కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6

ప్రకటనా పని చేసే ప్రజలు—ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు

ప్రకటనా పని చేసే ప్రజలు—ఇష్టపూర్వకంగా ముందుకొస్తారు

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

ప్రకటించే ఒక సైన్యాన్ని రాజు ఏర్పర్చుకుంటాడు

1, 2. యేసు ఏ ప్రాముఖ్యమైన పని గురించి ప్రవచించాడు? అయితే ఏ ప్రశ్న తలెత్తుతుంది?

 రాజకీయ నాయకులు తరచూ వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్చరు. మంచి ఉద్దేశాలు ఉన్న నాయకులు సైతం, తమ వాగ్దానాల్ని నెరవేర్చలేకపోవచ్చు. దీనికి భిన్నంగా, మెస్సీయ రాజైన యేసుక్రీస్తు ఎప్పుడూ తన మాట నిలబెట్టుకుంటాడు. అది ఎంత ఊరటనిస్తుందో కదా!

2 యేసు 1914లో రాజైన వెంటనే, ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని అంటే దాదాపు 1,900 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఇలా ప్రవచించాడు: “రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది.” (మత్త. 24:14) క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో ఆ మాటలు నెరవేరతాయి. కానీ ప్రశ్నేమిటంటే: ప్రేమ, దైవభక్తి ఏమాత్రం లేని స్వార్థపరులు ఉండే ఈ చివరి రోజుల్లో, ఇష్టపూర్వకంగా ప్రకటించే ఒక సైన్యాన్ని రాజు ఎలా ఏర్పర్చుకోగలడు? (మత్త. 24:12; 2 తిమో. 3:1-5) అది నిజ క్రైస్తవులందరికీ సంబంధించిన విషయం కాబట్టి, మనం ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ప్రాముఖ్యం.

3. యేసుకు ఏ నమ్మకం ఉంది? ఆ నమ్మకం ఆయనకు ఎలా వచ్చింది?

3 యేసు చెప్పిన ప్రవచనాన్ని మళ్లీ ఒకసారి గమనించండి. “ప్రకటించబడుతుంది” అనే మాటలో యేసుకున్న నమ్మకాన్ని మీరు చూడగలుగుతున్నారా? చివరి రోజుల్లో తనకు ఇష్టపూర్వకంగా మద్దతిచ్చే ప్రజలు ఉంటారని యేసు బలంగా నమ్మాడు. ఆయనకు ఆ నమ్మకం ఎలా వచ్చింది? ఆయన తన తండ్రిని చూసి నేర్చుకున్నాడు. (యోహా. 12:45; 14:9) యెహోవా తన ఆరాధకుల విషయంలో ఎలాంటి నమ్మకాన్ని కనబరుస్తాడో, యేసు భూమ్మీదికి రాకముందు స్వయంగా చూశాడు. దానిగురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

“నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు”

4. ఏ పనికి మద్దతివ్వమని యెహోవా ఇశ్రాయేలీయుల్ని కోరాడు? దానికి వాళ్లు ఎలా స్పందించారు?

4 ఆరాధన కోసం ఒక గుడారాన్ని నిర్మించమని యెహోవా మోషేకు చెప్పినప్పుడు ఏమి జరిగిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఆ నిర్మాణ పనికి మద్దతిచ్చే అవకాశాన్ని ప్రజలందరికీ కల్పిస్తూ, యెహోవా మోషే ద్వారా ఇలా చెప్పాడు: “కానుక ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకునే ప్రతీ ఒక్కరు యెహోవా కోసం వీటిని తేవాలి.” దానికి ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు? వాళ్లు “ప్రతీ ఉదయం స్వేచ్ఛార్పణలు తెస్తూనే ఉన్నారు.” ఎంతగా తెచ్చారంటే, ‘ఇంకేమీ తీసుకురావద్దని’ వాళ్లకు చెప్పాల్సివచ్చింది! (నిర్గ. 35:5; 36:3, 6, NW) యెహోవా తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇశ్రాయేలీయులు వమ్ము చేయలేదు.

