కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ పాఠం

పయినీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి పాఠశాలలు ఉన్నాయి?

పయినీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి పాఠశాలలు ఉన్నాయి?

సొంత ఊరు అమెరికాలో . . .

గిలియడ్‌ పాఠశాలలో . . .

పనామాలో బైబిలు అధ్యయనం చేస్తూ . . .

చాలాకాలంగా దైవపరిపాలనా పాఠశాలలు యెహోవాసాక్షులకు గుర్తింపు చిహ్నంగా ఉన్నాయి. రాజ్య ప్రకటనా పనికోసం పూర్తి సమయం వెచ్చించేవాళ్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. ఆ శిక్షణ వల్ల వాళ్లు ‘తమ పరిచర్యను పూర్తిగా నెరవేర్చగలుగుతారు.’—2 తిమోతి 4:5.

పయినీరు సేవా పాఠశాల. సంవత్సరం పాటు క్రమ పయినీరు సేవచేసిన తర్వాత ఈ పాఠశాలకు హాజరవ్వవచ్చు. ఇది ఆరు రోజులు జరుగుతుంది, దీన్ని తరచూ దగ్గర్లోని రాజ్యమందిరంలో నిర్వహిస్తారు. యెహోవాకు ఇంకా దగ్గరయ్యేలా, పరిచర్యలోని అన్ని పద్ధతుల్లో నేర్పు సాధించేలా, ఎక్కువకాలం ఈ సేవలో కొనసాగేలా పయినీర్లకు సహాయం చేయడమే ఈ పాఠశాల ఉద్దేశం.

రాజ్య సువార్తికుల కోసం పాఠశాల. సొంత ఊరు విడిచిపెట్టి, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయడానికి ఇష్టపడే అనుభవంగల పయినీర్లకు ఈ పాఠశాలలో శిక్షణ ఇస్తారు. ఇది రెండు నెలలు జరుగుతుంది. ఒకవిధంగా వాళ్లు, భూమ్మీద జీవించిన వాళ్లందరిలో గొప్ప సువార్తికుడైన యేసుక్రీస్తులా, “నేనున్నాను! నన్ను పంపు!” అని చెప్తున్నారు. (యెషయా 6:8; యోహాను 7:29) దూర ప్రాంతానికి వెళ్లి సేవచేసే వాళ్లు ఇంకాస్త సాదాసీదా జీవితానికి అలవాటుపడాల్సి రావచ్చు. అక్కడి సంస్కృతి, వాతావరణం, ఆహారం అంతా వేరుగా ఉండవచ్చు. కొత్త భాష కూడా నేర్చుకోవాల్సి రావచ్చు. 23-65 ఏళ్ల వయసున్న ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు, దంపతులు ఈ పాఠశాలకు హాజరవ్వవచ్చు. తమ నియామకానికి అవసరమైన మంచి లక్షణాలు పెంచుకోవడానికి, యెహోవాకూ ఆయన సంస్థకూ మరింత ఉపయోగపడేలా నైపుణ్యాలు సంపాదించుకోవడానికి ఈ పాఠశాల వాళ్లకు సహాయం చేస్తుంది.

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌. “గిలియడ్‌” అని అనువదించిన హీబ్రూ పదానికి “సాక్ష్యపు కుప్ప” అని అర్థం. గిలియడ్‌ పాఠశాల 1943 లో మొదలైంది. ఇప్పటివరకు అందులో పట్టభద్రులైన 8,000 కన్నా ఎక్కువమంది మిషనరీల్ని “భూమి అంచుల వరకు” సాక్ష్యమివ్వడానికి పంపించారు, దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. (అపొస్తలుల కార్యాలు 13:47) మిషనరీలు మొదటిసారి పెరూ దేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక్క సంఘం కూడా లేదు, కానీ ఇప్పుడు 1,000 కన్నా ఎక్కువ సంఘాలు ఉన్నాయి. మా మిషనరీలు జపాన్‌లో అడుగుపెట్టినప్పుడు అక్కడ కనీసం పదిమంది సాక్షులు కూడా లేరు. కానీ ఇప్పుడు 2,00,000 కన్నా ఎక్కువమంది ఉన్నారు. ఐదు నెలలు జరిగే గిలియడ్‌ పాఠశాలలో బైబిల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రత్యేక పయినీర్లను, మిషనరీల్ని, బ్రాంచి కార్యాలయాల్లో సేవ చేస్తున్నవాళ్లను, ప్రాంతీయ సేవలో ఉన్నవాళ్లను ఈ పాఠశాలకు పిలుస్తారు. అక్కడిచ్చే చక్కని శిక్షణ ప్రపంచవ్యాప్త పనికి మద్దతిచ్చేలా, బలపర్చేలా వాళ్లకు సహాయం చేస్తుంది.

  • పయినీరు సేవా పాఠశాల ఉద్దేశం ఏంటి?

  • రాజ్య సువార్తికుల కోసం పాఠశాలలో ఎవరికి శిక్షణ ఇస్తారు?