కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7

ప్రకటించడానికి ఉపయోగించిన పద్ధతులు—ప్రజల్ని చేరుకోవడానికి వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగించడం

ప్రకటించడానికి ఉపయోగించిన పద్ధతులు—ప్రజల్ని చేరుకోవడానికి వీలైన ప్రతీ పద్ధతిని ఉపయోగించడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

వీలైనంత ఎక్కువమందికి ప్రకటించడానికి దేవుని ప్రజలు రకరకాల పద్ధతుల్ని ఉపయోగించడం

1, 2. (ఎ) ఎక్కువమంది ప్రజలతో మాట్లాడేటప్పుడు యేసు ఏ పద్ధతిని ఉపయోగించాడు? (బి) ఆయన నమ్మకమైన శిష్యులు ఆయన్ని ఎలా అనుసరించారు? ఎందుకు?

 సముద్ర తీరాన యేసు బోధించడం మొదలుపెట్టాడు. చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి తరలివచ్చారు. అప్పుడు ఆయన ఒక పడవ ఎక్కి తీరానికి కాస్త దూరంలో కూర్చున్నాడు. ఎందుకు? నీటి ఉపరితలం మీద నుండి ఆయన స్వరం పెద్దగా వినిపిస్తుంది. కాబట్టి, ఎక్కువమంది ప్రజలు ఆయన చెప్పే విషయాల్ని స్పష్టంగా వినగలుగుతారు.—మార్కు 4:1, 2 చదవండి.

2 రాజ్యం స్థాపించబడడానికి ముందు అలాగే ఆ తర్వాతి దశాబ్దాల్లో, క్రీస్తు అనుచరులు ఆయనలాగే మంచివార్తను ఎక్కువమందికి చేరవేయడానికి కొత్తకొత్త పద్ధతుల్ని ఉపయోగించారు. పరిస్థితులు మారినప్పుడు, కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినప్పుడు, వాటికి తగ్గట్లుగా తమ పద్ధతుల్ని మలుచుకున్నారు. అంతం రాకముందే వీలైనంత ఎక్కువమందిని చేరుకోవాలన్నది వాళ్ల కోరిక. (మత్త. 24:14) అందుకోసం వాళ్లు ఉపయోగించిన కొన్ని పద్ధతుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా, వాళ్ల విశ్వాసాన్ని మీరు ఏయే విధాలుగా అనుకరించవచ్చో ఆలోచించండి.

ఎక్కువమంది ప్రజల్ని చేరుకోవడం

3. మనం వార్తాపత్రికలను ఉపయోగించడం చూసి శత్రువులు ఎలా స్పందించారు?

3 వార్తాపత్రికలు. సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు 1879 నుండి వాచ్‌ టవర్‌ పత్రికను ప్రచురిస్తూ, అనేకమంది ప్రజలకు రాజ్య సందేశాన్ని చేరవేశారు. 1914కు ముందు దశాబ్దంలో రాజ్య సందేశం ఎక్కువమందికి చేరేలా క్రీస్తే పరిస్థితుల్ని మలిచివుంటాడు. ఒక ఉదాహరణ పరిశీలించండి. 1903లో పెన్సిల్వేనియాలోని ప్రొటెస్టెంట్‌ గుంపు ప్రతినిధి డాక్టర్‌ ఇ. ఎల్‌. ఈటెన్‌, బైబిలు సిద్ధాంతాల గురించి బహిరంగంగా చర్చించుకుందాం రమ్మని రస్సెల్‌ను సవాలు చేశాడు. అతను రస్సెల్‌కు రాసిన ఒక ఉత్తరంలో, “మీకు మాకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్న కొన్ని విషయాల గురించి బహిరంగంగా చర్చించుకుందాం. . . . దాన్ని వినడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారు” అని అన్నాడు. అలాంటి చర్చలు ప్రజలకు ఆసక్తికరంగా ఉంటాయని రస్సెల్‌, అతని సహచరులు కూడా భావించారు. దాంతో వాళ్లు ఆ చర్చల్ని, ద పిట్స్‌బర్గ్‌ గాజెట్‌ అనే ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ ఆర్టికల్స్‌ బాగా ప్రాచుర్యం పొందడం వల్ల, అలాగే రస్సెల్‌ బైబిలు సత్యాన్ని స్పష్టంగా వివరించడం వల్ల, ఆ వార్తాపత్రిక అతని ప్రసంగాలను ప్రతీవారం ప్రచురించడానికి ముందుకొచ్చింది. అప్పుడు, శత్రువులు ఎంతగా రగిలిపోయి ఉంటారో కదా!

