కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ పాఠం

సరైన ఆరాధనను ఎలా గుర్తుపట్టవచ్చు?

సరైన ఆరాధనను ఎలా గుర్తుపట్టవచ్చు?

1. అన్ని మతాలు సరైనవేనా?

“అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి.”—మత్తయి 7:15.

యేసు తన అనుచరులకు ఒకేఒక్క మతం గురించి, అంటే సరైన మతం గురించి బోధించాడు. అది శాశ్వత జీవితానికి నడిపించే దారి లాంటిది. “కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 7:14) దేవుడు తన వాక్యమైన బైబిలు ప్రకారం ఉన్న ఆరాధనను మాత్రమే అంగీకరిస్తాడు. సరైన విధంగా ఆరాధించే వాళ్లందరికీ ఒకే రకమైన విశ్వాసం ఉంటుంది.యోహాను 4:23, 24; 14:6; ఎఫెసీయులు 4:4, 5 చదవండి.

దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా? వీడియో చూడండి.

2. అబద్ధ క్రైస్తవుల గురించి యేసు ఏం చెప్పాడు?

“వాళ్లు తమకు దేవుడు తెలుసని అందరిముందు చెప్పుకుంటారు, కానీ వాళ్ల పనులు వాళ్లు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారని చూపిస్తాయి.”—తీతు 1:16.

అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ మతాన్ని కలుషితం చేస్తారని యేసు హెచ్చరించాడు. వాళ్లు పైకి సరైన ఆరాధన చేస్తున్నట్టే కనిపిస్తారు. వాళ్ల చర్చీల్ని క్రైస్తవ ఆరాధనా స్థలాలని చెప్పుకుంటారు. కానీ వాళ్లు అబద్ధ క్రైస్తవులని వాళ్ల లక్షణాలు, పద్ధతులు చూపిస్తాయి. అలాగే నిజ క్రైస్తవుల్ని వాళ్ల మంచి లక్షణాల్ని, పద్ధతుల్ని బట్టి గుర్తుపట్టవచ్చు.మత్తయి 7:13-23 చదవండి.

3. సరైన ఆరాధన చేసేవాళ్లను ఎలా గుర్తుపట్టవచ్చు?

సరైన ఆరాధన చేసేవాళ్లను గుర్తుపట్టడానికి సహాయం చేసే ఐదు విషయాలు పరిశీలించండి:

  • వాళ్లు బైబిల్ని దేవుని వాక్యంగా గౌరవిస్తారు. వాళ్లు దేవుని వాక్యంలోని సూత్రాల ప్రకారం జీవించడానికి కృషి చేస్తారు. కాబట్టి సరైన మతం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉండదు. (మత్తయి 15:7-9) సరైన ఆరాధన చేసేవాళ్లు ఒకటి చెప్పి ఇంకొకటి చేయరు.యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17 చదవండి.

  • వాళ్లు యెహోవా దేవుని పేరును ఘనపరుస్తారు. యెహోవా పేరును ఇతరులకు తెలియజేయడం ద్వారా యేసు ఆ పేరును ఘనపర్చాడు. అంతేకాదు, దేవున్ని తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేశాడు, దేవుని పేరు పవిత్రపర్చబడాలని ప్రార్థించమని చెప్పాడు. (మత్తయి 6:9) మీ ప్రాంతంలో ఎవరు దేవుని పేరు ఇతరులకు తెలియజేస్తున్నారు?యోహాను 17:26; రోమీయులు 10:13, 14 చదవండి.

  • వాళ్లు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారు. రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడానికి దేవుడు యేసును పంపించాడు. దేవుని రాజ్యం మాత్రమే మనుషుల సమస్యలన్నిటినీ తీసేస్తుంది. యేసు చనిపోయే చివరిక్షణం వరకు దాని గురించే మాట్లాడాడు. (లూకా 4:43; 8:1; 23:42, 43) తన అనుచరులు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారని ఆయన చెప్పాడు. యేసులా ఎవరు ఇంటింటికి వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు?మత్తయి 24:14 చదవండి.

  • వాళ్లు లోకసంబంధులు కారు. వాళ్లు లోక రాజకీయాల్లో గానీ ఇతర పోరాటాల్లో గానీ పాల్గొనరు. (యోహాను 17:16; 18:36) అంతేకాదు, లోకంలోని హానికరమైన పనులకు, ఆలోచనలకు దూరంగా ఉంటారు.యాకోబు 4:4 చదవండి.

  • వాళ్లు ఒకరి మీద ఒకరు నిజమైన ప్రేమ చూపించుకుంటారు. అన్ని రకాల ప్రజల్ని గౌరవించాలని వాళ్లు దేవుని వాక్యం నుండి నేర్చుకుంటారు. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, అబద్ధ మతాలు తరచూ వాటికి పూర్తి మద్దతు తెలిపాయి. కానీ సరైన ఆరాధన చేసేవాళ్లు అలా చేయరు. (మీకా 4:1-3) బదులుగా వాళ్లు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి తమ సమయాన్ని, శక్తిని, డబ్బును నిస్వార్థంగా ఉపయోగిస్తారు.యోహాను 13:34, 35; 1 యోహాను 4:20 చదవండి.

4. సరైన మతాన్ని మీరు గుర్తుపట్టగలరా?

ఏ మతం దేవుని వాక్యం ఆధారంగా మాత్రమే బోధిస్తూ, దేవుని పేరును ఘనపరుస్తూ, కేవలం దేవుని రాజ్యమే మనుషుల సమస్యల్ని తీసేస్తుందని ప్రకటిస్తోంది? ఏ మతంవాళ్లు ప్రేమ చూపిస్తూ, యుద్ధాలకు దూరంగా ఉంటున్నారు? మీకు ఏమనిపిస్తుంది?1 యోహాను 3:10-12 చదవండి.