కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

17వ పాఠం

ప్రాంతీయ పర్యవేక్షకులు మాకు ఎలా సహాయం చేస్తారు?

ప్రాంతీయ పర్యవేక్షకులు మాకు ఎలా సహాయం చేస్తారు?

మలావీ

క్షేత్రసేవా గుంపు

పరిచర్య

పెద్దల కూటం

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో బర్నబా గురించి, అపొస్తలుడైన పౌలు గురించి చాలాచోట్ల చదువుతాం. వాళ్లు మొదటి శతాబ్దంలోని సంఘాల్ని సందర్శిస్తూ ప్రయాణ పర్యవేక్షకులుగా సేవచేశారు. తోటి సహోదరసహోదరీల సంక్షేమం పట్ల వాళ్లకు నిజమైన శ్రద్ధవుంది కాబట్టే వాళ్లు అలా చేశారు. సహోదరుల దగ్గరికి “తిరిగెళ్లి” వాళ్లెలా ఉన్నారో చూడాలనుకుంటున్నానని పౌలు ఒకసారి అన్నాడు. వాళ్లను బలపర్చడం కోసం వందల కిలోమీటర్లు వెళ్లడానికి కూడా ఆయన వెనకాడలేదు. (అపొస్తలుల కార్యాలు 15:36) ఇప్పుడున్న ప్రయాణ పర్యవేక్షకులు కూడా అదే స్ఫూర్తితో సేవ చేస్తారు.

వాళ్లు మమ్మల్ని ప్రోత్సహించడానికి వస్తారు. ప్రతీ ప్రాంతీయ పర్యవేక్షకుడు దాదాపు 20 సంఘాల్ని సందర్శిస్తాడు. ప్రతీ సంఘంతో ఒక వారం గడుపుతూ, సంవత్సరానికి రెండుసార్లు వాటిని సందర్శిస్తాడు. ఈ సహోదరుల అనుభవం నుండి, ఒకవేళ పెళ్లయ్యుంటే వాళ్ల భార్యల అనుభవం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్లు సంఘంలోని ప్రతీ ఒక్కరి గురించి తెలుసుకోవడానికి కృషిచేస్తారు. మాతో కలిసి పరిచర్య చేయడానికి, బైబిలు అధ్యయనాలకు రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు పెద్దలతో కలిసి కాపరి సందర్శనాలు చేస్తారు. కూటాల్లో, సమావేశాల్లో మమ్మల్ని బలపర్చే, ప్రోత్సహించే ప్రసంగాలు ఇస్తారు.—అపొస్తలుల కార్యాలు 15:35.

వాళ్లు అందరి మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘాల ఆధ్యాత్మిక స్థితి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. పెద్దలతో, సంఘ పరిచారకులతో ఒక కూటం నిర్వహించి సంఘ ప్రగతి గురించి చర్చిస్తారు, బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించేలా సలహాలు ఇస్తారు. ఇంకా మెరుగ్గా పరిచర్య చేసేలా పయినీర్లకు సహాయం చేస్తారు. అలాగే, కొత్తగా కూటాలకు వస్తున్న వాళ్లను పరిచయం చేసుకోవడానికి, వాళ్లెలా ప్రగతి సాధిస్తున్నారో తెలుసుకోవడానికి ఇష్టపడతారు. నిస్వార్థంగా కష్టపడే ఈ సహోదరుల్లో ప్రతీ ఒక్కరు మాకు ‘సహాయం చేసే తోటి పనివాళ్లు.’ (2 కొరింథీయులు 8:23) వాళ్ల విశ్వాసాన్ని, దైవభక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.—హెబ్రీయులు 13:7.

  • ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘాల్ని ఎందుకు సందర్శిస్తారు?

  • వాళ్ల సందర్శనాల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?