1914కల్లా 2,000లకు పైగా వార్తాపత్రికలు రస్సెల్‌ ప్రసంగాలను ప్రచురిస్తున్నాయి

4, 5. రస్సెల్‌ ఏ లక్షణాన్ని చూపించాడు? బాధ్యతగల స్థానాల్లో ఉన్నవాళ్లు ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు?

4 త్వరలోనే చాలా వార్తాపత్రికలు రస్సెల్‌ ప్రసంగాలను ప్రచురించడానికి ముందుకొచ్చాయి. 1908కల్లా అతని ప్రసంగాలు “11 వార్తాపత్రికల్లో క్రమంగా” ప్రచురించబడ్డాయని వాచ్‌ టవర్‌ తెలియజేసింది. సంస్థ కార్యాలయాలను పిట్స్‌బర్గ్‌ నుండి ఒక ప్రముఖ నగరానికి మారిస్తే, మన ఆర్టికల్స్‌ ఇంకా ఎక్కువ వార్తాపత్రికల్లో వస్తాయని, వార్తాపత్రికల పనిలో అనుభవం ఉన్న కొంతమంది సహోదరులు సలహా ఇచ్చారు. రస్సెల్‌ ఆ సలహాను, ఇతర విషయాల్ని పరిశీలించి 1909లో సంస్థ కార్యాలయాలను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు మార్చాడు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? కొద్ది నెలల్లోనే, దాదాపు 400 వార్తాపత్రికలు రస్సెల్‌ ప్రసంగాలను ప్రచురించడం మొదలుపెట్టాయి. తర్వాత్తర్వాత ఆ సంఖ్య ఇంకా పెరిగింది. 1914లో రాజ్యం స్థాపించబడే సమయానికల్లా, 2,000కన్నా ఎక్కువ వార్తాపత్రికలు, రస్సెల్‌ ప్రసంగాలను, ఆర్టికల్స్‌ను నాలుగు భాషల్లో ప్రచురిస్తున్నాయి!

5 దీని నుండి మనం ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు? నేడు, దేవుని సంస్థలో బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులు రస్సెల్‌ చూపించిన వినయాన్ని అనుకరించవచ్చు. ఏ విధంగా? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులు ఇచ్చే సలహాలను స్వీకరించడం ద్వారా వాళ్లు వినయం చూపించవచ్చు.—సామెతలు 15:22 చదవండి.

6. వార్తాపత్రికల్లో ప్రచురించబడిన సత్యాలు ఒక వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

6 ఆ వార్తాపత్రికల్లో ప్రచురించబడిన రాజ్య సత్యాలు ఎంతోమంది జీవితాల్ని మార్చాయి. (హెబ్రీ. 4:12) అలా వార్తాపత్రికల ద్వారా సత్యం నేర్చుకున్నవాళ్లలో ఓరా హెజిల్‌ ఒకరు. ఆమె ఇలా చెప్పింది: “పెళ్లైన తర్వాత, ఒకసారి నేను మిన్నెసోటాలోని రోచెస్టర్‌లో ఉంటున్న మా అమ్మను చూడడానికి వెళ్లాను. నేను వెళ్లేసరికి, మా అమ్మ వార్తాపత్రికలో వచ్చిన రస్సెల్‌ ప్రసంగాలను కత్తిరిస్తూ ఉంది. ఆ ప్రసంగాల నుండి ఆమె ఏమేమి నేర్చుకుందో నాకు చెప్పింది.” ఓరా ఆ సత్యాలను అంగీకరించి, 1917లో బాప్తిస్మం తీసుకుంది. తర్వాత, దాదాపు ఆరు దశాబ్దాలపాటు ఆమె నమ్మకంగా దేవుని రాజ్యం గురించి ప్రకటించింది.