5, 6. కీర్తన 110:1-3 ప్రకారం యెహోవాకు, యేసుకు ఏ నమ్మకం ఉంది?

5 మరి ఈ చివరి రోజుల్లో కూడా, తనను ఇష్టపూర్వకంగా ఆరాధించే ప్రజలు ఉంటారని యెహోవా నమ్మాడా? ఖచ్చితంగా నమ్మాడు! దానికి సంబంధించిన ఒక ప్రవచనాన్ని ఆయన దావీదు ద్వారా రాయించాడు. యేసు జన్మించడానికి 1,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే యెహోవా దాన్ని రాయించాడు. (కీర్తన 110:1-3 చదవండి.) కొత్తగా సింహాసనాన్ని అధిష్ఠించిన యేసుకు, శత్రువులే కాకుండా మద్దతిచ్చే ప్రజలు కూడా ఉంటారని; వాళ్లు బలవంతంగా కాదుగానీ ఇష్టపూర్వకంగా రాజును సేవిస్తారని; వాళ్లలో యౌవనులు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తారని; వాళ్లు సూర్యోదయం సమయంలో నేలను కప్పేసే కోటానుకోట్ల మంచు బిందువుల్లా అవుతారని యెహోవా ప్రవచించాడు. a

రాజ్యానికి ఇష్టపూర్వకంగా మద్దతిచ్చే ప్రజలు మంచు బిందువుల్లా అత్యధిక సంఖ్యలో ఉంటారు (5వ పేరా చూడండి)

6 కీర్తన 110లో ఉన్న ప్రవచనం తన గురించేనని యేసుకు తెలుసు. (మత్త. 22:42-45) కాబట్టి, తనకు విశ్వసనీయంగా మద్దతిచ్చే ప్రజలు ఉంటారని, వాళ్లు భూవ్యాప్తంగా మంచివార్త ప్రకటించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొస్తారని యేసు బలంగా నమ్మాడు. మరి చరిత్ర ఏమి రుజువుచేసింది? ఈ చివరి రోజుల్లో ఇష్టపూర్వకంగా ప్రకటించే ఒక సైన్యాన్ని రాజు ఏర్పర్చుకోగలిగాడా?

“ఆ సందేశాన్ని ప్రకటించడం నా బాధ్యత, నా కర్తవ్యం”

7. యేసు రాజైన వెంటనే, తన అనుచరులను ఒక ప్రాముఖ్యమైన పని కోసం ఎలా సిద్ధం చేశాడు?

7 యేసు రాజైన వెంటనే, ఒక గొప్ప పనికోసం తన అనుచరులను సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయంలో చూసినట్లుగా, ఆయన 1914 నుండి 1919 తొలిభాగం వరకు వాళ్లను తనిఖీ చేసి, శుద్ధీకరించాడు. (మలా. 3:1-4) తర్వాత 1919లో, వాళ్లను నడిపించడానికి నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు. (మత్త. 24:45) అప్పటినుండి ఆ దాసుడు సమావేశాల ద్వారా, ముద్రిత ప్రచురణల ద్వారా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తూ, ప్రకటనా పనిలో వ్యక్తిగతంగా పాల్గొనాల్సిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉందని పదేపదే నొక్కిచెప్తున్నాడు.

8-10. సమావేశాలు ప్రకటనా పనిని ఎలా ప్రోత్సహించాయి? ఒక ఉదాహరణ చెప్పండి. (“ ప్రకటనా పనిని ప్రోత్సహించిన తొలి సమావేశాలు” అనే బాక్సు కూడా చూడండి.)

8 సమావేశంలో ఇవ్వబడిన ప్రసంగాలు. అమెరికాలో, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో 1919, సెప్టెంబరు 1 నుండి 8 వరకు జరిగిన ఒక సమావేశంలో బైబిలు విద్యార్థులు సమకూడారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మొట్టమొదటి పెద్ద సమావేశం అదే. ఆ సమావేశంలో రెండో రోజున, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగిస్తూ, సూటిగా ఇలా అన్నాడు: “ఈ భూమ్మీద ప్రతీ క్రైస్తవుని కర్తవ్యం . . . ప్రభువు రాజ్యం గురించి ప్రకటించడమే.”

