కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4

యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం

యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యెహోవా పేరును ఘనపర్చడం ప్రాముఖ్యమని దేవుని ప్రజలు అర్థం చేసుకున్నారు

1, 2. కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) బైబిలు దేవుని పేరును ఎలా ఘనపర్చింది?

 అది 1947, డిసెంబరు 2 మంగళవారం. ఆ రోజు ఉదయం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌లో ఉన్న అభిషిక్త సహోదరుల చిన్న గుంపు, ఒక పెద్ద బాధ్యతను చేపట్టింది. అది ఎంత కష్టంగా ఉన్నప్పటికీ, వాళ్లు దాన్ని 12 సంవత్సరాల పాటు కొనసాగించి, ఎట్టకేలకు 1960, మార్చి 13 ఆదివారాన పూర్తిచేశారు. ఇంతకీ వాళ్లు పూర్తిచేసిన ఆ పని ఏమిటి? ఒక కొత్త బైబిలు అనువాదాన్ని తయారుచేయడం. మూడు నెలల తర్వాత, అంటే 1960, జూన్‌ 18న సహోదరుడు నేథన్‌ నార్‌ ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరుగుతున్న ఒక సమావేశంలో, పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) పూర్తి బైబిలును విడుదల చేశాడు. హాజరైనవాళ్లంతా ఎంతో పులకరించిపోయారు. అప్పుడు సహోదరుడు నార్‌ ఇలా అన్నాడు: “ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు ఇది ఎంతో సంతోషకరమైన రోజు!” ఆ మాటలు అక్కడున్న వాళ్లందరి భావాలను ప్రతిధ్వనించాయి. ఆ కొత్త బైబిలు అనువాదం ఎందుకు అంత సంతోషాన్నిచ్చిందంటే, అది దేవుని పేరును ఎక్కువసార్లు ఉపయోగించింది.

1950లో, థియోక్రసీస్‌ ఇంక్రీజ్‌ సమావేశంలో క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) బైబిల్ని విడుదల చేశారు (ఎడమ: న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం; కుడి: ఘానా)

2 చాలా బైబిలు అనువాదాలు దేవుని పేరును తీసేశాయి. కానీ, దేవుని పేరును శాశ్వతంగా తొలగించాలనే సాతాను ప్రయత్నాన్ని అడ్డుకుంటూ, యెహోవా అభిషిక్త సేవకులు కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) బైబిల్ని విడుదల చేశారు. ఆ బైబిల్లోని ముందుమాట ఇలా చెప్పింది: “ఈ అనువాదంలోని ప్రత్యేకత ఏమిటంటే, దేవుని పేరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడల్లా దాన్ని తిరిగి చేర్చడం.” నిజానికి, కొత్త లోక అనువాదం బైబిలు మన పరలోక తండ్రి అయిన యెహోవా పేరును 7,000 కన్నా ఎక్కువసార్లు ఉపయోగించి, ఆ పేరును ఎంతో ఘనపర్చింది!

3. (ఎ) దేవుని పేరుకు ఏ అర్థం ఉందని మన సహోదరులు గ్రహించారు? (బి) నిర్గమకాండము 3:13, 14 లో ఉన్న మాటల్ని మనమెలా అర్థం చేసుకోవాలి? (“ దేవుని పేరుకు ఉన్న అర్థం” అనే బాక్సు చూడండి.)