7. వార్తాపత్రికల ద్వారా మంచివార్త ప్రకటించడం గురించి ఎందుకు పునఃపరిశీలించాల్సి వచ్చింది?

7 అయితే 1916లో జరిగిన రెండు సంఘటనల వల్ల, వార్తాపత్రికల ద్వారా మంచివార్త చేరవేయడం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఒకటి, అప్పుడే ఊపు అందుకుంటున్న మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా, వార్తాపత్రికలు ముద్రించడానికి కావాల్సిన వస్తువులు దొరకడం కష్టమైంది. దాని గురించి బ్రిటన్‌లో ఉన్న మన వార్తాపత్రిక విభాగం 1916లో ఇలా నివేదించింది: “ప్రస్తుతం 30 వార్తాపత్రికలు మాత్రమే మన ప్రసంగాలను ప్రచురిస్తున్నాయి. పేపరు ధర విపరీతంగా పెరుగుతున్నందువల్ల, ప్రసంగాలను ప్రచురించే వార్తాపత్రికల సంఖ్య ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది.” రెండో సంఘటన, 1916 అక్టోబరు 31న సహోదరుడు రస్సెల్‌ చనిపోవడం. 1916, వాచ్‌ టవర్‌ డిసెంబరు 15 సంచిక ఇలా ప్రకటించింది: “సహోదరుడు రస్సెల్‌ చనిపోయారు కాబట్టి, [వార్తాపత్రికల్లో] ఇక ప్రసంగాలు ప్రచురించబడవు.” అయితే ఆ పద్ధతి ముగిసిపోయినప్పటికీ, “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” వంటి ఇతర పద్ధతులు విజయవంతంగా కొనసాగాయి.

8. “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌”ను ఎలా రూపొందించారు?

8 చిత్ర ప్రదర్శనలు. రస్సెల్‌, అతని సహచరులు దాదాపు మూడేళ్లు కష్టపడి తయారుచేసిన “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” 1914లో విడుదలైంది. (సామె. 21:5) కదిలే చిత్రాలు, సౌండ్లు, రంగురంగుల గాజు స్లైడ్లు ఉపయోగించి దాన్ని వినూత్నంగా రూపొందించారు. వందలమంది వ్యక్తులు బైబిలు సన్నివేశాలను పునర్నటిస్తుండగా, ఆ సన్నివేశాలను ఫిల్మ్‌లో బంధించారు. ఆ సన్నివేశాల్లో కొన్ని జంతువుల్ని కూడా ఉపయోగించారు. 1913లో వచ్చిన ఒక నివేదిక ఇలా చెప్పింది: “నోవహు జలప్రళయాన్ని చిత్రీకరించడానికి ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల నుండి చాలా జంతువుల్ని తెప్పించారు.” ఇక వందలాది గాజు స్లైడ్ల విషయానికొస్తే లండన్‌, న్యూయార్క్‌, ప్యారిస్‌, ఫిలదెల్ఫియా నుండి వచ్చిన కళాకారులు వాటిలో ప్రతీ స్లైడు మీద చేత్తో రంగులు వేశారు.

9. “ఫోటో డ్రామా” తయారుచేయడానికి ఎందుకంత సమయాన్ని, డబ్బును వెచ్చించారు?

