కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1

“నీ రాజ్యం రావాలి”

“నీ రాజ్యం రావాలి”

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడో పరిశీలిస్తాం

1, 2. యెహోవా ముగ్గురు అపొస్తలులకు ఏమి చెప్పాడు? దానికి వాళ్లు ఎలా స్పందించారు?

 యెహోవా దేవుడే స్వయంగా మీకు ఏదైనా చేయమని చెప్తే, మీరెలా స్పందిస్తారు? ఆయన ఏమి అడిగినా సరే, మీరు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు!

2 సా.శ. 32 పస్కా పండుగ తర్వాత పేతురు, యోహాను, యాకోబులకు అలాంటి అనుభవమే ఎదురైంది. (మత్తయి 17:1-5 చదవండి.) ఆ ముగ్గురు అపొస్తలులు యేసుతో కలిసి “ఎత్తయిన ఓ కొండ మీదికి” వెళ్లారు. అక్కడ వాళ్లు ఒక దర్శనంలో, యేసును మహిమాన్విత పరలోక రాజుగా చూశారు. పేతురు ఆ దర్శనంలో ఎంతగా లీనమైపోయాడంటే, అది నిజంగానే జరుగుతుందనుకొని, మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతుండగా, ఒక మేఘం వాళ్లను కమ్మేసింది. అప్పుడు వాళ్లు యెహోవా స్వరాన్ని విన్నారు! దేవుని స్వరం వినే అలాంటి అరుదైన అవకాశం కేవలం కొద్దిమందికి మాత్రమే దక్కింది. యెహోవా తన కొడుకైన యేసు గురించి చెప్తూ, “ఈయన మాట వినండి” అని అన్నాడు. అపొస్తలులు ఆ నిర్దేశానికి లోబడ్డారు. వాళ్లు యేసు బోధల్ని విన్నారు, అలాగే వాటిని ఇతరులకు బోధించారు.—అపొ. 3:19-23; 4:18-20.

యేసు మరే ఇతర విషయాల కన్నా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు

3. మనం తన కొడుకు మాట వినాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు? ఇప్పుడు మనం దేని గురించి పరిశీలిస్తాం?

3 “ఈయన మాట వినండి” అనే మాటల్ని, దేవుడు మన కోసమే బైబిల్లో రాయించాడు. (రోమా. 15:4) ఎందుకు? ఎందుకంటే, యేసు యెహోవా ప్రతినిధిగా ఆయన తరఫున మాట్లాడాడు. అంతేకాదు, యేసు నోరు తెరచి బోధించిన ప్రతీసారి, మనం ఏ విషయాలు తెలుసుకోవాలని తండ్రి కోరుకుంటున్నాడో వాటినే బోధించాడు. (యోహా. 1:1, 14) ఆయన మరే ఇతర విషయాల కన్నా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు. దేవుని రాజ్యం అంటే క్రీస్తుయేసు, 1,44,000 మంది సహరాజులు కలిసి ఏర్పడే పరలోక మెస్సీయ ప్రభుత్వం. మనం దానిగురించి జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. (ప్రక. 5:9, 10; 14:1-3; 20:6) ముందుగా, యేసు ఎక్కువగా దేవుని రాజ్యం గురించే ఎందుకు బోధించాడో పరిశీలిద్దాం.

“హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది”

4. రాజ్యం అంటే యేసుకు ఇష్టమని ఎలా చెప్పవచ్చు?

