కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9

యెహోవా గురించి మాట్లాడడం మానని యిర్మీయా

యెహోవా గురించి మాట్లాడడం మానని యిర్మీయా

వీళ్లు యిర్మీయా మీద ఎందుకు కోప్పడుతున్నారు?

యెహోవా యిర్మీయాను కాపాడాడు

మనం యెహోవా గురించి మాట్లాడినప్పుడు కొంతమంది మనల్ని ఎగతాళి చేస్తారు, ఇంకొంతమంది మనమీద కోప్పడతారు. దాంతో మనకు దేవుని గురించి మాట్లాడడం మానేయాలని అనిపించే అవకాశముంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?— బైబిలు ఒక యువకుని గురించి చెబుతోంది. అతను యెహోవాను ప్రేమించాడు కానీ యెహోవా గురించి మాట్లాడడం దాదాపు మానేసినంత పనిచేశాడు. అతని పేరు యిర్మీయా. ఇప్పుడు అతని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం.

యెహోవా యిర్మీయాకు ఒక పని అప్పగించాడు. అదేమిటంటే, చెడ్డపనులు చేయడం మానేయమని ప్రజలను హెచ్చరించాలి. అప్పటికి యిర్మీయా ఇంకా యువకుడే. యెహోవా చెప్పిన పని చేయడం యిర్మీయాకు చాలా కష్టమనిపించింది, అతను భయపడ్డాడు కూడా. యిర్మీయా యెహోవాతో ఇలా అన్నాడు: ‘నాకు ఏమి మాట్లాడాలో తెలీదు. నేనింకా చిన్నోడినే.’ దానికి యెహోవా ఇలా అన్నాడు: ‘భయపడకు, నేను నీకు తోడుంటా.’

యెహోవా ఇచ్చిన హామీతో యిర్మీయా ప్రజలను హెచ్చరించడం మొదలుపెట్టాడు. వాళ్లు మారకపోతే దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు. మరి ప్రజల్లో మార్పు వచ్చిందా?— రాలేదు. పైగా కొంతమంది అతన్ని వెక్కిరించారు, ఇంకొంతమంది అతని మీద కోప్పడ్డారు. మరికొంతమంది ఏకంగా అతన్ని చంపేయాలనుకున్నారు! అప్పుడు యిర్మీయాకు ఎలా అనిపించిందంటారు?— అతనికి భయమేసింది. ‘యెహోవా గురించి ఇంకెప్పుడూ మాట్లాడను’ అనుకున్నాడు. మరి నిజంగానే మాట్లాడడం మానేశాడా?— లేదు, మానేయలేదు. అతనికి యెహోవా అంటే చాలా ఇష్టం, ఎంతంటే ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. యిర్మీయా యెహోవా చెప్పిన పని చేయడం మానేయలేదు కాబట్టి యెహోవా అతన్ని క్షేమంగా ఉంచాడు.

ఉదాహరణకు, కొంతమంది చెడ్డవాళ్లు యిర్మీయాను పట్టుకుని చాలా లోతుగా ఉన్న బురద గుంటలో పడేశారు. అక్కడ తిండి లేదు, నీళ్లు లేవు. అతను అందులోనే చనిపోవాలని వదిలేసి వెళ్లిపోయారు. కానీ యెహోవా సహాయంతో యిర్మీయా బయటపడ్డాడు!

యిర్మీయా నుండి మీరేమి నేర్చుకోవచ్చు?— యిర్మీయా కొన్నిసార్లు భయపడినా, యెహోవా గురించి మాట్లాడడం మానేయలేదు. మీరు యెహోవా గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది కోప్పడతారు. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించవచ్చు, భయమేయవచ్చు. అయినా సరే, యెహోవా గురించి మాట్లాడడం ఎప్పుడూ మానేయకండి. యెహోవా యిర్మీయాకు తోడుగా ఉన్నట్టే, మీకు కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాడు.

మీ బైబిల్లో చదవండి