9 “ఫోటో డ్రామా” తయారు చేయడానికి ఎందుకంత సమయాన్ని, డబ్బును వెచ్చించారు? 1913లో జరిగిన సమావేశాల్లో ఈ తీర్మానం తీసుకున్నారు: “అమెరికన్‌ వార్తాపత్రికలు కార్టూన్లను, చిత్రాలను ఎక్కువగా ఉపయోగించి ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు, కదిలే చిత్రాలు బాగా ప్రాచుర్యం పొంది, ప్రజల మనసుల్ని కట్టిపడేస్తున్నాయి. అందుకే సమర్థవంతంగా ప్రకటించడానికి, బైబిలు గురించి బోధించడానికి కదిలే చిత్రాలు, స్టీరియో ఆప్టికన్‌ స్లైడ్లు చక్కగా ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం.”

“ఫోటో డ్రామా” ఈ గదిలో నుండి ప్రదర్శించబడేది; “ఫోటో డ్రామా” గాజు స్లైడ్లు

10. “ఫోటో డ్రామా” ఎంత విస్తృతంగా ప్రదర్శించబడింది?

10 1914లో, “ఫోటో డ్రామా” ప్రతీరోజు 80 నగరాల్లో ప్రదర్శించబడింది. అమెరికాలో, కెనడాలో దాదాపు 80 లక్షలమంది ప్రజలు దాన్ని వీక్షించారు. అదే సంవత్సరంలో ఆస్ట్రేలియా, బ్రిటన్‌, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, నార్వే, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌లో కూడా దాన్ని ప్రదర్శించారు. చిన్న పట్టణాల్లో ప్రదర్శించడం కోసం “యురేకా డ్రామా” అనే సరళమైన వర్షన్‌ని రూపొందించారు. దానిలో కదిలే చిత్రాలు ఉండవు కాబట్టి ఖర్చు కొంచెం తగ్గింది. అంతేకాదు, దాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడం తేలికైంది. 1916కల్లా “ఫోటో డ్రామా” లేదా “యురేకా డ్రామా” అర్మేనియన్‌, డానో నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, గ్రీక్‌, ఇటాలియన్‌, పోలిష్‌, స్పానిష్‌, స్వీడిష్‌ భాషల్లోకి అనువదించబడింది.

1914లో, “ఫోటో డ్రామా” చూడడానికి చాలామంది ప్రజలు వచ్చేవాళ్లు

11, 12. “ఫోటో డ్రామా” ఒక యువకుడిపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఆయన ఇతరులకు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

11 ఫ్రెంచ్‌లోకి అనువదించబడిన “ఫోటో డ్రామా,” 18 ఏళ్ల ఛార్లెస్‌ రోనర్‌ మనసుమీద చెరగని ముద్ర వేసింది. ఆయన ఇలా అన్నాడు: “దాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్సేస్‌లో మా ఊర్లో అంటే కోల్మార్‌లో ప్రదర్శించారు. మొదటి నుండి చివరివరకు అది బైబిలు సత్యాల్ని స్పష్టంగా వివరించడం చూసి నేను ముగ్ధుణ్ణి అయ్యాను.”

12 తర్వాత ఛార్లెస్‌ రోనర్‌ బాప్తిస్మం తీసుకొని, 1922లో పూర్తికాల సేవ చేపట్టాడు. ఆయన పొందిన నియామకాల్లో ఒకటి, ఫ్రాన్స్‌లో “ఫోటో డ్రామా”ను ప్రదర్శించడంలో సహాయం చేయడం. దానిగురించి ఆయన ఇలా చెప్పాడు: “వయోలిన్‌ వాయించడం, అకౌంట్స్‌ సేవకుడిగా పనిచేయడం, సాహిత్యాన్ని అందించడం లాంటి చాలా పనులు నాకు అప్పగించారు. కార్యక్రమం మొదలవడానికి ముందు ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పే పని కూడా నాదే. మేము విరామ సమయంలో ప్రేక్షకులకు సాహిత్యాన్ని అందించేవాళ్లం. ఒక్కో సహోదరుడికి లేదా సహోదరికి హాలులోని ఒక్కో భాగాన్ని నియమించేవాళ్లు. మేము ప్రచురణలు చేత్తో పట్టుకొని, మాకు నియమించిన భాగంలో ప్రతీఒక్కరి దగ్గరికి వెళ్లేవాళ్లం. అంతేకాదు, హాలు ప్రవేశద్వారం దగ్గర కూడా టేబుళ్ల నిండా ప్రచురణలు పెట్టేవాళ్లం.” 1925లో, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ చేయడానికి ఛార్లెస్‌ రోనర్‌కు ఆహ్వానం వచ్చింది. అక్కడ కొత్తగా స్థాపించిన డబ్ల్యూ. బి. బి. ఆర్‌ రేడియో స్టేషన్‌లో, వాద్య బృందాన్ని నడిపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. సహోదరుడు రోనర్‌ అనుభవం పరిశీలించాక మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేసేపనిలో నాకు ఏ నియామకం ఇచ్చినా, దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నానా?’—యెషయా 6:8 చదవండి.

