే ఇంకో రెండు పాఠాలు ఏంటి?

14 మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటంటే, పౌలు బర్నబాలు ప్రజలకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని మార్చుకున్నారు. ఈకొనియలోని యూదులకు, యూదులుగా మారిన అన్యజనులకు తెలిసినట్లు, లుస్త్రలోని ప్రజలకు లేఖనాల గురించి గానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవునికున్న సంబంధం గురించి గానీ ఏమీ తెలీదు లేదా అంతంత మాత్రమే తెలుసు. అయితే లుస్త్రలోని ప్రజలకు వ్యవసాయం గురించి బాగా తెలుసు. అక్కడ వర్షాలు బాగా కురిసేవి, పంటలు బాగా పండేవి. కాబట్టి, సృష్టికర్తకు ఉన్న గొప్ప లక్షణాల్ని అర్థం చేసుకోవడానికి వాళ్ల కళ్లముందు ఎన్నో రుజువులు ఉన్నాయి. వాళ్ల హృదయాల్ని చేరుకునేలా పౌలు, బర్నబా ఆ రుజువుల్ని ఉపయోగించే ప్రకటించారు.—రోమా. 1:19, 20.

15 వాళ్లలాగే మనం కూడా ప్రజలకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని మార్చుకోగలమా? ఒక రైతు ఒకే రకమైన విత్తనాల్ని నాటుతున్నప్పటికీ, తను పండించే పొలంలోని నేలను బట్టి తన పద్ధతుల్ని మార్చుకుంటాడు. కొన్ని రకాల నేలలు విత్తనాల్ని నాటడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఇంకొన్ని రకాల నేలలు అలా ఉండవు. వాటిని విత్తనాలు నాటడానికి అనుకూలంగా మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా, నేడు మనం విత్తే విత్తనం కూడా ఒక్కటే. అదే, దేవుని వాక్యంలోని రాజ్య సందేశం. పౌలు బర్నబాల్లాగే మనం కూడా ముందుగా ప్రజల పరిస్థితుల్ని, వాళ్ల మతనమ్మకాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. తర్వాత వాళ్లకు తగ్గట్టుగా రాజ్య సందేశాన్ని ప్రకటిస్తాం.—లూకా 8:11, 15.

16 లుస్త్రలో జరిగినదాని నుండి మనం ఇంకో పాఠం నేర్చుకోవచ్చు. మనం ఎంత బాగా ప్రయత్నించినా సరే, కొన్నిసార్లు మనం నాటిన విత్తనాన్ని ఎవరైనా ఎత్తుకెళ్లిపోవచ్చు లేదా ఆ విత్తనం రాతి నేల మీద పడవచ్చు. (మత్త. 13:18-21) ఒకవేళ అలా జరిగితే నిరుత్సాహపడకండి. తర్వాతి రోజుల్లో, పౌలు రోములో ఉన్న క్రైస్తవులకు చెప్పిన ఈ మాటల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం: “మనలో ప్రతీ ఒక్కరు [అంటే, మనం ప్రకటించిన వాళ్లతో సహా ప్రతీ ఒక్కరు] తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.”—రోమా. 14:12.

‘ఆ పెద్దల్ని వాళ్లు యెహోవాకు అప్పగించారు’ (అపొ. 14:20-28)

17. పౌలు, బర్నబాలు దెర్బే నుండి ఎక్కడికి వెళ్లారు, ఎందుకు?

17 లుస్త్రలోని ప్రజలు పౌలును రాళ్లతో కొట్టి, ఆయన చనిపోయాడనుకుని ఊరి అవతల పడేశారు. అప్పుడు కొంతమంది శిష్యులు పౌలు దగ్గరకు వచ్చి, ఆయన్ని లేపి ఆ నగరంలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఆ రాత్రి అక్కడే ఉంచారు. తర్వాతి రోజు పౌలు, బర్నబా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెర్బేకు ప్రయాణమయ్యారు. ముందటి రోజే ప్రజలు పౌలును రాళ్లతో తీవ్రంగా కొట్టారు. కాబట్టి ఈ ప్రయాణం పౌలుకు ఎంత కష్టంగా అనిపించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయినా పౌలు, బర్నబా పట్టుదల చూపించారు. దెర్బేలో మంచివార్త ప్రకటించి, “చాలామందిని శిష్యుల్ని చేశారు.” తర్వాత వాళ్లు కావాలనుకుంటే, దగ్గరి దారిలో నేరుగా సిరియాలోని అంతియొకయకు వెళ్లిపోవచ్చు. కానీ వాళ్లు అలా చేయకుండా “లుస్త్రకు, ఈకొనియకు, [పిసిదియకు చెందిన] అంతియొకయకు తిరిగెళ్లారు.” వాళ్లు మళ్లీ అక్కడికి ఎందుకు వెళ్లారు? ‘విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ, వాళ్లను బలపర్చడం’ కోసం అలా తిరిగెళ్లారు. (అపొ. 14:20-22) పౌలు, బర్నబా ఎంత గొప్ప ఆదర్శం ఉంచారో కదా! వాళ్లకు అనుకూలంగా ఉండే దగ్గరి దారిలో వెళ్లిపోయే బదులు, సంఘానికి సహాయం చేయడమే ముఖ్యమని వాళ్లు అనుకున్నారు. నేడు ప్రయాణ పర్యవేక్షకులు, మిషనరీలు కూడా వాళ్లనే ఆదర్శంగా తీసుకుంటారు.