4 దేవుని రాజ్యం అంటే యేసుకు చాలా ఇష్టం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? సాధారణంగా, మాటలు హృదయానికి అద్దంపడతాయి. అంటే, మనం వేటిని ప్రాముఖ్యంగా ఎంచుతున్నామో మన మాటల్లో తెలుస్తుంది. యేసే స్వయంగా ఇలా అన్నాడు: “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.” (మత్త. 12:34) ఆయన ప్రతీ సందర్భంలో రాజ్యం గురించే మాట్లాడాడు. నాలుగు సువార్త పుస్తకాల్లో, రాజ్యం గురించిన ప్రస్తావన 100 కన్నా ఎక్కువసార్లు ఉంది. వాటిలో చాలావరకు యేసు స్వయంగా ప్రస్తావించినవే. నిజానికి, ఆయన ప్రకటించిన ముఖ్య సందేశం, దేవుని రాజ్యమే. ఆయన ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.” (లూకా 4:43) పునరుత్థానమైన తర్వాత కూడా, యేసు తన శిష్యులతో రాజ్యం గురించే మాట్లాడాడు. (అపొ. 1:3) యేసు హృదయమంతా రాజ్యానికి సంబంధించిన విషయాలతో నిండిపోయింది కాబట్టే, ఆయన దానిగురించి ఎక్కువగా మాట్లాడాడు.

5-7. (ఎ) రాజ్యం అంటే యెహోవాకు ఇష్టమని మనకెలా తెలుసు? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) రాజ్యం అంటే మనకు కూడా అలాంటి ఇష్టమే ఉందని ఎలా చూపించవచ్చు?

5 రాజ్యం అంటే యెహోవాకు కూడా చాలా ఇష్టం. అది మనకెలా తెలుసు? యేసును ఈ లోకానికి పంపించింది యెహోవాయే. అంతేకాదు, యేసు చెప్పినవాటికి, బోధించినవాటికి మూలం ఆయనే. (యోహా. 7:16; 12:49, 50) నాలుగు సువార్త పుస్తకాలు యేసు జీవితాన్ని, పరిచర్యను వివరిస్తున్నాయి. వాటిలో ప్రతీ విషయాన్ని రాయించింది కూడా యెహోవాయే. దాన్నిబట్టి మనం ఏ ముగింపుకు రావచ్చు?

మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘దేవుని రాజ్యం అంటే నాకూ అలాంటి ఇష్టమే ఉందా?’

6 మీరు ఒక ఆల్బమ్‌లో ఫోటోలు పెడుతున్నట్లు ఊహించుకోండి. మీ దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి. కానీ ఆల్బమ్‌లో కొన్నే పడతాయి. అప్పుడు మీరేమి చేస్తారు? ఏ ఫోటోలు పెట్టాలో ఎంచుకుని, వాటిని మాత్రమే పెడతారు. ఒక విధంగా, సువార్త పుస్తకాలన్నీ యేసు గురించి తెలియజేసే ఫోటో ఆల్బమ్‌ లాంటివే. అయితే, యేసు భూమ్మీదున్నప్పుడు చెప్పిన ప్రతీ విషయం గురించి, చేసిన ప్రతీ పని గురించి యెహోవా ఆ సువార్త పుస్తకాల్లో రాయించలేదు. (యోహా. 20:30; 21:25) బదులుగా, ప్రాముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే యెహోవా పవిత్రశక్తితో రాయించాడు. ఆ కొద్ది సమాచారంలోనే, యేసు పరిచర్య ఉద్దేశం ఏమిటో, యెహోవాకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటో మనం తెలుసుకోవచ్చు. (2 తిమో. 3:16, 17; 2 పేతు. 1:21) సువార్త పుస్తకాల నిండా, దేవుని రాజ్యం గురించిన విషయాలే ఉన్నాయి. కాబట్టి, రాజ్యం అంటే యెహోవాకు చాలా ఇష్టమని అర్థమౌతుంది. మనం తన రాజ్యం గురించి తెలుసుకోవాలని యెహోవా ఎంతగా కోరుకుంటున్నాడో కదా!

7 మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘దేవుని రాజ్యం అంటే నాకూ అలాంటి ఇష్టమే ఉందా?’ ఒకవేళ ఉంటే, రాజ్యం గురించి యేసు ఏమి చెప్పాడో, బోధించాడో మనం తెలుసుకుంటాం. అంటే రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో, అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటాం.

రాజ్యం ఎలా వస్తుంది?

8. రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో యేసు ఎలా తెలియజేశాడు?