13, 14. మంచివార్త వ్యాప్తి చేయడంలో రేడియో ఎలా ఉపయోగపడింది? ( “డబ్ల్యూ. బి. బి. ఆర్‌ ప్రసారం చేసిన కార్యక్రమాలు,”  “ఒక చారిత్రాత్మక సమావేశం” అనే బాక్సులు కూడా చూడండి.)

13 రేడియో. 1920లలో “ఫోటో డ్రామా” ప్రాచుర్యం తగ్గిపోయినప్పుడు, మంచివార్తను వ్యాప్తి చేయడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1922 ఏప్రిల్‌ 16న, పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో ఉన్న మెట్రోపోలిటన్‌ ఒపేరా హౌస్‌లో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఒక చారిత్రాత్మక రేడియో ప్రసంగాన్ని అందించాడు. దాని అంశం “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు.” ఆ ప్రసంగాన్ని దాదాపు 50,000 మంది విన్నారని అంచనా. ఆ తర్వాత 1923లో, ఒక సమావేశ కార్యక్రమం రేడియోలో మొదటిసారిగా ప్రసారమైంది. బయటివాళ్ల రేడియో స్టేషన్లను ఉపయోగించుకోవడంతోపాటు, ఒక సొంత స్టేషన్‌ను నిర్మించుకుంటే బాగుంటుందని నాయకత్వం వహిస్తున్న సహోదరులు భావించారు. దాంతో, న్యూయార్క్‌లోని స్టేటన్‌ ద్వీపంలో ఒక రేడియో స్టేషన్‌ నిర్మించి, దాన్ని డబ్ల్యూ. బి. బి. ఆర్‌ పేరుతో రిజిస్టర్‌ చేయించారు. 1924, ఫిబ్రవరి 24న ఆ రేడియో స్టేషన్‌ దాని మొదటి కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

1922లో, “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే ప్రసంగాన్ని సుమారు 50,000 మంది ప్రజలు రేడియో ద్వారా విన్నారని అంచనా

14 డబ్ల్యూ. బి. బి. ఆర్‌ను స్థాపించడానికి గల ఉద్దేశాన్ని వివరిస్తూ 1924, ద వాచ్‌ టవర్‌ డిసెంబరు 1 సంచిక ఇలా చెప్పింది: “సత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఇప్పటివరకు ఉపయోగించిన పద్ధతులన్నిటిలో రేడియో చాలా చౌక పద్ధతని, సమర్థవంతమైన పద్ధతని మేము నమ్ముతున్నాం. మరిన్ని రేడియో స్టేషన్లను నిర్మించడం ప్రభువు చిత్తమైతే, అందుకు అవసరమైన డబ్బును కూడా ఆయనే తగిన విధంగా ఏర్పాటు చేస్తాడు.” (కీర్త. 127:1) 1926కల్లా యెహోవా ప్రజలకు ఆరు సొంత రేడియో స్టేషన్లు ఉన్నాయి. అందులో రెండు అమెరికాలో ఉన్నాయి: ఒకటి న్యూయార్క్‌ నగరంలో ఉన్న డబ్ల్యూ. బి. బి. ఆర్‌, రెండవది చికాగోలో ఉన్న డబ్ల్యూ. ఓ. ఆర్‌. డి. మిగతా నాలుగు కెనడాలోని ఆల్బర్టా, బ్రిటీష్‌ కొలంబియా, ఒంటారియో, సస్కత్‌చెవాన్‌ నగరాల్లో ఉన్నాయి.

