కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 16

మెస్సీయ రాక

మెస్సీయ రాక

ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన మెస్సీయ నజరేయుడైన యేసే అని యెహోవా స్పష్టం చేశాడు

యెహోవా తాను వాగ్దానం చేసిన మెస్సీయను గుర్తుపట్టడానికి ప్రజలకు ఏమైనా గుర్తులు ఇచ్చాడా? ఇచ్చాడు. అవేంటో చూద్దాం. హెబ్రీ లేఖనాలు రాయడం పూర్తయి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు గడిచాయి. ఉత్తర ప్రాంతమైన గలిలయలోని నజరేతు పట్టణంలో నివసించే మరియ అనే యువతి జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. గబ్రియేలు అనే దేవదూత ఆమెకు కనిపించి, ఆమె కన్యకే అయినా దేవుని పరిశుద్ధాత్మవల్ల గర్భవతియై ఒక మగ శిశువును కంటుందని చెప్పాడు. దేవుడే పరలోకంలో ఉన్న తన కుమారుని జీవాన్ని మరియ గర్భంలోకి మార్చాడు కాబట్టి ఆ శిశువుకు తండ్రి దేవుడే. ఆ కుమారుడే ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన రాజు అవుతాడు, ఆయన నిరంతరం పరిపాలిస్తాడు.

ఆ గొప్ప బాధ్యతను మరియ వినయంగా స్వీకరించింది. ఆమెకు అప్పటికే వడ్రంగియైన యోసేపుతో పెళ్లి నిశ్చయమైంది. ఆయన ఆమెను వదిలేయాలనుకున్నాడు గానీ ఒక దేవదూత వచ్చి నిజాన్ని చెప్పినప్పుడు ఆయన మరియను పెళ్లి చేసుకున్నాడు. మరి, మెస్సీయ బేత్లెహేములో జన్మిస్తాడనే ప్రవచనం మాటేమిటి? (మీకా 5:2) ఆ చిన్న పట్టణం నజరేతుకు దాదాపు 140 కి.మీ. దూరంలో ఉంది!

అప్పటి రోమా పరిపాలకుడు జనాభా లెక్కలను రాయించమని ఆదేశించడంతో ప్రజలందరూ తమ జన్మస్థలాలకు వెళ్లాల్సివచ్చింది. యోసేపు మరియలు బహుశా బేత్లెహేముకు చెందినవారై ఉండవచ్చు. అందుకే యోసేపు గర్భవతియైన తన భార్యను తీసుకొని అక్కడికెళ్లాడు. (లూకా 2:3) మరియ ఓ పశువుల పాకలో ప్రసవించి శిశువును పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. అప్పుడు, ఆ శిశువే వాగ్దానం చేయబడిన మెస్సీయ లేదా క్రీస్తు అని కొండ ప్రాంతంలోవున్న గొర్రెల కాపరులకు చెప్పడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు.

ఆ తర్వాత, యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఇతరులు కూడా సాక్ష్యమిచ్చారు. మెస్సీయ చేయబోయే ప్రాముఖ్యమైన పనికి మార్గాన్ని సిద్ధం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడని యెషయా ప్రవచించాడు. (యెషయా 40:3) ఆ వ్యక్తి బాప్తిస్మమిచ్చే యోహాను. ఆయన యేసును చూసినప్పుడు “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని బిగ్గరగా చెప్పాడు. అది విన్న యోహాను శిష్యుల్లో కొంతమంది వెంటనే యేసు అనుచరులయ్యారు. వారిలో ఒకరు, “మేము మెస్సీయను కనుగొంటిమి” అన్నాడు.—యోహాను 1:29, 36, 41.

యెహోవా కూడా యేసు గురించి సాక్ష్యమిచ్చాడు. యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యెహోవా తన పరిశుద్ధాత్మతో యేసును మెస్సీయగా అభిషేకించాడు. అప్పుడు, యెహోవాయే పరలోకం నుండి ఇలా చెప్పాడు: “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:16, 17) చివరకు, ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన మెస్సీయ రానేవచ్చాడు!

మెస్సీయ ఏ సంవత్సరంలో వచ్చాడు? సా.శ. 29లో వచ్చాడు. అంటే సరిగ్గా, దానియేలు ప్రవచించిన 483 సంవత్సరాలు పూర్తయ్యాక వచ్చాడు. ఇది, యేసే మెస్సీయ లేదా క్రీస్తు అనడానికి తిరుగులేని రుజువుల్లో ఒకటి. అయితే, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు ఏ సందేశాన్ని ప్రకటించాడు?

మత్తయి 1 నుండి 3 అధ్యాయాలు; మార్కు 1వ అధ్యాయం; లూకా 2వ అధ్యాయం; యోహాను 1వ అధ్యాయం.