8 యేసు నేర్పించిన ప్రార్థన గురించి ఆలోచించండి. యేసు కేవలం కొన్ని సరళమైన పదాల్లోనే, రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో, అది త్వరలోనే ఏమి సాధిస్తుందో తెలియజేశాడు. ఆ ప్రార్థనలో ఏడు విన్నపాలు ఉన్నాయి. అందులో మొదటి మూడు విన్నపాలు యెహోవా సంకల్పాలకు సంబంధించినవి. అవి: ఆయన పేరు పవిత్రపర్చబడడం, ఆయన రాజ్యం రావడం, ఆయన ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద కూడా నెరవేరడం. (మత్తయి 6:9, 10 చదవండి.) ఆ మూడు విన్నపాలు ఒకదానికొకటి ముడిపడివున్నాయి. మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు, తన ఇష్టాన్ని నెరవేరుస్తాడు.

9, 10. (ఎ) దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? (బి) బైబిల్లోని ఏ వాగ్దానం నెరవేరితే చూడాలని మీరు కోరుకుంటున్నారు?

9 దేవుని రాజ్యం ఎలా వస్తుంది? “నీ రాజ్యం రావాలి” అని ప్రార్థిస్తున్నామంటే, నిజానికి ఆ రాజ్యం చర్య తీసుకోవాలని మనం అడుగుతున్నాం. రాజ్యం వచ్చినప్పుడు, అది భూమంతటిని పూర్తిగా తన అధికారంలోకి తీసుకుంటుంది. అది ప్రస్తుతం ఉన్న చెడ్డ వ్యవస్థను, మానవ ప్రభుత్వాలన్నిటిని నిర్మూలించి, నీతి విలసిల్లే కొత్త లోకాన్ని తీసుకొస్తుంది. (దాని. 2:44; 2 పేతు. 3:13) ఆ రాజ్య పరిపాలన కింద భూమంతా పరదైసులా మారుతుంది. (లూకా 23:43) చనిపోయి దేవుని జ్ఞాపకంలో ఉన్నవాళ్లు తిరిగి లేచి, తమ ప్రియమైన వాళ్లను కలుసుకుంటారు. (యోహా. 5:28, 29) విధేయులైన మనుషులు పరిపూర్ణతకు చేరుకుని, శాశ్వత జీవితాన్ని ఆనందిస్తారు. (ప్రక. 21:3-5) అప్పుడు, పరలోకంలో నెరవేరినట్లే భూమ్మీద కూడా యెహోవా ఇష్టం నెరవేరుతుంది! ఆ వాగ్దానాలు నిజమయ్యే రోజు కోసం మీరు ఎదురుచూస్తున్నారా? దేవుని రాజ్యం రావాలని ప్రార్థించిన ప్రతీసారి, ఆ వాగ్దానాలు నిజమవ్వాలని మీరు ప్రార్థిస్తున్నట్లే.

10 దేవుని రాజ్యం రాలేదని, అంటే యేసు నేర్పించిన ప్రార్థనలోని ఆ మూడు విన్నపాలు ఇంకా నెరవేరలేదని మనకు తెలుసు. ప్రస్తుతం ఈ భూమిని మానవ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి; నీతి విలసిల్లే కొత్త లోకం ఇంకా రాలేదు. కానీ ఒక శుభవార్త. దేవుని రాజ్యం ఇప్పటికే స్థాపించబడింది! దానిగురించి మనం తర్వాతి అధ్యాయంలో వివరంగా చర్చిస్తాం. అయితే, రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది, ఎప్పుడు వస్తుంది వంటి విషయాల గురించి యేసు ఏమి చెప్పాడో ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం.

రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది?

11. రాజ్యం స్థాపించబడడం గురించి యేసు ఏమి సూచించాడు?

11 దేవుని రాజ్యం సా.శ. మొదటి శతాబ్దంలో స్థాపించబడుతుందని యేసు శిష్యుల్లో కొంతమంది అనుకున్నారు. కానీ అది మొదటి శతాబ్దంలో స్థాపించబడదని యేసు సూచించాడు. (అపొ. 1:6) దానికి సంబంధించి, కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఆయన రెండు ఉదాహరణలు చెప్పాడు. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం.

