కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3

యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేశాడు

యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేశాడు

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యెహోవా తనపట్ల భయభక్తులు గలవాళ్లకు, తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేస్తాడు

1, 2. మనుషుల విషయంలో తన సంకల్పాన్ని యెహోవా ఎలా వెల్లడి చేశాడు?

 శ్రద్ధగల తల్లిదండ్రులు, తమ కుటుంబ విషయాల్ని పిల్లలతో కూడా పంచుకుంటారు. అయితే వాళ్లు వివేచన ఉపయోగించి, పిల్లలు ఏ విషయాల్ని అర్థం చేసుకోగలరో, ఎంతవరకు అర్థం చేసుకోగలరో ఆలోచించి వాటినే చెప్తారు.

2 అదేవిధంగా, యెహోవా మనుషుల విషయంలో తన సంకల్పాన్ని క్రమక్రమంగా తెలియజేశాడు. అది కూడా, తగిన సమయంలో వెల్లడి చేశాడు. చరిత్రంతటిలో, రాజ్య సత్యాల్ని యెహోవా ఎలా వెల్లడి చేశాడో ఇప్పుడు క్లుప్తంగా పరిశీలిద్దాం.

రాజ్యం ఎందుకు అవసరమైంది?

3, 4. మనుషుల భవిష్యత్తును యెహోవా ముందే నిర్ణయించాడా? వివరించండి.

3 మొదట్లో, మెస్సీయ రాజ్యం యెహోవా సంకల్పంలో భాగం కాదు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, మనుషుల భవిష్యత్తును యెహోవా ముందే నిర్ణయించలేదు. నిజానికి, ఆయన వాళ్లకు స్వేచ్ఛనిస్తూ ఇలా అన్నాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆది. 1:28) అయితే, వాళ్లు మంచిచెడుల విషయంలో తన ప్రమాణాలను గౌరవించాలని ఆయన కోరుకున్నాడు. (ఆది. 2:16, 17) ఆదాముహవ్వలు యెహోవాకు నమ్మకంగా ఉండాల్సింది. అలా ఉండివుంటే, దేవుని సంకల్పం నెరవేర్చడానికి రాజ్యం అవసరమై ఉండేదే కాదు. పైగా, ఇప్పుడు భూమంతా యెహోవాను ఆరాధించే పరిపూర్ణ ప్రజలతో నిండి ఉండేది.

4 ఆదాముహవ్వలు, అలాగే సాతాను తిరుగుబాటు చేసినప్పటికీ, భూమిని పరిపూర్ణ మనుషులతో నింపాలనే తన సంకల్పాన్ని యెహోవా మార్చుకోలేదు. బదులుగా, దాన్ని నెరవేర్చడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉదాహరణకు, ఒక రైలు గమ్యస్థానం చేరుకోవాలంటే నిర్దిష్ట మార్గంలోనే వెళ్లాలి. ఆ మార్గంలో ఏదైనా ఆటంకం కలిగితే అది గమ్యస్థానం చేరుకోలేదు. యెహోవా సంకల్పం అలాంటిది కాదు. ఆయన ఒక్కసారి దేని గురించైనా చెప్పాడంటే, విశ్వంలోని ఏ శక్తీ దాన్ని నెరవేరకుండా అడ్డుకోలేదు. (యెషయా 55:10, 11 చదవండి.) ఏదైనా ఆటంకం వల్ల ఒక మార్గం మూసుకుపోతే ఆయన మరో మార్గాన్ని ఉపయోగించుకుంటాడు. a (నిర్గ. 3:14, 15) తర్వాత, తగిన సమయంలో ఆ కొత్త మార్గం గురించి తన నమ్మకమైన సేవకులకు తెలియజేస్తాడు.

5. ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు యెహోవా ఏమి చేశాడు?

5 ఏదెనులో తిరుగుబాటు జరిగిన వెంటనే, యెహోవా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. (మత్త. 25:34) మానవజాతికి చీకటి అలుముకున్న ఆ సమయంలో, ఆయన వెలుగును ప్రసరింపజేయడం మొదలుపెట్టాడు. మనుషుల్ని తిరిగి పరిపూర్ణులుగా చేయడానికి, సాతాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించడానికి తాను ఉపయోగించబోయే సాధనం గురించి యెహోవా తెలియజేశాడు. (ఆది. 3:14-19) అయితే, దానికి సంబంధించిన వివరాలన్నిటినీ ఆయన ఒకే సమయంలో వెల్లడి చేయలేదు.