9 ఆ సమావేశం చివరి రోజున, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “తోటి పనివాళ్లకు ఒక సందేశం” అనే అంశంతో ఒక ప్రసంగం ఇచ్చాడు. ఆ ప్రసంగం, ద వాచ్‌ టవర్‌ పత్రికలో “రాజ్యాన్ని ప్రకటించడం” అనే శీర్షికతో ప్రచురించబడింది. అందులో సహోదరుడు ఇలా అన్నాడు: “‘అసలు జీవితంలో నేను ఏమి చేయాలనుకుంటున్నాను?’ అని కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు. ఆ ప్రశ్నకు మీ జవాబు ఏమై ఉండాలంటే, ‘ప్రభువు తన కృపతో నాకొక బాధ్యత అప్పగించాడు, నేను ఒక రాయబారిగా ఆయన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. ఆ సందేశాన్ని ప్రకటించడం నా బాధ్యత, నా కర్తవ్యం.’”

10 ఆ చారిత్రాత్మకమైన ప్రసంగంలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ద గోల్డెన్‌ ఏజ్‌ (ప్రస్తుతం తేజరిల్లు!) అనే కొత్త పత్రిక గురించి ప్రకటన చేశాడు. రాజ్యం మాత్రమే మనుషుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తుందని ప్రజలకు తెలియజేయడానికి ఆ పత్రిక రూపొందించబడింది. దీన్ని పంచిపెట్టడంలో ఎవరెవరు భాగం వహించాలనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. “అక్కడ హాజరైన 6,000 మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అది నిజంగా మరపురాని దృశ్యం” అని ఆ సమావేశానికి సంబంధించిన ఒక నివేదిక తెలియజేసింది. b కాబట్టి, రాజ్యం గురించి ప్రకటించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చే ప్రజలు రాజుకు ఉన్నారని స్పష్టమౌతోంది!

11, 12. రాజ్య సందేశాన్ని ఎప్పుడు ప్రకటించాలని 1920 వాచ్‌ టవర్‌ పత్రిక చెప్పింది?

11 ముద్రిత ప్రచురణలు. యేసు ప్రవచించిన ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమైనదో వాచ్‌ టవర్‌ పత్రిక క్రమక్రమంగా స్పష్టం చేస్తూ వచ్చింది. ఉదాహరణకు, 1920ల ప్రారంభంలో వచ్చిన కొన్ని వాచ్‌ టవర్‌ సంచికల్ని గమనించండి.

12 మత్తయి 24:14 నెరవేర్పుగా ఏ సందేశాన్ని ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి? 1920, వాచ్‌ టవర్‌ జూలై 1 సంచికలో “రాజ్యం గురించిన మంచివార్త” అనే శీర్షికతో ఒక ఆర్టికల్‌ వచ్చింది. మనం ప్రకటించాల్సిన సందేశం ఏమిటో వివరిస్తూ ఆ ఆర్టికల్‌ ఇలా చెప్పింది: “పాత వ్యవస్థ ముగిసిపోయి, మెస్సీయ రాజ్యం స్థాపించబడడమే ఆ మంచివార్త.” ఆ సందేశాన్ని ఎప్పుడు ప్రకటించాలి? దాని గురించి ఆ ఆర్టికల్‌ ఇలా స్పష్టం చేసింది: “[మొదటి] ప్రపంచ యుద్ధానికి, ‘మహాశ్రమకు’ మధ్య కాలంలో ఆ సందేశాన్ని ప్రకటించాలి. . . . దాన్ని క్రైస్తవ మత సామ్రాజ్యమంతటా చాటి చెప్పడానికి . . . ఇదే సమయం.”

13. ప్రకటనా పనిని ఇష్టపూర్వకంగా చేసే విషయంలో 1921 వాచ్‌ టవర్‌ పత్రిక అభిషిక్త క్రైస్తవుల్ని ఏమని ప్రోత్సహించింది?

