కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 19

ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు

ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు

రాజుగా తన ప్రత్యక్షతా కాలంలో ఏమి జరుగుతుందో, ఈ లోక అంత్యదినాల్లో ఏమి జరుగుతుందో యేసు చెప్పాడు

ఒలీవ కొండమీద నుండి కిందవున్న యెరూషలేము, దాని ఆలయం ఎంతో చక్కగా కనిపిస్తాయి. యేసు ఆ కొండమీద కూర్చొని ఉన్నప్పుడు అపొస్తలుల్లో నలుగురు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన అంతకుముందు చెప్పిన విషయాల గురించి అడిగారు. అంతకుముందే ఆయన వాళ్లకు, యెరూషలేము నాశనం గురించి చెప్పాడు. దానికి కొంతకాలం ముందు, “యుగసమాప్తి” గురించి ఆయన వారితో మాట్లాడాడు. (మత్తయి 13:40, 49) అందుకే అపొస్తలులు, “నీ రాకడకును [‘ప్రత్యక్షతకు,’ NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి” అని ఆయనను అడిగారు.—మత్తయి 24:3.

దానికి యేసు, యెరూషలేము నాశనానికి ముందు ఏమి జరుగుతుందో వివరించాడు. అయితే, అప్పుడు ఆయన చెప్పిన మాటలు మనకాలానికి కూడా వర్తిస్తాయి. ఆయన ప్రవచనం ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతుంది. వరుసగా జరిగే అనేక సంఘటనల గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి ఆయన ప్రవచించాడు. వాటన్నిటినీ బైబిలు “సూచనలు” అని పిలుస్తోంది. వీటినిబట్టి భూమ్మీదున్నవాళ్లు, పరలోకంలో రాజైన యేసు ప్రత్యక్షతా కాలం మొదలైందని తెలుసుకుంటారు. ఇంకోమాటలో చెప్పాలంటే యెహోవా దేవుడు, ఎంతోకాలం క్రితం వాగ్దానం చేసిన మెస్సీయ రాజ్యానికి యేసును రాజుగా నియమించాడు అనడానికి అవి సూచనలుగా పనిచేస్తాయి. అంతేకాదు, ఆ రాజ్యం త్వరలో దుష్టులను నాశనం చేసి శాంతిని నెలకొల్పుతుందని కూడా ఆ సూచనలు చూపిస్తాయి. యేసు ప్రవచించిన విషయాలు, ప్రస్తుత లోకవిధానం అంటే ఇప్పుడున్న మత, రాజకీయ, వ్యాపార వ్యవస్థల అంతం సమీపించిందనడానికి, కొత్తలోకవిధానం మొదలవుతుంది అనడానికి సూచనలుగా ఉంటాయి.

తన ప్రత్యక్షతా కాలంలో, భూమ్మీద ప్రపంచ యుద్ధాలు జరుగుతాయని, కరువులు, పెద్దపెద్ద భూకంపాలు వస్తాయని, చాలామంది రోగాల బారిన పడతారని యేసు చెప్పాడు. అంతేకాదు, అన్యాయం పెరుగుతుంది. యేసు నిజ శిష్యులు దేవుని రాజ్యం గురించి భూవ్యాప్తంగా ప్రకటిస్తారు. చివరకు, ఇంతకుముందెప్పుడూ రానంత “మహా శ్రమ” కలుగుతుంది.—మత్తయి 24:20, 21.

ఆ శ్రమ ఎప్పుడు వస్తుందో యేసు అనుచరులకు ఎలా తెలుస్తుంది? ‘అంజూరపు చెట్టును చూసి నేర్చుకోండి’ అని ఆయన చెప్పాడు. (మత్తయి 24:32) అంజూరపు చెట్టు చిగిరించినప్పుడు వేసవి కాలం రాబోతుందని తెలుసుకోవచ్చు. అలాగే, యేసు చెప్పినవన్నీ జరిగినప్పుడు అంతం సమీపించిందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. మహా శ్రమ ఎప్పుడు మొదలవుతుందో తన తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదని ఆయన అన్నాడు. అందుకే, ఆయన ‘ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి’ అని తన శిష్యులను ప్రోత్సహించాడు.—మార్కు 13:33.

మత్తయి 24, 25 అధ్యాయాలు; మార్కు 13వ అధ్యాయం; లూకా 21వ అధ్యాయం.

^ పేరా 14 యేసు ప్రవచనం గురించిన మరింత వివరణ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.