3 దేవుని పేరుకు ‘ఉన్నవాడు’ అని అర్థమని బైబిలు విద్యార్థులు మొదట్లో అనుకున్నారు. (నిర్గ. 3:14) అందుకే 1926, ద వాచ్‌ టవర్‌ జనవరి 1 సంచిక ఇలా చెప్పింది: “యెహోవా అనే పేరుకు, ఆయన అన్ని కాలాల్లో ఉంటాడని, . . . ఆయనకు ఆది గానీ అంతం గానీ లేవని అర్థం.” కానీ, దేవుని ప్రజలు కొత్త లోక అనువాదం బైబిల్ని అనువదించడం మొదలుపెట్టే సమయానికల్లా, వాళ్లు దేవుని పేరుకున్న సరైన అర్థాన్ని గ్రహించేలా యెహోవా సహాయం చేశాడు. యెహోవా అనే పేరుకు అర్థం, ఆయన అన్ని కాలాల్లో ఉండేవాడు మాత్రమే కాదుగానీ, ఆయన సంకల్పం గల దేవుడని, దాన్ని నెరవేర్చే దేవుడని వాళ్లు గ్రహించారు. అంతేకాదు, ఆ పేరుకు అక్షరార్థంగా, “తానే కర్త అవుతాడు” అనే భావం ఉందని వాళ్లు అర్థం చేసుకున్నారు. అవును, ఆయన ఈ విశ్వాన్ని, బుద్ధిగల ప్రాణుల్ని సృష్టించాడు. అలాగే, తన ఇష్టాన్ని, సంకల్పాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. ఇంతకీ దేవుని పేరును ఘనపర్చడం ఎందుకు ప్రాముఖ్యం? దాన్ని మనమెలా ఘనపర్చవచ్చు?

దేవుని పేరును పవిత్రపర్చడం

4, 5. (ఎ) “నీ పేరు పవిత్రపర్చబడాలి” అని ప్రార్థిస్తున్నప్పుడు నిజానికి మనం ఏమి అడుగుతున్నాం? (బి) దేవుడు ఎలా, ఎప్పుడు తన పేరును పవిత్రపర్చుకుంటాడు?

4 తన పేరు ఘనపర్చబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. నిజానికి, తన పేరు పవిత్రపర్చబడాలన్నదే ఆయన ముఖ్య సంకల్పం. యేసు చేసిన ప్రార్థనలోని ఈ మొదటి విన్నపాన్ని బట్టి ఆ విషయం మనకు అర్థమౌతుంది: “నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్త. 6:9) దేవుని పేరు పవిత్రపర్చబడాలని ప్రార్థిస్తున్నప్పుడు, నిజానికి మనం ఏమి అడుగుతున్నాం?

5 ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో పరిశీలించిన విషయాన్ని గుర్తుతెచ్చుకోండి. యేసు చేసిన ప్రార్థనలోని “నీ పేరు పవిత్రపర్చబడాలి” అనే విన్నపంతో పాటు, “నీ రాజ్యం రావాలి,” “నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి” అనే రెండు విన్నపాలు కూడా యెహోవా సంకల్పంతో ముడిపడివున్నాయని గమనించాం. (మత్త. 6:10) రాజ్యం రావాలి, ఆయన ఇష్టం నెరవేరాలి అని ప్రార్థిస్తున్నప్పుడు, రాజ్యాన్ని రప్పించమని, తన ఇష్టాన్ని నెరవేర్చుకునేలా చర్య తీసుకోమని మనం యెహోవాను అడుగుతున్నాం. అదే విధంగా, ఆయన పేరు పవిత్రపర్చబడాలి అని ప్రార్థిస్తున్నప్పుడు, తన పేరును పవిత్రపర్చుకునేలా చర్య తీసుకోమని మనం అడుగుతున్నాం. మరో మాటలో చెప్పాలంటే, ఏదెనులో తిరుగుబాటు జరిగిన దగ్గర నుండి యెహోవా పేరుపై ఎన్ని నిందలు పడ్డాయో, వాటన్నిటిని తొలగించేలా చర్య తీసుకోమని ఆయన్ని అడుగుతున్నాం. అలాంటి ప్రార్థనలకు యెహోవా ఎలా స్పందిస్తాడు? ఆయన ఇలా అంటున్నాడు: ‘అన్యజనుల ఎదుట దూషించబడిన నా ఘనమైన నామాన్ని నేను పరిశుద్ధపరుస్తాను.’ (యెహె. 36:23; 38:23) హార్‌మెగిద్దోన్‌లో, యెహోవా చెడుతనాన్ని నిర్మూలించి సృష్టి ప్రాణులందరి ముందు తన పేరును పవిత్రపర్చుకుంటాడు.