13 మరి ప్రకటనా పనిలో పాల్గొనే దేవుని ప్రజలు ఆ పనిని బలవంతంగా చేస్తారా? లేదు. 1921, వాచ్‌ టవర్‌ మార్చి 15 సంచికలో వచ్చిన “ధైర్యంగా ఉండండి” అనే ఆర్టికల్‌, ఇష్టపూర్వకంగా ప్రకటనా పని చేయమని అభిషిక్త క్రైస్తవుల్ని ప్రోత్సహించింది. ఆ ఆర్టికల్‌ ఇలా చెప్పింది: “‘ఈ పనిలో పాల్గొనడాన్ని నేను అమూల్యమైన అవకాశంగా, నా బాధ్యతగా భావిస్తున్నానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు దాన్ని గొప్ప అవకాశంగా భావించినప్పుడు యిర్మీయాలాగే స్పందిస్తారు. ప్రభువు వాక్యం ‘తన హృదయంలో అగ్నిలా మండుతూ తన ఎముకల్లో మూయబడినట్లు’ ఉందని, తాను ప్రకటించకుండా ఉండలేనని ఆయన అన్నాడు.” (యిర్మీ. 20:9) ఆ ప్రోత్సాహకరమైన మాటల్ని చూస్తే, రాజ్యానికి విశ్వసనీయంగా మద్దతిచ్చే ప్రజల మీద యెహోవాకు, యేసుకు ఎంత నమ్మకం ఉందో అర్థమౌతుంది.

14, 15. రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించాలని 1922 వాచ్‌ టవర్‌ పత్రిక చెప్పింది?

14 నిజ క్రైస్తవులు రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించాలి? ద వాచ్‌ టవర్‌ 1922, ఆగస్టు 15 సంచికలో “సేవ చేయడం ప్రాముఖ్యం” అనే ఒక శక్తివంతమైన ఆర్టికల్‌ వచ్చింది. ఆ ఆర్టికల్‌ అభిషిక్త క్రైస్తవుల్ని ఇలా ప్రోత్సహించింది: “ఇంటింటికి వెళ్లి, ప్రజలకు ముద్రిత సందేశాన్ని అందించండి. పరలోక రాజ్యం సమీపించిందని వాళ్లకు సాక్ష్యమిస్తూ దానిలో చురుగ్గా పాల్గొనండి.”

15 1919 నుండి, నమ్మకమైన బుద్ధిగల దాసుడు ప్రకటనా పని గురించి నొక్కిచెప్పేలా క్రీస్తే అతన్ని నిర్దేశించాడని స్పష్టమౌతోంది. రాజ్య సందేశాన్ని ప్రకటించడం క్రైస్తవుల కర్తవ్యమని, అది వాళ్లకున్న అమూల్యమైన అవకాశమని దాసుడు పదేపదే నొక్కిచెప్పాడు. మరి ఆ నిర్దేశానికి తొలి బైబిలు విద్యార్థులు ఎలా స్పందించారు?

“నమ్మకమైన సేవకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు”

16. ప్రతీఒక్కరూ పరిచర్య చేయాలి అనే నిర్దేశానికి కొంతమంది పెద్దలు ఎలా స్పందించారు?

16 1920లలో, 1930లలో కొంతమంది ఆ నిర్దేశాన్ని వ్యతిరేకించారు. అభిషిక్త క్రైస్తవుల్లో ప్రతీఒక్కరూ పరిచర్యలో భాగం వహించాలి అనే ఆలోచనే వాళ్లకు నచ్చలేదు. దాని గురించి 1927, వాచ్‌ టవర్‌ నవంబరు 1 సంచిక ఇలా చెప్పింది: “సంఘంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్న కొంతమంది పెద్దలు . . . పరిచర్యలో భాగం వహించట్లేదు, భాగం వహించమని ఇతరుల్ని కూడా ప్రోత్సహించట్లేదు. . . . ఇంటింటికి వెళ్లి దేవుని గురించి, రాజు గురించి, రాజ్యం గురించి ప్రజలకు ప్రకటించడాన్ని వాళ్లు ఎగతాళి చేస్తున్నారు.” వాళ్ల గురించి ఆ ఆర్టికల్‌ సూటిగా ఇలా చెప్పింది: “అలాంటివాళ్లను గుర్తించి, వాళ్లకు దూరంగా ఉండాలి, అంతేకాదు వాళ్లు పెద్దలుగా సేవ చేయడానికి తగరని వాళ్లకు తెలియజేయాలి.” c