15, 16. (ఎ) మన రేడియో ప్రసారాలకు కెనడాలోని మతనాయకులు ఎలా స్పందించారు? (బి) రేడియో ప్రసారాలు, ఇంటింటి పరిచర్య ఒకదానికొకటి ఎలా తోడ్పడ్డాయి?

15 బైబిలు సత్యాలు విస్తృతంగా ప్రసారం అవ్వడం, క్రైస్తవ మత సామ్రాజ్యపు నాయకుల కంట్లో పడింది. కెనడాలోని సస్కత్‌చెవాన్‌ రేడియో స్టేషన్‌లో జరిగే పని గురించి తెలిసిన ఆల్బర్ట్‌ హోఫ్‌మన్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు: “బైబిలు విద్యార్థుల [అప్పట్లో యెహోవాసాక్షుల్ని అలా పిలిచేవాళ్లు] గురించి ఇంకా ఎక్కువమంది ప్రజలు తెలుసుకోసాగారు. సాక్ష్యమిచ్చే పని బాగా జరిగింది. కానీ 1928లో మతనాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో, కెనడాలోని బైబిలు విద్యార్థుల అన్ని రేడియో స్టేషన్ల లైసెన్సులు రద్దయ్యాయి.”

16 కెనడాలోని రేడియో స్టేషన్లు మూతబడినప్పటికీ, బయటి రేడియో స్టేషన్ల ద్వారా బైబిలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి. (మత్త. 10:23) ఆ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడానికి, అవి ఏ స్టేషన్లలో ప్రసారం అవుతాయో ఆ స్టేషన్ల లిస్టును ద వాచ్‌ టవర్‌, ద గోల్డెన్‌ ఏజ్‌ (ప్రస్తుతం తేజరిల్లు!) పత్రికల్లో ముద్రించారు. ప్రచారకులు ఆ పత్రికల్ని ఇంటింటి పరిచర్యలో అందిస్తూ, తమ స్థానిక స్టేషన్ల ద్వారా ప్రసంగాలను వినమని ప్రజల్ని ప్రోత్సహించారు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది? 1931 జనవరి బులెటిన్‌ (ప్రస్తుతం మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌) ఇలా చెప్పింది: “ఇంటింటి పరిచర్య చేస్తున్న సహోదరులకు ఈ రేడియో కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రజలు ఆ రేడియో కార్యక్రమాలను విన్నారని మన కార్యాలయానికి వచ్చిన ఎన్నో నివేదికలు తెలియజేశాయి. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన ప్రసంగాల్ని వినడం వల్ల, పరిచర్యలో పుస్తకాలను ఇవ్వగానే వాటిని తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని ఆ నివేదికలు తెలియజేశాయి.” రేడియో ప్రసారాలు, ఇంటింటి పరిచర్య ఈ రెండూ “ప్రభువు సంస్థకు రెండు పట్టుకొమ్మలు” అని కూడా ఆ బులెటిన్‌ వివరించింది.

17, 18. పరిస్థితులు మారినప్పటికీ, మంచివార్త వ్యాప్తి చేయడంలో రేడియో ఎలా కీలక పాత్ర పోషించింది?