6. దేవుని పేరును పవిత్రపర్చడంలో మనమెలా భాగం వహించవచ్చు?

6 చరిత్రంతటిలో, యెహోవా తన పేరును పవిత్రపర్చే అవకాశాన్ని తన సేవకులకు ఇచ్చాడు. నిజమే మనం దేవుని పేరును ఎక్కువ పవిత్రంగా చేయలేం. ఎందుకంటే, అది ఇప్పటికే పూర్తిస్థాయిలో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మరి దాన్ని మనమెలా పవిత్రపర్చగలం? యెషయా ఇలా చెప్పాడు: “సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి.” ఇక్కడ, “పరిశుద్ధుడనుకొనుడి” అని అనువదించబడిన హీబ్రూ పదానికి “పవిత్రంగా ఎంచండి” అని అర్థం. యెహోవా తన ప్రజల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు: ‘[వాళ్లు] నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు . . . ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.’ (యెష. 8:13; 29:23) కాబట్టి, దేవుని పేరును గౌరవించడం ద్వారా, దాన్ని మిగతా పేర్లన్నిటికంటే ప్రత్యేకంగా, ఉన్నతంగా ఎంచడం ద్వారా, అలాగే దాన్ని పవిత్రంగా ఎంచేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం దాన్ని పవిత్రపరుస్తాం. మరిముఖ్యంగా, యెహోవాను మన పరిపాలకునిగా ఒప్పుకుని నిండు హృదయంతో ఆయనకు లోబడినప్పుడు, ఆయన పేరుపట్ల భయభక్తులు చూపిస్తాం.—సామె. 3:1; ప్రక. 4:11.

తన పేరును ధరించేలా, ఘనపర్చేలా యెహోవా తన ప్రజల్ని సిద్ధం చేశాడు

7, 8. (ఎ) దేవుని ప్రజలు తన పేరును ధరించేలా యెహోవా ఎలా సహాయం చేశాడు? (బి) మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం?

7 ఆధునిక కాల దేవుని సేవకులు, 1870ల నుండి తమ ప్రచురణల్లో యెహోవా పేరును ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు 1879, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఆగస్టు సంచిక, అలాగే అదే సంవత్సరంలో ప్రచురించబడిన సాంగ్స్‌ ఆఫ్‌ ద బ్రైడ్‌ పాటల పుస్తకం యెహోవా పేరును ప్రస్తావించాయి. అయినప్పటికీ, తన పవిత్రమైన పేరును ధరించే ముందు, దానికి తగిన అర్హతలు సంపాదించుకునేలా యెహోవా తన ప్రజలకు సహాయం చేశాడు. ఆ గొప్ప గౌరవాన్ని పొందేలా యెహోవా తొలి బైబిలు విద్యార్థులను ఎలా సిద్ధం చేశాడు?

8 1800ల చివర్లో, అలాగే 1900ల ప్రారంభంలో, తన పేరుకు సంబంధించిన ప్రాముఖ్యమైన సత్యాల్ని యెహోవా తన ప్రజలకు వెల్లడి చేశాడు. వాటిలో మూడిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

9, 10. (ఎ) మొదట్లో వాచ్‌ టవర్‌ పత్రిక ఎందుకు యేసుమీదే ఎక్కువగా దృష్టిపెట్టింది? (బి) 1919లో ఏ మార్పు వచ్చింది? ఫలితంగా ఏమి జరిగింది? (“ కావలికోట దేవుని పేరును ఎలా ఘనపర్చింది?” అనే బాక్సు కూడా చూడండి.)

