కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

24వ పాఠం

మా ప్రపంచవ్యాప్త పనికి డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?

మా ప్రపంచవ్యాప్త పనికి డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?

నేపాల్‌

టోగో

బ్రిటన్‌

మా సంస్థ ప్రతీ సంవత్సరం కోట్లాది బైబిళ్లను, ఇతర ప్రచురణల్ని డబ్బు వసూలు చేయకుండానే ప్రచురిస్తుంది, పంపిణీ చేస్తుంది. అంతేకాదు రాజ్యమందిరాల్ని, బ్రాంచి కార్యాలయాల్ని నిర్మించి వాటిని మంచి స్థితిలో ఉంచుతుంది. అలాగే వేలాది బెతెల్‌ సభ్యుల, మిషనరీల బాగోగులు చూసుకుంటుంది, విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేస్తుంది. ‘వీటన్నిటికీ డబ్బులు ఎక్కడనుండి వస్తాయి?’ అని మీరు అనుకోవచ్చు.

మేము దశమభాగాలు తీసుకోం, చందాలు వసూలు చేయం. మేము చేసే సువార్త ప్రకటనా పనికి ఎంతో ఖర్చు అవుతుంది. అయితే డబ్బు కోసం మేము ఎవ్వరి దగ్గరా చెయ్యి చాచం. వందకన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం మా కావలికోట పత్రిక రెండో సంచిక ఇలా చెప్పింది: ‘మాకు యెహోవా మద్దతు ఉందని నమ్ముతున్నాం, అందుకే మేము ఎన్నడూ మద్దతు కోసం మనుషుల్ని యాచించం, అర్థించం.’ ఆ మాటకు తగ్గట్టే మేము ఇంతవరకు ఎవ్వర్నీ యాచించలేదు, అర్థించలేదు!—మత్తయి 10:8.

మా పనులు స్వచ్ఛంద విరాళాల సహాయంతో జరుగుతాయి. మా బైబిలు విద్యా పనిని మెచ్చుకుంటూ చాలామంది విరాళాలిస్తారు. దేవుని ఇష్టాన్ని భూవ్యాప్తంగా చేయడానికి యెహోవాసాక్షులు కూడా తమ సమయాన్ని, శక్తిని, డబ్బును, వనరుల్ని సంతోషంగా ఇస్తారు. (1 దినవృత్తాంతాలు 29:9) మా రాజ్యమందిరాల్లో, సమావేశాల్లో విరాళాల పెట్టెలు ఉంటాయి. విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్లు వాటిలో వేయవచ్చు, లేదా మా jw.org వెబ్‌సైట్‌ ద్వారా ఇవ్వవచ్చు. విరాళాలు ఇచ్చేవాళ్లలో చాలామంది, రెండు చిన్న నాణేలు వేసిన పేద విధవరాలి లాంటివాళ్లే. యేసు ఆమెను చాలా మెచ్చుకున్నాడు. (లూకా 21:1-4) మనలో ప్రతీ ఒక్కరు, క్రమంగా కొంత డబ్బు ‘తీసి పక్కకు పెట్టడం’ ద్వారా “మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకున్నారో అంత” విరాళం ఇవ్వవచ్చు.—1 కొరింథీయులు 16:2; 2 కొరింథీయులు 9:7.

అలా చాలామంది రాజ్య పనికి మద్దతుగా ‘తమకున్న విలువైనవాటిని ఇచ్చి యెహోవాను ఘనపర్చాలని’ అనుకుంటున్నారు. (సామెతలు 3:9) తన ఇష్టం నెరవేరేలా యెహోవా ఇకమీదట కూడా అలాంటివాళ్లను పురికొల్పుతాడని మేము నమ్ముతున్నాం.

  • వేరే మతాలకు, మా సంస్థకు తేడా ఏంటి?

  • మేము స్వచ్ఛంద విరాళాల్ని ఎలా ఉపయోగిస్తాం?