18. పెద్దల్ని నియమించడం ఎలా జరుగుతుంది?

18 పౌలు, బర్నబా తమ మాటలతో, ఆదర్శంతో శిష్యుల్ని ప్రోత్సహించడంతో పాటు “ఒక్కో సంఘంలో పెద్దల్ని నియమించారు.” పౌలు, బర్నబాలు ఈ మిషనరీ యాత్రకు ‘పవిత్రశక్తి ద్వారా పంపబడ్డారు.’ అయినప్పటికీ పెద్దల్ని నియమించి, వాళ్లను ‘యెహోవాకు అప్పగించే’ ముందు పౌలు, బర్నబా ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నారు. (అపొ. 13:1-4; 14:23) నేడు పెద్దల్ని నియమించడం కూడా అలాగే జరుగుతుంది. పెద్దలు ఎవరైనా సహోదరుణ్ణి సిఫారసు చేసే ముందు, అతను లేఖనాల్లోని అర్హతల్ని చేరుకున్నాడో లేదో ప్రార్థనాపూర్వకంగా పరిశీలిస్తారు. (1 తిమో. 3:1-10, 12, 13; తీతు 1:5-9; యాకో. 3:17, 18; 1 పేతు. 5:2, 3) ఆ సహోదరుడు ఎంతకాలం నుండి క్రైస్తవుడిగా ఉన్నాడు అనేది ముఖ్యమైన విషయం కాదు. బదులుగా అతని మాటలు, ప్రవర్తన పవిత్రశక్తి అతని మీద పని చేస్తున్నట్టు చూపిస్తున్నాయా, పవిత్రశక్తి నిర్దేశానికి తగ్గట్టు జీవిస్తాడనే పేరు అతనికి ఉందా అనేవి ముఖ్యంగా పరిశీలిస్తారు. పర్యవేక్షకులకు సంబంధించిన లేఖనాల్లో ఉన్న అర్హతల్ని చేరుకుంటేనే, ఆ సహోదరుడు కాపరిగా నియమించబడతాడు. (గల. 5:22, 23) సహోదరుల్ని అలా నియమించే బాధ్యత ప్రాంతీయ పర్యవేక్షకులకు ఉంటుంది.—1 తిమో. 5:22 తో పోల్చండి.

19. తమకు ఏ బాధ్యత ఉందని పెద్దలు గుర్తుంచుకుంటారు? పౌలు, బర్నబాల ఆదర్శాన్ని పెద్దలు ఎలా పాటిస్తారు?

19 సంఘం విషయంలో దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత తమకు ఉందని పెద్దలు గుర్తుంచుకుంటారు. (హెబ్రీ. 13:17) పౌలు బర్నబాల్లాగే పెద్దలు ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తారు, తమ మాటలతో తోటి విశ్వాసుల్ని బలపరుస్తారు. పెద్దలు, తమకన్నా సంఘంలో ఉన్నవాళ్ల ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.—ఫిలి. 2:3, 4.

20. నేడు తోటి సహోదర సహోదరీలు చేస్తున్న పని గురించి చదివినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

20 పౌలు, బర్నబా తమ మొదటి మిషనరీ యాత్రను పూర్తి చేసుకుని తిరిగి సిరియాలోని అంతియొకయకు వెళ్లిపోయారు. వాళ్లు అక్కడికి చేరుకున్నాక, ‘తమ ద్వారా దేవుడు చేసిన వాటన్నిటి గురించి, అలాగే దేవుడు అన్యజనుల కోసం విశ్వాసమనే తలుపు తెరవడం’ గురించి సహోదరులకు చెప్పారు. (అపొ. 14:27) నేడు తోటి సహోదర సహోదరీలు చేస్తున్న పని గురించి, యెహోవా వాళ్ల ప్రయత్నాల్ని దీవించడం గురించి చదివినప్పుడు “యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడుతూ” ఉండాలనే కోరిక మనలో బలపడుతుంది.

a ఈకొనియ—ఫ్రుగియుల నగరం” అనే బాక్సు చూడండి