కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 14

“మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం”

“మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం”

పరిపాలక సభ ఒక ముఖ్యమైన నిర్ణయం ఎలా తీసుకుంది? ఆ నిర్ణయం సంఘాలన్నిటినీ ఎలా ఐక్యం చేసింది?

అపొస్తలుల కార్యాలు 15:13-35 ఆధారంగా

1, 2. (ఎ) మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ముందు ఏ ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి? (బి) సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసే ఏ సమాచారం వాళ్ల ముందు ఉంది?

 యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు కలుసుకున్న గది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వాళ్లకు అర్థమైంది. సున్నతి గురించిన వివాదం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవదీసింది. క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలా? యెహోవా క్రైస్తవులుగా మారిన యూదుల్ని ఒకలా, క్రైస్తవులుగా మారిన అన్యజనుల్ని ఇంకోలా చూస్తున్నాడా?

2 అపొస్తలులు, పెద్దలు ఎన్నో విషయాల్ని పరిశీలించారు. వాళ్లు దేవుని వాక్యంలోని ప్రవచనాల్ని, అలాగే అన్యజనుల్ని దేవుడు అంగీకరించాడని తెలిపే అనుభవాల్ని చర్చించుకున్నారు. ఆ అనుభవాల్ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు కూడా అక్కడ ఉన్నారు. ప్రతీఒక్కరు వాళ్ల అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సమాచారమంతా ఇప్పుడు వాళ్ల ముందు ఉంది. పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశాన్ని వాళ్లు స్పష్టంగా చూడగలుగుతున్నారు. మరి వాళ్లు ఆ నిర్దేశాన్ని పాటిస్తారా?

3. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయాన్ని పరిశీలించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

3 పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశాన్ని పాటించాలంటే వాళ్లకు విశ్వాసం, ధైర్యం అవసరం. వాళ్లు తీసుకునే నిర్ణయం యూదా మతనాయకుల కోపాన్ని ఇంకా పెంచవచ్చు. దేవుని ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించడం తప్పనిసరి అని సంఘంలో కూడా కొంతమంది పట్టుబట్టుతున్నారు. బహుశా వాళ్లకు ఈ నిర్ణయం నచ్చకపోవచ్చు. మరి పరిపాలక సభ ఏం చేస్తుంది? దాని గురించే ఇప్పుడు చూస్తాం. అలాగే, ఆ సహోదరులు నేటి పరిపాలక సభకు ఎలాంటి చక్కని ఆదర్శం ఉంచారో పరిశీలిస్తాం. మనం కూడా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ల ఆదర్శాన్ని పాటించాలి.

‘ప్రవక్తలు రాసిన మాటలకు అనుగుణంగా ఉంది’ (అపొ. 15:13-21)

4, 5. దేవుని వాక్యంలోని ఏ ప్రవచనాన్ని యాకోబు చెప్పాడు?

4 శిష్యుడైన యాకోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన యేసు తమ్ముడు. a ఈ మీటింగ్‌కి ఆయనే ఛైర్మన్‌ అని తెలుస్తుంది. అక్కడ ఉన్నవాళ్లతో యాకోబు ఇలా అన్నాడు: ‘దేవుడు తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడానికి, ఇప్పుడు వాళ్లను అంగీకరిస్తున్నాడని ఇంతకుముందే సుమెయోను వివరంగా చెప్పాడు. ఇది ప్రవక్తలు రాసిన మాటలకు అనుగుణంగా ఉంది.’ వాళ్లందరూ దాదాపు ఏ ముగింపుకు వచ్చారో ఆయన మాటల్ని బట్టి తెలుసుకోవచ్చు.—అపొ. 15:14, 15.