9 మొదటిగా, దేవుని సేవకులు యెహోవా పేరు ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకున్నారు. బైబిలంతటిలో ముఖ్యమైన బోధ, విమోచన క్రయధనమేనని తొలి బైబిలు విద్యార్థులు అనుకున్నారు. అందుకే వాచ్‌ టవర్‌ పత్రిక యేసుమీదే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఉదాహరణకు, ఆ పత్రిక ప్రచురించబడిన మొదటి సంవత్సరంలో, అది యేసు పేరును యెహోవా పేరుకన్నా పది రెట్లు ఎక్కువగా ఉపయోగించింది. మొదట్లో బైబిలు విద్యార్థులు, యేసుకు “ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువ” ప్రాముఖ్యత ఇచ్చారని 1976, మార్చి 15 కావలికోట పత్రిక చెప్పింది. అయితే తర్వాతి కాలాల్లో, బైబిలు దేవుని పేరుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందని వాళ్లు గ్రహించేలా యెహోవా సహాయం చేశాడు. అప్పుడు వాళ్లు ఏమి చేశారు? అదే కావలికోట ఆర్టికల్‌ ఇలా చెప్పింది: ముఖ్యంగా 1919 నుండి, వాళ్లు “మెస్సీయ తండ్రియైన యెహోవాకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెట్టారు.” ఆ తర్వాతి దశాబ్దంలోనే, ద వాచ్‌ టవర్‌ పత్రిక దేవుని పేరును 6,500 కన్నా ఎక్కువసార్లు ఉపయోగించింది!

10 మన సహోదరులు యెహోవా పేరుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా, దానిపట్ల ప్రేమ చూపించారు. వాళ్లు ప్రాచీన కాలంలోని మోషేలాగే ‘యెహోవా నామాన్ని ప్రకటించాలని’ నిశ్చయించుకున్నారు. (ద్వితీ. 32:3; కీర్త. 34:3) తన పేరు విషయంలో వాళ్లు చూపించిన ప్రేమను యెహోవా గుర్తించాడు, వాళ్లను ఆశీర్వదించాడు.—కీర్త. 119:132; హెబ్రీ. 6:10.

11, 12. (ఎ) 1919 తర్వాత మన ప్రచురణల్లో ఎలాంటి మార్పు వచ్చింది? (బి) తన సేవకులు ఏ విషయాన్ని గ్రహించేలా యెహోవా సహాయం చేశాడు? ఎందుకు?

11 రెండవదిగా, వాళ్లు దేవుడు అప్పగించిన పనిని సరైన విధంగా అర్థం చేసుకున్నారు. 1919 తర్వాత కొంతకాలానికి, నాయకత్వం వహిస్తున్న అభిషిక్త సహోదరులు యెషయా ప్రవచనాన్ని లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పటినుండి, మన ప్రచురణలు ఒక కొత్త విషయంపై దృష్టి పెట్టాయి. అది నిజంగా “తగిన సమయంలో” వచ్చిన ఆహారమని ఎందుకు చెప్పవచ్చు?—మత్త. 24:45.