12. రాజ్యం మొదటి శతాబ్దంలో స్థాపించబడదని, గోధుమలు గురుగుల ఉదాహరణ ఎలా చూపిస్తుంది?

12 గోధుమలు, గురుగుల ఉదాహరణ. (మత్తయి 13:24-30 చదవండి.) యేసు బహుశా సా.శ. 31 వసంతకాలంలో ఈ ఉదాహరణ చెప్పివుంటాడు. ఆ తర్వాత, దాని అర్థాన్ని తన శిష్యులకు వివరించాడు. (మత్త. 13:36-43) దాని సారాంశం ఏంటంటే: అపొస్తలులు చనిపోయిన తర్వాత, సాతాను గోధుమల (“రాజ్య కుమారులు” లేదా అభిషిక్త క్రైస్తవులు) మధ్య గురుగుల్ని (నకిలీ క్రైస్తవులు) విత్తుతాడు. గోధుమలు, గురుగులు కోతకాలం వరకు అంటే “లోక వ్యవస్థ ముగింపు” వరకు కలిసి పెరుగుతాయి. ఆ రెండూ కలిసి పెరిగే కాలం పూర్తై, కోతకాలం మొదలవ్వగానే గురుగుల్ని పీకేసి, గోధుమల్ని సమకూరుస్తారు. కాబట్టి, రాజ్యం స్థాపించబడేది మొదటి శతాబ్దంలో కాదు గానీ, గోధుమలు గురుగులు కలిసి పెరిగే కాలం పూర్తయ్యాకే అని ఆ ఉదాహరణ చూపిస్తుంది. 1914లో, ఆ కాలం పూర్తై, కోతకాలం మొదలైంది.

13. తాను పరలోకానికి వెళ్లిన వెంటనే రాజ్యాధికారం పొందనని వివరించడానికి యేసు ఏ ఉదాహరణ చెప్పాడు?

13 మినాల ఉదాహరణ. (లూకా 19:11-13 చదవండి.) యేసు ఈ ఉదాహరణను సా.శ. 33లో, చివరిసారిగా యెరూషలేముకు వెళ్తున్న సమయంలో చెప్పాడు. యెరూషలేముకు చేరుకోగానే యేసు తన రాజ్యాన్ని స్థాపిస్తాడని కొంతమంది అనుకున్నారు. యేసు వాళ్ల ఆలోచనను సరిదిద్ది, రాజ్యం స్థాపించబడడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పాలనుకున్నాడు. అందుకే, తనను ‘రాజ్యాధికారం సంపాదించుకొని తిరిగి వద్దామని దూర దేశానికి’ ప్రయాణమైన ఒక వ్యక్తితో పోల్చుకున్నాడు. a యేసు వెళ్లే ఆ దూరదేశం, పరలోకమే. అక్కడ ఆయన తన తండ్రి దగ్గర నుండి రాజ్యాధికారం పొందుతాడు. అయితే, పరలోకానికి వెళ్లిన వెంటనే కాదు గానీ, ఆయన దేవుని కుడిపక్కన కూర్చుని, నియమిత సమయం వరకు వేచి ఉన్న తర్వాతే దాన్ని పొందుతాడు. అలా ఆయన వందల సంవత్సరాలపాటు వేచివున్నాడు.—కీర్త. 110:1, 2; మత్త. 22:43, 44; హెబ్రీ. 10:12, 13.

రాజ్యం ఎప్పుడు వస్తుంది?