17, 18. నమ్మకమైన దాసుడు ఇచ్చిన నిర్దేశానికి చాలా సంఘాలు ఎలా స్పందించాయి? గడిచిన 100 సంవత్సరాల్లో లక్షలమంది ప్రజలు దానికి ఎలా స్పందించారు?

17 సంతోషకరమైన విషయమేమిటంటే, చాలా సంఘాల్లోని సహోదరసహోదరీలు నమ్మకమైన దాసుడు ఇచ్చిన నిర్దేశానికి సానుకూలంగా స్పందించారు. రాజ్యం గురించి ప్రకటించడాన్ని వాళ్లు అమూల్యమైన అవకాశంగా భావించారు. దాని గురించి 1926, వాచ్‌ టవర్‌ మార్చి 15 సంచిక ఇలా చెప్పింది: “ఈ సందేశాన్ని ప్రకటించడానికి . . . నమ్మకమైన సేవకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.” వాళ్లు కీర్తన 110:3 చెప్తున్నట్లు, మెస్సీయ రాజుకు ఇష్టపూర్వకంగా మద్దతిచ్చే ప్రజలుగా నిరూపించుకున్నారు.

18 గత వంద సంవత్సరాల్లో, రాజ్యం గురించి ప్రకటించడానికి లక్షలమంది ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చారు. వాళ్లు ఎలా ప్రకటించారో అంటే ఏ పద్ధతుల్ని, పరికరాల్ని ఉపయోగించారో, దానివల్ల వాళ్లకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఈ పుస్తకంలోని తర్వాతి అధ్యాయాల్లో చర్చిస్తాం. ఈ స్వార్థపూరిత లోకంలో, లక్షలమంది ప్రజలు రాజ్య ప్రకటనా పని కోసం ఎందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ విషయాన్ని పరిశీలిస్తుండగా, ‘నేను మంచివార్త ఎందుకు ప్రకటించాలి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది.

“రాజ్యానికి . . . మొదటిస్థానం ఇస్తూ ఉండండి”

19. “రాజ్యానికి . . . మొదటి స్థానం ఇస్తూ ఉండండి” అని యేసు ఇచ్చిన సలహాను మనమెందుకు పాటిస్తున్నాం?

19 “రాజ్యానికి . . . మొదటిస్థానం ఇస్తూ ఉండండి” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 6:33) ఆ సలహాను మనమెందుకు పాటిస్తున్నాం? ఎందుకంటే, దేవుని సంకల్ప నెరవేర్పులో రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకున్నాం. అంతేకాదు, ముందటి అధ్యాయంలో చూసినట్లుగా, రాజ్యం గురించిన విలువైన సత్యాల్ని పవిత్రశక్తి మనకు క్రమక్రమంగా వెల్లడి చేసింది. ఆ సత్యాలు మన హృదయానికి హత్తుకున్నప్పుడు, రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వాలని మనం తప్పకుండా కోరుకుంటాం.

దాచబడిన నిధిని కనుగొన్న వ్యక్తిలాగే, క్రైస్తవులు కూడా రాజ్య సత్యాన్ని కనుగొన్నందుకు చాలా సంతోషిస్తారు (20వ పేరా చూడండి)

20. రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వండి అనే సలహాకు తన అనుచరులు ఎలా స్పందిస్తారని యేసు చెప్పాడు?