యెహోవా రాజ్య సత్యాల్ని వెల్లడి చేయడం మొదలుపెట్టాడు

6. యెహోవా ఏమి వాగ్దానం చేశాడు? కానీ ఆయన ఏ వివరాలను వెల్లడి చేయలేదు?

6 సాతాను తలను చితక్కొట్టే ఒక ‘సంతానం’ గురించి, యెహోవా తన మొట్టమొదటి ప్రవచనంలోనే తెలియజేశాడు. (ఆదికాండము 3:15 చదవండి.) అయితే ఆ సంతానం ఎవరో, సర్ప సంతానం ఎవరో ఆ సమయంలో ఆయన చెప్పలేదు. నిజానికి, ఆయన ఆ వివరాలను దాదాపు 2000 సంవత్సరాల వరకు వెల్లడి చేయలేదు. b

7. యెహోవా అబ్రాహామును ఎందుకు ఎంచుకున్నాడు? దానినుండి మనం ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

7 తర్వాత, ఆ వాగ్దాన సంతానం అబ్రాహాము ద్వారా రావాలని యెహోవా సంకల్పించాడు. యెహోవా అబ్రాహామునే ఎందుకు ఎంచుకున్నాడంటే, అతను యెహోవా ‘మాట విన్నాడు.’ (ఆది. 22:18) దానినుండి మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, తనపట్ల భయభక్తులు గలవాళ్లకు మాత్రమే యెహోవా తన సంకల్పాన్ని వెల్లడిచేస్తాడు.—కీర్తన 25:14 చదవండి.

8, 9. వాగ్దాన సంతానం గురించిన ఏ సత్యాల్ని యెహోవా అబ్రాహాముకు, యాకోబుకు వెల్లడి చేశాడు?

8 యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముతో ఒక దూత ద్వారా మాట్లాడుతూ, వాగ్దాన సంతానం ఒక మనిషి అనే ప్రాముఖ్యమైన సత్యాన్ని మొదటిసారి వెల్లడి చేశాడు. (ఆది. 22:15-17; యాకో. 2:23) అయితే ఆ మనిషి సర్పం తలను ఎలా చితక్కొడతాడు? ఇంతకీ సర్పం ఎవరు? ఆ వివరాల్ని యెహోవా తర్వాత్తర్వాత వెల్లడి చేశాడు.

9 వాగ్దాన సంతానం అబ్రాహాము మనుమడైన యాకోబు ద్వారా రావాలని యెహోవా సంకల్పించాడు. ఎందుకంటే యాకోబు యెహోవామీద అచంచలమైన విశ్వాసం చూపించాడు. (ఆది. 28:13-22) వాగ్దాన సంతానం, యాకోబు కొడుకైన యూదా వంశంలో పుడతాడని యెహోవా యాకోబుకు తెలియజేశాడు. ఆ సంతానానికి ఒక “దండము,” అంటే రాజ్యాధికారం ఇవ్వబడుతుందని, ‘ప్రజలు అతనికి విధేయులై ఉంటారని’ యాకోబు ప్రవచించాడు. (ఆది. 49:1, 10) అలా వాగ్దాన సంతానం ఒక పరిపాలకుడు, రాజు అవుతాడని యెహోవా వెల్లడి చేశాడు.

10, 11. యెహోవా తన సంకల్పం గురించి దావీదుకు, దానియేలుకు ఎందుకు తెలియజేశాడు?

10 దాదాపు 650 సంవత్సరాలు గడిచిన తర్వాత, యూదా వంశస్థుడైన దావీదుకు యెహోవా తన సంకల్పం గురించి మరిన్ని వివరాలు తెలియజేశాడు. దావీదు ‘తన చిత్తానుసారమైన మనస్సుగల వాడని’ యెహోవా అతని గురించి చెప్పాడు. (1 సమూ. 13:14; 17:12; అపొ. 13:22) అంతేకాదు, అతను దేవునిపట్ల భయభక్తులు గల వ్యక్తి. అందుకే యెహోవా అతనితో ఒక ఒప్పందం చేశాడు. అతని వంశస్థుల్లో ఒకరు నిరంతరం పరిపాలిస్తారని ఆయన వాగ్దానం చేశాడు.—2 సమూ. 7:8, 12-16.