5 సుమెయోను లేదా సీమోను పేతురు అన్న మాటలు అలాగే బర్నబా, పౌలు చెప్పిన అనుభవాలు బహుశా యాకోబుకు కొన్ని లేఖనాల్ని గుర్తు చేసి ఉంటాయి. అవి యెహోవా నిర్దేశాన్ని అర్థం చేసుకునేలా సహోదరులకు సహాయం చేశాయి. (యోహా. 14:26) ‘ప్రవక్తలు రాసిన మాటలకు అనుగుణంగా ఉంది’ అని అన్న తర్వాత యాకోబు ఆమోసు 9:11, 12 లో ని మాటల్ని చెప్పాడు. హీబ్రూ లేఖనాల్లో “ప్రవక్తల పుస్తకాలు” అని పిలవబడే వాటిలో ఆమోసు పుస్తకం ఒకటి. (మత్త. 22:40; అపొ. 15:16-18) యాకోబు అన్న మాటలు, నేడు ఆమోసు పుస్తకంలో కనిపించే మాటలకు కొంచెం వేరుగా ఉంటాయి. ఎందుకలా? బహుశా యాకోబు, హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదమైన సెప్టువజింటులోని మాటల్ని ఉపయోగించి ఉండవచ్చు.

6. దేవుని ఇష్టం ఏంటో అర్థం చేసుకునేలా సహోదరులకు లేఖనాలు ఎలా సహాయం చేశాయి?

6 “దావీదు ఇంటిని నిలబెడతాను” అని యెహోవా ఆమోసు ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు. అంటే, దావీదు వంశానికి రాజ్యాధికారాన్ని ఇచ్చి మెస్సీయ రాజ్యాన్ని స్థాపిస్తానని యెహోవా చెప్పాడు. (యెహె. 21:26, 27) దానర్థం యెహోవా మళ్లీ ఇశ్రాయేలీయుల్నే ప్రత్యేకమైన ప్రజలుగా ఎన్నుకుంటాడనా? కాదు. ఎందుకంటే ‘[దేవుని] పేరుతో పిలవబడే అన్నిదేశాల ప్రజల’ గురించి ఆమోసు ప్రవచనం చెప్తుందని యాకోబు గుర్తుచేశాడు. పేతురు కూడా కాసేపటి క్రితమే ఏమన్నాడో గుర్తుచేసుకోండి: “వాళ్లకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ల హృదయాల్ని పవిత్రపర్చడం ద్వారా దేవుడు మనల్ని [క్రైస్తవులుగా మారిన యూదుల్ని], అన్యజనుల్ని [క్రైస్తవులుగా మారిన అన్యజనుల్ని] ఒకేలా చూస్తున్నానని తెలియజేశాడు.” (అపొ. 15:9) ఒక్కమాటలో చెప్పాలంటే యూదులు, అన్యజనులు ఒకేవిధంగా మెస్సీయ రాజ్యానికి వారసులు అవ్వాలన్నదే దేవుని ఇష్టం. (రోమా. 8:17; ఎఫె. 2:17-19) అన్యజనులు ఆ రాజ్యానికి వారసులు అవ్వాలంటే, ముందు సున్నతి చేయించుకోవాలని గానీ లేదా యూదా మతంలోకి మారాలని గానీ ఏ ప్రవచనమూ చెప్పలేదు.

7, 8. (ఎ) యాకోబు ఏం అన్నాడు? (బి) ఆయన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు?

7 లేఖనాల్లో ఉన్న అలాంటి రుజువులతో పాటు పేతురు, బర్నబా, పౌలు చెప్పిన విషయాల్ని పరిశీలించాక యాకోబు ఇలా అన్నాడు: “కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న అన్యజనుల్ని ఇబ్బందిపెట్టడం మంచిదికాదని నా అభిప్రాయం. అయితే విగ్రహపూజ వల్ల కలుషితమైన వాటికి, లైంగిక పాపానికి, గొంతు పిసికి చంపినవాటికి, రక్తానికి దూరంగా ఉండమని వాళ్లకు రాసి పంపాలన్నదే నా అభిప్రాయం. మోషే పుస్తకాల్లోని ఈ ఆజ్ఞల్ని ప్రకటించేవాళ్లు ప్రాచీనకాలాల నుండి అన్ని నగరాల్లో ఉన్నారు. ఎందుకంటే, ప్రతీ విశ్రాంతి రోజున ఆ పుస్తకాల్లో ఉన్నవాటిని సమాజమందిరాల్లో బయటికి చదివి వినిపిస్తున్నారు.”—అపొ. 15:19-21.

