కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19వ పాఠం

నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఎవరు?

నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఎవరు?

ఆధ్యాత్మిక ఆహారం నుండి అందరం ప్రయోజనం పొందుతాం

యేసు చనిపోవడానికి కొన్నిరోజుల ముందు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయలతో విడిగా మాట్లాడాడు. చివరి రోజుల్లో తన ప్రత్యక్షతకు సూచన చెప్తూ యేసు ఈ ముఖ్యమైన ప్రశ్న అడిగాడు: “తన ఇంట్లోని సేవకులకు తగిన సమయంలో ఆహారం పెట్టేలా యజమాని వాళ్లమీద నియమించిన నమ్మకమైన, బుద్ధిగల దాసుడు నిజంగా ఎవరు?” (మత్తయి 24:3, 45; మార్కు 13:3, 4) చివరి రోజుల్లో తన అనుచరులకు క్రమంగా ఆధ్యాత్మిక ఆహారం పెట్టే దాసుణ్ణి నియమిస్తానని “యజమాని” అయిన యేసు తన శిష్యులకు మాటిచ్చాడు. ఇంతకీ ఆ దాసుడు ఎవరు?

అభిషిక్తులైన యేసు అనుచరుల చిన్న గుంపు. యెహోవాసాక్షుల పరిపాలక సభే ఆ “దాసుడు.” పరిపాలక సభ, తోటి యెహోవా ఆరాధకులకు తగిన సమయంలో ఆధ్యాత్మిక ఆహారం అందిస్తుంది. “తగిన సమయంలో, తగినంత ఆహారం” పొందడానికి మేము ఈ నమ్మకమైన దాసుని మీదే ఆధారపడతాం.—లూకా 12:42.

దేవుని ఇంటివాళ్లను చూసుకుంటాడు. (1 తిమోతి 3:15) యేసు ఈ దాసునికి ఒక బరువైన బాధ్యత అప్పగించాడు. అదేంటంటే, యెహోవా సంస్థలోని భూభాగంలో జరిగే పనిని చూసుకోవడం. అందులో, సంస్థకు చెందిన ఆస్తుల్ని చూసుకోవడం, ప్రకటనా పనిని నిర్దేశించడం, సంఘాల ద్వారా మాకు బోధించడం వంటివి ఉన్నాయి. పరిచర్యలో ఉపయోగించే ప్రచురణల ద్వారా, కూటాల్లో-సమావేశాల్లో చర్చించే సమాచారం ద్వారా “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మాకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని తగిన సమయంలో ఇస్తున్నాడు.

ఈ దాసుడు నమ్మకమైనవాడు, ఎందుకంటే అతను బైబిలు సత్యాలకు, తనకు అప్పగించిన ప్రకటనా పనికి కట్టుబడి ఉంటాడు. అంతేకాదు అతను బుద్ధిగలవాడు, ఎందుకంటే క్రీస్తు భూమ్మీద తనకు అప్పగించిన వాటన్నిటినీ అతను తెలివిగా చూసుకుంటాడు. (అపొస్తలుల కార్యాలు 10:42) ఎక్కువమంది సత్యంలోకి రావడం, ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా ఉండడం చూస్తుంటే యెహోవా ఈ దాసుని పనిని దీవిస్తున్నాడని తెలుస్తోంది.—యెషయా 60:22; 65:13.

  • తన శిష్యులకు ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి యేసు ఎవర్ని నియమించాడు?

  • దాసుడు నమ్మకమైనవాడు, బుద్ధిగలవాడు అని ఎందుకు చెప్పవచ్చు?