11 దాదాపు 500 ఏళ్ల తర్వాత, యెహోవా దానియేలు ప్రవక్త ద్వారా, ఆ అభిషిక్తుడు లేదా మెస్సీయ భూమ్మీద కనిపించే ఖచ్చితమైన సంవత్సరం గురించి తెలియజేశాడు. (దాని. 9:25) యెహోవా దానియేలునే ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే దానియేలు యెహోవాకు ‘బహు ప్రియుడు.’ అతను యెహోవాపట్ల ప్రగాఢమైన గౌరవం చూపిస్తూ, ఆయన్ని నిరంతరం సేవించాడు.—దాని. 6:16; 9:22, 23.

12. యెహోవా దానియేలుకు ఏమి చేయమని చెప్పాడు? ఎందుకు?

12 యెహోవా దానియేలు వంటి నమ్మకమైన ప్రవక్తల ద్వారా, వాగ్దాన సంతానమైన మెస్సీయ గురించి ఎన్నో వివరాలు తెలియజేశాడు. అయినప్పటికీ, ఆ విషయాల భావం వాళ్లకు పూర్తిగా తెలీదు. ఎందుకంటే యెహోవా వాటి అర్థాన్ని వెల్లడిచేసే సమయం అప్పటికి ఇంకా రాలేదు. ఉదాహరణకు, దానియేలు విషయాన్నే తీసుకోండి. దేవుని రాజ్యం స్థాపించబడడాన్ని అతను ఒక దర్శనంలో చూశాడు. కానీ, నియమిత సమయం వరకు దాన్ని రహస్యంగా ఉంచమని యెహోవా అతనికి చెప్పాడు. భవిష్యత్తులో, అంటే నియమిత సమయంలో నిజమైన జ్ఞానం ‘అధికమౌతుంది.’—దాని. 12:4.

యెహోవా దానియేలు వంటి నమ్మకమైన వ్యక్తుల ద్వారా, మెస్సీయ రాజ్యానికి సంబంధించిన వివరాలను రాయించాడు

దేవుని సంకల్పం గురించి యేసు మరిన్ని వివరాలు తెలియజేశాడు

13. (ఎ) వాగ్దాన సంతానం ఎవరు? (బి) ఆదికాండము 3:15 లో ఉన్న ప్రవచనానికి సంబంధించి యేసు ఏ వివరాలు వెల్లడి చేశాడు?

13 దావీదు వంశంలో పుట్టి, భవిష్యత్తులో రాజుగా పరిపాలించే ఆ వాగ్దాన సంతానం యేసేనని యెహోవా స్పష్టంగా తెలియజేశాడు. (లూకా 1:30-33; 3:21, 22) యేసు పరిచర్య చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుని సంకల్పంపై మరింత వెలుగు ప్రకాశించింది. (మత్త. 4:13-17) ఉదాహరణకు సాతాను ‘హంతకుడని,’ ‘అబద్ధానికి తండ్రని’ యేసు చెప్పినప్పుడు, ఆదికాండము 3:14, 15 లో చెప్పబడిన సర్పం ఎవరో స్పష్టమైంది. (యోహా. 8:44) ఆ “మొదటి సర్పం” అపవాదియైన సాతానేనని యేసు ఒక దర్శనంలో యోహానుకు తెలియజేశాడు. c (ప్రకటన 1:1; 12:9 చదవండి.) వాగ్దాన సంతానం ఏదెనులో చెప్పబడిన ప్రవచనాన్ని నెరవేర్చి, సాతానును ఎలా నాశనం చేస్తాడో కూడా యేసు ఆ దర్శనంలో చూపించాడు.—ప్రక. 20:7-10.

14-16. మొదటి శతాబ్దంలోని శిష్యులు, యేసు వెల్లడి చేసిన సత్యాల్ని అన్నిసార్లూ పూర్తిగా అర్థం చేసుకోగలిగారా? వివరించండి.