8 యాకోబు బహుశా ఆ మీటింగ్‌కి ఛైర్మన్‌గా ఉన్నాడు కాబట్టి, తన అధికారాన్ని ఉపయోగించి ఏం చేయాలో ఆయనే నిర్ణయించేస్తున్నాడా? లేదు! “నా అభిప్రాయం” అనే మాట యాకోబు పరిపాలక సభ మీద అధికారం చెలాయిస్తున్నాడని చూపించట్లేదు. బదులుగా, అప్పటివరకు విన్నదాన్ని బట్టి, లేఖనాలు చెప్తున్నదాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆయనకు అనిపించిందో దాన్ని వాళ్లందరి ముందుపెట్టాడు.

9. యాకోబు ఇచ్చిన సలహా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

9 యాకోబు ఇచ్చింది మంచి సలహానేనా? ఖచ్చితంగా! అపొస్తలులు, పెద్దలు ఆయన ఇచ్చిన సలహాను అంగీకరించారు. ఆ సలహా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఒకటి, ఆ సలహా క్రైస్తవులుగా మారిన అన్యజనుల్ని “ఇబ్బంది పెట్టదు” లేదా కష్టపెట్టదు. ఎందుకంటే వాళ్లు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (అపొ. 15:19) రెండు, అది క్రైస్తవులుగా మారిన యూదుల మనస్సాక్షిని గౌరవిస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా ‘ప్రతీ విశ్రాంతి రోజున, సమాజమందిరాల్లో చదివి వినిపిస్తున్న మోషే పుస్తకాల్లో ఉన్నవాటికి’ అది అనుగుణంగా ఉంది. b (అపొ. 15:21) యాకోబు ఇచ్చిన సలహా క్రైస్తవులుగా మారిన యూదుల్ని, అన్యజనుల్ని ఖచ్చితంగా మరింత దగ్గర చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆ సలహా దేవుని నిర్దేశానికి అనుగుణంగా ఉంది కాబట్టి అది యెహోవా హృదయాన్ని సంతోషపెడుతుంది. దేవుని ప్రజల మధ్య శాంతిని, ఐక్యతను దెబ్బతీసే ఈ సమస్యను వాళ్లు ఎంత చక్కగా పరిష్కరించారో కదా! అది నేటి క్రైస్తవ సంఘానికి మంచి ఆదర్శం.

1998 అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తున్న ఆల్బర్ట్‌ ష్రోడర్‌

10. మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఆదర్శాన్ని నేటి పరిపాలక సభ ఎలా పాటిస్తుంది?

