కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6

భయపడని దావీదు

భయపడని దావీదు

మీకు ఎప్పుడైనా భయమేస్తే ఏమి చేస్తారు?— అమ్మ దగ్గరికో, నాన్న దగ్గరికో పరిగెత్తుతారు కదా. మీకు సాయం చేసేవాళ్లు ఇంకొకరు కూడా ఉన్నారు తెలుసా? ఎవ్వరికీ లేనంత బలం ఆయనకు ఉంది! ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.— అవును, యెహోవా దేవుడు. ఇప్పుడు మనం దావీదు అనే యువకుడి గురించి తెలుసుకుందాం. యెహోవా ఎప్పుడూ తోడుగా ఉంటాడని అతనికి తెలుసు, అందుకే అతను భయపడలేదు.

దావీదు అమ్మానాన్నలు అతనికి చిన్నప్పటి నుండే యెహోవాను ప్రేమించడం నేర్పించారు. అందుకే, చాలా భయపెట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దావీదు భయపడలేదు. యెహోవా తనకు స్నేహితుడని, ఆపదలో తనను ఆదుకుంటాడని దావీదుకు తెలుసు. ఓసారి దావీదు గొర్రెలను కాస్తుండగా, పేద్ద సింహం ఓ గొర్రెను నోట కరచుకుని తీసుకెళ్లిపోయింది! అప్పుడు దావీదు ఏమి చేశాడో తెలుసా? ఆ సింహం వెనకాలే పరుగెత్తుకుంటూ వెళ్లి దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపేశాడు! ఇంకోసారి ఏమైందంటే, ఒక ఎలుగుబంటి దావీదు గొర్రె మీద దాడి చేసింది. దావీదు దాన్ని కూడా చంపేశాడు! ఇంతకీ దావీదు అదంతా ఎలా చేశాడు?— అవును, యెహోవా సహాయంతో చేశాడు.

ఒకసారి దావీదు చాలా ఎక్కువ ధైర్యం చూపించాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. ఫిలిష్తీయుల్లో ఒక సైనికుడు చాలాచాలా పొడుగ్గా, ఎంతో బలంగా ఉండేవాడు! అతని పేరు గొల్యాతు. ఇశ్రాయేలు సైనికులను, యెహోవాను వాడు చాలా ఎగతాళి చేశాడు. దమ్ముంటే తనతో పోరాడమని ఇశ్రాయేలు సైనికులకు సవాలు విసిరాడు. కానీ, ఇశ్రాయేలు సైన్యంలో ఎవ్వరికీ ధైర్యం చాల్లేదు. ఈ విషయం దావీదుకు తెలిసింది, అప్పుడు అతను గొల్యాతుతో ఇలా అన్నాడు: ‘నీతో నేను పోరాడతా! యెహోవా నాకు తోడుగా ఉంటాడు. నేను నిన్ను ఓడిస్తా!’ దావీదు అంత ధైర్యవంతుడా?— అవును, చాలా ధైర్యవంతుడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలనుందా?

దావీదు తన వడిసెలను, ఐదు నున్నని రాళ్లను తీసుకుని ఆ భారీకాయుడితో పోరాడడానికి వెళ్లాడు. దావీదు ఎంత చిన్నోడో చూసి గొల్యాతు ఎగతాళి చేశాడు. అప్పుడు దావీదు గొల్యాతుతో ఇలా అన్నాడు: ‘నువ్వు కత్తితో వచ్చావు, కానీ నేను యెహోవా పేరున నీ మీదకు వస్తున్నా!’ ఆ తర్వాత దావీదు ఒక రాయిని వడిసెలలో పెట్టి, పరుగెత్తుకుంటూ వెళ్లి గొల్యాతు మొహం మీదకు విసిరాడు. రాయి రయ్యిమని వెళ్లి గొల్యాతు నుదుటి మీద, సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్య గట్టిగా తగిలింది! అంత ఎత్తున్న ఆ బలవంతుడు ఒక్కసారిగా ఢబేల్‌మని కింద పడి చచ్చిపోయాడు! అది చూసి ఫిలిష్తీయులు ఎంత భయపడ్డారంటే వాళ్లు అక్కడి నుండి పరుగులు తీశారు. దావీదు చిన్నోడు కదా, మరి అంత బలవంతుణ్ణి ఎలా ఓడించాడు?— ఎలాగంటే, దావీదుకు యెహోవా సహాయం చేశాడు. యెహోవా గొల్యాతుకన్నా చాలాచాలా బలవంతుడు!

యెహోవా తోడుగా ఉంటాడని దావీదుకు తెలుసు, అందుకే అతను భయపడలేదు

దావీదు కథ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— యెహోవా అందరికన్నా బలవంతుడు. ఆయన మీకు స్నేహితుడు కూడా. ఈసారి ఎప్పుడైనా మీకు భయమేస్తే, యెహోవా మీకు తోడుగా ఉంటూ ధైర్యమిస్తాడని మర్చిపోకండి!

మీ బైబిల్లో చదవండి