కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 17

యేసు దేవుని రాజ్యం గురించి బోధించాడు

యేసు దేవుని రాజ్యం గురించి బోధించాడు

యేసు తన శిష్యులకు ఎన్నో విషయాలు బోధించినా ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా బోధించాడు

యేసు భూమ్మీదికి ఎందుకు వచ్చాడు? ‘నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని’ అని ఆయనే చెప్పాడు. (లూకా 4:43) ఆయన అంత ప్రాముఖ్యతనిచ్చిన దేవుని రాజ్యం గురించి ఏ నాలుగు విషయాలను బోధించాడు?

1. యేసు దేవుని రాజ్యానికి రాజు. ప్రవచించబడిన మెస్సీయ తనేనని యేసు సూటిగా చెప్పాడు. (యోహాను 4:25, 26) దానియేలు దర్శనంలో చూసిన రాజు తనేనని కూడా యేసు చెప్పాడు. తను ఏదో ఒకరోజు “మహిమగల సింహాసనము” మీద కూర్చుంటానని, తనతోపాటు వాళ్లు కూడా సింహాసనాలమీద కూర్చుంటారని యేసు తన అపొస్తలులతో చెప్పాడు. (మత్తయి 19:28) పరిపాలన చేయబోయే ఈ గుంపును యేసు “చిన్న మంద” అని పిలిచాడు. ఈ గుంపుకు చెందని “వేరే గొఱ్ఱెలు” కూడా తనకు ఉన్నారని ఆయన చెప్పాడు.—లూకా 12:32; యోహాను 10:16.

2. దేవుని రాజ్యం న్యాయానికి నెలవుగా ఉంటుంది. ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు సాతాను దేవునికి చెడ్డపేరు తీసుకువచ్చాడు. అదే మొట్టమొదటి అన్యాయం. దేవుని రాజ్యం యెహోవా నామాన్ని పరిశుద్ధపరిచి, అంటే ఆ చెడ్డపేరును తీసివేసి న్యాయం చేస్తుంది. (మత్తయి 6:9, 10) యేసు ప్రతిరోజు స్త్రీపురుషులు, బీద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ బోధించడం ద్వారా తనకు పక్షపాతం లేదని కూడా చూపించాడు. యేసు ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు బోధించడానికే వచ్చినా ఆయన సమరయులకు, అన్యులకు అంటే యూదులుకానివారికి కూడా బోధించాడు. తన కాలంలోని మతనాయకుల్లా ఆయన పక్షపాతం చూపించలేదు.

3. దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. యేసు కాలంలో రాజకీయపరంగా పరిస్థితులు గందరగోళంగా ఉండేవి. ఆ ప్రాంతాన్ని విదేశీయులు పరిపాలించేవారు. ప్రజలు యేసును రాజుగా చేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన దానికి ఒప్పుకోలేదు. (యోహాను 6:14, 15) ఆయన ఒక అధికారితో, “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అన్నాడు. (యోహాను 18:36) ఆయన తన అనుచరులతో “మీరు లోకసంబంధులు కారు” అన్నాడు. (యోహాను 15:19) ఆయన తన అనుచరులను దేనికోసమైనాసరే, చివరకు తనను కాపాడడానికి కూడా యుద్ధాయుధాలను వాడనివ్వలేదు.—మత్తయి 26:51, 52.

‘ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో సంచారం చేశాడు.’—లూకా 8:1

4. క్రీస్తు ప్రేమతో పరిపాలిస్తాడు. ఆయన, ప్రజల భారాలను తీసేసి వారిని సేదదీరుస్తానని మాటిచ్చాడు. (మత్తయి 11:28-30) ఆయన తన మాట నిలబెట్టుకున్నాడు. జీవిత చింతలతో పోరాడడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం, ధనసంపదల వ్యామోహంలో పడకుండా జాగ్రత్తపడడం, సంతోషాన్ని పొందడం వంటి విషయాల గురించి ఆయన ప్రేమతో మంచి సలహాలను ఇచ్చాడు. (మత్తయి, 5-7 అధ్యాయాలు) ఆయన ప్రేమ చూపించాడు కాబట్టే అన్ని వర్గాలవాళ్లు ఆయన దగ్గరకు రాగలిగారు. ఆయన కనికరంతో, గౌరవంతో చూస్తాడన్న నమ్మకంతో అణచివేతకు గురైనవాళ్లు కూడా ఆయన దగ్గరకు వచ్చేవాళ్లు. యేసు మనల్ని ఎంత చక్కగా పరిపాలిస్తాడో ఆలోచించండి.

దేవుని రాజ్యం మనకోసం ఏమి చేయబోతుందో చూపించడానికి యేసు అద్భుతాలు చేశాడు. అయితే, అద్భుతాలు చేయడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటో తర్వాతి అధ్యాయంలో చూద్దాం.

మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు.