కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8

ప్రకటించడానికి ఉపయోగించిన పరికరాలు—ప్రపంచవ్యాప్త ప్రజలందరి కోసం ప్రచురణలు తయారుచేయడం

ప్రకటించడానికి ఉపయోగించిన పరికరాలు—ప్రపంచవ్యాప్త ప్రజలందరి కోసం ప్రచురణలు తయారుచేయడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

యెహోవా అన్ని జాతుల, తెగల, భాషల ప్రజలకు బోధించడానికి కావాల్సిన పరికరాలను ఇవ్వడం

1, 2. (ఎ) మొదటి శతాబ్దంలో మంచివార్త రోమా సామ్రాజ్యమంతటా వ్యాప్తి చెందడానికి ఏది సహాయం చేసింది? (బి) మనకాలంలో జరుగుతున్న పనికి యెహోవా మద్దతు ఉందని ఎలా చెప్పవచ్చు? ( “670 కన్నా ఎక్కువ భాషల్లో అనువాద పని జరుగుతోంది” అనే బాక్సు చూడండి.)

 అది సా.శ. 33 పెంతెకొస్తు రోజు. యెరూషలేముకు వచ్చిన సందర్శకులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఎందుకు? ఎందుకంటే గలిలయకు చెందిన యేసు శిష్యులు వేర్వేరు భాషల్లో ధారాళంగా మాట్లాడుతున్నారు. వాళ్లు చెప్తున్న సందేశం అక్కడున్న వాళ్లందర్నీ ఆకట్టుకుంది. శిష్యులు అలా అద్భుత రీతిలో వేర్వేరు భాషల్లో మాట్లాడడం, వాళ్లకు దేవుని మద్దతు ఉందని నిరూపించింది. (అపొస్తలుల కార్యములు 2:1-8, 12, 15-17 చదవండి.) ఆ రోజు వాళ్లు చెప్పిన సందేశం, వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలకు చేరింది. తర్వాత్తర్వాత రోమా సామ్రాజ్యమంతటా వ్యాపించింది.—కొలొ. 1:23.

2 నేడు, దేవుని సేవకులు అద్భుత రీతిలో వేర్వేరు భాషలు మాట్లాడట్లేదు. కానీ, వాళ్లు మొదటి శతాబ్దంలో శిష్యులు మాట్లాడిన భాషల కంటే ఎక్కువ భాషల్లో రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూ, 670కు పైగా భాషల్లో దాన్ని అనువదిస్తున్నారు. (అపొ. 2:9-11) వాళ్లు ఆ పనిని ఎంత విస్తృతంగా చేస్తున్నారంటే, రాజ్య సందేశం ప్రపంచ నలుమూలలా వ్యాపిస్తోంది. a యెహోవా మన రాజైన యేసుక్రీస్తు ద్వారా ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నాడని అది రుజువు చేస్తుంది. (మత్త. 28:19, 20) గడిచిన 100 ఏళ్లలో ప్రకటనా పనిలో ఉపయోగించిన కొన్ని పరికరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అంతేకాదు, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించే విషయంలో రాజు మనకెలా క్రమక్రమంగా శిక్షణ ఇచ్చాడో కూడా గమనిద్దాం.—2 తిమో. 2:2.

సత్యపు విత్తనాలు నాటడానికి కావాల్సిన పరికరాలను ఇవ్వడం

3. మనం ప్రకటనా పనిలో రకరకాల పరికరాలను ఎందుకు ఉపయోగిస్తాం?

3 యేసు ‘రాజ్యం గురించిన వాక్యాన్ని’ విత్తనంతో, ఒక వ్యక్తి హృదయాన్ని నేలతో పోల్చాడు. (మత్త. 13:18, 19) రైతు విత్తనాలు నాటేముందు నేలను మెత్తబర్చడానికి, దాన్ని సిద్ధం చేయడానికి రకరకాల పనిముట్లను ఉపయోగిస్తాడు. అదేవిధంగా, రాజ్య సందేశాన్ని అంగీకరించేలా లక్షలమంది ప్రజల హృదయాల్ని సిద్ధం చేయడానికి, యెహోవా సేవకులు కూడా రకరకాల పరికరాలను ఉపయోగించారు. వాటిలో కొన్నిటిని కొంతకాలం వరకు ఉపయోగిస్తే, పుస్తకాలు, పత్రికలు వంటి మరికొన్నిటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ముందటి అధ్యాయంలో, ఎక్కువమందికి రాజ్యసందేశం చేరవేయడానికి ఉపయోగించిన పద్ధతుల గురించి పరిశీలించాం. అయితే ఈ అధ్యాయంలో, ప్రజలకు వ్యక్తిగతంగా బోధించడానికి సహాయం చేసిన పరికరాల గురించి చర్చిస్తాం.—అపొ. 5:42; 17:2, 3.

కెనడాలోని టోరెంటోలో ఫోనోగ్రాఫ్‌లను, సౌండ్‌ పరికరాలను తయారు చేస్తున్నారు

4, 5. ఫోనోగ్రాఫ్‌ను ఎలా ఉపయోగించేవాళ్లు? కానీ అది ఏ విషయంలో విఫలమైంది?

4 రికార్డు చేసిన ప్రసంగాలు. 1930ల నుండి 1940ల మధ్యకాలంలో, ప్రచారకులు పోర్టబుల్‌ ఫోనోగ్రాఫ్‌ ఉపయోగించి బైబిలు ప్రసంగాల రికార్డింగ్‌లను వినిపించేవాళ్లు. ప్రతీ రికార్డింగ్‌ ఐదు నిమిషాల కన్నా తక్కువసేపే ఉండేది. కొన్ని రికార్డింగ్‌లకు “త్రిత్వం,” “పాపవిమోచన లోకం,” “రాజ్యం” వంటి చిన్న శీర్షికలు ఉండేవి. ప్రచారకులు ఫోనోగ్రాఫ్‌లను ఎలా ఉపయోగించేవాళ్లు? అమెరికాలో 1930లో బాప్తిస్మం తీసుకున్న జూనియర్‌ క్లేటన్‌ జె. ఉడ్‌వర్త్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు: “ఫోనోగ్రాఫ్‌ ఒక చిన్న సూట్‌కేస్‌లా ఉండేది. దానిలో ఉన్న చిన్న హ్యాండిల్‌ను రికార్డు అంచున పెట్టగానే, ప్రసంగం ప్లే అయ్యేది. అది స్ప్రింగ్‌ మెకానిజమ్‌ ఆధారంగా పనిచేసేది. నేను ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, గుమ్మం దగ్గర నిలబడి సూట్‌కేస్‌ తెరిచి, హ్యాండిల్‌ను రికార్డు అంచున పెట్టి, కాలింగ్‌ బెల్‌ నొక్కేవాణ్ణి. ఇంటి వ్యక్తి తలుపు తెరవగానే, ‘నా దగ్గర ఒక ముఖ్యమైన సందేశం ఉంది, మీరు వింటారా?’ అని అడిగేవాణ్ణి.” అప్పుడు గృహస్థులు ఎలా స్పందించేవాళ్లు? దాని గురించి సహోదరుడు ఉడ్‌వర్త్‌ ఇలా చెప్పాడు: “చాలామంది సానుకూలంగా స్పందించేవాళ్లు. కానీ కొంతమంది నా ముఖం మీదే తలుపు వేసేవాళ్లు. ఇంకొంతమంది నేను ఫోనోగ్రాఫ్‌లు అమ్మడానికి వచ్చానేమో అనుకునేవాళ్లు.”

1940కల్లా దాదాపు 90 వేర్వేరు ప్రసంగాల రికార్డింగ్‌లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి

5 1940కల్లా దాదాపు 90 వేర్వేరు ప్రసంగాల రికార్డింగ్‌లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్‌లో పయినీరుగా, ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసిన సహోదరుడు జాన్‌ ఈ. బార్‌ ఇలా చెప్పాడు: “1936 నుండి 1945 వరకు, పరిచర్యలో ఫోనోగ్రాఫే నాకు తోడు. అయినప్పటికీ కొన్నిసార్లు నాకు నిరుత్సాహంగా అనిపించేది. కానీ గుమ్మం దగ్గర సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ స్వరాన్ని వినగానే, ఆయన నా పక్కనే ఉన్నట్లు అనిపించి చాలా ధైర్యం వచ్చేది. అయితే ఫోనోగ్రాఫ్‌, ప్రకటించడంలో విజయం సాధించింది కానీ, ప్రజల హృదయాల్ని చేరుకునేలా బోధించడంలో విఫలమైంది.”

6, 7. (ఎ) సాక్ష్యపు కార్డులు ఉపయోగించడంలో ఉన్న లోటుపాట్లు ఏమిటి? (బి) యెహోవా ఏ భావంలో తన ‘మాటల్ని మన నోట’ ఉంచాడు?

6 సాక్ష్యపు కార్డులు. 1933 నుండి, ప్రచారకులు ఇంటింటి పరిచర్యలో సాక్ష్యపు కార్డులను ఉపయోగించడం మొదలుపెట్టారు. సాక్ష్యపు కార్డు దాదాపు ఐదు అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పు ఉండేది. దాంట్లో క్లుప్తమైన బైబిలు సందేశం, అలాగే ఒక బైబిలు ప్రచురణ గురించి వివరణ ఉండేది. ప్రచారకులు ఇంటి వ్యక్తికి ఆ కార్డు ఇచ్చి దాన్ని చదవమని చెప్పేవాళ్లు. లిల్యన్‌ కామరుడ్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది: “సాక్ష్యపు కార్డును ఉపయోగించి ప్రకటించడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు, మాకు పరిచర్యలో మాట్లాడడం అంతగా వచ్చేది కాదు. కానీ సాక్ష్యపు కార్డుల వల్ల ప్రజలతో సంభాషణ మొదలుపెట్టడం తేలికైంది.” తర్వాత ఆ సహోదరి ప్యూర్టోరికోలో, అర్జెంటీనాలో మిషనరీగా సేవ చేసింది.

సాక్ష్యపు కార్డు (ఇటాలియన్‌ భాషలో)

7 1918లో బాప్తిస్మం తీసుకున్న డేవిడ్‌ రూష్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు: “సాక్ష్యపు కార్డులు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఎందుకంటే మాలో చాలామందికి పరిచర్యలో ఏమి మాట్లాడాలో తెలిసేది కాదు.” అయితే, సాక్ష్యపు కార్డును ఉపయోగించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సహోదరుడు రూష్‌ ఇంకా ఇలా చెప్పాడు: “కొన్నిసార్లు ప్రజలు మాకు మాటలు రావేమో అనుకునేవాళ్లు. ఒక విధంగా మాకు మాటలు రావనే చెప్పాలి. కానీ యెహోవా తన పరిచారకులుగా మమ్మల్ని సిద్ధం చేశాడు. ఆయన తన మాటల్ని మా నోట ఉంచి, ఇంటింటి పరిచర్యలో లేఖనాలు ఉపయోగించి బోధించేలా మాకు సహాయం చేశాడు. దాని కోసమే 1940లలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల రూపొందించబడింది.”—యిర్మీయా 1:6-9 చదవండి.

8. మంచి బోధకులయ్యేలా క్రీస్తు మనకు ఎలా సహాయం చేస్తున్నాడు?

8 పుస్తకాలు. 1914 నుండి, యెహోవా ప్రజలు 100కన్నా ఎక్కువ బైబిలు ఆధారిత పుస్తకాలను ప్రచురించారు. వాటిలో కొన్ని, సమర్థవంతంగా ప్రకటించేలా ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం కోసమే రూపొందించబడ్డాయి. డెన్మార్క్‌లో దాదాపు 70 సంవత్సరాల నుండి ప్రచారకురాలుగా కొనసాగుతున్న ఆనా లార్సన్‌ ఇలా చెప్తుంది: “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా, దానికి సంబంధించిన పుస్తకాల ద్వారా, సమర్థవంతమైన ప్రచారకులయ్యేలా యెహోవా మాకు సహాయం చేశాడు. 1945లో రాజ్య ప్రచారకులకు దైవపరిపాలనా సహాయకం (ఇంగ్లీషు) అనే పుస్తకం విడుదలవ్వడం నాకింకా గుర్తుంది. తర్వాత 1946లో ‘ప్రతి మంచి పనికి సిద్ధంగా ఉండడం’ (ఇంగ్లీషు) అనే పుస్తకం వచ్చింది. 2001 నుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నాం.” అవును, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా, దానికి సంబంధించిన పుస్తకాల ద్వారా, “పరిచారకులుగా ఉండేందుకు” యెహోవా మనల్ని అర్హుల్ని చేశాడు. (2 కొరిం. 3:5, 6) నేడు, వారం మధ్యలో జరిగే కూటం ద్వారా పరిచర్య విషయంలో శిక్షణ పొందుతున్నాం. ప్రతీ నెల వచ్చే మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతున్నారా? అలాగైతే, మంచి బోధకులయ్యేలా క్రీస్తు మీకు శిక్షణ ఇస్తున్నట్లే.—2 కొరిం. 9:6; 2 తిమో. 2:15.

9, 10. సత్యపు విత్తనాలు నాటడంలో, వాటికి నీళ్లు పోయడంలో పుస్తకాలు ఎలా సహాయం చేశాయి?

9 బైబిల్లోని ప్రాథమిక బోధల్ని ఇతరులకు వివరించడానికి సహాయం చేసే పుస్తకాల్ని కూడా యెహోవా తన సంస్థ ద్వారా అందించాడు. వాటిలో, 1968లో ప్రచురించబడిన నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం ఒకటి. అది విడుదలైన కొన్ని నెలలకే మంచి స్పందన వచ్చింది. దాని గురించి 1968 నవంబరు మన రాజ్య పరిచర్య ఇలా చెప్పింది: “సత్యము పుస్తకాలు ఎంతగా అవసరమయ్యాయంటే, సెప్టెంబరులో వాటిని ముద్రించడానికి బ్రూక్లిన్‌లోని సొసైటీ ఫ్యాక్టరీలో మన సహోదరులు రాత్రుళ్లు కూడా పనిచేయాల్సి వచ్చింది.” ఆ ఆర్టికల్‌ ఇంకా ఇలా చెప్పింది: “ఒకసారి ఆగస్టులో, అప్పటికే ముద్రించిన వాటికన్నా 15 లక్షల కాపీలు అదనంగా అవసరమయ్యాయి!” 1982 కల్లా, ఆ పుస్తకాన్ని 116 భాషల్లో పదికోట్ల కన్నా ఎక్కువ కాపీలను ప్రచురించారు. 1968 నుండి 1982 వరకు అంటే 14 సంవత్సరాల్లో, సత్యము పుస్తకం ద్వారా 10 లక్షలకన్నా ఎక్కువమంది కొత్తగా ప్రచారకులు అయ్యారు. b

10 2005లో, బైబిలు అధ్యయనాలు చేయడానికి రూపొందించబడిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకాన్ని దాదాపు 256 భాషల్లో 20 కోట్ల కాపీలను ప్రచురించారు! దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? 2005 నుండి 2012 వరకు, అంటే కేవలం ఏడు సంవత్సరాల్లోనే దాదాపు 12 లక్షలమంది కొత్తగా ప్రచారకులయ్యారు. ఆ సమయంలోనే బైబిలు అధ్యయనాల సంఖ్య దాదాపు 60 లక్షల నుండి 87 లక్షలకు చేరింది. రాజ్య సత్యపు విత్తనాల్ని నాటడానికి, నీళ్లు పోయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తున్నాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.—1 కొరింథీయులు 3:6, 7 చదవండి.

11, 12.లేఖనాలు సూచిస్తున్నట్లుగా, ఎలాంటి ప్రజల్ని చేరుకోవడానికి మన పత్రికలు రూపొందించబడ్డాయి?

11 పత్రికలు. ముఖ్యంగా “పరలోక పిలుపులో వంతు ఉన్న” ‘చిన్నమంద’ కోసం ద వాచ్‌ టవర్‌ పత్రిక రూపొందించబడింది. (లూకా 12:32; హెబ్రీ. 3:1) అలాగే 1919, అక్టోబరు 1న యెహోవా సంస్థ సాధారణ ప్రజల కోసం మరో పత్రికను విడుదల చేసింది. ఆ పత్రికను మొదట్లో గోల్డెన్‌ ఏజ్‌ అని, 1937లో కన్సోలేషన్‌ అని, 1946లో తేజరిల్లు! అని పిలిచారు. బైబిలు విద్యార్థులు, ప్రజలు ఆ పత్రికను ఎంతగా ఆదరించారంటే, అది వాచ్‌ టవర్‌ పత్రిక కన్నా ఎక్కువగా పంచిపెట్టబడింది.

12 దశాబ్దాలు గడుస్తుండగా కావలికోట, తేజరిల్లు! పత్రికల రూపురేఖల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ వాటి ఉద్దేశం మాత్రం మారలేదు. దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ బైబిలు మీద విశ్వాసాన్ని పెంచడమే ఆ పత్రికల ఉద్దేశం. నేడు కావలికోట పత్రిక అధ్యయన ప్రతిగా, సార్వజనిక ప్రతిగా లభ్యమౌతుంది. అధ్యయన ప్రతి ‘ఇంటివాళ్ల’ కోసం, అంటే ‘చిన్నమంద’ అలాగే ‘వేరే గొర్రెల’ కోసం రూపొందించబడింది. c (మత్త. 24:45; యోహా. 10:16) సార్వజనిక ప్రతి బైబిలు పట్ల, దేవుని పట్ల గౌరవం ఉండి సత్యం ఇంకా తెలుసుకోని వాళ్లకోసం తయారు చేయబడింది. (అపొ. 13:16) తేజరిల్లు! పత్రిక బైబిలు గురించి, సత్యదేవుడైన యెహోవా గురించి ఏ మాత్రం తెలియని వాళ్ల కోసం రూపొందించబడింది.—అపొ. 17:22, 23.

13. మన పత్రికలకు సంబంధించి ఏ విషయం మీకు నచ్చింది? ( “ప్రచురణలకు సంబంధించిన ప్రపంచ రికార్డులు” అనే చార్టు చూడండి.)

13 2014 ఆరంభం కల్లా, ప్రతీనెల తేజరిల్లు! పత్రికను దాదాపు 100 భాషల్లో 4 కోట్ల 40 లక్షలకన్నా ఎక్కువ కాపీలను ప్రచురించారు. అలాగే కావలికోట పత్రికను 200 కన్నా ఎక్కువ భాషల్లో దాదాపు 4 కోట్ల 60 లక్షల కాపీలను ప్రచురించారు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా పంచిపెట్టబడుతూ, ఎక్కువ భాషల్లోకి అనువదించబడుతున్న పత్రికలు అవే! ఆ గణాంకాలు చూసి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, భూమంతటా ప్రకటించబడుతుందని యేసు చెప్పిన సందేశమే ఆ పత్రికల్లో ఉంది.—మత్త. 24:14.

14. దేవుని ప్రజలు ఏ విషయంలో ఉత్సాహంగా పనిచేశారు? ఎందుకు?

14 బైబిలు. 1896లో సహోదరుడు రస్సెల్‌, అతని సహచరులు తాము ఉపయోగిస్తున్న కార్పొరేషన్‌ పేరులో బైబిలు అనే పదాన్ని చేర్చి, దాని పేరును వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీగా మార్చారు. ఆ పేరు సరైనదే, ఎందుకంటే రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడంలో బైబిలే మన ముఖ్య పరికరం. (లూకా 24:27) ఆ పేరుకు తగ్గట్లుగానే దేవుని ప్రజలు బైబిళ్లను విస్తృతంగా పంచిపెట్టారు, దాన్ని చదవమని ఇతరుల్ని ప్రోత్సహించారు. ఉదాహరణకు 1926లో, బెంజమిన్‌ విల్సన్‌ ప్రచురించిన క్రైస్తవ గ్రీకు లేఖనాల అనువాదమైన ద ఎంఫాటిక్‌ డయాగ్లట్‌ బైబిల్ని మన సొంత ప్రెస్‌లో ముద్రించాం. 1942 నుండి కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ పూర్తి బైబిల్ని ముద్రించి, దాదాపు 7 లక్షల కాపీలను పంచిపెట్టాం. తర్వాత రెండు సంవత్సరాలకే, అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ బైబిల్ని ముద్రించడం మొదలుపెట్టి, 1950కల్లా 2,50,000 కన్నా ఎక్కువ కాపీలను పంచిపెట్టాం. ఆ బైబిల్లో యెహోవా పేరు 6,823 సార్లు కనిపిస్తుంది.

15, 16. (ఎ) కొత్త లోక అనువాదం బైబిలుకు సంబంధించి మీకు ఏది బాగా నచ్చింది? ( “బైబిలు అనువాద పనిని వేగవంతం చేయడం” అనే బాక్సు చూడండి.) (బి) దేవుని వాక్యం మన హృదయాన్ని కదిలించాలంటే ఏమి చేయాలి?

15 1950లో క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) బైబిలు విడుదలైంది. 1961లో పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం (ఇంగ్లీషు) పూర్తి బైబిలు ఒకే సంపుటిలో విడుదలైంది. ఆ బైబిలు, ప్రాచీన హీబ్రూ రాతప్రతుల్లో యెహోవా పేరు ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా దాన్ని తిరిగి చేర్చింది. ఆ విధంగా యెహోవా పేరును ఘనపర్చింది. అంతేకాదు ఆ బైబిల్లో, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కూడా యెహోవా పేరు 237 సార్లు కనిపిస్తుంది. ఆ బైబిల్లోని వివరాలు ఖచ్చితంగా ఉండేలా, చదవడానికి తేలిగ్గా ఉండేలా దాన్ని చాలాసార్లు రివైజ్‌ చేశారు. ఈ మధ్యే 2013లో కూడా ఆ బైబిల్ని రివైజ్‌ చేశారు. 2013 కల్లా, కొత్త లోక అనువాదం బైబిల్ని పూర్తిగా లేదా భాగాలుగా 121 భాషల్లో 20 కోట్ల 10 లక్షల కన్నా ఎక్కువ కాపీలను ప్రచురించారు.

16 కొత్త లోక అనువాదం బైబిల్ని తమ సొంత భాషలో చదివిన కొంతమంది ఏమంటున్నారో గమనించండి. నేపాల్‌కు చెందిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “మాలో చాలామందికి పాత నేపాలీ అనువాదం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అందులోని భాష గ్రాంథికంగా ఉండేది. కానీ ఈ కొత్త బైబిలు, వాడుక భాషలో ఉంది కాబట్టి చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం.” సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌కు చెందిన ఒకామె, శాంగో భాషలో బైబిల్ని చదివి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఇలా చెప్పింది: “ఇది నా హృదయానికి హత్తుకునే భాష.” ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివితే, అది మన హృదయాన్ని కూడా కదిలిస్తుంది.—కీర్త. 1:2; మత్త. 22:36, 37.

పరికరాలను, శిక్షణను ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

17. మన పరిచర్యకు కావాల్సిన పరికరాలను, శిక్షణను ఇస్తున్నందుకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

17 మన పరిచర్యకు కావాల్సిన పరికరాలను, శిక్షణను ఇస్తున్నందుకు రాజైన యేసుక్రీస్తు పట్ల మీరు కృతజ్ఞత కలిగివున్నారా? దేవుని సంస్థ అందిస్తున్న ప్రచురణల్ని చదవడానికి సమయం కేటాయిస్తున్నారా? వాటిని పరిచర్యలో ఉపయోగిస్తున్నారా? అలాగైతే మీరు సహోదరి ఒపల్‌ బెట్లర్‌లాగే భావిస్తారు. ఆమె 1914, అక్టోబరు 4న బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా చెప్పింది: “ఎన్నో సంవత్సరాలపాటు నేను, నా భర్త [ఎడ్వర్డ్‌] ఫోనోగ్రాఫ్‌, సాక్ష్యపు కార్డులు ఉపయోగించి ప్రకటించాం. ఇంటింటి పరిచర్యలో పుస్తకాలు, చిన్న పుస్తకాలు, పత్రికలు అందించాం. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కరపత్రాలను పంచిపెట్టాం. తర్వాత, ఆసక్తి చూపించినవాళ్లను తిరిగి కలవడంలో, [ఇప్పుడు వాటిని పునర్దర్శనాలు అని పిలుస్తున్నాం] గృహ బైబిలు అధ్యయనాలు చేయడంలో శిక్షణ పొందాం. ఆ రోజులు ఎంతో బిజీగా, సంతోషంగా గడిచిపోయాయి.” తన ప్రజలు విత్తడంలో, కోయడంలో సంతోషిస్తారని యేసు ముందే చెప్పాడు. సహోదరి ఒపల్‌లాగే, లక్షలమంది సహోదరసహోదరీలు ఆ మాటలు ఎంత నిజమో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు.—యోహాను 4:35, 36 చదవండి.

18. మనందరికీ ఏ గొప్ప అవకాశం ఉంది?

18 దేవుని ప్రజలు “చదువులేని సామాన్యులని” చాలామంది అనుకోవచ్చు. (అపొ. 4:13) కానీ ఒక్కసారి ఆలోచించండి! ఆ సామాన్య ప్రజలే, చరిత్రలో ముందెన్నడూ లేనంతగా ప్రచురణల్ని అనువదించి, పంచిపెట్టారు! అలా చేయడానికి రాజు వాళ్లకు సహాయం చేశాడు. మరిముఖ్యంగా, ఆ పరికరాలను ఉపయోగించి అన్ని రకాల ప్రజలకు మంచివార్త ప్రకటించేలా వాళ్లకు శిక్షణ ఇచ్చాడు. సత్యపు విత్తనాలు నాటడంలో, అలాగే కోత కోయడంలో క్రీస్తుతో కలిసి పనిచేయడం ఎంత గొప్ప అవకాశమో కదా!

a గడిచిన ఒక్క దశాబ్దంలోనే, యెహోవా ప్రజలు 2,000 కోట్లకన్నా ఎక్కువ బైబిలు ప్రచురణల్ని తయారు చేశారు. దాంతోపాటు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న 270 కోట్లకన్నా ఎక్కువమంది ప్రజలకు jw.org వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంది.

b దేవుని వీణ (ఇంగ్లీషు, 1921లో ప్రచురించారు), “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఇంగ్లీషు, 1946లో ప్రచురించారు), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (1982లో ప్రచురించారు), నిత్యజీవానికి నడిపించే జ్ఞానము (1995లో ప్రచురించారు) వంటి పుస్తకాలు బైబిలు అధ్యయనాలు చేయడానికి సహాయం చేశాయి.

c ‘ఇంటివాళ్ల’ విషయంలో వచ్చిన కొత్త అవగాహన గురించి తెలుసుకోవడానికి, 2013 కావలికోట జూలై 15, 23వ పేజీ, 13వ పేరా చూడండి.