17 1930లలో బయటి రేడియో స్టేషన్లు ఉపయోగించుకునే విషయంలో వ్యతిరేకత ఎదురైంది. కాబట్టి 1937 చివర్లో, యెహోవా ప్రజలు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తమ పద్ధతుల్ని మార్చుకున్నారు. బయటి రేడియో స్టేషన్ల ద్వారా చేస్తున్న ప్రసారాలను నిలిపేసి, ఇంటింటి పరిచర్యపై దృష్టి పెట్టారు. a అయినప్పటికీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లో రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడంలో రేడియో కీలకపాత్ర పోషించింది. ఉదాహరణకు, 1951 నుండి 1991 వరకు జర్మనీలోని వెస్ట్‌ బెర్లిన్‌లో ఒక రేడియో స్టేషన్‌ బైబిలు ప్రసంగాలను క్రమంగా ప్రసారం చేసింది. దానివల్ల, అప్పట్లో ఈస్ట్‌ జర్మనీగా పిలవబడిన ప్రాంతాల్లోని ప్రజలు రాజ్య సందేశాన్ని వినగలిగారు. 1961 నుండి మరో మూడు దశాబ్దాల వరకు, దక్షిణ అమెరికాలోని సురినామ్‌లో ఉన్న ఒక జాతీయ రేడియో స్టేషన్‌, ప్రతీవారం 15 నిమిషాలపాటు బైబిలు సత్యాల్ని ప్రసారం చేసింది. 1969 నుండి 1977 వరకు, “లేఖనాలన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి” అనే శీర్షికతో 350కు పైగా రికార్డు చేసిన రేడియో కార్యక్రమాలను సంస్థ రూపొందించింది. అమెరికాలో, 48 రాష్ట్రాల్లో 291 రేడియో స్టేషన్లు ఆ కార్యక్రమాలను ప్రసారం చేశాయి. 1996లో, దక్షిణ పసిఫిక్‌ సమోవాకు రాజధానియైన ఆపియాలోని ఒక రేడియో స్టేషన్‌, “బైబిలు ప్రశ్నలకు జవాబులు” అనే శీర్షికతో ప్రతీవారం ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

18 20వ శతాబ్దం ముగిసేసరికి, మంచివార్తను వ్యాప్తి చేయడంలో రేడియోకు ఉన్న ప్రాచుర్యం తగ్గి మరో పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఆ పద్ధతి ద్వారా, మంచివార్త ఇంకా ఎక్కువమందికి చేరింది.

19, 20. యెహోవా ప్రజలు jw.org వెబ్‌సైట్‌ను ఎందుకు రూపొందించారు? దానికి ఎలాంటి స్పందన వచ్చింది? ( “JW.ORG” అనే బాక్సు కూడా చూడండి.)

19 ఇంటర్నెట్‌. 2013 నాటికి 270 కోట్ల కన్నా ఎక్కువమంది, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతం మంది ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. వాళ్లలో దాదాపు 200 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ వంటి మొబైల్‌ పరికరాల్లో ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారని అంచనా. మొబైల్‌లో ఇంటర్నెట్‌ను ఉపయోగించేవాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది, మరిముఖ్యంగా ఆఫ్రికాలో వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో 9 కోట్ల కంటే ఎక్కువమంది మొబైల్‌లో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఆ మార్పు, ప్రజలకు సమాచారాన్ని చేరవేసే ఒక కొత్త పద్ధతికి తెరతీసింది.

20 1997లో, యెహోవా ప్రజలు ఎక్కువమందికి రాజ్య సందేశాన్ని చేరవేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. 2013లో jw.org వెబ్‌సైట్‌ దాదాపు 300 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో, 520 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రతీరోజు 7,50,000కు పైగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు (మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌) ఈ వెబ్‌సైట్‌కు కనెక్ట్‌ అవుతున్నాయి. ప్రజలు ఈ వెబ్‌సైట్‌లో వీడియోలు చూడడంతోపాటు, ప్రతీనెల దాదాపు 30 లక్షల పుస్తకాలను, 40 లక్షల పత్రికలను, 2 కోట్ల 20 లక్షల ఆడియో రికార్డింగ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.