14. (ఎ) నలుగురు అపొస్తలులు అడిగిన ప్రశ్నకు యేసు ఏమి జవాబు చెప్పాడు? (బి) యేసు చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతోంది కాబట్టి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

14 యేసు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, నలుగురు అపొస్తలులు ఆయన దగ్గరికి వచ్చి, “నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” అని అడిగారు. (మత్త. 24:3; మార్కు 13:4) దానికి జవాబుగా, యేసు చాలా అంశాలు ఇమిడివున్న ఒక ప్రవచనాన్ని చెప్పాడు. దాన్ని మనం మత్తయి 2425 అధ్యాయాల్లో చూడవచ్చు. తన ప్రత్యక్షతా కాలంలో భూవ్యాప్తంగా జరిగే వేర్వేరు సంఘటనల గురించి యేసు ఆ ప్రవచనంలో వివరించాడు. యేసు ప్రత్యక్షతా కాలం, రాజ్యం స్థాపించబడినప్పుడు మొదలై, రాజ్యం వచ్చినప్పుడు ముగుస్తుంది. ఆ ప్రవచనం 1914 నుండి నెరవేరడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. b కాబట్టి, 1914లో ఆయన ప్రత్యక్షతా కాలం మొదలైందని, అలాగే రాజ్యం స్థాపించబడిందని స్పష్టమౌతోంది.

15, 16. యేసు “ఈ తరం” అని అన్నప్పుడు ఎవర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు?

15 మరి రాజ్యం ఎప్పుడు వస్తుంది? అది ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుందో యేసు చెప్పలేదు. (మత్త. 24:36) కానీ, అది చాలా దగ్గర్లో ఉందని సూచించే కొన్ని విషయాల్ని ఆయన చెప్పాడు. తాను చెప్పిన ప్రవచనం నెరవేరడాన్ని “ఈ తరం” కళ్లారా చూసిన తర్వాతే రాజ్యం వస్తుందని యేసు తెలియజేశాడు. (మత్తయి 24:32-34 చదవండి.) “ఈ తరం” అంటే అర్థమేమిటి? యేసు మాటల్ని ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం.

16 “ఈ తరం.” యేసు అవిశ్వాసుల్ని ఉద్దేశించి ఆ మాట అన్నాడా? లేదు. ఆయన ఆ ప్రవచనాన్ని ఎవరితో చెప్పాడో పరిశీలించండి. ఆయన తన దగ్గరికి “ఏకాంతంగా” వచ్చిన కొద్దిమంది శిష్యులతో, అంటే త్వరలోనే పవిత్రశక్తితో అభిషేకించబడే తన అనుచరులతో చెప్పాడు. (మత్త. 24:3) ఆయన ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు? “ఈ తరం” గురించి ప్రస్తావించే ముందు ఆయన ఇలా అన్నాడు: “అంజూర చెట్టు ఉదాహరణను గమనించండి: ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, మృదువుగా మారి చిగురించిన వెంటనే ఎండాకాలం దగ్గర పడిందని మీకు తెలుస్తుంది. అదే విధంగా, ఇవన్నీ జరుగుతుండడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.” యేసు చెప్పిన సూచనను, అలాగే ‘ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడనే’ విషయాన్ని గుర్తించేది అభిషిక్త అనుచరులే గానీ అవిశ్వాసులు కాదు. కాబట్టి, “ఈ తరం” అన్నప్పుడు, యేసు తన అభిషిక్త అనుచరులను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు.

17. “తరం,” “ఇవన్నీ” అనే పదాలు వేటిని సూచిస్తున్నాయి?

17 “ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు అంతరించిపోదు.” ఆ మాటల అర్థం ఏమిటి? అది తెలుసుకోవాలంటే, ముందు “తరం” అంటే ఏమిటో, “ఇవన్నీ” అంటే ఏమిటో తెలుసుకోవాలి. సాధారణంగా “తరం” అనే పదం, ఒకానొక సమయంలో జీవిస్తున్న వేర్వేరు వయసుల ప్రజల్ని సూచిస్తుంది. అది మరీ ఎక్కువకాలం ఉండదు, దానికి ఒక ముగింపు ఉంటుంది. (నిర్గ. 1:6) “ఇవన్నీ” అనే పదం, యేసు ప్రత్యక్షతా కాలంలో జరిగే సంఘటనలన్నిటిని, అంటే 1914 నుండి “మహాశ్రమ” వరకు జరిగే సంఘటనలన్నిటిని సూచిస్తుంది.—మత్త. 24:21.

