కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20వ పాఠం

నేడు పరిపాలక సభ ఎలా పనిచేస్తుంది?

నేడు పరిపాలక సభ ఎలా పనిచేస్తుంది?

మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ

పరిపాలక సభ నుండి వచ్చిన ఉత్తరాన్ని చదువుతున్నారు

మొదటి శతాబ్దంలో, “యెరూషలేములో ఉన్న అపొస్తలులతో, పెద్దలతో” కూడిన ఒక చిన్న గుంపు పరిపాలక సభగా పనిచేసేది. ఆ పరిపాలక సభ, అభిషిక్త క్రైస్తవుల సంఘమంతటి తరఫున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది. (అపొస్తలుల కార్యాలు 15:2) వాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా లేఖనాలు ఏం చెప్తున్నాయో చర్చించేవాళ్లు, పవిత్రశక్తి నిర్దేశానికి లోబడేవాళ్లు. (అపొస్తలుల కార్యాలు 15:25) నేటి పరిపాలక సభ కూడా అలాగే పనిచేస్తుంది.

తన ఇష్టాన్ని చేయడానికి దేవుడు దాన్ని ఉపయోగిస్తున్నాడు. పరిపాలక సభలో సేవచేసే అభిషిక్త సహోదరులకు దేవుని వాక్యం మీద ఎంతో ఆసక్తి ఉంటుంది. అంతేకాదు మా పనిని నిర్దేశించడంలో, బైబిలుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వడంలో వాళ్లకు చాలా అనుభవం ఉంటుంది. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరుల అవసరాల గురించి చర్చించడానికి ప్రతీవారం సమకూడతారు. మొదటి శతాబ్దంలోలాగే వాళ్లు ఉత్తరాల ద్వారా, ప్రయాణ పర్యవేక్షకుల ద్వారా, ఇతరుల ద్వారా బైబిలు ఆధారిత నిర్దేశాలు ఇస్తారు. దానివల్ల దేవుని ప్రజలు ఒకేలా ఆలోచించగలుగుతారు, ఒకేలా పని చేయగలుగుతారు. (అపొస్తలుల కార్యాలు 16:4, 5) పరిపాలక సభ ప్రకటనా పనికి మొదటిస్థానం ఇవ్వమని అందర్నీ ప్రోత్సహిస్తుంది. ఆధ్యాత్మిక ఆహారం తయారుచేసే పనిని, సహోదరుల్ని బాధ్యతగల స్థానాల్లో నియమించే పనిని చూసుకుంటుంది.

అది దేవుని పవిత్రశక్తి నిర్దేశానికి లోబడుతుంది. పరిపాలక సభలోని వాళ్లు నిర్దేశం కోసం విశ్వసర్వాధిపతైన యెహోవా మీద, సంఘ శిరస్సయిన యేసు మీద ఆధారపడతారు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:23) వాళ్లు దేవుని ప్రజల మీద నాయకులమని అనుకోరు. బదులుగా, మిగతా అభిషిక్త క్రైస్తవులందరితో పాటు “గొర్రెపిల్ల [యేసు] ఎక్కడికి వెళ్లినా సరే, ఆయన వెంట వెళ్తూ ఉంటారు.” (ప్రకటన 14:4) వాళ్ల కోసం, వాళ్లు చేస్తున్న పని కోసం మేము ప్రార్థిస్తున్నందుకు వాళ్లు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు.

  • మొదటి శతాబ్దంలోని పరిపాలక సభలో ఎవరు ఉండేవాళ్లు?

  • నేటి పరిపాలక సభ దేవుని నిర్దేశాన్ని ఎలా వెదుకుతుంది?