10 మనం ముందటి అధ్యాయంలో చూసినట్లుగా, మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఆదర్శాన్నే నేటి యెహోవాసాక్షుల పరిపాలక సభ పాటిస్తుంది. వాళ్లు అన్ని విషయాల్లో నిర్దేశం కోసం విశ్వసర్వాధిపతైన యెహోవా వైపు, సంఘానికి శిరస్సయిన యేసుక్రీస్తు వైపు చూస్తారు. c (1 కొరిం. 11:3) దాన్ని వాళ్లు ఎలా చేస్తారు? 1974 నుండి పరిపాలక సభ సభ్యునిగా సేవచేసి, 2006 మార్చిలో తన భూజీవితాన్ని ముగించిన ఆల్బర్ట్‌ డి. ష్రోడర్‌ ఇలా అన్నాడు: ‘పరిపాలక సభ ప్రతీ బుధవారం సమావేశమౌతుంది. ముందుగా పవిత్రశక్తి నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థన చేస్తారు. చర్చించే ప్రతీ విషయం, తీసుకునే ప్రతీ నిర్ణయం దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా ఉండేలా వాళ్లు చాలా కృషి చేస్తారు.’ అదేవిధంగా పరిపాలక సభ సభ్యునిగా చాలాకాలం సేవచేసి, 2003 మార్చిలో తన భూజీవితాన్ని ముగించిన సహోదరుడు మిల్టన్‌ జి. హెన్షెల్‌, 101వ తరగతి గిలియడ్‌ పాఠశాల విద్యార్థుల్ని ఈ ప్రశ్న అడిగాడు: ‘ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, దేవుని వాక్యమైన బైబిల్ని సంప్రదించే పరిపాలక సభ కలిగి ఉన్న సంస్థ మరొకటి ఏదైనా ఈ భూమ్మీద ఉందా?’ లేదు అని మనకు తెలుసు.

‘ఎంచుకోబడినవాళ్లను పంపాలని అనుకున్నారు’ (అపొ. 15:22-29)

11. పరిపాలక సభ తమ నిర్ణయాన్ని సంఘాలకు ఎలా తెలియజేసింది?

11 సున్నతి గురించి యెరూషలేములోని పరిపాలక సభ అంతా కలిసి ఒక ముగింపుకు వచ్చింది. సంఘంలోని సహోదరులు ఐక్యంగా ఉండాలంటే వాళ్లు తమ నిర్ణయాన్ని స్పష్టంగా, ప్రోత్సాహకరంగా చెప్పాలి. మరి వాళ్లు దాన్ని ఎలా చేస్తారు? దానిగురించి లూకా ఇలా రాశాడు: “అపొస్తలులు, పెద్దలు సంఘమంతటితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లు తమలో నుండి ఎంచుకోబడినవాళ్లను పౌలు, బర్నబాలతో పాటు అంతియొకయకు పంపాలని అనుకున్నారు. కాబట్టి వాళ్లు సహోదరుల మధ్య నాయకత్వం వహిస్తున్న ఇద్దర్ని అంటే బర్సబ్బా అని పిలవబడిన యూదాను, సీలను పంపించారు.” అంతేకాదు అంతియొకయలో, సిరియాలో, కిలికియలో ఉన్న సంఘాలన్నిట్లో చదివి వినిపించడానికి వాళ్లతోపాటు ఒక ఉత్తరాన్ని ఇచ్చి పంపించారు.—అపొ. 15:22-26.

12, 13. పరిపాలక సభ యూదాను, సీలను పంపించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? (బి) వాళ్లతోపాటు ఉత్తరాన్ని ఇచ్చి పంపించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

12 యూదా, సీల ‘సహోదరుల మధ్య నాయకత్వం వహిస్తున్నారు’ కాబట్టి పరిపాలక సభ తరఫున వెళ్లడానికి వాళ్లు పూర్తిగా అర్హులు. ఈ నలుగుర్నీ పంపించడం ద్వారా, సున్నతి గురించిన విషయానికి సమాధానం ఇవ్వడమే కాదు, ఒక కొత్త నిర్దేశాన్ని కూడా ఇస్తున్నాం అని పరిపాలక సభ స్పష్టం చేసింది. యెరూషలేములో ఉన్న యూదా క్రైస్తవులు, సంఘాలన్నిటిలో ఉన్న క్రైస్తవులుగా మారిన అన్యజనులు ఒకరికొకరు మరింత దగ్గరయ్యేలా ఈ “ఎంచుకోబడినవాళ్లు” సహాయం చేయగలుగుతారు. వాళ్లను పంపించడం నిజంగా తెలివైన నిర్ణయం, అది పరిపాలక సభకు ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఈ నిర్ణయం దేవుని ప్రజల మధ్య శాంతిని, ఐక్యతను పెంచుతుంది అనడంలో ఏ సందేహం లేదు!