12 ద వాచ్‌ టవర్‌ పత్రిక 1919కు ముందెప్పుడూ, యెషయా పుస్తకంలోని ఈ మాటల్ని చర్చించలేదు: “మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. . . . ఇదే యెహోవా వాక్కు.” (యెషయా 43:10-12 చదవండి.) కానీ 1919 తర్వాత కొంతకాలానికే, మన ప్రచురణలు ఆ వృత్తాంతంపై దృష్టిపెట్టి, యెహోవా అప్పగించిన పనిలో, అంటే ఆయనకు సాక్షులుగా ఉండే పనిలో భాగం వహించమని అభిషిక్తులందర్నీ ప్రోత్సహించాయి. నిజానికి, 1925 నుండి 1931 మధ్యకాలంలోనే, ద వాచ్‌ టవర్‌ పత్రిక 57 వేర్వేరు సంచికల్లో యెషయా 43వ అధ్యాయం గురించి చర్చించి, అందులో ఉన్న మాటల్ని నిజ క్రైస్తవులకు అన్వయించింది. ఆ సంవత్సరాల్లో, దేవుని సేవకులు తాము చేయాల్సిన ముఖ్యమైన పనిని గ్రహించేలా యెహోవా సహాయం చేశాడని స్పష్టమౌతోంది. ఎందుకు? ఎందుకంటే, దేవుని పేరును ధరించడానికి ‘ముందుగా వాళ్లు అర్హులో కాదో పరీక్షించబడాలి.’ (1 తిమో. 3:10) వాళ్లు దేవుని పేరును ధరించే ముందే, ఆయనకు సాక్షులని తమ క్రియల ద్వారా నిరూపించుకోవాలి.—లూకా 24:47, 48.

13. యెహోవా పేరు పవిత్రపర్చబడడమే అత్యంత ప్రాముఖ్యమని దేవుని వాక్యం ఎలా వెల్లడి చేసింది?

13 మూడవదిగా, 1920లలో వాళ్లు దేవుని పేరు పవిత్రపర్చబడడమే అత్యంత ప్రాముఖ్యమని గ్రహించారు. దేవుని వాక్యం ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎలా వెల్లడి చేసింది? రెండు ఉదాహరణలు పరిశీలించండి: దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రప్పించడానికి ముఖ్య కారణం ఏమిటి? ‘భూలోకమందంతటా నా నామాన్ని ప్రచురం చేయాడానికే’ అని యెహోవా చెప్పాడు. (నిర్గ. 9:16) అలాగే ఇశ్రాయేలీయులు తనమీద తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా వాళ్లను ఎందుకు కరుణించాడు? ‘అన్యజనుల ఎదుట, తన నామానికి దూషణ కలుగకుండా ఉండడానికి’ యెహోవా అలా చేశాడు. (యెహె. 20:8-10) ఆ వృత్తాంతాల నుండి, అలాగే బైబిల్లో ఉన్న ఇతర వృత్తాంతాల నుండి బైబిలు విద్యార్థులు ఏమి అర్థం చేసుకున్నారు?

14. (ఎ) 1920ల చివరికల్లా, దేవుని ప్రజలు ఏ విషయాన్ని అర్థం చేసుకున్నారు? (బి) అది, బైబిలు విద్యార్థుల ప్రకటనా పనిపై ఎలాంటి ప్రభావం చూపించింది? (“ ప్రకటించడానికి గల ముఖ్యమైన కారణం” అనే బాక్సు కూడా చూడండి.)

14 1920ల చివరికల్లా, దేవుని ప్రజలు యెషయా రాసిన మాటల్ని అర్థం చేసుకున్నారు. దాదాపు 2,700 సంవత్సరాల క్రితం, యెషయా యెహోవా గురించి ఇలా రాశాడు: “నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి.” (యెష. 63:14) కాబట్టి మనుషులు రక్షణ పొందడం ప్రాముఖ్యం కాదుగానీ, దేవుని పేరు పవిత్రపర్చబడడమే అత్యంత ప్రాముఖ్యమని బైబిలు విద్యార్థులు అర్థం చేసుకున్నారు. (యెష. 37:20; యెహె. 38:23) 1929లో ప్రవచనం (ఇంగ్లీషు) అనే పుస్తకం ఆ విషయాన్నే తెలియజేసింది. అదిలా చెప్పింది: “సృష్టి ప్రాణులందరి ముందు [పరిష్కరించబడాల్సిన] అత్యంత ప్రాముఖ్యమైన విషయం, యెహోవా పేరు పవిత్రపర్చబడడమే.” ఆ కొత్త అవగాహన వల్ల, దేవుని సేవకులు యెహోవా గురించి సాక్ష్యమివ్వాలని, ఆయన పేరు మీద పడిన నిందల్ని తొలగించాలని బలంగా కోరుకున్నారు.