20 రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వండి అనే నిర్దేశానికి తన అనుచరులు ఎలా స్పందిస్తారో యేసుకు తెలుసు. దాచబడిన నిధి గురించి ఆయన చెప్పిన ఉదాహరణ పరిశీలించండి. (మత్తయి 13:44 చదవండి.) ఒకతను ఎప్పటిలాగే పొలంలో పని చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ, అనుకోకుండా అతనికి ఒక దాచబడిన నిధి కనబడింది. అది ఎంత విలువైనదో అర్థం చేసుకుని, “అతను సంతోషంగా వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని” కొన్నాడు. దీనినుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? మనం కూడా రాజ్య సత్యాన్ని తెలుసుకుని అది ఎంత విలువైనదో గ్రహించినప్పుడు, దానికోసం సంతోషంగా త్యాగాలు చేస్తాం, అలాగే రాజ్య సంబంధ విషయాలకు మొదటి స్థానం ఇస్తాం. d

21, 22. రాజ్యానికి విశ్వసనీయంగా మద్దతిచ్చే ప్రజలు దానికి మొదటి స్థానం ఇస్తున్నామని ఎలా చూపించారు? ఒక ఉదాహరణ చెప్పండి.

21 రాజ్యానికి విశ్వసనీయంగా మద్దతిచ్చేవాళ్లు, దానికి మొదటి స్థానం ఇస్తున్నామని చెప్పుకోవడమే కాదు గానీ తమ పనుల ద్వారా చూపిస్తారు. వాళ్లు తమ జీవితాల్ని, సామర్థ్యాల్ని, వనరుల్ని ప్రకటనా పనికి అంకితం చేస్తారు. నేడు చాలామంది సహోదరసహోదరీలు పూర్తికాల సేవ చేపట్టడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రాజ్యానికి మొదటి స్థానమిచ్చేవాళ్లను యెహోవా ఎంతగా ఆశీర్వదిస్తాడో వాళ్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఒక ఉదాహరణ పరిశీలించండి.

22 ఏవరీ బ్రిస్టో, లోవీన్యా అనే దంపతులు 1920ల చివర్లో అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో కల్‌పోర్చర్లుగా (పయినీర్లుగా) సేవ చేశారు. లోవీన్యా ఇలా గుర్తుచేసుకుంది: “నేను, ఏవరీ కలిసి చాలా సంవత్సరాలు పయినీరు సేవ చేశాం. కొన్నిసార్లు సరుకులు, వంట గ్యాస్‌ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కావు. కానీ ప్రతీసారి, యెహోవా ఏదోక రూపంలో మా అవసరాలు తీర్చాడు. అందువల్ల మేము పయినీరు సేవను కొనసాగించడంపైనే దృష్టిపెట్టాం. మాకు సరిగ్గా ఏది కావాలో, దాన్నే యెహోవా మాకు ఇస్తూ వచ్చాడు.” వాళ్లు ఫ్లోరిడాలోని పెన్సకోలాలో సేవ చేస్తున్నప్పుడు, ఒక సందర్భంలో వాళ్ల సరుకులు అయిపోయాయి. వాటిని కొనుక్కోవడానికి వాళ్ల దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ వాళ్లు తమ హౌజ్‌ కారు (ఇల్లుగా మార్చుకున్న కారు) దగ్గరికి వచ్చి చూసే సరికి, అక్కడ రెండు పెద్ద సంచుల నిండా సరుకులు పెట్టి ఉన్నాయి. వాటితోపాటు “ఇట్లు, ప్రేమతో, పెన్సకోలా కంపెనీ” అని రాసివున్న కార్డు కూడా ఉంది. e కొన్ని దశాబ్దాల పాటు పూర్తికాల సేవ చేసిన తర్వాత లోవీన్యా ఇలా గుర్తుచేసుకుంది: “యెహోవా మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు.”

23. రాజ్య సత్యాన్ని కనుగొన్నందుకు మీరు ఎలా భావిస్తున్నారు? మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?

23 మనందరి పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, మనం వాళ్లలా పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించలేకపోవచ్చు. అయినప్పటికీ, మన శక్తి మేరకు మనస్ఫూర్తిగా ప్రకటించే అవకాశం మనలో ప్రతీఒక్కరికీ ఉంది. (కొలొ. 3:23) మనకు దొరికిన రాజ్య సత్యాన్ని అమూల్యంగా ఎంచుతున్నాం కాబట్టే, దానికోసం త్యాగాలు చేయడానికి, ప్రకటనా పనిలో శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరూ సిద్ధంగా ఉన్నారా?

