కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 9

ఇశ్రాయేలీయులు ఒక రాజు కావాలని అడిగారు

ఇశ్రాయేలీయులు ఒక రాజు కావాలని అడిగారు

ఇశ్రాయేలీయుల మొదటి రాజు సౌలు యెహోవాకు లోబడలేదు. ఆయన తర్వాత దావీదు రాజయ్యాడు. దేవుడు దావీదుతో నిత్యం నిలిచివుండే రాజ్యానికి సంబంధించిన నిబంధన చేశాడు

సమ్సోను తర్వాత సమూయేలు ఇశ్రాయేలులో ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా సేవచేశాడు. ఇతర జనాంగాల్లాగే తమకూ ఒక వ్యక్తి రాజుగా ఉండాలని వాళ్లు సమూయేలును చాలాసార్లు అడిగారు. అది యెహోవాకు అవమానకరంగా అనిపించినా వాళ్లు అడిగినట్లే చేయమని ఆయన సమూయేలుకు చెప్పాడు. దేవుడు వినయంగల సౌలును రాజుగా ఎంపిక చేశాడు. కానీ, మెల్లగా సౌలులో గర్వం పెరిగి దేవునికి లోబడడం మానేశాడు. యెహోవా ఆయన స్థానంలో యువకుడైన దావీదును రాజుగా నియమించమని సమూయేలుతో చెప్పాడు. అయితే దావీదు వెంటనే రాజు కాలేదు.

ఒకసారి దావీదు, సౌలు సైన్యంలో పనిచేస్తున్న తన అన్నల దగ్గరికి వెళ్లాడు. అప్పుడు, బహుశా ఆయన వయసు 13-19 ఏళ్ల మధ్యలో ఉండివుంటుంది. ఇశ్రాయేలీయులను, వాళ్ల దేవుణ్ణి ఎగతాళి చేస్తున్న భారీకాయుడైన గొల్యాతు అనే ఒక శత్రుయోధుడికి సైన్యమంతా భయపడడం చూశాడు. దాంతో కోపోద్రేకుడైన దావీదు, తొమ్మిది అడుగుల ఎత్తున్న గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక వడిసెల, కొన్ని రాళ్లు తీసుకొని దావీదు శత్రువు మీదికి వెళ్లాడు. గొల్యాతు ఆయనను ఎగతాళి చేసినప్పుడు దావీదు అతనికన్నా తన దగ్గర బలమైన ఆయుధం ఉందని చెప్పాడు. ఎందుకంటే, దావీదు యెహోవా దేవుని పేరిట యుద్ధానికి వెళ్లాడు. ఒకేఒక రాయితో అతణ్ణి పడగొట్టి, అతని కత్తితోనే అతని తలను నరికేశాడు. అది చూసిన ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు.

మొదట్లో, సౌలు దావీదు ధైర్యానికి ముగ్ధుడై ఆయనను తన సైన్యాధిపతిగా నియమించాడు. కానీ, దావీదు విజయపరంపరను చూసి సౌలుకు ఎంతో అసూయ కలిగింది. దాంతో ఆయన దావీదును చంపడానికి ప్రయత్నించాడు. అందుకే దావీదు పారిపోయి ఎన్నో సంవత్సరాలపాటు సౌలు కంటపడకుండా దాక్కోవాల్సి వచ్చింది. సౌలు అంత చేసినా, ఆయన యెహోవా నియమించిన రాజు కాబట్టి దావీదు ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. చివరికి, సౌలు ఒక యుద్ధంలో చనిపోయాడు. ఆ వెంటనే, యెహోవా వాగ్దానం చేసినట్టు దావీదు రాజయ్యాడు.

“అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.”—2 సమూయేలు 7:13

దావీదు తను రాజుగా ఉన్నప్పుడు యెహోవాకు ఒక ఆలయం కట్టించాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ, ఆయన కాకుండా ఆయన కుమారుల్లో ఒకరు ఆ పని చేస్తారని యెహోవా చెప్పాడు. ఆయన చెప్పినట్టే, దావీదు కుమారుడైన సొలొమోను ఆ పని చేశాడు. అయితే, దేవుడు దావీదుతో ఒక గొప్ప నిబంధన చేసి ఆయనను ఆశీర్వదించాడు. ఆ నిబంధన ఏమిటంటే, దావీదు కుటుంబంలోనుండే చాలామంది రాజులుగా పరిపాలిస్తారు. చివరకు, ఆ వంశంలోనే విమోచకుడు లేదా ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానం పుడతాడు. ఆ సంతానమే మెస్సీయగా అంటే దేవునిచేత ‘అభిషేకించబడిన’ వ్యక్తిగా నిరంతరం నిలిచే ప్రభుత్వానికి లేదా రాజ్యానికి పరిపాలకుడు అవుతాడు.

దేవుడు అలా ఆశీర్వదించినందుకు ఎంతో కృతజ్ఞతతో దావీదు ఆలయ నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని, వెండి బంగారాలను పెద్ద మోతాదులో సమకూర్చి పెట్టాడు. ఆయన ఎన్నో ప్రేరేపిత కీర్తనలను కూడా కూర్చాడు. దావీదు తన జీవిత చరమాంకంలో ఇలా అన్నాడు: “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది.”—2 సమూయేలు 23:2.

—1వ, 2వ సమూయేలు; 1 దినవృత్తాంతములు; యెషయా 9:7;మత్తయి21:9; లూకా 1:32; యోహాను 7:42.