13 క్రైస్తవులుగా మారిన అన్యజనులు సున్నతి చేయించుకోవాలా వద్దా అనే విషయంలో ఆ ఉత్తరం స్పష్టమైన నిర్దేశం ఇచ్చింది. అంతేకాదు యెహోవా ఆమోదాన్ని, ఆయన దీవెనల్ని పొందాలంటే వాళ్లు ఏం చేయాలో కూడా చెప్పింది. ఆ ఉత్తరంలో ముఖ్యంగా ఇలా ఉంది: “అవసరమైన ఈ విషయాలు తప్ప అదనంగా ఏ భారం మీ మీద పెట్టకూడదని పవిత్రశక్తి సహాయంతో మేము ఒక ముగింపుకు వచ్చాం, అవేమిటంటే: విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి, రక్తానికి, గొంతు పిసికి చంపినవాటికి, లైంగిక పాపానికి ఎప్పుడూ దూరంగా ఉండండి. మీరు జాగ్రత్తగా వీటికి దూరంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. మీరు క్షేమంగా ఉండాలి!”—అపొ. 15:28, 29.

14. ఏ మాత్రం ఐక్యతలేని ఈ లోకంలో యెహోవాసాక్షులు ఎలా ఐక్యంగా ఉండగలుగుతున్నారు?

14 నేడు ప్రపంచవ్యాప్తంగా లక్ష కంటే ఎక్కువ సంఘాల్లో, 80 లక్షల కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు. వాళ్లందరి నమ్మకాలు ఒకేలా ఉంటాయి, వాళ్ల మధ్య నిజమైన ఐక్యత కనిపిస్తుంది. ఏ మాత్రం ఐక్యతలేని, గందరగోళంలో మునిగిపోయిన ఈ లోకంలో అది ఎలా సాధ్యం? సంఘానికి శిరస్సయిన యేసుక్రీస్తు నమ్మకమైన బుద్ధిగల దాసుని ద్వారా, అంటే పరిపాలక సభ ద్వారా ఇస్తున్న స్పష్టమైన, సరైన నిర్దేశం వల్ల అది సాధ్యమౌతుంది. (మత్త. 24:45-47) పరిపాలక సభ ఇస్తున్న నిర్దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులు పాటిస్తూ ఉండడం వల్ల కూడా మన మధ్య ఐక్యత కనిపిస్తుంది.

“ప్రోత్సహించే మాటల్ని బట్టి ఎంతో సంతోషించారు” (అపొ. 15:30-35)

15, 16. పరిపాలక సభ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ఫలితం వచ్చింది? అది ఎలా సాధ్యమైంది?

15 ఆ నలుగురు యెరూషలేము నుండి బయల్దేరి అంతియొకయకు వచ్చిన తర్వాత “శిష్యులందర్నీ ఒక చోట సమావేశపర్చి ఆ ఉత్తరం వాళ్ల చేతికి ఇచ్చారు.” పరిపాలక సభ నుండి వచ్చిన నిర్దేశం విన్నాక అక్కడున్న సహోదరులకు ఎలా అనిపించింది? వాళ్లంతా “ఉత్తరం చదివాక, అందులో ఉన్న ప్రోత్సహించే మాటల్ని బట్టి ఎంతో సంతోషించారు.” (అపొ. 15:30, 31) అంతేకాదు యూదా, సీల “ప్రసంగాలిచ్చి సహోదరుల్ని ప్రోత్సహించారు, బలపర్చారు.” అందుకే బర్నబా, పౌలు, ఇతరుల్లాగే వాళ్లిద్దరు కూడా “ప్రవక్తలు” అని పిలవబడ్డారు. దేవుని ఇష్టాన్ని తెలియజేసే వాళ్లను ప్రవక్తలని బైబిలు పిలుస్తుంది.—అపొ. 13:1; 15:32; నిర్గ. 7:1, 2.

