కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 1

సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు

సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు

దేవుడు విశ్వాన్ని, భూమ్మీద జీవంతోవున్న ప్రతీదాన్ని సృష్టించాడు. తర్వాత, పరిపూర్ణమైన పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి, వారిని ఓ అందమైన తోటలో ఉంచి, వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు

“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) సుపరిచితమైన ఈ పరిచయ మాటలు చాలా ప్రత్యేకమైనవి. పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో ఘనత ఆపాదించబడిన సర్వశక్తిగల దేవుడైన యెహోవాను, స్పష్టమైన ఆ ఒక్క వాక్యంతో బైబిలు పరిచయం చేస్తోంది. మనం జీవిస్తున్న భూగ్రహంతోసహా ఈ విశ్వాన్నంతా దేవుడే సృష్టించాడని బైబిల్లోని ఆ మొదటి వచనం తెలియజేస్తోంది. బైబిలు కొన్నిసార్లు దినములు అని ప్రస్తావించినప్పుడు అది వేల సంవత్సరాలను సూచిస్తుంది. అలా కొన్ని వేల సంవత్సరాల కాలవ్యవధిలో దేవుడు మన నివాసగృహమైన భూమిని ప్రకృతి సౌందర్యాలతో ఎలా తీర్చిదిద్దాడో ఆ తర్వాతి వచనాలు తెలియజేస్తాయి.

యెహోవా దేవుడు భూమ్మీద చేసినవాటన్నిటిలో మానవుని సృష్టి అత్యద్భుతమైనది. ఎందుకంటే ఆయన మనిషిని తన స్వరూపంలో అంటే ప్రేమ, జ్ఞానంలాంటి తన లక్షణాలను చూపించే సామర్థ్యంతో సృష్టించాడు. యెహోవా దేవుడు మనిషిని మట్టితో చేసి, అతనికి ఆదాము అని పేరుపెట్టి, పరదైసులో అంటే ఏదెను అనే అందమైన తోటలో ఉంచాడు. అంతేకాక, ఆ తోటలో మంచి కాపునిచ్చే అందమైన చెట్లను మొలిపించాడు.

మనిషికి ఒక తోడు అవసరమని దేవునికి అనిపించింది. అందుకే, దేవుడు ఆదాముకు గాఢనిద్ర వచ్చేలా చేసి ఆయన పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి దానితో స్త్రీని చేశాడు. ఆమెను ఆయనకు భార్యగా ఇచ్చాడు. ఆదాము ఆనందంతో పరవశించిపోయి, “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము” అంటూ కవిత్వం చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు హవ్వ అనే పేరు పెట్టాడు. దేవుడు ఇలా వివరించాడు: “కాబట్టి, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”—ఆదికాండము 2:22-24; 3:20.

దేవుడు ఆదాము హవ్వలకు రెండు ఆజ్ఞలిచ్చాడు. మొదటిగా, భూమిని సాగుచేసి దాన్ని జాగ్రత్తగా చూసుకోమని, పిల్లల్ని కని భూమ్మీద విస్తరించమని చెప్పాడు. రెండవదిగా, విస్తారమైన ఆ తోటలోవున్న చెట్లన్నిటిలో ఒక చెట్టు పండ్లను, అంటే “మంచి చెడ్డల తెలివినిచ్చు” చెట్టు పండ్లను తినకూడదని చెప్పాడు. (ఆదికాండము 2:17) వాళ్లు ఆయన మాట వినకపోతే చనిపోతారు. ఆ ఆజ్ఞలను పాటించి, ఆయనను తమ పరిపాలకునిగా అంగీకరిస్తున్నామని చూపించే అవకాశాన్ని దేవుడు వాళ్లకిచ్చాడు. అంతేకాదు, వాళ్లు ఆయన మాట వింటే తమకు ఆయనపట్ల ప్రేమా కృతజ్ఞతా ఉన్నాయని కూడా చూపిస్తారు. దయగల ఆయన పరిపాలనను కాదనడానికి వాళ్లకు ఏ కారణమూ లేదు. పరిపూర్ణులైన ఆదాము, హవ్వల్లో ఎలాంటి లోపమూ లేదు. ‘దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలమంచిదిగ ఉండెను’ అని బైబిలు చెప్తోంది.—ఆదికాండము 1:31.

ఆదికాండము 1, 2 అధ్యాయాలు.