కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 18

యేసు అద్భుతాలు చేశాడు

యేసు అద్భుతాలు చేశాడు

యేసు అద్భుతాలు చేసి, భవిష్యత్తులో రాజుగా తనకున్న శక్తిని ఎలా ఉపయోగిస్తాడో చూపించాడు

ఇతరులెవ్వరూ చేయలేని వాటిని చేసే శక్తిని దేవుడు యేసుకు ఇచ్చాడు. యేసు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. వాటిని తరచూ ఎంతోమంది చూస్తుండగా చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు ఆయన తన శత్రువులకంటే శక్తిగలవాడనేకాక, అపరిపూర్ణులెవ్వరూ తీసివేయలేనివాటిని ఆయన తీసివేయగలడని కూడా నిరూపించాయి. కొన్ని ఉదాహరణలను చూద్దాం.

ఆహారపానీయాల కొరత. నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చడమే యేసు చేసిన మొదటి అద్భుతం. మరో రెండు సందర్భాల్లో, కేవలం కొన్ని రొట్టెలు, చేపలతో ఆకలితోవున్న వేలాదిమందికి ఆహారం పెట్టాడు. రెండు సందర్భాల్లో ప్రజలు కడుపునిండా తిన్న తర్వాత కూడా ఆహారం మిగిలింది.

అనారోగ్యం. యేసు ప్రజల “ప్రతి వ్యాధిని, రోగమును” నయం చేశాడు. (మత్తయి 4:23) యేసు గుడ్డివారిని, చెవిటివారిని, కుష్ఠ రోగులను, మూర్ఛరోగులను, కుంటివారిని, వికలాంగులను, అంగవైకల్యంగలవారిని స్వస్థపరిచాడు. ఆయన బాగుచేయలేని రోగమంటూ ఏదీ లేదు.

ఆయనకు ప్రకృతిని శాసించే శక్తి ఉంది. యేసు, ఆయన శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను రేగింది. శిష్యులు ఎంతో భయపడ్డారు. కానీ యేసు ప్రశాంతంగా సముద్రంవైపు చూసి గాలిని “నిశ్శబ్దమై ఊరకుండుము” అన్నాడు. దాంతో సముద్రం నిమ్మళించింది. (మార్కు 4:37-39) మరో సందర్భంలో, పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆయన సముద్రపు నీళ్లమీద నడిచాడు.—మత్తయి 14:24-33.

దయ్యాలను వెళ్లగొట్టాడు. దయ్యాలు మనుషులకంటే ఎంతో శక్తిగలవి. చాలామంది దేవునికి బద్ధ శత్రువులైన ఈ దయ్యాల బారినపడ్డారు. కానీ, యేసు ఎన్నోసార్లు మనుషులను వదిలిపొమ్మని వాటిని ఆజ్ఞాపించినప్పుడు అవి ఏమీ చేయలేక వెళ్లిపోవాల్సి వచ్చింది. యేసు వాటికి భయపడలేదు కానీ అవే ఆయనకు భయపడ్డాయి. ఎందుకంటే, యేసుకు ఎంత అధికారం ఉందో వాటికి తెలుసు.

మరణాన్ని శాసించాడు. ‘కడపటి శత్రువని’ సరిగ్గానే వర్ణించబడిన మరణాన్ని మనుషులెవ్వరూ తప్పించుకోలేరు. (1 కొరింథీయులు 15:26) అయితే, యేసు చనిపోయినవారిని బ్రతికించాడు. ఒక విధవరాలి కుమారుడిని, చనిపోయిన ఓ బాలికను బ్రతికించి వాళ్ల కుటుంబ సభ్యుల దుఃఖాన్ని తీర్చాడు. ఒక సందర్భంలో, యేసు తన ప్రియమిత్రుడైన లాజరును అందరు చూస్తుండగా బ్రతికించాడు. ఇది ఆయన చేసిన పునరుత్థానాల్లో విశేషమైనది. ఎందుకంటే, చనిపోయిన లాజరును నాలుగురోజుల తర్వాత బ్రతికించాడు. చివరికి, యేసు బద్ధ శత్రువులు కూడా ఆయన ఈ అద్భుతాన్ని చేశాడని ఒప్పుకున్నారు.—యోహాను 11:38-48; 12:9-11.

యేసు ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడు? ఆయన బ్రతికించిన వాళ్లంతా మళ్లీ చనిపోయారు. మరి ఆయన చేసినదానివల్ల ప్రయోజనం ఏంటి? నిజానికి వాటివల్ల మంచే జరిగింది. మెస్సీయ రాజు పరిపాలనకు సంబంధించిన ఉత్కంఠభరిత ప్రవచనాలన్నీ ఖచ్చితంగా నెరవేరతాయనడానికి ఇవి బలమైన ఆధారాలు. దేవుడు నియమించిన రాజు ఆహారపానీయాల కొరతను, అనారోగ్యాన్ని తీసేయగలడనీ, ప్రకృతిని, దయ్యాలను, మరణాన్ని శాసించగలడనీ అవి నిరూపించాయి. వీటన్నిటిని చేసే శక్తిని దేవుడు తనకిచ్చాడని యేసు నిరూపించాడు.

మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు.