కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 22

అపొస్తలులు ధైర్యంగా ప్రకటించారు

అపొస్తలులు ధైర్యంగా ప్రకటించారు

క్రైస్తవులు హింసించబడినా సంఘం వేగంగా అభివృద్ధి చెందింది

యేసు పరలోకానికి వెళ్లిన పది రోజుల తర్వాత అంటే సా.శ. 33లో ఆయన శిష్యుల్లో దాదాపు 120 మంది, యూదుల పెంతెకొస్తు పండుగ రోజున యెరూషలేములోని ఒక ఇంట్లో సమావేశమయ్యారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్లున్న గదిలో బలమైన గాలి వీస్తున్న శబ్దంలాంటిది వినిపించింది. అద్భుతరీతిలో, శిష్యులు తమకు తెలియని భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు ఏమి జరిగింది అక్కడ? శిష్యులమీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.

పండుగ కోసం చాలా ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు బయట ఉన్నారు. తమ మాతృభాషల్ని యేసు శిష్యులు స్పష్టంగా మాట్లాడడం చూసి ప్రజలెంతో నివ్వెరపోయారు! జరిగిన దాన్ని వివరిస్తూ పేతురు, దేవుడు తన ‘ఆత్మను కుమ్మరిస్తాడని,’ అది వాళ్లకు అద్భుత వరాలను ఇస్తుందని యోవేలు ప్రవక్త చెప్పిన మాటల్ని గుర్తుచేశాడు. (యోవేలు 2:28, 29) దేవుడు అలా పరిశుద్ధాత్మను ఇచ్చి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చూపించాడు. అదేమిటంటే, తన అనుగ్రహం ఇశ్రాయేలీయుల మీదనుండి పోయి కొత్తగా స్థాపించబడిన క్రైస్తవ సంఘంమీదికి వచ్చింది. అప్పటినుండి ఒక వ్యక్తి ఆరాధనను దేవుడు ఇష్టపడాలంటే అతను క్రీస్తు అనుచరుడు కావాలి.

కొంతకాలానికి క్రైస్తవులపై హింస చెలరేగింది. శత్రువులు శిష్యులను చెరసాలలో పెట్టారు. కానీ, రాత్రిపూట యెహోవా దూత చెరసాల తలుపులు తీసి వాళ్లని పంపిస్తూ వెళ్లి ప్రకటించమని చెప్పాడు. తెల్లవారినప్పుడు శిష్యులు దేవదూత చెప్పినట్టే దేవాలయంలో ప్రవేశించి యేసు గురించిన సువార్తను బోధించడం మొదలుపెట్టారు. మతవ్యతిరేకులు ఆగ్రహంతో, ప్రకటించడం ఆపేయమని వాళ్లకు ఆజ్ఞాపించారు. దానికి శిష్యులు ధైర్యంగా, ‘మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడాలి’ అని బదులిచ్చారు.—అపొస్తలుల కార్యములు 5:28, 29.

హింస ఉద్ధృతమయ్యింది. శిష్యుడైన స్తెఫను దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాడని నిందించి కొంతమంది యూదులు ఆయనను రాళ్లతో కొట్టి చంపారు. తార్సుకు చెందిన సౌలు అనే యువకుడు దాన్ని సమ్మతించి స్తెఫనును చంపుతున్నప్పుడు చూస్తూ నిలబడ్డాడు. ఈయన, క్రీస్తు అనుచరులను పట్టుకొని చెరసాలలో వేయాలని దమస్కుకు బయలుదేరాడు. దారిలో ఉన్నప్పుడు, పరలోకం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించి, ఆకాశం నుండి ‘సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు?’ అనే మాటలు వినిపించాయి. ఆ వెలుగువల్ల గుడ్డివాడైన సౌలు, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాడు. అందుకు, ‘నేను యేసును’ అనే జవాబు వచ్చింది.—అపొస్తలుల కార్యములు 9:3-5.

మూడు రోజుల తర్వాత, సౌలుకు చూపు తెప్పించడానికి యేసు అననీయ అనే శిష్యుణ్ణి పంపించాడు. ఆ తర్వాత సౌలు బాప్తిస్మం తీసుకొని యేసు గురించి ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడు. సౌలు ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా క్రైస్తవ సంఘంలో చాలా చురుగ్గా పనిచేశాడు.

యేసు శిష్యులు అప్పటివరకు కేవలం యూదులకు, సమరయులకు మాత్రమే ప్రకటించేవారు. అయితే ఒకరోజు, దేవదూత దైవభక్తిగల రోమా శతాధిపతియైన కొర్నేలీకి కనిపించి అపొస్తలుడైన పేతురును పిలిపించమని చెప్పాడు. పేతురు కొందరితోపాటు కొర్నేలీ ఇంటికొచ్చి ఆయనకు, ఆయన ఇంటివారికి దేవుని గురించి బోధించారు. పేతురు మాట్లాడుతుండగా, విశ్వాసులుగా మారిన అన్యులమీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అప్పుడు పేతురు, వాళ్లను యేసు నామాన బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు. ఈ విధంగా, నిత్యజీవం పొందే అవకాశం అన్ని జనాంగాల ప్రజలకు దొరికింది. సుదూర ప్రాంతాలకు సువార్తను చేరవేయడానికి క్రైస్తవ సంఘం సిద్ధమైంది.

అపొస్తలుల కార్యములు 1:1–11:21.