14 ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో చూసినట్లుగా, రాజ్యం గురించి యేసు ఎక్కువగా బోధించాడు. అయితే, తన శిష్యులు అడిగిన వివరాలన్నిటినీ ఆయన అన్నిసార్లూ వెల్లడి చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన స్పష్టమైన వివరాలు చెప్పినా, వాళ్లు చాలాకాలం వరకు అంటే కొన్నిసార్లు వందల సంవత్సరాల వరకు వాటిని పూర్తిగా గ్రహించలేకపోయారు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

15 దేవుని రాజ్యంలో సహపరిపాలకులుగా ఉండేవాళ్లు భూమ్మీద నుండి తీసుకోబడి, ఆత్మప్రాణులుగా పరలోకానికి వెళ్తారని యేసు సా.శ. 33లో తెలియజేశాడు. కానీ శిష్యులకు ఆ మాటలు అర్థం కాలేదు. (దాని. 7:18; యోహా. 14:2-5) అదే సంవత్సరంలో, యేసు కొన్ని ఉదాహరణలు ద్వారా తాను పరలోకానికి వెళ్లిన వెంటనే రాజ్యం స్థాపించబడదని వాళ్లకు తెలియజేశాడు. (మత్త. 25:14, 19; లూకా 19:11, 12) అయితే శిష్యులు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేదు. అందుకే, యేసు పునరుత్థానమైన తర్వాత, వాళ్లు ఆయన్ని “ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?” అని అడిగారు. కానీ యేసు ఆ సమయంలో మరిన్ని వివరాలు వెల్లడి చేయలేదు. (అపొ. 1:6, 7) పరలోకంలో తనతోపాటు పరిపాలించే ‘చిన్నమందే’ కాకుండా, తనకు “వేరే గొర్రెలు” కూడా ఉంటాయని యేసు మరో సందర్భంలో చెప్పాడు. (యోహా. 10:16; లూకా 12:32) రెండు గుంపుల గురించి, 1914 తర్వాత గానీ క్రీస్తు అనుచరులకు సరైన అవగాహన రాలేదు.

16 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తన శిష్యులకు చాలా విషయాలు చెప్పివుండేవాడే. కానీ, వాళ్లు అర్థం చేసుకోలేరని ఆయనకు తెలుసు. (యోహా. 16:12) ఇప్పటివరకు చర్చించినవాటిని బట్టి, రాజ్యం గురించిన చాలా వివరాలు మొదటి శతాబ్దంలో వెల్లడయ్యాయని అర్థమౌతుంది. కానీ, జ్ఞానం అధికమయ్యే సమయం అది కాదు.

‘అంత్యకాలములో’ నిజమైన జ్ఞానం అధికమౌతుంది

17. రాజ్య సత్యాల్ని అర్థం చేసుకోవడానికి మనం ఏమి చేయాలి? అందుకు ఏది కూడా అవసరం?

17 ‘అంత్యకాలములో’ చాలామంది నలుదిశల ‘సంచరిస్తారనీ,’ దేవుని సంకల్పం గురించిన నిజమైన జ్ఞానం అధికమౌతుందనీ యెహోవా దానియేలుకు చెప్పాడు. (దాని. 12:4) ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే దానికోసం చాలా కృషి చేయాలి. ‘సంచరించు’ అనే హీబ్రూ క్రియాపదం, ఒక పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించడాన్ని సూచిస్తుందని ఒక రెఫరెన్సు పుస్తకం తెలియజేస్తుంది. అయితే బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, యెహోవా సహాయం కూడా ఉంటేనే మనం రాజ్య సత్యాల్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం.—మత్తయి 13:11 చదవండి.

18. యెహోవాపట్ల భయభక్తులు గలవాళ్లు విశ్వాసాన్ని, వినయాన్ని ఎలా చూపించారు?