21. సీనా అనుభవాన్ని బట్టి ఏమి అర్థమౌతుంది?

21 ప్రకటనా పని నిషేధించబడిన ప్రాంతాల్లో సైతం, మంచివార్తను వ్యాప్తి చేయడంలో jw.org వెబ్‌సైట్‌ ఒక శక్తివంతమైన సాధనంగా పని చేసింది. ఉదాహరణకు, 2013లో సీనా అనే వ్యక్తి మన వెబ్‌సైట్‌ని సందర్శించాడు. తర్వాత అమెరికాలో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఫోన్‌ చేసి, బైబిలు గురించి ఇంకా ఎక్కువ సమాచారం కావాలని అడిగాడు. తర్వాత, అమెరికాలో ఉంటున్న ఒక యెహోవాసాక్షి ఆయనతో ఇంటర్నెట్‌ ద్వారా వారానికి రెండుసార్లు బైబిలు అధ్యయనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే, ఆయన ముస్లిం నేపథ్యం నుండి వచ్చాడు. పైగా, ఆయన యెహోవాసాక్షుల ప్రకటనా పని పూర్తిగా నిషేధించబడిన దేశంలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్నాడు.

ప్రజలకు వ్యక్తిగతంగా బోధించడం

22, 23. (ఎ) ఎక్కువమంది ప్రజల్ని చేరుకోవడానికి ఉపయోగించిన పద్ధతులు, ఇంటింటి పరిచర్యకున్న ప్రాముఖ్యతను తగ్గించాయా? (బి) రాజు మన కృషిని ఎలా ఆశీర్వదించాడు?

22 ఎక్కువమంది ప్రజల్ని చేరుకోవడానికి వార్తాపత్రికలు, “ఫోటో డ్రామా,” రేడియో, వెబ్‌సైట్‌ వంటి పద్ధతులు ఉపయోగించినప్పటికీ, ఇంటింటి పరిచర్యే అన్నిటికన్నా ముఖ్యమైన పద్ధతి. ఎందుకు? ఎందుకంటే, యేసు ప్రారంభించిన పద్ధతి అదే. ఆయన జనసమూహాలకు బోధించినప్పటికీ, మరిముఖ్యంగా ప్రజలకు వ్యక్తిగతంగా బోధించడంపైనే దృష్టిపెట్టాడు. (లూకా 19:1-5) అంతేకాదు ప్రజలకు వ్యక్తిగతంగా బోధించేలా తన శిష్యులకు శిక్షణనిస్తూ, ఏ సందేశాన్ని ప్రకటించాలో కూడా చెప్పాడు. (లూకా 10:1, 8-11 చదవండి.) 6వ అధ్యాయంలో చర్చించినట్లుగా, ప్రజలకు వ్యక్తిగతంగా ప్రకటించడం ప్రాముఖ్యమని నాయకత్వం వహిస్తున్న సహోదరులు మొదటినుండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు.—అపొ. 5:42; 20:20.

23 రాజ్యం స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం, దాదాపు 80 లక్షలమంది ప్రచారకులు దేవుని సంకల్పాల గురించి ఉత్సాహంగా బోధిస్తున్నారు. రాజ్యం గురించి ప్రకటించడానికి మనం ఉపయోగించిన పద్ధతుల్ని రాజు ఆశీర్వదించాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, ప్రతీ దేశానికి, తెగకు, భాషకు చెందిన ప్రజలకు మంచివార్తను వ్యాప్తి చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ఆయన ఇచ్చాడు. దాని గురించి మనం తర్వాతి అధ్యాయంలో చర్చిస్తాం.—ప్రక. 14:6.

a 1957లో న్యూయార్క్‌లో ఉన్న డబ్ల్యూ. బి. బి. ఆర్‌ను మూసేయాలని నాయకత్వం వహిస్తున్న సహోదరులు నిర్ణయించారు. మన రేడియో స్టేషన్లలో చివరిగా మూయబడిన రేడియో స్టేషన్‌ అదే.