కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9

ప్రకటనా పనికి వచ్చిన ఫలితాలు—“పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి”

ప్రకటనా పనికి వచ్చిన ఫలితాలు—“పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి”

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

రాజ్య విత్తనాలను యెహోవా పెరిగేలా చేశాడు

1, 2. (ఎ) శిష్యులు ఎందుకు ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టారు? (బి) యేసు ఏ కోత పని గురించి మాట్లాడుతున్నాడు?

 శిష్యులు ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టారు. ఎందుకంటే యేసు వాళ్లతో, “మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి [‘తెల్లబారి ఉన్నాయి,’ అధస్సూచి]” అన్నాడు. యేసు చూపిస్తున్న వైపు వాళ్లు చూశారు. అప్పుడే మొలకెత్తుతున్న బార్లీ పంటతో పొలాలు పచ్చగా ఉన్నాయి కానీ, యేసు చెప్పినట్లు తెల్లగా లేవు. ‘యేసు ఏ కోత గురించి మాట్లాడుతున్నాడు? ఇంకా పంట కోతకు రావడానికి నాలుగు నెలలు ఉంది కదా’ అని వాళ్లు అనుకుని ఉండవచ్చు.—యోహా. 4:35.

2 అయితే, యేసు మాట్లాడుతున్నది మామూలు కోత గురించి కాదు. బదులుగా, ఆయన ఆధ్యాత్మిక కోత గురించి, అంటే ప్రజల్ని సమకూర్చడం గురించి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన రెండు ముఖ్యమైన విషయాల్ని ఆయన తన శిష్యులకు చెప్పాడు. ఏమిటా విషయాలు? వాటిని తెలుసుకోవడానికి, ఆ వృత్తాంతాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం.

ఒక ఆహ్వానం, ఒక వాగ్దానం

3. (ఎ) యేసు ‘పొలాలు తెల్లబారి ఉన్నాయి’ అని అనడానికి కారణం ఏమైవుండవచ్చు? (అధస్సూచి చూడండి.) (బి) తాను మాట్లాడుతున్నది అక్షరార్థమైన కోత గురించి కాదని యేసు ఎలా స్పష్టం చేశాడు?

3 యేసు ఆ మాటల్ని సా.శ. 30 చివర్లో చెప్పాడు. ఆ సందర్భంలో యేసు, ఆయన శిష్యులు సమరయలోని సుఖారు అనే ఊరికి దగ్గర్లో ఉన్నారు. శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్లారు. యేసు అక్కడున్న బావి దగ్గరే ఆగి ఒక స్త్రీతో ఆధ్యాత్మిక సత్యాలు పంచుకున్నాడు. ఈలోపు శిష్యులు తిరిగివచ్చారు. ఆ స్త్రీ తాను విన్న విషయాలు చాలా ముఖ్యమైనవని గ్రహించి, ఇరుగుపొరుగువాళ్లతో చెప్పడానికి హడావిడిగా సుఖారుకు వెళ్లింది. ఆమె మాటలు విని, ఆ ఊరివాళ్లు చాలా ఆసక్తితో యేసును కలవడానికి బయల్దేరారు. బహుశా ఆ సమయంలో, యేసు పొలాల్ని కాదుగానీ పొలాల అవతల నుండి వస్తున్న సమరయుల్ని చూస్తూ, ఇలా అన్నాడు: “పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి [‘తెల్లబారి ఉన్నాయి,’ అధస్సూచి].” a తాను మాట్లాడుతున్నది అక్షరార్థమైన కోత గురించి కాదని స్పష్టం చేస్తూ, యేసు ఇంకా ఇలా అన్నాడు: “కోత కోసేవాడు . . . శాశ్వత జీవితం కోసం పంటను సమకూరుస్తున్నాడు.”—యోహా. 4:5-30, 36.

4. (ఎ) ఆధ్యాత్మిక కోతకు సంబంధించి యేసు ఏ రెండు విషయాలు చెప్పాడు? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

4 ఆధ్యాత్మిక కోతకు సంబంధించి ఏ రెండు విషయాల్ని యేసు చెప్పాడు? మొదటిది, కోత పనిని త్వరగా మొదలుపెట్టడం. ‘పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పడం ద్వారా, కోత పనిని మొదలుపెట్టమని యేసు తన అనుచరులను ఆహ్వానిస్తున్నాడు. అది ఎంత అత్యవసరమో వాళ్లకు అర్థం కావడానికి, ఆయన ఇలా అన్నాడు: ‘కోత కోసేవాడు ఇప్పటికే తన జీతం తీసుకుంటున్నాడు.’ అవును, కోత పని ఇప్పటికే మొదలైపోయింది. కాబట్టి ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు! రెండవది, పనివాళ్లు సంతోషించడం. విత్తేవాళ్లు, కోసేవాళ్లు “కలిసి సంతోషిస్తారు” అని యేసు వాగ్దానం చేశాడు. (యోహా. 4:35బి, 36) యేసు తనమీద విశ్వాసం ఉంచిన ‘చాలామంది సమరయుల్ని’ చూసి సంతోషించినట్లే, ఆయన శిష్యులు కూడా కోత పనిలో మనస్ఫూర్తిగా పాల్గొని సంతోషిస్తారు. (యోహా. 4:39-42) మొదటి శతాబ్దంలోని ఆ వృత్తాంతానికి, మన కాలంలో ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఎందుకంటే, గొప్ప ఆధ్యాత్మిక కోత పని జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఆ కోత పని ఎప్పుడు మొదలైంది? దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? దానిలో ఎవరు భాగం వహిస్తారు?

రాజైన యేసు గొప్ప కోత పనికి నాయకత్వం వహిస్తాడు

5. భూవ్యాప్తంగా జరిగే కోత పనికి ఎవరు నాయకత్వం వహిస్తారు? కోత పనిని త్వరగా మొదలుపెట్టాలనే విషయాన్ని యోహాను దర్శనం ఎలా తెలియజేస్తుంది?

5 భూవ్యాప్తంగా జరిగే కోత పనికి యేసు నాయకత్వం వహిస్తాడని, యెహోవా ఒక దర్శనంలో అపొస్తలుడైన యోహానుకు చెప్పాడు. (ప్రకటన 14:14-16 చదవండి.) యేసుకు ఒక కిరీటం, ఒక కొడవలి ఉన్నట్లు యోహాను ఆ దర్శనంలో చూశాడు. యేసుకు ఉన్న “బంగారు కిరీటం,” ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడని సూచిస్తుంది. ఆయన చేతిలో ఉన్న “పదునైన కొడవలి,” కోత పనికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుంది. అప్పుడు యెహోవా ఒక దూత ద్వారా, “భూమ్మీది పంట పండింది, కోత కోసే సమయం [లేదా “గంట,” అధస్సూచి] వచ్చేసింది” అని చెప్పాడు. అంటే కోత పనిని త్వరగా మొదలుపెట్టమని , ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదని యెహోవా నొక్కిచెప్తున్నాడు. “నీ కొడవలితో భూమ్మీది పంట కొయ్యి” అని యెహోవా ఆజ్ఞాపించగానే, యేసు కొడవలితో భూమ్మీది పంట కోయడం మొదలుపెట్టాడు, అంటే భూమ్మీదున్న ప్రజల్ని సమకూర్చడం మొదలుపెట్టాడు. ఈ ఉత్తేజకరమైన దర్శనం కూడా, ‘పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి’ అనే విషయాన్ని నొక్కిచెప్తుంది. ఇంతకీ ఆ కోత పని ఎప్పుడు మొదలైంది? దానికి జవాబు ఆ దర్శనంలోనే ఉంది.

6. (ఎ)  “కోతకాలం” ఎప్పుడు మొదలైంది? (బి) ‘భూమ్మీది పంటను’ కోయడం యేసు ఎప్పుడు మొదలుపెట్టాడు? వివరించండి.

6 కోత కోయడానికి సిద్ధంగా ఉన్న యేసుకు ఒక కిరీటం (14వ వచనం) ఉన్నట్లు ప్రకటన 14వ అధ్యాయంలోని యోహాను దర్శనంలో చూస్తాం. అంటే అప్పటికే ఆయన రాజయ్యాడని స్పష్టమౌతోంది. (దాని. 7:13, 14) ఆయన రాజైన కొంతకాలానికి కోత కోయమనే ఆజ్ఞను పొందాడు (15వ వచనం). గోధుమల కోత గురించి యేసు చెప్పిన ఉదాహరణలో కూడా సంఘటనలు అదే క్రమంలో జరిగాయి. ఆ ఉదాహరణలో యేసు ఇలా చెప్పాడు: “కోత లోక వ్యవస్థ ముగింపు.” కాబట్టి కోతకాలం అలాగే లోక వ్యవస్థ ముగింపు, రెండూ ఒకే సమయంలో అంటే 1914లో మొదలయ్యాయి. ఆ తర్వాత కోతకాలం గడుస్తుండగా అసలైన కోత పని మొదలైంది. (మత్త. 13:30, 39) మన కాలం నుండి వెనక్కి తిరిగి చూస్తే, యేసు రాజైన కొన్ని సంవత్సరాలకు కోత పనిని మొదలుపెట్టాడని తెలుస్తోంది. ముందుగా, 1914 నుండి 1919 తొలిభాగం వరకు, యేసు తన అభిషిక్త అనుచరులను శుద్ధీకరించాడు. (మలా. 3:1-3; 1 పేతు. 4:17) తర్వాత, 1919లో అసలు కోత పనిని మొదలుపెట్టాడు, అంటే భూమ్మీది పంటను కోయడం మొదలుపెట్టాడు. అదే సంవత్సరంలో యేసు నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి నియమించి, ప్రకటనా పని ఎంత అత్యవసరమో సహోదరులు గుర్తించేలా సహాయం చేశాడు. అప్పుడేమి జరిగిందో పరిశీలించండి.

7. (ఎ) ప్రకటనా పని అత్యవసరమనే విషయాన్ని మన సహోదరులు ఎలా తెలుసుకోగలిగారు? (బి) వాళ్లు ఏమి చేయమని సంఘాలను ప్రోత్సహించారు?

7 జూలై 1920 ద వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా చెప్పింది: “లేఖనాల్ని లోతుగా పరిశీలిస్తున్నప్పుడు, రాజ్య సందేశాన్ని ప్రకటించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని తెలుసుకున్నాం.” ఉదాహరణకు, సహోదరులు యెషయా ప్రవచనాన్ని పరిశీలించినప్పుడు, రాజ్యం గురించిన మంచివార్తను ప్రపంచమంతటా ప్రకటించాలనే విషయాన్ని గ్రహించారు. (యెష. 49:6; 52:7; 61:1-3) ఆ పని ఎలా జరుగుతుందో తెలీకపోయినా, యెహోవాయే దారి చూపిస్తాడని వాళ్లు నమ్మారు. (యెషయా 59:1 చదవండి.) వాళ్లు ప్రకటనా పని ఎంత ప్రాముఖ్యమో గ్రహించి, ఆ పనిలో ఎక్కువగా పాల్గొనమని సంఘాలను ప్రోత్సహించారు. దానికి ఎలాంటి స్పందన వచ్చింది?

8. 1921లో, ప్రకటనా పనికి సంబంధించిన ఏ రెండు వాస్తవాల్ని సహోదరులు గ్రహించారు?

8 డిసెంబరు 1921 ద వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా చెప్పింది: “1921వ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరంలో, ఎక్కువమంది ప్రజలకు మంచివార్త ప్రకటించాం. కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది . . . కాబట్టి దాన్ని సంతోష హృదయంతో చేద్దాం.” యేసు తన అపొస్తలులకు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన విషయాల్నే ఆ సహోదరులు కూడా గ్రహించారు: ఒకటి, ఆ పనిని త్వరగా చేయడం, రెండు, పనివాళ్లు సంతోషించడం.

9. (ఎ) 1954లో, ప్రకటనా పని గురించి కావలికోట ఏమి చెప్పింది? ఎందుకు? (బి) గత 50 సంవత్సరాల్లో ప్రచారకుల సంఖ్య ఎలా పెరిగింది? ( “ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి” అనే చార్టు చూడండి.)

9 1930లలో, వేరేగొర్రెలకు చెందిన గొప్పసమూహం గురించి అర్థం చేసుకున్నాక, సహోదరులు ప్రకటనా పనిని ఇంకా ముమ్మరం చేశారు. (యెష. 55:5; యోహా. 10:16; ప్రక. 7:9) దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాజ్య సందేశాన్ని ప్రకటించేవాళ్లు 1934లో 41,000 మంది ఉన్నారు. 1953లో ఆ సంఖ్య 5,00,000కు చేరింది! b దాని గురించి డిసెంబరు 1, 1954 కావలికోట ఇలా చెప్పింది: “యెహోవా పవిత్రశక్తి, అలాగే ఆయన వాక్యం సహాయం చేయడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ కోత పని చేయగలిగాం.”—జెక. 4:6.

 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి

దేశం

1962

1987

2013

ఆస్ట్రేలియా

15,927

46,1704

66,023

బ్రెజిల్‌

26,390

216, 216

756,455

ఫ్రాన్స్‌

18,452

96,954

124,029

ఇటలీ

6,929

149,870

247,251

జపాన్‌

2,491

120,722

217,154

మెక్సికో

27,054

222,168

772,628

నైజీరియా

33,956

133,899

344,342

ఫిలిప్పీన్స్‌

36,829

101,735

181,236

అమెరికా

289,135

780,676

1,203,642

జాంబియా

30,129

67,144

162,370

 

అంతకంతకు పెరుగుతున్న బైబిలు అధ్యయనాల సంఖ్య

1950

234,952

1960

646,108

1970

1,146,378

1980

1,371,584

1990

3,624,091

2000

4,766,631

2010

8,058,359

కోత పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయో యేసు ముందే చెప్పాడు

10, 11. ఆవగింజ ఉదాహరణ ఏ విషయాల్ని నొక్కిచెప్తుంది?

10 కోత పనికి వచ్చే ఫలితాల గురించి యేసు పద చిత్రాల ద్వారా స్పష్టం చేశాడు. ఆయన చెప్పిన ఆవగింజ, పులిసిన పిండి ఉదాహరణలను పరిశీలిస్తూ, అవి ఈ వ్యవస్థ ముగింపు సమయంలో ఎలా నెరవేరుతున్నాయో గమనిద్దాం.

11 ఆవగింజ ఉదాహరణ. ఒక వ్యక్తి తన పొలంలో ఆవగింజను విత్తుతాడు. అది పెరిగి పెద్ద చెట్టు అయినప్పుడు, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో ఆశ్రయం పొందుతాయి. (మత్తయి 13:31, 32 చదవండి.) ఆ ఉదాహరణ ఏమి తెలియజేస్తుంది? (1) ‘విత్తనాలన్నిటి కన్నా చాలా చిన్నదైన’ ఆవగింజ ఎంత విస్తృతంగా వృద్ధి చెందుతుందంటే, అది పొడవాటి కొమ్మలు ఉన్న పెద్ద చెట్టు అవుతుంది. (మార్కు 4:31, 32) (2) ‘విత్తిన తర్వాత అది పెరుగుతుంది’ అని యేసు చెప్పాడు, అంతేకానీ ‘పెరగవచ్చేమో’ అనలేదు. అంటే అది తప్పకుండా పెరుగుతుందని, ఆ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరని యేసు ఉద్దేశం. (3) అది పెద్ద చెట్టు అయిన తర్వాత, ఇతరులకు ఆశ్రయం ఇస్తుంది. “ఆకాశపక్షులు దాని నీడలో ఆశ్రయం పొందుతాయి” అని యేసు చెప్పాడు. ఆ మూడు విషయాలు మన కాలంలో ఎలా నెరవేరుతున్నాయి?

12. ఆవగింజ ఉదాహరణలోని విషయాలు, మన కాలంలో ఎలా నెరవేరుతున్నాయి? ( “అంతకంతకు పెరుగుతున్న బైబిలు అధ్యయనాల సంఖ్య” అనే చార్టు కూడా చూడండి.)

12 (1) విస్తృతంగా వృద్ధి చెందడం: రాజ్య సందేశం ఎలా వ్యాపిస్తుందో, క్రైస్తవ సంఘం ఎలా వృద్ధి చెందుతుందో ఆ ఉదాహరణ తెలియజేస్తుంది. 1919 నుండి, క్రైస్తవ సంఘంలోకి చాలామంది ఉత్సాహవంతమైన కోత పనివాళ్లు సమకూర్చబడుతున్నారు. అప్పట్లో వాళ్లు తక్కువమందే ఉన్నారు. కానీ ఆ సంఖ్య, ముఖ్యంగా 1900ల తొలినాళ్లనుండి చాలా వేగంగా పెరుగుతోంది. (యెష. 60:22) (2) తప్పకుండా వృద్ధి చెందడం: క్రైస్తవ సంఘ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరు. దేవుని శత్రువులు ఆ చిన్న ఆవగింజకు ఎన్ని రాళ్లు అడ్డుపెట్టినా, అది వాటన్నిటినీ ఛేదించుకుని పెరుగుతుంది. (యెష. 54:17) (3) ఆశ్రయం ఇవ్వడం: “ఆకాశపక్షులు” ఆ చెట్టు నీడలో ఆశ్రయం పొందినట్లే, దాదాపు 240 దేశాలకు చెందిన లక్షలమంది ప్రజలు రాజ్య సందేశానికి స్పందించి, క్రైస్తవ సంఘంలో సభ్యులౌతున్నారు. (యెహె. 17:23) అక్కడ వాళ్లు ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుతూ సేదదీర్పును, కాపుదలను అనుభవిస్తున్నారు.—యెష. 32:1, 2; 54:13.

ప్రజలు క్రైస్తవ సంఘంలో ఆశ్రయాన్ని, కాపుదలను పొందుతారని ఆవగింజ ఉదాహరణ చూపిస్తుంది (11, 12 పేరాలు చూడండి)

13. అభివృద్ధికి సంబంధించిన ఏ విషయాల్ని పులిసిన పిండి ఉదాహరణ తెలియజేస్తుంది?

13 పులిసిన పిండి ఉదాహరణ. ఒక స్త్రీ కాస్త పులిసిన పిండిని తీసుకుని ఎక్కువ మొత్తంలో కలిపినప్పుడు, ఆ పిండి అంతా పులిసిపోయింది. (మత్తయి 13:33 చదవండి.) అభివృద్ధికి సంబంధించిన ఏ విషయాల్ని ఈ ఉదాహరణ నొక్కిచెప్తుంది? (1) అది పిండిని మార్చేస్తుంది. ఆ పులిసిన పిండి వల్ల మిగతా పిండి పులిసిపోతుంది. (2) అది విస్తృతంగా వ్యాపిస్తుంది. అది, ‘పది కిలోల పిండిని’ అంటే పిండి మొత్తాన్ని పులిసిపోయేలా చేస్తుంది. ఆ రెండు విషయాలు, నేడు మన కాలంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కోత పనికి సంబంధించి ఎలా నెరవేరుతున్నాయి?

14. పులిసిన పిండి ఉదాహరణలోని విషయాలు నేడు ఎలా నెరవేరుతున్నాయి?

14 (1) మార్పు తీసుకురావడం: ఆ ఉదాహరణలో పులిసిన పిండి రాజ్య సందేశాన్ని సూచిస్తుంది, పిండి ముద్ద మానవజాతిని సూచిస్తుంది. పులిసిన పిండి, పిండి మొత్తాన్ని పులిసేలా చేసినట్లే, రాజ్య సందేశం కూడా దాన్ని అంగీకరించినవాళ్ల వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. (రోమా. 12:2) (2) విస్తృతంగా వ్యాపించడం: పులిసిన పిండి, పిండి మొత్తంలో వ్యాపించినట్లే, రాజ్య సందేశం కూడా “భూమంతటా” వ్యాపిస్తుంది. అంతేకాదు, పిండి పులవడం అనే ప్రక్రియ పైకి కనిపించకుండా లోలోపల జరుగుతుంది. (అపొ. 1:8) అదే విధంగా, ప్రకటనా పని నిషేధించబడిన దేశాల్లో, మన కార్యకలాపాలు పైకి కనిపించకపోయినా లోలోపల అవి జరుగుతూనే ఉంటాయి.

15. యెషయా 60:5, 22 లోని మాటలు ఎలా నెరవేరాయి? (93వ పేజీలో ఉన్న  “యెహోవాకు అన్నీ సాధ్యమే” అనే బాక్సు, అలాగే 96-97 పేజీల్లో ఉన్న  “‘ఎన్నికలేనివాడు బలమైన జనం అవ్వడం’” అనే బాక్సు చూడండి.)

15 యేసు ఆ ఉదాహరణలను చెప్పడానికి సుమారు 800 సంవత్సరాల క్రితమే, ఆధ్యాత్మిక కోత పని గురించి, దానివల్ల కలిగే ఆనందం గురించి యెహోవా యెషయా ద్వారా తెలియజేశాడు. “దూరమునుండి” ప్రజలు తన సంస్థలోకి ప్రవాహంలా వస్తారని యెహోవా చెప్పాడు. ఆయన నేడు భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవుల్ని సూచిస్తున్న యెరూషలేముతో ఇలా అన్నాడు: “నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.” c (యెష. 60:1, 4, 5, 9) ఆ మాటలు ఎంత నిజమో కదా! నేడు, ఎంతోకాలం నుండి యెహోవాను సేవిస్తున్నవాళ్లు, తమ ప్రాంతంలో ఉన్న ప్రచారకుల సంఖ్య వేగంగా పెరగడం చూసి సంతోషిస్తున్నారు. ఆ ఆనందంతో వాళ్ల ముఖాలు ‘ప్రకాశిస్తున్నాయి.’

యెహోవా సేవకులందరూ కోత పనిలో సంతోషిస్తారు

16, 17. ‘విత్తేవాడు, కోసేవాడు కలిసి సంతోషించడానికి’ కారణం ఏమిటి? ( “అమెజాన్‌లో రెండు హృదయాలను తాకిన రెండు కరపత్రాలు” అనే బాక్సు కూడా చూడండి.)

16 యేసు తన అపొస్తలులకు చెప్పిన ఈ మాటల్ని గుర్తు తెచ్చుకోండి: “కోత కోసేవాడు ఇప్పటికే . . . శాశ్వత జీవితం కోసం పంటను సమకూరుస్తున్నాడు. దానివల్ల విత్తేవాడు, కోసేవాడు కలిసి సంతోషిస్తారు.” (యోహా. 4:36) భూవ్యాప్తంగా జరుగుతున్న కోత పనిలో మనం ఎలా ‘కలిసి సంతోషిస్తాం’? చాలా విధాలుగా సంతోషిస్తాం. వాటిలో మూడిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

17 మొదటిది, మన పనిలో యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో చూసి సంతోషిస్తాం. మనం రాజ్య సందేశాన్ని ప్రకటించడం ద్వారా విత్తనాలు నాటుతున్నాం. (మత్త. 13:18, 19) అలాగే, ఒక వ్యక్తి క్రీస్తుకు శిష్యుడయ్యేలా సహాయం చేయడం ద్వారా కోత కోస్తున్నాం. అయితే యెహోవా ఆ రాజ్య విత్తనాలు ‘మొలకెత్తి, పొడుగ్గా పెరిగేలా’ చేసినప్పుడు మనం సంతోషిస్తాం. (మార్కు 4:27, 28) కొన్నిసార్లు, మనం నాటిన విత్తనాలు కొంతకాలం తర్వాత మొలకెత్తవచ్చు. అప్పుడు వేరేవాళ్లు వాటిని కోస్తారు. సహోదరి జోన్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ఆ సహోదరి 60 ఏళ్ల క్రితం బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా చెప్పింది: “కొంతమంది నా దగ్గరికి వచ్చి, కొన్నేళ్ల క్రిందట నేను వాళ్ల హృదయాల్లో సత్యపు విత్తనాలు నాటాననీ, ఆ తర్వాత వేరే సాక్షులు వాళ్లతో బైబిలు అధ్యయనం చేసి యెహోవా సేవకులయ్యేలా సహాయం చేశారనీ చెప్తుంటారు. నేను నాటిన విత్తనాలు మొలకెత్తడం, వాటిని వేరేవాళ్లు కోయడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.”—1 కొరింథీయులు 3:6, 7 చదవండి.

18. 1 కొరింథీయులు 3:8 ప్రకారం, మనం సంతోషించడానికి ఏ కారణం ఉంది?

18 రెండవది, “వాళ్లవాళ్ల పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతారు” అని పౌలు అన్న మాటల్ని మనసులో ఉంచుకుని మనం సంతోషించవచ్చు. (1 కొరిం. 3:8) ఎందుకంటే ప్రతీఒక్కరూ వాళ్ల పనిని బట్టే ప్రతిఫలం పొందుతారు గానీ, ఆ పనికి వచ్చిన ఫలితాల్ని బట్టి కాదు. ప్రజలు ఏమాత్రం స్పందించని క్షేత్రంలో పరిచర్య చేస్తున్న సహోదరసహోదరీలకు ఆ మాటలు ఎంత ఊరటనిస్తాయో కదా! ప్రకటనా పనిలో మనస్ఫూర్తిగా పాల్గొనే ప్రతీఒక్కరు దేవుని దృష్టిలో ‘ఎక్కువగా ఫలిస్తున్నట్లే.’ కాబట్టి వాళ్లు సంతోషించవచ్చు.—యోహా. 15:8; మత్త. 13:23.

19. (ఎ) మత్తయి 24:14 లో ఉన్న యేసు మాటల ప్రకారం, మనం సంతోషించడానికి ఒక కారణం ఏమిటి? (బి) ఒక వ్యక్తి క్రీస్తుకు శిష్యుడయ్యేలా చేయడంలో మనం విజయం సాధించలేకపోయినా, మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

19 మూడవది, మనం చేస్తున్న పని ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తుంది. ఒక సందర్భంలో, అపొస్తలులు యేసు దగ్గరికి వచ్చి, “నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” అని అడిగారు. అప్పుడు ఆయన ఆ సూచనలో భాగంగా, మంచివార్త భూవ్యాప్తంగా ప్రకటించబడుతుందని చెప్పాడు. మరి శిష్యుల్ని చేసే పని మాటేమిటి? అది కూడా ఆ సూచనలో భాగమేనా? కాదు. ఆయన స్పష్టంగా ఇలా చెప్పాడు: “రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది.” (మత్త. 24:3, 14) అంటే రాజ్యాన్ని ప్రకటించడమే ఆ సూచనలో భాగం కానీ శిష్యుల్ని చేయడం కాదు. కాబట్టి మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని క్రీస్తు శిష్యుడయ్యేలా చేయలేకపోయినా, మనం అతనికి ‘సాక్ష్యం’ ఇచ్చినందుకు సంతోషించవచ్చు. d అవును, ప్రజలు మన సందేశానికి స్పందించినా స్పందించకపోయినా, యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పులో మనం భాగం వహిస్తున్నట్లే, అలాగే ‘దేవుని తోటి పనివాళ్లుగా’ సేవ చేస్తున్నట్లే. (1 కొరిం. 3:9) సంతోషించడానికి అది ఎంత మంచి కారణమో కదా!