16 పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాన్ని యెహోవా ఆశీర్వదించాడు. దానివల్ల సంఘాలన్నీ ఎంతో ప్రోత్సాహం పొందాయి. ఇదంతా ఎలా సాధ్యమైంది? పవిత్రశక్తి నిర్దేశంతో, దేవుని వాక్యం ఆధారంగా పరిపాలక సభ సరైన సమయానికి, స్పష్టమైన నిర్దేశం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. తమ నిర్ణయాన్ని సంఘాలన్నిటికీ తెలియజేయడానికి వాళ్లు చేసిన ప్రేమపూర్వక ఏర్పాటు వల్ల కూడా అది సాధ్యమైంది.

17. పౌలు, బర్నబా, యూదా, సీలల్లాగే నేటి ప్రాంతీయ పర్యవేక్షకులు ఏం చేస్తున్నారు?

17 అదే పద్ధతిని పాటిస్తూ, నేటి యెహోవాసాక్షుల పరిపాలక సభ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులకు సరైన సమయంలో నిర్దేశాలు ఇస్తుంది. పరిపాలక సభ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని సంఘాలకు స్పష్టంగా, సూటిగా తెలియజేస్తుంది. కొన్నిసార్లు పరిపాలక సభ సంఘాలకు ఆ నిర్దేశాల్ని ప్రాంతీయ పర్యవేక్షకుల ద్వారా ఇస్తుంది. ఎన్నో త్యాగాలు చేసే ఈ సహోదరులు, ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి ప్రయాణిస్తూ స్పష్టమైన నిర్దేశాల్ని ఇస్తారు, ప్రోత్సహిస్తారు. పౌలు, బర్నబాల్లాగే ఈ ప్రాంతీయ పర్యవేక్షకులు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వాళ్లు “చాలామంది సహోదరులతో కలిసి యెహోవా వాక్యం గురించిన మంచివార్తను బోధిస్తూ, ప్రకటిస్తూ” ఉంటారు. (అపొ. 15:35) యూదా, సీలల్లాగే “చాలా ప్రసంగాలిచ్చి సహోదరుల్ని” ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు.

18. యెహోవా దీవెనలు పొందాలంటే నేడు దేవుని ప్రజలు ఏం చేయాలి?

18 మరి నేటి సంఘాల సంగతేంటి? ఏమాత్రం ఐక్యతలేని ఈ లోకంలో, ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నిట్లో శాంతి, ఐక్యత ఉండాలంటే ఏం అవసరం? కొంతకాలం తర్వాత శిష్యుడైన యాకోబు రాసిన ఈ మాటల్ని గమనించండి: “పరలోకం నుండి వచ్చే తెలివి మొట్టమొదట స్వచ్ఛమైనది, తర్వాత శాంతికరమైనది, పట్టుబట్టే స్వభావం లేనిది, లోబడడానికి సిద్ధంగా ఉండేది . . . అంతేకాదు, అందరితో శాంతిగా ఉండడానికి కృషి చేసేవాళ్లు శాంతిని వ్యాప్తి చేస్తారు; దానివల్ల వాళ్లు నీతియుక్తమైన పనులు చేయగలుగుతారు.” (యాకో. 3:17, 18) యెరూషలేములో జరిగిన ఆ సమావేశాన్ని మనసులో పెట్టుకుని యాకోబు ఈ మాటలు రాసి ఉంటాడా? ఏమో, మనకు తెలీదు. కానీ అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయాన్ని పరిశీలించాక ఒక విషయం స్పష్టంగా అర్థమౌతుంది: మనం ఐక్యంగా ఉంటూ, నిర్దేశాలకు లోబడినప్పుడు మాత్రమే యెహోవా దీవెనలు పొందుతాం.