18 1914కు ముందున్న కాలంలోలాగే, అంతానికి చేరువౌతున్న ఈ కాలంలో కూడా యెహోవా రాజ్య సత్యాల్ని క్రమక్రమంగా వెల్లడి చేస్తున్నాడు. గడిచిన 100 సంవత్సరాల్లో దేవుని ప్రజలు తమ అవగాహనను ఎన్నోసార్లు సవరించుకోవాల్సి వచ్చింది. దాని గురించి ఈ పుస్తకంలోని 45 అధ్యాయాల్లో చూస్తాం. వాళ్లు అలా సరిచేసుకున్నంత మాత్రాన, యెహోవా సహాయం వాళ్లకు లేదని మనం అనుకోవాలా? లేదు. నిజానికి యెహోవా వాళ్లకు ఎంతో సహాయం చేశాడు. ఎందుకంటే, వాళ్లు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడంతోపాటు, ఆయన ఇష్టపడే రెండు లక్షణాలను అంటే విశ్వాసాన్ని, వినయాన్ని చూపించారు. (హెబ్రీ. 11:6; యాకో. 4:6) దేవుని వాక్యంలోని వాగ్దానాలన్నీ తప్పక నెరవేరతాయని వాళ్లు విశ్వసించారు. అంతేకాదు, ఆ వాగ్దానాల నెరవేర్పును తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని వినయంగా ఒప్పుకున్నారు. వాళ్లకు ఎంత వినయం ఉందో, 1925 ద వాచ్‌ టవర్‌ మార్చి 1 సంచికలోని ఈ మాటలు చూపించాయి: “ప్రభువు తన వాక్యంలోని భావాన్ని, తన ప్రజలకు సరైన సమయంలో, సరైన విధంగా తెలియజేస్తాడని మేము నమ్ముతున్నాం.”

“ప్రభువు తన వాక్యంలోని భావాన్ని, తన ప్రజలకు సరైన సమయంలో, సరైన విధంగా తెలియజేస్తాడు”

19. దేవుని ప్రజలు ఏ విషయాల్ని ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు? ఎందుకు?

19 రాజ్యం 1914లో స్థాపించబడినప్పుడు, రాజ్యానికి సంబంధించిన ప్రవచనాలు ఎలా నెరవేరతాయో దేవుని ప్రజలు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. (1 కొరిం. 13:9, 10, 12) వాళ్లు ఆ ప్రవచనాల నెరవేర్పును చూడాలన్న ఆత్రుతతో, కొన్నిసార్లు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే, 1925 ద వాచ్‌ టవర్‌ మార్చి 1 సంచిక ఇలా చెప్పింది: “ఏదైనా ఒక ప్రవచనం, నెరవేరిన తర్వాత గానీ నెరవేరుతుండగా గానీ మనకు బాగా అర్థమౌతుంది.” ఆ మాటలు ఎంత నిజమో కదా! రాజ్యానికి సంబంధించిన ఎన్నో ప్రవచనాలు మన కాలంలో నెరవేరాయి, నెరవేరుతున్నాయి. కాబట్టే మనం ఇప్పుడు రాజ్యం గురించిన చాలా విషయాల్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు, మన అవగాహన తప్పు అని తెలుసుకున్నప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి వినయంగా, సిద్ధంగా ఉన్నాం కాబట్టే, యెహోవా మనకు చాలా వివరాలు తెలియజేశాడు. అవును, నిజమైన జ్ఞానం అధికమైంది!

అవగాహనల్లో వచ్చిన మార్పులు దేవుని ప్రజల్ని పరీక్షించాయి

20, 21. అవగాహనల్లో మార్పులు వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా స్పందించారు?

20 సత్యం విషయంలో యెహోవా మన అవగాహనను సరిదిద్దినప్పుడు, ఆ దిద్దుబాటును అంగీకరిస్తామా లేదా అనేదాన్ని బట్టి మనకు విశ్వాసం, వినయం ఉన్నాయో లేదో తెలుస్తుంది. మొదటి శతాబ్దపు మధ్యకాలంలో జీవించిన క్రైస్తవులకు అలాంటి పరిస్థితే ఎదురైంది. మీరు ఆ కాలంలో జీవిస్తున్న ఒక యూదా క్రైస్తవునిగా ఊహించుకోండి. మీరు మోషే ధర్మశాస్త్రాన్ని చాలా గౌరవిస్తారు. అలాగే, ఇశ్రాయేలు జనాంగంలో ఒకరిగా ఉన్నందుకు గర్వపడతారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు దైవప్రేరణతో రాసిన ఉత్తరాలు మీకు అందాయి. ధర్మశాస్త్రం రద్దు చేయబడిందని; యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని తృణీకరించి, దాని స్థానంలో ఆధ్యాత్మిక ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్నాడని; అందులో యూదులతోపాటు అన్యులు కూడా ఉంటారని పౌలు రాశాడు. (రోమా. 10:12; 11:17-24; గల. 6:15, 16; కొలొ. 2:13, 14) దానికి మీరెలా స్పందించి ఉండేవాళ్లు?