15. (ఎ) 1930ల కల్లా మన సహోదరులు వేటిని అర్థం చేసుకున్నారు? (బి) ఇప్పుడు దేనికి సమయం ఆసన్నమైంది?

15 1930ల ప్రారంభం కల్లా, మన సహోదరులు దేవుని పేరు ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన అప్పగించిన పని ఏమిటో, పరిష్కరించబడాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు, వాళ్లు దేవుని పేరును ధరించే సమయం ఆసన్నమైంది. తన పేరు ధరించే అవకాశాన్ని యెహోవా తన ప్రజలకు ఎలా ఇచ్చాడో తెలుసుకోవడానికి, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం.

యెహోవా “తన పేరు” ధరించే ప్రజల్ని ఎంచుకున్నాడు

16. (ఎ) యెహోవా ఏ విధంగా తన పేరును ఘనపర్చుకున్నాడు? (బి) గతంలో, తన పేరు ధరించిన ప్రజలుగా ఉండడానికి యెహోవా ఎవర్ని ఎంచుకున్నాడు?

16 తన నామాన్ని ధరించే ప్రజల్ని ఏర్పర్చుకోవడం ద్వారా, యెహోవా తన పేరును ఘనపర్చుకున్నాడు. సా.శ.పూ 1513 నుండి ఇశ్రాయేలీయులు యెహోవా నామాన్ని ధరించిన ప్రజలుగా ఉన్నారు. (యెష. 43:12) కానీ వాళ్లు ఆయనతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు. దానివల్ల, సా.శ. 33లో ఆయనతో ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని కోల్పోయారు. అప్పుడు, యెహోవా ‘తన పేరు కోసం అన్యుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడం’ మొదలుపెట్టాడు. (అపొ. 15:14) అలా ఎంచుకోబడిన ప్రజలు “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడ్డారు. దానిలో, వేర్వేరు జాతులకు చెందిన క్రీస్తు అభిషిక్త అనుచరులు ఉంటారు.—గల. 6:16.

17. సాతాను ఏమి చేయడంలో విజయం సాధించాడు?

17 దాదాపు సా.శ. 44లో, క్రీస్తు శిష్యులు ‘దేవుని నిర్దేశం ప్రకారం క్రైస్తవులని’ పిలువబడ్డారు. (అపొ. 11:26) మొదట్లో, ఆ పేరు నిజ క్రైస్తవులకు మాత్రమే వర్తించింది. (1 పేతు. 4:16) కానీ, యేసు చెప్పిన గోధుమలు గురుగుల ఉదాహరణ సూచిస్తున్నట్లుగా, అన్ని రకాల నకిలీ క్రైస్తవులు కూడా క్రైస్తవులని పిలువబడేలా చేయడంలో సాతాను విజయం సాధించాడు. దానివల్ల, వందల సంవత్సరాల పాటు, ఆ నకిలీ క్రైస్తవుల మధ్య నిజ క్రైస్తవుల్ని గుర్తించడం కష్టమైంది. కానీ 1914లో “కోతకాలం” మొదలైనప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే, దేవదూతలు నిజ క్రైస్తవుల్ని, నకిలీ క్రైస్తవుల్ని వేరు చేయడం మొదలుపెట్టారు.—మత్త. 13:30, 39-41.

18. తమకు ఒక కొత్త పేరు అవసరమని సహోదరులకు ఎందుకు అనిపించింది?

