కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 21

యేసు పునరుత్థానమయ్యాడు!

యేసు పునరుత్థానమయ్యాడు!

యేసు తన శిష్యులకు కనిపించి వాళ్లకు బోధించాడు, ప్రోత్సహించాడు

యేసు చనిపోయిన తర్వాత మూడో రోజున ఆయన శిష్యుల్లో కొంతమంది స్త్రీలు, ఆయన సమాధి దగ్గరికెళ్లారు. అక్కడ సమాధికి అడ్డంగావున్న బండరాయి పక్కకు జరిగివుంది. అంతేకాదు, సమాధి ఖాళీగా ఉంది!

ఇద్దరు దేవదూతలు ఆ స్త్రీలకు కనిపించారు. వారిలో ఒక దూత, ‘నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు; ఆయన లేచాడు’ అని చెప్పాడు. (మార్కు 16:6) వెంటనే ఆ స్త్రీలు జరిగింది అపొస్తలులకు చెప్పడానికి పరుగెత్తారు. దారిలో యేసు వాళ్లకు కనిపించి, ‘భయపడకండి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లాలని, వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలపండి’ అని చెప్పాడు.—మత్తయి 28:10.

అదేరోజు ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక అపరిచిత వ్యక్తి వాళ్లను కలిసి వాళ్లు దేని గురించి మాట్లాడుకుంటున్నారని అడిగాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు పునరుత్థానమైన యేసే. ఆయన వేరే వ్యక్తి రూపంలో కనిపించడంతో వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. దుఃఖంలో మునిగివున్న వాళ్లు తాము యేసు గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు. ఆయన మెస్సీయ గురించి లేఖనాల్లోవున్న విషయాలను వివరించాడు. నిజానికి, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ యేసు విషయంలో నెరవేరాయి. * ఆయన పునరుత్థానమైన యేసే అని శిష్యులు గుర్తించినప్పుడు ఆయన అదృశ్యమైపోయాడు.

ఆ ఇద్దరు శిష్యులు వెంటనే యెరూషలేముకు తిరిగివెళ్లి అపొస్తలులను కలిశారు. తలుపులు మూసివున్న గదిలో వాళ్లు జరిగినదాన్ని వివరిస్తున్నప్పుడు యేసు వాళ్లందరికి కనిపించాడు. శిష్యులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు! ఆయన వాళ్లను, “మీ హృదయములలో సందేహములు పుట్టనేల?” అని అడిగి ‘క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచునని వ్రాయబడియున్నది’ అని అన్నాడు.— లూకా 24:38, 46.

యేసు పునరుత్థానమైన తర్వాత 40 రోజుల వరకు తన శిష్యులకు వేర్వేరు సందర్భాల్లో కనిపించాడు. ఒకసారి ఆయన 500 కంటే ఎక్కువమందికి కనిపించాడు. బహుశా ఈ సందర్భంలోనే తన శిష్యులకు ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తూ ఇలా చెప్పాడు: ‘మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ యే సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో కూడ ఉన్నాను.’మత్తయి 28:19, 20.

యేసు, తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులను చివరిసారిగా కలిసినప్పుడు, ఆయన వాళ్ళకు ఈ హామీనిచ్చాడు: ‘పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందుతారు గనుక మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులైవుంటారు.’ (అపొస్తలుల కార్యములు 1:8) ఆ తర్వాత యేసు పరలోకానికి వెళ్లిపోతున్నప్పుడు, ఒక మేఘం అడ్డురావడంతో ఆయనిక వాళ్లకు కనిపించలేదు.

మత్తయి 28వ అధ్యాయం; మార్కు 16వ అధ్యాయం; లూకా 24వ అధ్యాయం; యోహాను 20, 21 అధ్యాయాలు; 1 కొరింథీయులు 15:5, 6.

^ పేరా 6 యేసు విషయంలో నెరవేరిన మెస్సీయ ప్రవచనాల కోసం, ఈ బ్రోషురులోని 14వ భాగం, 15వ భాగం, 16వ భాగం చూడండి దానితోపాటు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో “యేసుక్రీస్తు-వాగ్దానం చేయబడిన మెస్సీయ” అనే అనుబంధం ఆర్టికల్‌ చూడండి.