‘తూర్పు దిశ నుండి పడమటి దిశ వరకు’

20, 21. (ఎ) మలాకీ 1:11 లో ఉన్న మాటలు ఎలా నెరవేరుతున్నాయి? (బి) కోత పనికి సంబంధించి, మీరు ఏమి చేయాలని తీర్మానించుకున్నారు? ఎందుకు?

20 కోత పని ఎంత అత్యవసరమో అర్థం చేసుకునేలా యేసు మొదటి శతాబ్దంలోని అపొస్తలులకు సహాయం చేశాడు. అలాగే 1919 నుండి, ఆధునిక కాలంలో ఉన్న తన శిష్యులకు కూడా సహాయం చేస్తున్నాడు. దానివల్ల, దేవుని ప్రజలు కోత పని అత్యవసరమని గుర్తించి, తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. వాళ్లు చేస్తున్న పనిని శత్రువులు కూడా ఆపలేకపోయారు. మలాకీ ప్రవక్త ముందే చెప్పినట్లు, నేడు ప్రకటనా పని ‘తూర్పు దిశ నుండి పడమటి దిశ వరకు’ జరుగుతోంది. (మలా. 1:11) ఏ విధంగా? ఒకటి, దేవుని ప్రజలు తూర్పు నుండి పడమర వరకు, అంటే భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు సంతోషంగా విత్తనాలు నాటుతున్నారు, కోత కోస్తున్నారు. రెండు, వాళ్లు ‘తూర్పు దిశ నుండి పడమటి దిశ వరకు’ అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రోజంతా అత్యవసర భావంతో ప్రకటిస్తున్నారు.

21 గడిచిన 100 సంవత్సరాల్లో, దేవుని ప్రజల చిన్న గుంపు ఎలా ‘బలమైన జనముగా’ అయ్యిందో ఆలోచిస్తే, మన హృదయాలు ఆనందంతో ‘ఉప్పొంగుతాయి.’ (యెష. 60:5, 22) ఆ ఆనందంతో, అలాగే ‘పంట యజమానియైన’ యెహోవాపట్ల ప్రేమతో, మన కాలంలో జరుగుతున్న గొప్ప కోత పనిలో సంతోషంగా భాగం వహిద్దాం!—లూకా 10:2.

a యేసు బహుశా, తెల్లని వస్త్రాలు వేసుకుని తన దగ్గరికి వస్తున్న సమరయుల్ని చూసి, ‘పొలాలు తెల్లబారి ఉన్నాయి’ అని అనివుండవచ్చు.

b ఆ సంవత్సరాల్లో, ఆ తర్వాతి దశాబ్దాల్లో జరిగిన పని గురించి తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఇంగ్లీషు) పుస్తకంలో 425-520 పేజీలు చూడండి. అందులో, 1919 నుండి 1992 మధ్యకాలంలో జరిగిన కోత పని గురించి ఉంది.

c ఈ అద్భుతమైన ప్రవచనం గురించి వివరంగా తెలుసుకోవడానికి, యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు 2వ సంపుటిలో 303-320 పేజీలు చూడండి.

d ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని తొలి బైబిలు విద్యార్థులు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. 1895, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ నవంబరు 15 సంచిక ఇలా చెప్పింది: “మనం కొన్ని గోధుమల్నే కోసినా, సత్యం గురించి సమర్థవంతంగా సాక్ష్యమిచ్చినట్లే. . . . అందరూ దానిలో భాగం వహించగలరు.”