18 1919లో నమ్మకమైన దాసుడు నియమించబడిన తర్వాత, దేవుని ప్రజలు తాము చేయాల్సిన పని ఏమిటో అర్థం చేసుకునేలా యెహోవా సహాయం చేశాడు. ఇంటింటి పరిచర్యే తమను నకిలీ క్రైస్తవుల నుండి వేరు చేస్తుందని వాళ్లు వెంటనే గ్రహించారు. కాబట్టి, “బైబిలు విద్యార్థులు” అనే పేరు, తమను ఇతర క్రైస్తవుల నుండి వేరు చేయడానికి సరిపోదని వాళ్లు అర్థం చేసుకున్నారు. జీవితంలో వాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని, బైబిల్ని అధ్యయనం చేయడం మాత్రమే కాదుగానీ దేవుని గురించి సాక్ష్యమిస్తూ, ఆయన పేరును గౌరవించి, ఘనపర్చడమేనని గ్రహించారు. మరి వాళ్లు చేసే పనికి ఏ పేరైతే బాగుంటుంది? ఆ ప్రశ్నకు జవాబు 1931లో వచ్చింది.

సమావేశ కార్యక్రమ పట్టిక, 1931

19, 20. (ఎ) 1931లో జరిగిన సమావేశంలో, దేవుని ప్రజలు ఏ తీర్మానం తీసుకున్నారు? (బి) కొత్త పేరు ధరించినందుకు సహోదరులు ఎలా స్పందించారు?

19 1931 జూలైలో, అమెరికాలో ఒహాయోలోని కొలంబస్‌లో ఒక సమావేశం జరిగింది. దానికి దాదాపు 15,000 మంది బైబిలు విద్యార్థులు హాజరయ్యారు. ఆ సమావేశ కార్యక్రమ పట్టిక మీద, పెద్ద సైజులో ఉన్న J W అనే అక్షరాలు వాళ్లను ఆకట్టుకున్నాయి. వాటి అర్థం ఏమైవుంటుందా అని వాళ్లు ఆలోచించడం మొదలుపెట్టారు. ‘జస్ట్‌ వాచ్‌’ అని కొంతమంది, ‘జస్ట్‌ వెయిట్‌’ అని ఇంకొంతమంది అనుకున్నారు. చివరికి, ఆ సమావేశంలో ఆదివారం రోజున అంటే జూలై 26న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఒక ప్రాముఖ్యమైన తీర్మానం చేయడంతో వాళ్ల సందేహాలు తీరాయి. ఆయన ఈ తీర్మానాన్ని ప్రకటించాడు: “మనం ఇప్పటినుండి జెహోవాస్‌ విట్నెసెస్‌ (యెహోవాసాక్షులు) అనే పేరుతో పిలువబడతాం.” దాంతో, అక్కడ హాజరైన వాళ్లందరూ J అంటే జెహోవాస్‌ అని, W అంటే విట్నెసస్‌ అని అర్థం చేసుకున్నారు. ఆ పేరు యెషయా 43:10 ఆధారంగా తీసుకోబడిందని వాళ్లు గ్రహించారు.

20 హాజరైన వాళ్లందరూ సంతోషంగా చప్పట్లు కొట్టడం ద్వారా ఆ తీర్మానానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఆ ప్రతిధ్వని, రేడియో ద్వారా చాలా దేశాలకు వినిపించింది! ఆస్ట్రేలియాకు చెందిన ఎర్నెస్ట్‌ బార్బర్‌, నయోమి బార్బర్‌ ఇలా గుర్తుచేసుకున్నారు: “అమెరికాలోని సహోదరులు చప్పట్లు కొట్టడం విని, మెల్బోర్న్‌లోని సహోదరులు కూడా సంతోషంతో ఎగిరిగంతేసి, ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. మేము దాన్ని ఎప్పటికీ మర్చిపోలేం!” a

దేవుని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యెహోవా పేరును ఘనపరుస్తున్నారు

21. యెహోవాసాక్షులు అనే కొత్త పేరు, దేవుని సేవకుల ప్రకటనా పనిపై ఎలాంటి ప్రభావం చూపించింది?

