కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 13

మంచి రాజులు, చెడ్డ రాజులు

మంచి రాజులు, చెడ్డ రాజులు

ఇశ్రాయేలు జనాంగం రెండుగా చీలిపోయింది. ఇశ్రాయేలీయులను ఎంతోమంది రాజులు పరిపాలించారు. వారిలో చాలామంది యెహోవాకు అవిధేయులయ్యారు. బబులోను సామ్రాజ్యం యెరూషలేమును నాశనం చేసింది

సొలొమోను సత్యారాధనను మానేసిన తర్వాత యెహోవా చెప్పినట్టే ఇశ్రాయేలు జనాంగం రెండుగా చీలిపోయింది. సొలొమోను తర్వాత రాజైన ఆయన కుమారుడు రెహబాము చాలా కఠినుడు. అందుకే ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల్లో పదిగోత్రాల ప్రజలు రెహబాము మీద తిరుగుబాటు చేసి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుగా ఏర్పడ్డారు. అయితే రెండు గోత్రాల ప్రజలు మాత్రం యెరూషలేము నుండి పరిపాలించే దావీదు వంశస్థులైన రాజులకు లోబడి, దక్షిణ రాజ్యమైన యూదాగా ఏర్పడ్డారు.

ఈ రెండు రాజ్యాలు యెహోవాను ఆరాధించకుండా, ఆయన మాట వినకుండా ఎన్నో సమస్యలు కొనితెచ్చుకున్నాయి. రాజ్యం చీలిపోయినప్పటి నుంచీ ఇశ్రాయేలు రాజులు వేరే దేవతల ఆరాధనను ప్రోత్సహించారు కాబట్టి యూదా రాజ్యం పరిస్థితికన్నా దాని పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వాళ్లను సరిచేయడానికి యెహోవా ఏలీయా, ఎలీషా వంటి ప్రవక్తలను పంపించాడు. వాళ్లు ఎన్నో అద్భుతాలు చేయడం, చివరకు చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించడం చూసినా ఇశ్రాయేలు రాజ్యం యెహోవాను నమ్మకుండా చెడుమార్గాన్ని అనుసరించింది. అందుకే, అది అష్షూరీయుల చేతుల్లో నాశనమయ్యేలా దేవుడు అనుమతించాడు.

ఇశ్రాయేలు నాశనమైపోయినా యూదా రాజ్యానికి మాత్రం ఆ తర్వాత దాదాపు ఒక శతాబ్దంవరకు ఏమీకాలేదు. అయినా దానికీ దేవుని శిక్ష తప్పలేదు. యూదాను పరిపాలించిన రాజుల్లో కొంతమంది మాత్రమే దేవుని ప్రవక్తల హెచ్చరికలు విని ప్రజలను తిరిగి యెహోవా దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఉదాహరణకు, యోషీయా రాజు యెహోవా ఆలయాన్ని బాగుచేయించి, యూదా రాజ్యంలో అన్య దేవతల ఆరాధనను మాన్పించడం మొదలుపెట్టాడు. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రపు అసలు ప్రతి దొరికినప్పుడు అందులోని విషయాలను తెలుసుకుని యోషీయా ఎంతో చలించిపోయాడు. ప్రజలు మళ్ళీ యెహోవాను ఆరాధించేలా చేయడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు.

విచారకరంగా, యోషీయా తర్వాత వచ్చిన రాజులు ఆయనలా మంచి పనులు చేయలేదు. అందుకే బబులోను సామ్రాజ్యం యెరూషలేమును, దానిలోవున్న ఆలయాన్ని నాశనం చేసి, యూదాను జయించడానికి యెహోవా అనుమతించాడు. బ్రతికున్నవాళ్లను బంధీలుగా బబులోనుకు తీసుకువెళ్ళారు. వాళ్ళు 70 సంవత్సరాలపాటు బంధీలుగా ఉంటారని దేవుడు ప్రవచించాడు. ఆ జనాంగం మళ్ళీ తమ స్వదేశానికి తిరిగి వచ్చేంతవరకు యూదాదేశం నిర్జనంగా ఉండిపోయింది.

యెరూషలేము నాశనమైనప్పటి నుండి, వాగ్దానం చేయబడిన విమోచకుడు లేదా ప్రవచించబడిన మెస్సీయ రాజయ్యేంతవరకు దావీదు వంశీకుల పరిపాలన ఆగిపోయింది. దావీదు వంశంనుండి వచ్చిన రాజులు యెరూషలేము నుండి పరిపాలించారు. వాళ్లలో చాలామంది, అపరిపూర్ణ మనుషులెవ్వరూ ప్రజలను సరిగా పరిపాలించలేరని రుజువుచేశారు. కేవలం మెస్సీయ మాత్రమే పరిపాలించడానికి అర్హుడు. అందుకే దావీదు వంశీకుల్లోని చివరిరాజుకు యెహోవా ఇలా చెప్పాడు: ‘కిరీటమును ఎత్తుము. దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అది నిలువదు [“అది ఎవ్వరికీ చెందదు” NW]. నేను దానిని అతనికిచ్చెదను.’—యెహెజ్కేలు 21:26, 27.

2 రాజులు; 2 దినవృత్తాంతములు 10 నుండి 36 అధ్యాయాలు; యిర్మీయా 25:8-11.