కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 10

సొలొమోను జ్ఞానంగల రాజు

సొలొమోను జ్ఞానంగల రాజు

యెహోవా సొలొమోనుకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు; ఆయన పాలనలో ఇశ్రాయేలీయులు ఏ కొదువ లేకుండా ప్రశాంతంగా జీవించారు

రాజుతో సహా ప్రజలందరూ యెహోవా అధికారానికి లోబడుతూ ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఎలా ఉంటుంది? సొలొమోను 40 ఏళ్ల పరిపాలనే దానికి ఒక చక్కని ఉదాహరణ.

దావీదు చనిపోయే ముందు తన కుమారుడైన సొలొమోనును రాజుగా నియమించాడు. దేవుడు ఒక రాత్రి సొలొమోనుతో కలలో మాట్లాడి ఏదైనా కోరుకోమని చెప్పాడు. ప్రజలకు న్యాయం తీర్చడానికి కావాల్సిన బుద్ధివివేకాలను ఇవ్వమని సొలొమోను కోరాడు. దానికి యెహోవా ఎంతో సంతోషించి ఆయన అడిగింది ఇచ్చాడు. తనకు లోబడివుంటే సంపదలను, పేరుప్రతిష్ఠలను, దీర్ఘాయుష్షును ఇస్తానని కూడా యెహోవా వాగ్దానం చేశాడు.

సొలొమోనుకు న్యాయంగా తీర్పుతీరుస్తాడనే పేరు వచ్చింది. ఒకసారి, ఇద్దరు స్త్రీలు ఒక చంటిబిడ్డతో ఆయన దగ్గరకు వచ్చి, ఆ బిడ్డ నాదంటే నాదని వాదించారు. అందుకు ఆయన, ఆ బిడ్డను రెండుగా కోసి ఆ ఇద్దరికి చెరో భాగమివ్వమని ఆజ్ఞాపించాడు. దానికి ఒక స్త్రీ ఒప్పుకుంది కానీ, ఆ బిడ్డ అసలు తల్లి మాత్రం బిడ్డను చంపకుండా ఆ స్త్రీకే ఇచ్చేయమని ప్రాధేయపడింది. ప్రేమగల ఈ స్త్రీయే అసలు తల్లి అని సొలొమోను గ్రహించి బిడ్డను ఆమెకు అప్పగించాడు. ఈ తీర్పు గురించి ఇశ్రాయేలు దేశమంతా తెలిసింది. సొలొమోనుకు దేవుడు ఎంతో జ్ఞానాన్నిచ్చాడని ప్రజలు గుర్తించారు.

సొలొమోను తన పరిపాలనలో ఎన్నో గొప్ప పనులు చేశాడు. వాటిలో యెహోవా ఆలయం కట్టించడం ఒకటి. ఇశ్రాయేలీయులందరూ యెరూషలేముకు వచ్చి యెహోవాను ఆరాధించడానికే ఆయన వైభవోపేతమైన ఆలయాన్ని కట్టించాడు. ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను ఇలా ప్రార్థించాడు: “ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?”—1 రాజులు 8:27.

సొలొమోను పేరుప్రతిష్ఠల గురించి వేరే దేశాలకు చివరకు అరేబియాలోని షేబ దేశం వరకు తెలిసింది. షేబ దేశపు రాణి సొలొమోను వైభవాన్ని, సంపదలను చూడడానికి, ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి వెళ్లింది. ఆయన జ్ఞానాన్ని, ఇశ్రాయేలు సుసంపన్న స్థితిని చూసి ఎంతో ముగ్ధురాలై అంతటి జ్ఞానంగల వ్యక్తిని రాజును చేసినందుకు యెహోవా దేవుణ్ణి స్తుతించింది. యెహోవా ఆశీస్సులతో శాంతిసంపదలతో వర్ధిల్లిన సొలొమోను పాలన ఇశ్రాయేలు చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.

కానీ, సొలొమోను కొంతకాలం తర్వాత అవివేకంగా ప్రవర్తించాడు. దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి అన్య దేవతలను ఆరాధించే వందలకొద్దీ స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు. వాళ్లు మెల్లమెల్లగా ఆయనను మార్చేసి యెహోవాను కాకుండా విగ్రహాలను ఆరాధించేలా చేశారు. అలా చేసినందుకు ఆయన రాజ్యాన్ని విభాగించి వేరే రాజుకు ఇస్తానని యెహోవా ఆయనకు చెప్పాడు. ఆయన తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్నిబట్టి కొంతభాగం మాత్రం ఆయన కుటుంబానికి మిగిలివుంటుందని దేవుడు చెప్పాడు. సొలొమోను యెహోవా దేవుని మాట వినడం మానేసినా, యెహోవా మాత్రం తాను దావీదుతో చేసిన రాజ్య నిబంధనకు కట్టుబడివున్నాడు.

1 రాజులు 1 నుండి 11 అధ్యాయాలు;2 దినవృత్తాంతములు 1 నుండి 9 అధ్యాయాలు; ద్వితీయోపదేశకాండము 17:17.