24. ఈ చివరి రోజుల్లో రాజ్యం సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి ఏమిటి?

24 గత వంద సంవత్సరాలుగా, రాజైన యేసుక్రీస్తు మత్తయి 24:14 లో ఉన్న మాటల్ని నెరవేరుస్తున్నాడు. ప్రకటనా పని చేయమని ఆయన తన అనుచరుల్ని బలవంతపెట్టట్లేదు గానీ, వాళ్లే ఇష్టపూర్వకంగా ముందుకొస్తున్నారు. స్వార్థంతో నిండి ఉన్న ఈ లోకానికి భిన్నంగా, వాళ్లు ఇష్టపూర్వకంగా ప్రకటనా పనికి మద్దతిస్తున్నారు. వాళ్లు భూవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనా పని, యేసు ప్రత్యక్షతా కాలానికి సంబంధించిన సూచనలో ఒక భాగం. అంతేకాదు, ఈ చివరి రోజుల్లో రాజ్యం సాధిస్తున్న గొప్ప విజయాల్లో అదొకటి.

a బైబిల్లో, మంచు సమృద్ధిని సూచిస్తుంది.—ఆది. 27:28; మీకా 5:7.

b ఆ పని ఎవరికి అప్పగించబడింది? (ఇంగ్లీషు) అనే పాంప్లెట్‌ ఇలా వివరించింది: “ద గోల్డెన్‌ ఏజ్‌ ప్రచార కార్యక్రమంలో, ఇంటింటికి వెళ్లి రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూ గోల్డెన్‌ ఏజ్‌ పత్రిక గురించి కూడా ప్రచారం చేయాలి. . . . ఆ పత్రికకు చందాదారులుగా ఉండడానికి గృహస్థులు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఒక కాపీని ప్రతీ ఇంట్లో అందించాలి.” అయితే, ఆ తర్వాతి సంవత్సరాల్లో గోల్డెన్‌ ఏజ్‌ పత్రికకు, వాచ్‌ టవర్‌ పత్రికకు చందాదారుల్ని సేకరించమని సంస్థ సహోదరుల్ని ప్రోత్సహించింది. 1940, ఫిబ్రవరి 1 నుండి, ప్రజలకు విడి పత్రికల్ని అందించి వాటిని రిపోర్టు చేయమని సంస్థ చెప్పింది.

c అప్పట్లో పెద్దల్ని సంఘ సభ్యులే ఓటింగ్‌ పద్ధతి ద్వారా ఎన్నుకునేవాళ్లు. పరిచర్యను వ్యతిరేకించేవాళ్లను సంఘ పెద్దలుగా ఎన్నుకునేవాళ్లు కాదు. అయితే దైవపరిపాలనా పద్ధతిలో పెద్దల్ని నియమించే ఏర్పాటు గురించి ఈ పుస్తకంలోని 12వ అధ్యాయంలో తెలుసుకుంటాం.

d మంచి ముత్యం కోసం వెదుకుతున్న ఒక వ్యాపారస్థుని ఉదాహరణలో కూడా యేసు ఆ విషయాన్నే చెప్పాడు. ఆ వ్యాపారస్థుడు మంచి ముత్యాన్ని కనుగొనగానే తనకున్నదంతా అమ్మి దాన్ని కొన్నాడు. (మత్త. 13:45, 46) ఆ రెండు ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా, మనం సత్యాన్ని అనుకోకుండా తెలుసుకుని ఉండవచ్చు, లేదా దానికోసం వెదికి వెదికి కనుగొనివుండవచ్చు. కాబట్టి ఏ విధంగా సత్యం తెలుసుకున్నా, మన జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి, దానికోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

e అప్పట్లో సంఘాలను కంపెనీలు అని పిలిచేవాళ్లు.