కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4

నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి

నాన్నను, యెహోవాను సంతోషపెట్టిన అమ్మాయి

యెఫ్తా యెహోవాకు ఏమని మాటిస్తున్నాడు?

ఎంత కష్టమనిపించినా, యెఫ్తా కూతురు నాన్న మాట నిలబెట్టింది

ఈ చిత్రంలో ఉన్న అమ్మాయిని చూశారా?— ఆమె యెఫ్తా అనే వ్యక్తి కూతురు. బైబిల్లో ఆమె పేరు లేదు కానీ ఆమె వాళ్ల నాన్నను, యెహోవాను సంతోషపెట్టిందనే విషయం మాత్రం ఉంది. ఇప్పుడు ఆమె గురించి, వాళ్ల నాన్న గురించి తెలుసుకుందాం.

యెఫ్తా చాలా మంచి మనిషి. కూతురుకు యెహోవా గురించి నేర్పించడానికి ఆయన ఎంతో సమయం వెచ్చించేవాడు. ఆయన చాలా బలవంతుడు, మంచి నాయకుడు కూడా. అందుకే, శత్రువుల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుండి నడిపించమని ఇశ్రాయేలీయులు ఆయనను అడిగారు.

యుద్ధంలో గెలవడానికి సహాయం చేయమని యెఫ్తా యెహోవాకు ప్రార్థించాడు. ఒకవేళ యుద్ధంలో గెలిస్తే, ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుండి ముందుగా ఎవరు తనకు ఎదురొస్తారో వాళ్లను యెహోవాకు ఇస్తానని మాటిచ్చాడు. అలా ఎదురొచ్చే వ్యక్తి, చనిపోయేంతవరకు దేవుని గుడారంలో ఉంటూ అక్కడ పనిచేయాలి. ఆ రోజుల్లో గుడారం అనేది ప్రజలు దేవుణ్ణి ఆరాధించే స్థలం. అయితే, యెఫ్తా యుద్ధంలో గెలిచాడు! మరి ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో నుండి ముందుగా ఎవరు ఆయనకు ఎదురొచ్చారో తెలుసా?—

అవును, యెఫ్తా కూతురే ఆయనకు ఎదురొచ్చింది! ఈమె యెఫ్తాకు ఒక్కగానొక్క కూతురు. అయితే ఇప్పుడాయన ఆమెను పంపించేయాలి. ఈ విషయం ఆయన్ని చాలా బాధపెట్టింది. కానీ మీకు గుర్తుందా? ఆయన దేవునికి మాటిచ్చాడు. వాళ్ల కూతురు ఇంకేమీ ఆలోచించకుండా ఇలా అంది: ‘నాన్నా, నువ్వు దేవునికి మాటిచ్చావు, దాన్ని నిలబెట్టుకోవాలి.’

యెఫ్తా కూతురి స్నేహితురాళ్లు ప్రతీ సంవత్సరం ఆమెను చూడడానికి వచ్చేవాళ్లు

యెఫ్తా కూతురు కూడా చాలా బాధపడింది. ఆమె గుడారం దగ్గర సేవ చేయడానికి వెళ్తే పెళ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు వీలుండదు. అయితే, నాన్న మాట నిలబెట్టాలని, యెహోవాను సంతోషపెట్టాలని ఆమె ఎంతగానో కోరుకుంది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం కన్నా అదే చాలా ముఖ్యమని ఆమె అనుకుంది. అందుకే, ఆమె చనిపోయేంతవరకు ఇంటికి దూరంగా గుడారంలోనే జీవించింది.

ఆమె చేసిన పని వాళ్ల నాన్నను, యెహోవాను సంతోషపెట్టిందా?— అవును, వాళ్లిద్దర్నీ సంతోషపెట్టింది. మీరు కూడా చెప్పిన మాట వింటే, యెహోవాను ప్రేమిస్తే యెఫ్తా కూతురిలా ఉండవచ్చు. అప్పుడు మీరు కూడా మీ అమ్మానాన్నల్ని, యెహోవాను ఎంతో సంతోషపెడతారు.