18, 19. “తరం” గురించి యేసు చెప్పిన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దాన్నిబట్టి మనం ఏ ముగింపుకు రావచ్చు?

18 తరం గురించి యేసు చెప్పిన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తరంలో, అభిషిక్తుల రెండు గుంపులు ఉన్నాయి. మొదటి గుంపువాళ్లు ఎవరంటే, 1914లో యేసు చెప్పిన సూచన నెరవేర్పును కళ్లారా చూసిన అభిషిక్తులు. రెండో గుంపువాళ్లు ఎవరంటే, మొదటి గుంపువాళ్లకు సమకాలీనులు. రెండో గుంపువాళ్లలో కనీసం కొద్దిమందైనా మహాశ్రమ ప్రారంభమవ్వడాన్ని కళ్లారా చూస్తారు. మొదటి గుంపులోని అభిషిక్తులు జీవిస్తున్న సమయంలోనే రెండో గుంపువాళ్లు అభిషేకించబడ్డారు, కాబట్టి వాళ్లిద్దర్నీ కలిపి ఒక తరం అని చెప్పవచ్చు. c

19 మరి ఇప్పుడు మనం ఏ ముగింపుకు రావచ్చు? యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచన భూవ్యాప్తంగా నెరవేరడాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, ‘ఈ తరంలో’ భాగమైన అభిషిక్త క్రైస్తవులు వృద్ధులవ్వడాన్ని కూడా చూస్తున్నాం. వాళ్లలో అందరూ చనిపోకముందే మహాశ్రమ మొదలౌతుంది. కాబట్టి, రాజ్యం త్వరలోనే వస్తుందని, ఈ భూమ్మీద పరిపాలన ప్రారంభిస్తుందని మనం ముగింపుకు రావచ్చు. యేసు నేర్పించిన ప్రార్థనలో “నీ రాజ్యం రావాలి” అనే విన్నపం నెరవేరడాన్ని కళ్లారా చూసినప్పుడు ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా!

20. ఈ ప్రచురణలో ముఖ్యంగా దేని గురించి చర్చిస్తాం? తర్వాతి అధ్యాయంలో ఏమి పరిశీలిస్తాం?

20 “ఈయన మాట వినండి” అని యేసు గురించి యెహోవాయే స్వయంగా చెప్పిన మాటల్ని ఎన్నడూ మర్చిపోకుండా ఉందాం. నిజ క్రైస్తవులమైన మనం, ఆ నిర్దేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని రాజ్యం గురించి యేసు చెప్పిన, బోధించిన ప్రతీ విషయంలో మనకు ఎంతో ఆసక్తి ఉంది. ఈ ప్రచురణలో ముఖ్యంగా, దేవుని రాజ్యం ఇప్పటికే ఏమి సాధించిందో, భవిష్యత్తులో ఏమి సాధిస్తుందో పరిశీలిస్తాం. దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడినప్పుడు జరిగిన ఉత్తేజకరమైన సంఘటనల గురించి తర్వాతి అధ్యాయం చర్చిస్తుంది.

a యేసు ఉదాహరణ వింటున్నవాళ్లకు, హేరోదు కొడుకైన అర్కెలాయు గుర్తొచ్చివుంటాడు. హేరోదు చనిపోకముందు, అతను తన వారసుడైన అర్కెలాయును యూదయ మీద, ఇతర ప్రాంతాల మీద పరిపాలకునిగా నియమించాడు. కానీ అర్కెలాయు తన పరిపాలన మొదలుపెట్టాలంటే, ముందు రోముకు దూర ప్రయాణం చేసి కైసరు ఔగుస్తు దగ్గర ఆమోదం తీసుకోవాలి.

c 1914లో ‘వేదనలు ఆరంభం’ అవ్వడాన్ని కళ్లారా చూసిన అభిషిక్తులు మొదటి గుంపువాళ్లు. వాళ్లలోని చివరి వ్యక్తి చనిపోయిన తర్వాత అభిషేకించబడినవాళ్లు ‘ఈ తరంలో’ భాగమవ్వరు.—మత్త. 24:8.