21 వినయంగల క్రైస్తవులు పౌలు రాసిన ఆ విషయాల్ని అంగీకరించి, యెహోవా ఆశీర్వాదాన్ని పొందారు. (అపొ. 13:48) కొంతమంది మాత్రం వాటిని వ్యతిరేకించి, వాళ్లు అప్పటివరకు నమ్మినవాటికే అంటిపెట్టుకొని ఉన్నారు. (గల. 5:7-12) వాళ్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే, క్రీస్తుతోపాటు సహరాజులుగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకుంటారు.—2 పేతు. 2:1.

22. దేవుని సంకల్పం విషయంలో వచ్చిన కొత్త అవగాహనల గురించి మీరెలా భావిస్తున్నారు?

22 యెహోవా ఈ మధ్యకాలంలో రాజ్యం గురించిన మన అవగాహనను సరిచేశాడు. ఉదాహరణకు, గొర్రెలు మేకలు ఎప్పుడు వేరు చేయబడతాయో మనం స్పష్టంగా అర్థంచేసుకున్నాం. అంతేకాదు 1,44,000 సంఖ్య ఎప్పుడు పూర్తవుతుందో, రాజ్యం గురించి యేసు చెప్పిన ఉదాహరణల భావం ఏమిటో, అభిషిక్తుల్లో చివరివాళ్లు ఎప్పుడు పరలోకానికి ఎత్తబడతారో కూడా తెలుసుకున్నాం. d ఆ కొత్త అవగాహనలకు మీరెలా స్పందిస్తున్నారు? వాటివల్ల మీ విశ్వాసం బలపడిందా? యెహోవా వినయంగల తన ప్రజలకు సత్యాల్ని వెల్లడి చేస్తూనే ఉంటాడనడానికి అవి రుజువు కాదంటారా? తనపట్ల భయభక్తులు గలవాళ్లకు యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేస్తాడని నమ్మడానికి, ఈ పుస్తకంలోని తర్వాతి అధ్యాయాలు మీకు సహాయం చేస్తాయి.

a దేవుని పేరు, “కర్త అవుతాడు” అని అర్థాన్నిచ్చే హీబ్రూ క్రియాపదం నుండి వచ్చింది. యెహోవా అనే పేరుకు వాగ్దానాలు నెరవేర్చేవాడు అని అర్థం. 43వ పేజీలో ఉన్న “దేవుని పేరుకు ఉన్న అర్థం” అనే బాక్సు చూడండి.

b అది చాలా ఎక్కువ కాలమని మనకు అనిపించవచ్చు. కానీ, ఆ రోజుల్లో మనుషులు చాలా సంవత్సరాలు బ్రతికేవాళ్లని, ఆదాముకు అబ్రాహాముకు మధ్య నాలుగు తరాలు మాత్రమే ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఆదాముకు, నోవహు తండ్రియైన లెమెకు సమకాలీనుడు. లెమెకుకు, నోవహు కొడుకైన షేము సమకాలీనుడు. షేముకు అబ్రాహాము సమకాలీనుడు.—ఆది. 5:5, 31; 9:29; 11:10, 11; 25:7.

c హీబ్రూ లేఖనాల్లో “సాతాను” అనే పదం 18 సార్లే కనిపిస్తుంది. కానీ, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో 30 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఎందుకంటే, హీబ్రూ లేఖనాలు మెస్సీయను గుర్తించడంపైనే ఎక్కువగా దృష్టి నిలిపాయి. అయితే మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన సాతానును పూర్తిగా బట్టబయలు చేశాడు కాబట్టే, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “సాతాను” అనే పదం ఎక్కువసార్లు కనిపిస్తుంది.

d అలాంటి అవగాహనల్లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవడానికి ఈ కావలికోట సంచికలు చూడండి: అక్టోబరు 15, 1995, 23-28 పేజీలు; జనవరి 15, 2008, 20-24 పేజీలు; జూలై 15, 2008, 17-21 పేజీలు; జూలై 15, 2013, 9-14 పేజీలు.