19, 20. (ఎ) అంతియొకయ సంఘంలో ఇప్పుడు శాంతి, ఐక్యత ఉన్నాయని ఎలా చెప్పవచ్చు? (బి) పౌలు, బర్నబాలు ఇప్పుడు ఏం చేయవచ్చు?

19 పరిపాలక సభ నిర్ణయం తెలుసుకున్నాక, అంతియొకయ సంఘం ఇప్పుడు శాంతిగా, ఐక్యంగా ఉంది. అంతియొకయలో ఉన్న సహోదరులు యెరూషలేము నుండి వచ్చిన సహోదరులతో వాదించలేదు. బదులుగా యూదా, సీల అక్కడికి వచ్చినందుకు వాళ్లు చాలా సంతోషించారు. లూకా ఇలా రాశాడు: “వాళ్లు అక్కడ కొన్ని రోజులు ఉన్నాక, సహోదరులు వాళ్లకు వీడ్కోలు చెప్పారు. తర్వాత వాళ్లు యెరూషలేముకు తిరిగెళ్లారు.” d (అపొ. 15:33) యూదా, సీల యెరూషలేముకు తిరిగెళ్లి జరిగిందంతా చెప్పినప్పుడు అక్కడున్న సహోదరులు ఖచ్చితంగా ఆనందించి ఉంటారు. యెహోవా చూపించిన అపారదయ వల్ల వాళ్ల ప్రయాణం విజయవంతమైంది!

20 పౌలు, బర్నబా అంతియొకయలోనే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్లు ప్రశాంతంగా ప్రకటనా పని మీద మనసుపెట్టవచ్చు. నేడున్న ప్రాంతీయ పర్యవేక్షకులు కూడా సంఘాల్ని సందర్శిస్తున్నప్పుడు అదే పని చేస్తారు. (అపొ. 13:2, 3) అలాంటి ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘానికి ఒక మంచి దీవెన! ప్రకటనా పనిని ఉత్సాహంగా చేస్తున్న పౌలు, బర్నబాల్ని ఇప్పుడు యెహోవా ఎలా ఉపయోగించుకుంటాడు? వాళ్లు ముందుముందు ఎలాంటి దీవెనలు పొందుతారు? ఈ విషయాల గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.

పరిపాలక సభ, దాని ప్రతినిధులు ఇస్తున్న ఉపదేశం నుండి నేటి క్రైస్తవులు ప్రయోజనం పొందుతున్నారు

a ప్రభువు తమ్ముడైన యాకోబు” అనే బాక్సు చూడండి.

b యాకోబు తెలివిగా మోషే రాసిన పుస్తకాలు చెప్తున్న వాటి గురించి మాట్లాడాడు. మోషే రాసిన పుస్తకాల్లో ధర్మశాస్త్రమే కాదు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రం రాక ముందు, మనుషులందరి విషయంలో దేవుని ఇష్టం ఏంటో ఆ పుస్తకాలు తెలియజేశాయి. ఉదాహరణకు, రక్తం, లైంగిక పాపం, విగ్రహారాధన లాంటి విషయాల్లో దేవుని అభిప్రాయం ఏంటో ఆదికాండం పుస్తకంలో స్పష్టంగా చూడవచ్చు. (ఆది. 9:3, 4; 20:2-9; 35:2, 4) యూదులైనా, అన్యజనులైనా మనుషులందరూ పాటించాల్సిన సూత్రాల్ని యెహోవా ముందుగానే తెలియజేశాడు.

d 34వ వచనంలో, సీల అంతియొకయలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడని కొన్ని బైబిలు అనువాదాలు చెప్పాయి. (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) కానీ అపొస్తలుల కార్యాలు పుస్తకం రాయడం పూర్తయిన తర్వాతే, ఆ మాటలు చేర్చబడ్డాయని తెలుస్తుంది.