21 యెహోవాసాక్షులు అనే లేఖనాధార పేరు ధరించడం వల్ల, దేవుని సేవకులు ఇంకా ఉత్సాహంగా ప్రకటనా పని చేయగలిగారు. 1931లో కొలంబస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన ఎడ్వర్డ్‌ గ్రిమ్స్‌, జెస్సీ గ్రిమ్స్‌ అనే పయినీరు జంట ఇలా చెప్పారు: “మేము బైబిలు విద్యార్థులుగా ఇక్కడికి వచ్చాం. యెహోవాసాక్షులుగా తిరిగివెళ్తున్నాం. దేవుని నామాన్ని మహిమపర్చే పేరు ధరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.” ఆ సమావేశం తర్వాత, కొంతమంది సాక్షులు యెహోవా పేరును మహిమపర్చడానికి పరిచర్యలో ఒక కొత్త పద్ధతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వాళ్లు తమను తాము గృహస్థులకు పరిచయం చేసుకోవడానికి, ముందుగా ఒక కార్డు ఇచ్చేవాళ్లు. ఆ కార్డు మీద, “మేము మా దేవుడైన యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తున్న యెహోవాసాక్షులం” అని రాసివుండేది. అవును, దేవుని ప్రజలు యెహోవా పేరును ధరించడాన్ని గొప్ప గౌరవంగా భావించారు. అంతేకాదు, ఆ పేరును ప్రపంచమంతటా చాటిచెప్పాలని నిశ్చయించుకున్నారు.—యెష. 12:4.

“మేము బైబిలు విద్యార్థులుగా ఇక్కడికి వచ్చాం. యెహోవాసాక్షులుగా తిరిగివెళ్తున్నాం”

22. యెహోవా ప్రజలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఎందుకు చెప్పవచ్చు?

22 మనం యెహోవాసాక్షులు అనే ప్రత్యేకమైన పేరు ధరించి, చాలా సంవత్సరాలు గడిచాయి. మరి ఈ సంవత్సరాలన్నిటిలో, సాతాను మన గుర్తింపును పాడుచేయగలిగాడా? అంటే ఈ లోక మతాలకు, దేవుని ప్రజలకు మధ్య తేడా కనిపించకుండా అతను చేయగలిగాడా? లేదు! నిజానికి, దేవుని ప్రజలు ఈ లోక మతాలకు ఎంత భిన్నంగా ఉన్నారో ఇతరులు స్పష్టంగా గుర్తించగలుగుతున్నారు. (మీకా 4:5; మలాకీ 3:18 చదవండి.) దేవుని పేరుతో మనకు ఎంత అవినాభావ సంబంధం ఉందంటే, ఆ పేరును ఉపయోగించగానే, మనం యెహోవాసాక్షులమని ప్రజలు వెంటనే గుర్తుపట్టగలుగుతున్నారు. కాబట్టి, పర్వతాల్లాంటి అబద్ధమతాల మధ్య సత్యారాధన కనుమరుగయ్యే బదులు, అది ‘పర్వత శిఖరమున స్థిరపరచబడింది.’ (యెష. 2:2) అవును, నేడు యెహోవా పవిత్రమైన పేరు, ఆయన ఆరాధన ఎంతో ఘనపర్చబడుతున్నాయి!

23. కీర్తన 121:5 లోని మాటలు మనకెలా ఓదార్పునిస్తున్నాయి?

23 ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సాతాను చేసే దాడుల నుండి, యెహోవా మనల్ని కాపాడతాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుందో కదా! (కీర్త. 121:5) కాబట్టి కీర్తనకర్త రాసిన ఈ మాటలతో మనం ఏకీభవిస్తాం: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.”—కీర్త. 33:12.

a దేవుని ప్రజలు రేడియోను ఏయేవిధాలుగా ఉపయోగించారో తెలుసుకోవడానికి, 7వ అధ్యాయంలో 72-74 పేజీలు చూడండి.